బస్‌లో ‘ఛాతీపై మోచేతితో తాకారు’ అన్న ఆరోపణల తరువాత ఒకరి ఆత్మహత్య.. చనిపోయింది ఎవరు? వీడియో తీసిన మహిళ ఎవరు?

ఫొటో సోర్స్, Asgar Ali
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
బస్‌లో వెళ్తున్నప్పుడు తనను అనుచితంగా తాకారంటూ ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు వీడియో పోస్ట్ చేసిన మహిళను అరెస్ట్ చేశారు.
మహిళ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన తరువాత ఆయన ఆన్‌లైన్‌లో వేధింపులను ఎదుర్కొన్నారని కుటుంబీకులు తమ ఫిర్యాదులో ఆరోపించారు.
దీపక్.యు(42) బస్‌లో తన వక్షోజాలకు మోచేతిని తాకించారని ఆరోపిస్తూ షింజిత ముస్తఫా(35) అనే మహిళ గత శుక్రవారం తాను రికార్డ్ చేసిన ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ ఫుటేజ్‌పై అనేక మంది తీవ్రంగా స్పందించారు, కొందరు దీపక్‌ను విమర్శించారు. అక్కడికి రెండు రోజుల తరువాత దీపక్ ఆత్మహత్య చేసుకున్నారు.

ఫాలోవర్లను పెంచుకోవడానికి షింజిత అలా చేశారా?
కాగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను దీపక్ తోసిపుచ్చారని, ఆయన అమాయకుడని దీపక్ స్నేహితులు, కుటుంబసభ్యులు చెప్పారు.
'సోషల్ మీడియాలో తనపై ప్రజలు ఏర్పరుచుకుంటున్న అభిప్రాయాలను' చూసి కలత చెందిన ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు, స్నేహితులు అన్నారు.
కేరళలోని రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో సంబంధాలున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ షింజిత ముస్తఫా ఫాలోవర్లను పెంచుకోవడానికి ఈ వీడియో ఉపయోగించుకున్నారని వారు ఆరోపించారు.
కాగా షింజిత తాను అరెస్ట్ కావడానికి ముందు మరో వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె దీపక్ కుటుంబసభ్యులు చేసిన ఆరోపణలను ఖండించారు. 'తీవ్రమైన సామాజిక, మానసిక సమసోయను హైలైట్ చేయడానికి' బస్‌లో తాను ఆ వీడియోను రికార్డ్ చేసి పోస్ట్ చేసినట్లు షింజిత తన రెండో వీడియోలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జ్యుడీషియల్ కస్టడీకి షింజిత
కాగా దీపక్ తల్లి నుంచి అందిన ఫిర్యాదుతో పోలీసులు షింజితపై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
షింజితకు బుధవారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
మరోవైపు కేరళ మానవ హక్కుల కమిషన్ జోక్యం ఈ ఘటనపై స్పందించి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలంటూ కోజికోడ్ జిల్లా పోలీసులను ఆదేశించింది.
దీపక్ తన 42వ పుట్టిన రోజు జరుపుకొన్న మరునాడు.. అంటే జనవరి 18న ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య దేశంలో ఆగ్రహాన్ని రగిలించింది.
దీపక్‌కు మద్దతుగా ఆయన కుటుంబీకులు, స్నేహితులు, పురుష హక్కుల కార్యకర్తలు పెద్దఎత్తున గళం వినిపించారు.
'దీపక్ మహిళలనే కాదు, ఎవరినీ బాధపెట్టే మనిషి కాదు' అని ఆయన స్నేహితుడు అస్గర్ అలీ 'బీబీసీ హిందీ'తో చెప్పారు.
ఓ టెక్స్‌టైల్స్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే దీపక్ ఆ ఘటన జరిగిందంటున్న గత శుక్రవారం కోజికోడ్‌కు బస్‌లో వస్తున్నారు.
అదే బస్‌లో ప్రయాణిస్తున్న షింజిత.. దీపక్ తన శరీరాన్ని ఉద్దేశపూర్వకంగా తాకారని ఆరోపిస్తూ వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేశారు.
ఈ వీడియో చూసిన తరువాత దీపక్ చాలా వేదనకు గురయ్యారని.. రద్దీగా ఉన్న ఆ బస్‌లో తన వెనుక ఎవరు నిల్చున్నారో కూడా తాను గమనించలేదని తనతో చెప్పారని అస్గర్ అలీ బీబీసీతో చెప్పారు.
లాయర్‌ను కలిసి షింజితపై చర్యలు తీసుకునే ప్రక్రియ ప్రారంభిస్తానని దీపక్ తనతో చెప్పారని అలీ అన్నారు.
దీపక్ కజిన్ జిజిల్ విజయ్ మాట్లాడుతూ.. 'తల్లిదండ్రులకు దీపక్ ఒక్కరే సంతానం. ఆయన తల్లిదండ్రులు ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఆయన తల్లి ఆరోగ్యం బాగులేదు' అన్నారు.
షింజిత తన రెండో వీడియోలో ఏం చెప్పారు?
కాగా దీపక్ చనిపోయిన తరవాత షింజిత మరో వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆమె.. 'ఆయన లైంగిక సరిహద్దులను దాటారు. అది అనుకోకుండా జరిగిందో, అవగాహనరాహిత్యంతో జరిగిందో కాదు' అని ఆరోపించారు.
'నా ముందున్న ఓ బాలిక దీపక్ చేష్టల కారణంగా ఇబ్బందిపడడం చూసిన తరువాత నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. నేను నా మొబైల్ కెమేరా ఆన్ చేసి ఆయన చేస్తున్నది రికార్డ్ చేశాను. నేను షూట్ చేయడం గమనించి కదలకుండా నిల్చుండిపోయాడు' అని ఆమె ఆరోపించారు.
ఈ ఘటన చర్చకు దారితీసింది. ఆన్‌లైన్‌లో యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు.
'ఎక్స్'లో జైసన్ ఫిలిప్ అనే యూజర్.. 'వక్షోజాలకు మోచేతిని తగిలించడం(ఎల్బోయింగ్ ద బ్రెస్ట్స్) అనేది తప్పుడు ఆలోచనలున్నవారు వ్యూహాత్మకంగా చేసేపని' అని రాశారు.
సోషల్ మీడియాలో పురుషుల హక్కుల కార్యకర్తలు ఆ మహిళను తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ, తనకు జరిగింది లైంగిక దాడిగా భావించినందున దాన్ని రికార్డ్ చేసే హక్కు ఆమెకు పూర్తిగా ఉందని తాను భావిస్తున్నట్లు ఆయన రాశారు.
సూరజ్ కుమార్ బౌద్ధ్ అనే మరో యూజర్ రాసిన పోస్ట్‌కు స్పందనగా జైసన్ ఇదంతా రాశారు. 'సోషల్ మీడియా ట్రయల్ ఒక యువకుడి ప్రాణాలు తీసింది' అంటూ సూరజ్ కుమార్ ఆ పోస్ట్‌లో తన అభిప్రాయాలు రాశారు.
షింజిత పోస్ట్ చేసిన వీడియో దీపక్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధరణకు రాలేమని.. వ్యక్తిత్వ హననం, ప్రజల్లో తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక దీపక్ తన ప్రాణాలను తానే తీసుకున్నారని సూరజ్ తన పోస్ట్‌లో అభిప్రాయపడ్డారు.
కాగా షింజిత తొలుత పోస్ట్ చేసిన వీడియో చూసిన తరువాత అనేకమంది మహిళలను పబ్లిక్ ప్లేస్‌లలో తమకు జరిగిన అనుభవాలను షేర్ చేశారు.
కాగా మరికొందరు షింజిత.. దీపక్‌ను నిలదీయడమో, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమో చేయకుండా ఇదంతా రికార్డ్ చేసి ఎందుకు పోస్ట్ చేశారని ప్రశ్నించారు.
(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












