సుక్కా పగడాలమ్మ: పాతపట్నం ఎమ్మెల్యేగా ఆరేళ్ళున్నారు, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ముక్తాపురం గ్రామంలోకి వెళ్లగానే బావి దగ్గర నాలుగో ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అది ఒక మాజీ ఎమ్మెల్యే ఇల్లు. ఇప్పటికీ ఆమె అందులోనే నివాసం ఉంటున్నారు.
1972లో పాతపట్నం ఎమ్మెల్యేగా పని చేసిన సుక్కా పగడాలమ్మ పాత ఇంటిలోనే నివాసం ఉంటూ దానిని బాగు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయం ఆశిస్తున్నారు. 42 రెండేళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్న పగడాలమ్మ ఇంటికి వెళ్లిన బీబీసీ బృందం ఆమెతో మాట్లాడింది.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏడుగురికి ఒకేసారి ఉద్యోగాలు ఇప్పిస్తే తన ఇంటికి వచ్చి ఏడు అపిల్ పండ్లు ఇచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు.
అలాగే, ఒకాయనకు చిత్తూరులో పెద్ద పోస్టింగ్ ఇప్పిస్తే, సొంత ఖర్చులతో తమ కుటుంబాన్ని తిరుమల తీసుకుని వెళ్లాడని పగడాలమ్మ చెప్పారు.
ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భుజంపై తనను ఎందుకు చేయి వేయమన్నారో, ఒడిశాలో మ్యాట్నీ సినిమాకి వెళ్తే పోలీసులు వచ్చి తనను, తన భర్తని హెలీకాప్టర్ ఎక్కించుకొని హైదరాబాద్ ఎందుకు తీసుకుని వెళ్లారోననే ఆసక్తికర అంశాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు.

అప్పుడు ఎమ్మెల్యే జీతం రూ. 300
సుక్కా పగడాలమ్మ పాతపట్నం నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. సుమారు 8 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్యేగా పని చేసిన పగడాలమ్మ, ఆ తర్వాత పాలకొండ నియోజకవర్గం వర్గం నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ రాజకీయాల వైపు చూడలేదు. కానీ, మధ్యలో ఆర్థిక పరిస్థితి అనుకూలించక కొంతకాలం పాటు ఉపాధి హామీ పనులకు కూలీగా వెళ్లారు.
ఎమ్మెల్యేగా తాను తొలి జీతం రూ. 300 తీసుకున్నానని, ఆ తర్వాత రూ. 600కి పెరిగిందని పగడాలమ్మ చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు రూ. లక్ష కంటే ఎక్కువే జీతం వస్తుందని విన్నానని చెప్పిన పగడాలమ్మ ప్రస్తుతం తనకు మాజీ ఎమ్మెల్యేగా రూ. 30 వేల పెన్షన్ అందుతుందని తెలిపారు. పగడాలమ్మ వయస్సు 75 ఏళ్లు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. భర్త మూడేళ్ల క్రితమే చనిపోయారు.
పగడాలమ్మ ప్రస్తుతం పెన్షన్ పైనే జీవిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు, కుమార్తెల వివాహాల కోసం చేసిన అప్పులు, నెలవారీ మందుల ఖర్చులు వంటివి ఉండటంతో పెన్షన్ డబ్బులు సరిపోవడం లేదని అన్నారు. ఇంటి రిపేరు పనులు చేయించుకోలేక, మరో ఇంటికి మారలేక, పాత ఇంటిలోనే ఉంటున్నట్లు పగడాలమ్మ చెప్పారు. ఇంకా ఏమన్నారో ఆమె మాట్లల్లోనే...

'అలా ఎమ్మెల్యే అయ్యాను’
1972లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. దాంతో కాంగ్రెస్ నాయకులు నాకు టిక్కెట్ ఇచ్చి నన్ను ఎన్నికల్లో నిలబెట్టారు.
ఎన్నికల ఖర్చు కోసం జలగం వెంగళరావు రూ.10 వేలు, నీలం సంజీవరెడ్డి రూ.2 వేలు ఇచ్చారు. వాటికి తోడుగా మాకున్న కొంత ఆస్తిని అమ్మేసి మొత్తం రూ. 18 వేలతో పోటీలోకి దిగి గెలిచి ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యేగా గ్రామాలకు బస్సుల్లోనే వెళ్తూ, బావులు, చెరువుల్లోని నీటిని తాగేవాళ్లం.
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులకు ఒక వైపు ప్రయాణానికి రూ. 40 ఇచ్చేవారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీవీ నరసింహరావు, జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వారు నన్ను చాలా బాగా చూసుకునేవారు. నేను ఏ పని కోరినా అది వెంటనే చేసేవారు.
పాతపట్నం, నేను నివాసం ఉంటున్న ముక్తాపురం గ్రామంతో సహా 60 గ్రామాలకు మొదటగా విద్యుత్ సౌకర్యం తీసుకుని వచ్చింది నేనే. పాతపట్నం జూనియర్ కళాశాల, పెద్దమడిలో గిరిజన ఆశ్రమ పాఠశాల, కరజాడలో హైస్కూల్ నేను తీసుకురాగలిగాను.

‘ఉద్యోగాలు ఇప్పిస్తే ఆపిల్ పండ్లు ఇచ్చారు’
ఆ రోజుల్లో ముఖ్యమంత్రుల వద్ద నాకు పలుకుబడి ఉందని బాగా ప్రచారం జరిగింది. దాంతో చాలా మంది ఉద్యోగాలు కోసమని నా వద్దకు వచ్చి అడిగేవారు. నాకు పెద్దగా చదువులేదు. ఎవరైనా ఏదైనా అడిగితే అది ముఖ్యమంత్రుల వద్దకు తీసుకుని వెళ్లి చెప్పేదాన్ని. దానికి వాళ్లు నవ్వుకుని, సరేనంటూ ఆ పని చేసిపెట్టేవారు.
బాపట్ల నుంచి ఒక రోజు ఏడుగురు వచ్చారు. తమ ఊర్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సికింద్రాబాద్‌లో ఒక పెద్ద ఆఫీసర్‌కి చెప్పి సిఫారసు చేయమన్నారు. నేను వెంటనే ఆ ఆఫీసరుకు ఫోన్ చేసి అడిగితే, సరేనంటూ ఏడుగురికి ఉద్యోగాలు ఇచ్చారు.
ఒక రోజు ఈ ఏడుగురు ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వచ్చి ఒక్కో మనిషి ఒక్కో ఆపిల్ పండు ఇచ్చి నమస్కారం పెట్టి వెళ్లారు.
అలాగే ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు చెప్పి మరోకాయనకు చిత్తూరులో వ్యవసాయశాఖ ఆఫీసరుగా పెద్ద పోస్టు ఇప్పించాను. సంతోషంతో మా కుటుంబం మొత్తాన్ని ఆయన సొంత ఖర్చులతో తిరుమల తీసుకుని వెళ్లి వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. కొందరు భూములు అడిగితే విశాఖపట్నంలో ఇప్పించాను.
కానీ, ఏ రోజూ నా కోసం ఒక్క పైసా కూడబెట్టుకోలేదు. ఎక్కడా భూమి సంపాదించుకోలేదు. మాకున్న 30 ఎకరాల పొలం నేను ఎమ్మెల్యేగా దిగిపోయేనాటికి 4 ఎకరాలైంది. అప్పటికే పాడైపోయిన మా ఇల్లు తిత్లీ తుపానుకు చాలా వరకు దెబ్బతిని కూలిపోయే స్థితికి చేరుకుంది. దాంతో ఇప్పుడు ఎండ, వాన నుంచి నాకు రక్షణ లేకుండా పోయింది.

‘నాన్ లోకల్ అని ఓడించారు’
నేను అసెంబ్లీకి వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు.. “అమ్మాపగడాలమ్మ, ఇంట్లో ఉండకు, ఊర్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి కష్టాలు అన్ని రాసుకుని నా వద్దకు తీసుకుని రా’ అని చెప్పేవారు. దాంతో నేను నా భర్త సైకిల్ మీద ఊరంతా తిరిగేవాళ్లం. దూరం వెళ్లాల్సి వస్తే బస్సుల్లో వెళ్లేవాళ్లం. ఎమ్మెల్యేగా జీతం డబ్బులు పలాస ట్రెజరీ ఆఫీసు నుంచి తీసుకునే దాన్ని. ఇలా తీసుకుని వస్తూ దారిలోనే ప్రజలకు అవసరమయ్యే ఏదో ఒక పని మీద ఖర్చు పెట్టేసి ఇంటికి ఉట్టి చేతులతో వచ్చేదాన్ని. అప్పుడు డబ్బు కంటే గౌరవం కోసం తాపత్రయపడేవాళ్లం.
1978 ఎన్నికల్లో పాతపట్నం నుంచి కాకుండా పాలకొండ నుంచి పోటీ చేయమన్నారు. అక్కడ నుంచే పోటీ చేశాను. గెలుపు ఖాయమని అనుకున్నా. కానీ పగడాలమ్మ లోకల్ కాదు, మనకు ఏదైనా పని కావాలంటే పగడాలమ్మ సొంతూరైన పాతపట్నం వెళ్లాల్సి ఉంటుందని విద్యార్థులు, యువత నమ్మి నాకు ఓటేయ్యలేదు. దాంతో నేను ఓడిపోయాను.

‘సినిమాకి వెళ్తే హెలికాప్టర్ పంపించారు’
నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో అంటే 1972లో జై ఆంధ్రా ఉద్యమం బలంగా ఉంది. అప్పుడు ఎమ్మెల్యేల మీద దాడులు జరిగేవి. దాంతో భయపడి నేను, మా ఆయన ఇద్దరం ఒడిశాలో మాకు తెలిసిన వాళ్లింటికి వెళ్లిపోయి, అక్కడే తలదాచుకున్నాం. 20 రోజులు ఎవరికీ కనపడకుండా బయటకు రాకుండా ఒకే ఇంట్లో అలా గడిపాం. జై ఆంధ్ర ఉద్యమం గట్టిగా జరుగుతున్న సమయంలో నేను కనిపించపోయేసరికి పీవీ నరసింహరావు నా కోసం వెదకమని జిల్లా పోలీసులకు చెప్పారు. నా కోసం వాళ్లు వెదకడం ప్రారంభించారు. నాకు ఈ విషయాలేమీ తెలియదు.
ఒడిశాలో రోజుల తరబడి ఒకే ఇంట్లో ఉండలేక ఒక రోజు దగ్గరలోని ఒక సినిమాకి వెళ్లాం. సినిమా చూస్తుండగా ఎవరో నన్ను గుర్తుపట్టి పోలీసులకు చెప్పేశారు. దాంతో మేం సినిమా చూస్తుండగానే పోలీసులు వచ్చి నన్ను, నా భర్తని అక్కడ నుంచి తీసుకెళ్లి, మరో చోట హెలికాప్టర్ ఎక్కించి మమ్మల్ని హైదరాబాద్ పంపించారు. గొడవలు, అల్లర్లు ముగిసే వరకు మమ్మల్ని పీవీ నరసింహరావు భద్రంగా చూసుకున్నారు.

‘ఇందిరాగాంధీ భుజంపై చేయి వేశాను’
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా దిల్లీ వెళ్లి ప్రధాని ఇందిరాగాంధీని కలిశాం. ఆమె ఇంట్లో కాసేపు మాట్లాడిన తర్వాత వెళ్లిపోతుండగా నేను అమ్మతో ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుందని అన్నాను. ఆ మాటలకు వెళ్లిపోతున్న ఇందిరాగాంధీ గారు వెంటనే వెనక్కి తిరిగి వచ్చారు. ఫోటో కోసం ఆమె కూర్చీలో కూర్చుని, మమ్మల్ని ఫోటో తీసుకోడానికి రమ్మన్నారు. నేను ఇందిరాగాంధీ పక్కనే నిలబడితే ఆమె తన భుజంపై చేయి వేయమని అన్నారు.
నాకు భయం వేసింది. ప్రధానమంత్రి భుజంపై చేయి వేయడమంటే నాకు వణుకు వచ్చింది. కానీ, ఇందిరాగాంధీ మళ్లీ అడగడంతో నేను ఒక రెండు వేళ్లు మాత్రమే ఆమె భుజంపై పెట్టి ఫోటోకి ఫోజు ఇచ్చాను.
ఆ తర్వాత మరో విషయం తెలిసింది. ఇంత దూరం వచ్చాం, అమ్మతో ఫోటో తీసుకుంటే బాగుంటుందని నేను అన్నప్పుడు, ఇందిరాగాంధీ గారికి ‘‘అమ్మ, ఫోటో’’ అనే రెండు మాటలు అర్థమై ఫోటో తీయించుకోడానికి వచ్చారని అక్కడే ఉన్న ఒక తెలుగు అధికారి నాకు చెప్పారు.

‘గౌరవంతో పని ఇవ్వలేదు’
నేను ఎమ్మెల్యేగా ఆరేళ్లు పని చేశాను. దాంతో ఇప్పటికీ నన్ను చాలా మంది మాజీ ఎమ్మెల్యేగారు అని పిలుస్తుంటారు. అది విన్నప్పుడు నాకు పాత రోజులన్నీ గుర్తుకు వస్తాయి. కానీ, ఆ మాజీ ఎమ్మెల్యే అనే గౌరవం నాకు కష్టం కూడా తెచ్చిపెట్టింది.
అంతకు ముందు నా పెన్షన్ రూ. 1500. ఆతర్వాత రూ. 4000 అయ్యింది. అలా పెరుగుతూ ప్రస్తుతం రూ. 30 వేలు వస్తుంది. ఇప్పుడు కాస్త పర్వాలేదు. కానీ, పెన్షన్ తక్కువగా ఉన్న రోజుల్లో డబ్బులు ఇంటి అవసరాలకు, మందులు వంటి ఖర్చులకు సరిపోయేది కాదు. విషయం తెలిసిన కొందరు స్థానికులు తమతో పాటు ఉపాధి హామీ పనులకు రమ్మన్నారు.
నాలుగు నెలలు పని చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే అయిన మీ చేత పని చేయించుకోలేమంటూ పనికి రావద్దని చెప్పేశారు. దాంతో నా మీద వాళ్లు చూసిస్తున్న గౌరవమే నాకు పని లేకుండా చేసింది. ప్రస్తుతం పెన్షన్ రూ. 30 వేలు వస్తోంది. కానీ, ఆ డబ్బుతో ఇల్లు బాగు చేసుకుందామంటే నెలవారీ ఖర్చులకే సరిపోవడం లేదు. దీంతో ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుందా అని ఎదురు చూస్తున్నాను.
ఇవి కూడా చదవండి:
- లాలూ ప్రసాద్ యాదవ్: ‘మోదీ ఈసారి గెలవరనే నేను అనుకుంటున్నా’
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















