‘హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో జిహాదీలు ఎంతమంది పనిచేస్తున్నారు?’ - సజ్జనార్ వర్సెస్ అసదుద్దీన్ ఒవైసీ : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook
మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య ట్విటర్ వార్ నడిచిందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''బీజేపీ ఐటీ సెల్ ప్రతినిధి సురేశ్ కొచ్చటిల్ చేసిన ట్వీట్‌కు సజ్జనార్ స్పందించిన తీరుపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశా రు. 'హైదరాబాద్‌లోని అమెరికా ఐటీ కంపెనీలలో జిహాదీలు పని చేస్తున్నారు. అమెరికా ఆస్తులను ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో జిహాదీలను గుర్తించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. కంపెనీల్లో తనిఖీలు ఏమైనా చేశారా?' అని సురేశ్ కొచ్చటిల్ బుధవారం ఒక ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలను ఆ ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. దానికి సీపీ సజ్జనార్ స్పందించారు. 'అవును సర్... మాకు అలాంటి సమాచారం సేకరించడానికి ప్రత్యేకమైన విభాగాలున్నాయి. ఐటీ కంపెనీల్లో అలాంటి వారిని గుర్తించేందుకు మా నిఘా బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయి. వాటిద్వారా మాకు ముందే సమాచారం వస్తుంది. మీ దగ్గర ఎలాంటి సమాచారమున్నా మాకు తెలియజేయండి.' అని సజ్జనార్ ట్వీట్ చేశారు. తమ వద్ద అలాంటి నిఘా విభాగాలున్నాయన్న ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసులు స్పందించగా.. ఆ ట్వీట్‌పై అసద్‌ఘాటుగా స్పందించారు. 'అవును సర్' అంటే అర్థమేమిటో నాకు కొంచెం వివరించండి. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో జిహాదీలు ఎంతమంది పనిచేస్తున్నారో ఆ సంఖ్యను బహిర్గతం చేయండి? ఆ విషయం తెలియకుండా అంటే ఏ అర్థంతో 'అవును సర్' అన్నారో వివరణ ఇవ్వండి. ఒక ఎంపీగా నాకు సమాధానం చెప్తారా? మోదీ భక్తులకే సమాధానమిస్తారా?' అని సజ్జనార్‌పై ఒవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదని, ఒకసారి నాథూరాం గాడ్సేను గుర్తుచేసుకోవాలని ఒవైసీ హితవుపలికారు. ఒకవేళ ఐటీ కంపెనీల్లో జిహాదీలున్నా వారిని ఉదయం 5 గంటలకు తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేయొద్దంటూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. వారిని చట్టప్రకారం అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాలన్నారు. ఈ ట్వీట్‌లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సీపీ సజ్జనార్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
ఈ విమర్శల నేపథ్యంలో సజ్జనార్ మరో ట్వీట్ చేశారు. 'మా ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పడమే ట్వీట్ ఉద్దేశం. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నాం. పక్షపాతం లేకుండా అన్ని వర్గాలకు సేవలందిస్తున్నాం' అని అందులో పేర్కొన్నారు. కాగా.. సైబరాబాద్ పోలీస్ పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో సజ్జనార్ ఫొటో ఉంటుందిగానీ.. దాన్ని పర్యవేక్షించేది మాత్రం ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్'' అని ఆ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, Twitter/ktr
న్యూజిలాండ్‌తో దోస్తీ
న్యూజిలాండ్ ప్రభుత్వం, పారిశ్రామికవర్గాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారంటూ 'నమస్తే తెలంగాణ' కథనం ప్రచురించింది.
''న్యూజిలాండ్ ఎథ్నిక్ అఫైర్స్‌శాఖ పార్లమెంటరీ సెక్రటరీ, అక్కడి ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ బుధవారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక, విద్యారంగాల్లో న్యూజిలాండ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై చర్చించారు. ముఖ్యంగా అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్టప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పరిస్థితులను మంత్రి కేటీఆర్ ప్రియాంకకు వివరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం స్టార్టప్, ఇన్నోవేషన్ రంగాల్లో దేశంలోనే ముందువరుసలో ఉన్నదని తెలిపారు. టీహబ్, వీహబ్ వంటి ఇంక్యుబేటర్ల ద్వారా ఐటీ రంగంలో ముందున్నామని వెల్లడించారు. త్వరలోనే టీ-హబ్ రెండో దశ ప్రారంభం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నామని, ప్రస్తుతం ఉన్న విదేశీ స్టార్టప్ ఇకో సిస్టంతో కలిసి పనిచేసేందుకు ఉద్దేశించిన టీ-బ్రిడ్జి కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నామని తెలిపారు. టీ-బ్రిడ్జి కార్యక్రమంలో భాగంగా న్యూజిలాండ్ స్టార్టప్‌లతోనూ కలిసి పనిచేసేందుకు కృషిచేయాలని చెప్పారు. దీం తోపాటు అగ్రిటెక్ రంగంలోనూ అనేక అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నార''ని ఆ కథనంలో వివరించారు.

విశాఖలో ఎన్టీఆర్ విగ్రహం మాయం
విశాఖ నగరంలో ఎన్టీఆర్ విగ్రహం మాయమైందని 'ఈనాడు' వార్తాకథనం తెలిపింది.
''ఎన్టీఆర్ విగ్రహం మాయం కావడంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పీఎంపాలెం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. మధురవాడ మార్కెట్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు పెకిళించి పట్టుకుపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నార''ని ఆ కథనంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాణాలతో తిరిగి వస్తామనుకోలేదు
పాకిస్తాన్‌లోని జైలు నుంచి విడుదలై స్వస్థలాలకు చేరుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారని 'సాక్షి' కథనం తెలిపింది.
''పాక్ జైలుకెళ్లాక మా ఊరికి ప్రాణాలతో వెళతామన్న ఆశ లేకపోయింది. మా బతుకులు ఇక్కడే తెల్లారుతాయనుకున్నాం. మాచేత ఇష్టానుసారం పనులు చేయించేవాళ్లు. అన్నం సరిగ్గా ఉండేది కాదు. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలసి గోడు చెప్పుకున్నామని, తప్పక విడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారని మావాళ్లు వర్తమానం పంపారు. జగన్ అధికారంలోకి వచ్చారన్న విషయం తెలిసి సంతోషించాం. విడిపించడమే కాదు, ప్రతి జాలరికి రూ.2 లక్షలిస్తామని కూడా ఆయన చెప్పారని విన్నాం. అన్నట్లుగా జగన్ మమ్మల్ని విడిపించడమేగాక ఊహించిన దానికంటే ఎక్కువగా రూ.5 లక్షలు సాయం చేశారు. ఈ డబ్బుతో ఏదైనా పని చేసుకుని బతుకుతాం. ఈ జీవితం ఆయనదే..'' అంటూ పాక్ చెర నుంచి విడుదలైన నక్కా అప్పన్న కన్నీటి పర్యంతమయ్యాడు. హుద్‌హుద్ పెను తుపానుతో సర్వం కోల్పోవడంతో బతుకుతెరువుకోసం కొడుకు ధన్‌రాజ్(14)తో కలసి గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లిన విజయనగరం జిల్లా పూసపాటి రేగకు చెందిన అప్పన్న పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో పాక్ నావికాదళ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు.
ఫలితంగా ఇతర మత్స్యకారులతోపాటు ఈ తండ్రీకొడుకులు పాకిస్థాన్ జైలులో 14 నెలలపాటు దుర్భర జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఎట్టకేలకు జగన్ సర్కారు చొరవతో ఇతర మత్స్యకారులతోపాటు పాక్ చెర నుంచి బయటపడిన వారిద్దరూ బుధవారం సీఎం వైఎస్ జగన్‌ను కలిశార''ని ఆ కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- "కాసిం సులేమానీ హత్యకు ఒబామా, బుష్ ఒప్పుకోలేదు, ట్రంప్ పర్మిషన్ ఇచ్చారు": ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్‌తో ఇంటర్వ్యూ
- సీఈఎస్ 2020: శాంసంగ్ బాలీ.. నీడలా వెంటాడే రోబో బంతి
- ఆ రెండు అమెరికా స్థావరాలపైనే ఇరాన్ క్షిపణి దాడులు ఎందుకు చేసింది?
- విజయవాడలో చంద్రబాబు సహా టీడీపీ, ఇతర విపక్ష నేతల అరెస్ట్
- బాల్కనీలో చలికి గడ్డ కట్టుకుని చనిపోయిన పసిబిడ్డ
- నిర్భయ గ్యాంగ్‌రేప్: ఉరితాడుకు చేరువలో నలుగురు దోషులు
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: 2,000 ఇళ్లు బుగ్గి.. ఇంకా వదలని దావానలం భయం
- అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు: ఒక్కసారిగా పెరిగిన ముడి చమురు ధరలు
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్‌కౌంటర్ చేయడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








