గీతాంజలి ఆత్మహత్య: 'ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే బతికి ఉండేది...' ట్రోలింగ్ బాధితురాలి మృతిపై ఎస్పీ తుషార్ ఇంకా ఏమన్నారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
గీతాంజలి ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే, ప్రాణాలతో ఉండేదని గుంటూరు ఎస్పీ తుషార్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ మరణం వివాదాస్పదంగా మారింది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ కారణంగా ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని ఎస్పీ మీడియాకు వెల్లడించారు. గీతాంజలి ఆత్మహత్య కేసుకు సంబంధించి, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు.
ఆమె మరణం పట్ల ఆయన ఇంకా ఏమన్నారు? ఆ రోజున ఏం జరిగింది?

ఒక్క ఇంటర్య్యూతో అంతా మారింది..
“మార్చి 4న గీతాంజలి ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ గంటల సమయంలోనే వైరల్ అయింది. వేలకొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోను ఆధారంగా చేసుకుని కొంతమంది ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు రాత్రికే ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి. ఆ తరువాత రెండు రోజులూ గీతాంజలి ఆ ట్రోల్స్ వల్ల ముభావంగా ఉంది. కామెంట్లు చదువుతూ ఉంది. ఇంటి నుంచి ఎక్కువగా బయటకు వెళ్లలేదు. 7న ఇంటర్వ్యూకు విజయవాడ వెళ్లాల్సి ఉంది” అని చెప్పారు.
ఆ ఘటన గురించి చెబుతూ, “మార్చి 7 ఉదయం నుంచి ఘటన జరగకముందు వరకు బాధితురాలి కాల్ డేటా పరిశీలించగా ఆరు కాల్స్ ఉన్నాయి. అవి బంధువులు, స్నేహితులకు చేసినవి. 'నా వీడియో వైరల్ అయింది. నా పిల్లలు, తల్లీతండ్రి గురించి బూతులతో కామెంట్లు ఉన్నాయి. ఏం చేయాలో తెలీడం లేదు. ఆ కామెంట్లు ఎలా డిలీట్ చేయాలి?' అని వారిని అడిగింది” అని వెల్లడించారు.
అసభ్యకరమైన కామెంట్లు...
దర్యాప్తులో సోషల్ మీడియా ట్రోల్స్‌పై సేకరించిన కామెంట్లకు సంబంధించిన పత్రాలు తమ వద్ద 30-40 పేజీలకుపైగా ఉన్నాయని, ఎక్కవశాతం అసభ్యకరమైన కామెంట్లేనని అన్నారు ఎస్పీ.
“సుమారు 100 అకౌంట్ల నుంచి వచ్చిన కామెంట్లలో అరవైకి పైగా అకౌంట్ల నుంచి చేసిన కామెంట్లలో వాడిన భాష అసభ్యకరంగా ఉంది. నేనే కాదు, అవి మీరు చదివినా బాధపడతారు. ఆ అకౌంట్లు ఎవరివో పరిశీలిస్తున్నాం“ అని చెప్పారు.
"ఈ కేసులో, రాంబాబు (46) s/o రామచంద్రరావు, వెంకట దుర్గారావు (31) s/o అప్పారావు.. ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నాం. రిమాండ్ కోసం వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తాం“ అని తెలిపారు. మరికొంతమందిని గుర్తించామని, వారిని కూడా ప్రశ్నిస్తామని తెలిపారు.
బాధితురాలి మృతి గురించి మాట్లాడుతూ, “బాధితురాలు కనుక ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే, ప్రాణాలతో ఉండి ఉండేది. ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉండేది. కుటుంబమంతా సంతోషంగా ఉండేది“ అని అన్నారు.

ఎవరు ఈ గీతాంజలి?
32 ఏళ్ల గోల్తీ గీతాంజలిది తెనాలిలోని ఇస్లాంపేట. ఆమె భర్త పేరు బాలచందర్. వారికి ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు ఐదో తరగతి, చిన్నకూతురు యూకేజీ చదువుతున్నారు. గీతాంజలి అత్తామామలు కూడా వారితోనే ఉంటున్నారు.
గీతాంజలి భర్త, మామలు నగలు తయారీ చేసే వృత్తిలో ఉన్నారు. తమకు రోజుకు 600 రూపాయలు కూలీగా వస్తుందని బీబీసీతో చెప్పారు బాలచందర్. గీతాంజలి పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆమె చాలా యాక్టివ్‌గా ఉండేవారని ఇంట్లో వాళ్లు చెప్పారు.
ఆమెకు హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషలు కూడా తెలుసని, కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టేదని భర్త చెప్పారు.
ఒక్క వీడియోతో వైరల్..
గీతాంజలి కుటుంబం ఇస్లాంపేటలో అద్దెకు ఉంటోంది. పేదలకు ప్రభుత్వ ఇళ్ల స్థలాల పంపిణీలో ఆమె కుటుంబానికి ఇంటి స్థలం మంజూరైంది.
మార్చి 4వ తేదీన తెనాలిలో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ వేదిక మీదకు వచ్చి పట్టాలు తీసుకున్న మహిళల్లో గీతాంజలి కూడా ఉన్నారు.
ఆ సందర్భంగా మైక్ పట్టుకొని ఉన్న వ్యక్తితో ఆమె మాట్లాడారు. చాలా ఆనందం వ్యక్తం చేయడంతోపాటు తమ ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాల గురించి చెప్పారు. మరొకసారి జగన్‌కు ఓటు వేస్తామని అన్నారు.
‘‘ప్రతిపక్షాలు అన్ని కలిసి వస్తున్నాయి కదా?’’ అని ఆ వ్యక్తి ప్రశ్నించగా ‘‘ఎవరు వచ్చినా మేం జగన్ అన్ననే గెలిపించుకుంటాం’’ అని ఆమె అన్నారు.
‘‘మన ఆంధ్రా’’ అనే యూట్యూబ్ చానెల్లో మార్చి 5వ తేదీన ఆ వీడియో పబ్లిష్ అయింది. ఈ వీడియోను అధికారపక్ష సోషల్ మీడియా వైరల్ చేసేందుకు యత్నించింది.
అందుకు కౌంటర్‌గా ఆమె కామెంట్స్‌ని విమర్శిస్తూ టీడీపీ, జనసేన శిబిరాలు ఎదురుదాడి చేశాయి. ముఖ్యంగా అమ్మ ఒడి నాలుగు సార్లు ఇస్తే ఐదుసార్లు ఇచ్చారనడం ఏంటంటూ విమర్శించాయి.
ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో ఆ వీడియోను చూసిన కొందరు గీతాంజలిని అసభ్య పదజాలంతో దూషించారు.
దీని కారణంగానే ఆమె మనస్తాపానికి గురై ‘ఆత్మహత్య’ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

రాజకీయ రగడ
గీతాంజలి మరణం వైసీపీ, టీడీపీ-జనసేనల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది.
ఆమె మరణానికి కారణం మీరంటే మీరంటూ టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు.
సీఎం జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని వైసీపీ ఆరోపించగా, గీతాంజలి ‘వైసీపీ కార్యకర్త’ అని టీడీపీ శిబిరం ఆరోపించింది.
‘‘అది ఆత్మహత్యకు కాదు, ట్రైన్ యాక్సిడెంట్. ఎఫ్‌ఐఆర్‌లో యాక్సిడెంట్ అనే రాశారు. గీతాంజలి మరణాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటోంది’’ అని టీడీపీ ఆరోపిస్తోంది.
‘‘గీతాంజలిని ఎవరు తోసేశారు?’’ అంటూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది టీడీపీ.
అయితే ‘‘నిండు ప్రాణాన్ని బలిగొని, పశ్చాత్తాపం లేకుండా ఫేక్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు’’ అంటూ వైసీపీ ఆరోపించింది.
ఇలా రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది.
దాంతో ట్విటర్‌లో #WhoKilledGithanjali, #JusticeForGithanjali అనే హ్యాష్ ట్యాగ్స్ హోరెత్తాయి.
గీతాంజలి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం ప్రకటించింది
సోషల్ మీడియాలో రీల్స్..
గీతాంజలి భర్త ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆయనకు సోషల్ మీడియా మీద పెద్దగా ఆసక్తి గానీ, అవగాహన గానీ లేవు. అత్త, మామలది కూడా అదే పరిస్థితి.
గీతాంజలికి టిక్ టాక్ ఉన్న కాలం నుంచి వీడియోలు చేయడం అలవాటు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా చేసేవారు. పిల్లల పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి అందులోనూ రీల్స్ పోస్ట్ చేశారు.
భర్త, అత్త, మామలతో కలిసి కూడా రీల్స్ చేసేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వంటలు, చిన్న చిన్న స్కిట్స్, డ్యాన్సులకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆమె ఆనందపడేవారు.
ఆ రీల్స్ ద్వారా ఆమెకు స్థానికంగా గుర్తింపు కూడా వచ్చిందని ఆమె అత్త సత్యవతి బీబీసీతో అన్నారు. ఆ వీడియోలకు బంధువులు, స్నేహితులు చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యేవారని తెలిపారు.

‘నెగిటివ్ కామెంట్స్ బాధించాయి’
అప్పటి వరకూ సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్సాన్స్‌ను మాత్రమే చూసిన గీతాంజలి తొలిసారిగా నెగిటివ్ కామెంట్స్‌ను ఎదుర్కొన్నారని, అవి ఆమెను తీవ్రంగా బాధించాయని భర్త బాలచందర్ అన్నారు.
గీతాంజలి నెగిటివ్ ట్రోలింగ్‌కు తీవ్రంగా ప్రభావితమయినట్టు పోలీసులు చెబుతున్నారు.
రెండు రోజుల పాటు నెగిటివ్ కామెంట్స్ తో గీతాంజలి కొంత కలవరపడుతున్నట్టు కనిపించిందని బాలచందర్ అన్నారు.
"అర్ధరాత్రి మూడు గంటలకు నేను వాష్ రూమ్ కోసమని లేచినప్పుడు కూడా ఆమె మొబైల్ చూస్తోంది. ఎందుకలా చూస్తున్నావ్? పడుకో అన్నాను. సరే అంది. పొద్దున ఆరు గంటలకు లేచి, చూసినప్పుడూ మళ్లీ మొబైల్ చూస్తూ కనిపించింది. ముభావంగా కనిపించింది. వాటిని వదిలేయ్.. ఎవరో ఏదో అనుకున్నారని మనకెందుకు అన్నాను. కానీ వాటి గురించి ఆమె పూర్తిగా నాతో చెప్పలేదు" అని ఆయన బీబీసీకి వివరించారు.
ఇంట్లో ఆర్థిక పరిస్థితి రీత్యా స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్లో చేరేందుకు ఆమె సిద్ధం కావడంతో మార్చి 7న ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉందని బాలచందర్ అన్నారు.
"ఉదయం 11 గంటలకు ఆ స్కూల్ దగ్గరకు వెళ్లాలి. నేను కాల్ చేశాను. మనసు బాలేదని చెప్పింది. సరేలే అన్నాను. 12 గంటలకు ఫోన్ వచ్చింది. ఇక నుంచి అంతా మంచి జరుగుతుందిలే అంది. నాకు అర్థం కాలేదు. ట్రైన్ శబ్దం వినిపించింది. ఆ వెంటనే గీతాంజలి ఫోన్ కట్ చేసింది. నేను చాలా సార్లు కాల్ చేశాను. తీయలేదు. కొద్దిసేపటికి నాకు ఫోన్ వచ్చింది. కంగారుగా ఉన్న నాకు వారు బెంగాలీలో ఏదో చెప్పారు. యాక్సిడెంట్, ట్రైన్, గుంటూరు అనే మాటలు నాకు వినిపించాయి. అక్కడి నుంచి తెనాలి ఆస్పత్రికి తీసుకొచ్చి, వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లినా ప్రాణాలు కాపాడలేకపోయాం" అంటూ భర్త బాలచందర్ కన్నీరు పెట్టుకున్నారు.
గీతాంజలి తన చేతిలో చేయి వేసి, కన్నీరు పెడుతూ మార్చి 11 తెల్లవారుజామున తుది శ్వాస విడిచిందని తెలిపారు.
మొదట దీనిని రైలు ప్రమాదంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తరువాత ఆత్మహత్యకు పురిగొల్పడం వంటి సెక్షన్లను కూడా చేర్చామని తెలిపారు. క్రైమ్ నెం. 65/2024 గా కేసు దర్యాప్తు చేపట్టామని తెనాలి వన్ టౌన్ పోలీసులు తెలిపారు.
"ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఆత్మహత్యకు పురిగొల్పేలా కొందరు వ్యవహరించారు. ఈ కేసుని సీరియస్‌గా పరిగణిస్తున్నాం. ఆన్‌లైన్‌లో మహిళల మీద వేధింపులకు ఇది పరాకాష్ట, కొన్ని అకౌంట్లు గుర్తించాం. మరికొన్ని ఫేక్ అకౌంట్లున్నాయి. అందరి మీద చర్యలుంటాయి. కఠినంగా వ్యవహరిస్తాం" అని మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ అన్నారు.

పక్కదారి పట్టించే ప్రయత్నం..
గీతాంజలి కేసుని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా మహిళల మీద వేధింపులను అరికట్టే దిశలో చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కోరుతోంది.
మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అసలు సమస్యను పక్కదారి పట్టించేలా ఉన్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు టి.ప్రభావతి అన్నారు.
"ఆన్ లైన్‌లో మహిళల పట్ల అత్యంత నీచమైన స్థాయిలో రెచ్చిపోతున్నారు. కట్టడి చేయాల్సిన యంత్రాంగం చేతులెత్తేస్తోంది. మేమే అనేక ఫిర్యాదులు ఇచ్చినా తగిన చర్యలు తీసుకోలేదు. గీతాంజలి కేసులో నిందితులను గుర్తించి, తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆలస్యం చేయకుండా కేసులో చర్యలుండాలి. అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల తీరు కనిపిస్తోంది. రాజకీయంగా విమర్శలు గుప్పించుకుంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఇరువైపులా ఉన్న మహిళా నేతలు కూడా ఈ ట్రోలింగ్ బాధితులే. కాబట్టి దానిని అరికట్టే దిశలో స్పందించాలని కోరుతున్నాం" అని ఆమె బీబీసీతో చెప్పారు.
గమనిక: మహిళలకు ఆన్‌లైన్ వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు జాతీయ స్థాయిలో పోర్టల్ అందుబాటులో ఉంది.
నేరుగా పోలీసు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండానే www.cybercrime.gov.in అనే పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
- భారత్-దివ్యాస్త్ర: చైనా నగరాలను టార్గెట్ చేయగల ఈ క్షిపణిలోని టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి?
- విమానంలో 153 మంది ప్రయాణికులు, నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు, తర్వాత ఏం జరిగిందంటే...
- రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
- రవిచంద్రన్ అశ్విన్: బ్యాటర్ కావాలనుకుని బౌలర్‌గా మారి రికార్డులు నెలకొల్పిన ఆటగాడు
- బూతు కామెంట్లు, బాడీ షేమింగ్, ఫోటోల మార్ఫింగ్, మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్.. దీని వెనక ఏం జరుగుతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















