తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?

తెలంగాణ ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ ఓటరు జాబితాను పరిశీలించి చూడగా ఓ వర్గం వారు అండగా నిలిస్తే వారు బలపరిచిన అభ్యర్థులు ఏకంగా 62 శాతం నియోజవర్గాల్లో గెలిచే అవకాశముంది.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం.. 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయిక్కడ. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటరు జాబితా ప్రకారం 3,15,801 మంది ఓటర్లు ఉన్నారు.

వీరిలో పురుష ఓటర్లు 1,51,673 మంది కాగా.. మహిళా ఓటర్లు 1,64,006 మంది. మహిళా ఓటర్ల సంఖ్య 12,333 మంది ఎక్కువ.

ప్రస్తుతం ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

అయితే ఇప్పటివరకు అక్కడ ఒక్క మహిళకు కూడా ఎమ్మెల్మేగా ప్రాతినిధ్యం దక్కలేదు.

ఖమ్మం నియోజకవర్గమే కాదు, తెలంగా‌‍ణలోని మెజార్టీ నియోజకవర్గాల్లో మహిళలే వచ్చే ఎన్నికలలో గెలుపోటముల నిర్ణేతలు కానున్నారు.

వారు ఇచ్చే తీర్పుతోనే నేతల తలరాత మారనుంది.

అసెంబ్లీ

ఫొటో సోర్స్, Getty Images

62 శాతం నియోజకవర్గాలలో కీలకం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది.

నవంబర్ 30న పోలింగ్ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ ౩న ఫలితాలు తెలుస్తాయి.

తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇటీవల నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి విడుదల చే‌‍శారు.

రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లు నిండిన ఓటర్లు 3,17,32,727 మంది ‌ఉన్నట్లు తేలింది.

వీరిలో 1,58,71,493 మంది ఓటర్లు పురుషులు కాగా, 1,58,43,339 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఓవరాల్‌గా చూసుకుంటే పురుష, మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు సమానం.

అయితే, 119 నియోజకవర్గాల ఓటర్ల జాబితాను బీబీసీ పరిశీలించింది. ఇందులో కొన్ని ఆసక్తికర వి‌షయాలు తెలిశాయి.

కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

సంఖ్య ఎక్కువైనా... ప్రాతినిధ్యం తక్కువ

రాష్ట్రంలోని 74 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.

అంటే దాదాపు 62 శాతం నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువ శాతం ఏ పార్టీకి ఓటేస్తే వారికే విజయావకాశాలు ఎక్కువ.

మహిళా ఓటర్ల సంఖ్య ఇంతగా ప్రభావితం చేసేలా ఉన్నప్పటికీ, ఎన్నికల్లో వారి ప్రాతినిధ్యం మాత్రం కనిపించడం లేదు.

ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానంలో 4,073 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

ఇక్కడ 115835 పురుష ఓటర్లు ఉండగా, 119908 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఇక్కడ 1952 నుంచి దాజి శంకర్ రావు మొదలుకుని ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జోగు రామన్న వరకు ఒక్కరు కూడా మహిళా ఎమ్మెల్యే ఎన్నికవ్వలేదు.

బోథ్ అసెంబ్లీ స్థానం 1962 నుంచి ఉనికిలోకి వచ్చింది. ఇక్కడ 5375 మంది మహిళా ఓటర్లు ఎక్కువ.

ఇక్కడ పురుష ఓటర్లు 100656 ఉండగా, 106031 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఈ ఆరు దశాబ్దాల్లో ఒక్కరు కూడా మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వలేదు.

సిరిసిల్లలో 5048 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

ఈ నియోజకవర్గం ఏర్పడిన 1952 నుంచి ఇప్పటివరకు ఒక్కరు కూడా మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వలేదు.

ప్రస్తుతం ఇదే స్థానం నుంచి తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, మళ్లీ ఆయన బరిలోకి దిగారు.

మంథని నియోజకవర్గంలో పురుష ఓటర్లు 113828 మంది ఉన్నారు. 116458 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఇక్కడ 2630 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు.

కానీ, ఈ నియోజకవర్గం ఏర్పడిన 1952 నుంచి కూడా ఎమ్మెల్యేగా మహిళ ఎన్నికవ్వలేదు.

మానకొండూరు, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ డ్ గా ఉన్నాయి. ఇవి 2009లో ఏర్పడ్డాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మహిళలకు ప్రాతినిధ్యం దక్కలేదు.

ప్రస్తుత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం పాలేరు.

ఇక్కడ పురుష ఓటర్లు 112607 మంది ఉండగా.. 119994 మంది మహిళా ఓటర్ల ఉన్నారు. పురుషుల కంటే 7387 మంది మహిళలు ఎక్కువ.

1962లో ఎన్నికైన కత్తుల శాంతయ్య మొదలుకుని ఇప్పటివరకు మహిళా ఎమ్మెల్యే ఇక్కడి నుంచి రాలేదు. ప్రస్తుతం ఇదే స్థానం నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

బాల్కొండ నియోజకవర్గంలో పురుషులతో పోల్చితే 16,170 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

ఇక్కడ పురుష ఓటర్లు 99,728 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,15,898 మంది ఉన్నారు.

ఈ నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే.. 1952 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే మహిళ ఎమ్మెల్యేగా గెలిచారు.

1981 నుంచి 1983 మధ్య గడ్డం సుశీలాదేవి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమె అప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న గడ్డం రాజారాం భార్య.

1981లో రాజారాం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన ‌భార్య సుశీలాదేవికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అలా ఆమెకు ప్రాతినిధ్యం లభించింది.

మరో నియోజకవర్గం నిర్మల్.. ఇక్కడి నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఏర్పడింది.

ఇక్కడ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 12,351 మంది ఎక్కువగా ఉన్నారు.

మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో మగవారే విజేతలుగా నిలిచారు. ప్రధాన పార్టీలు కూడా వారికే టికెట్లు కేటాయిస్తూ వస్తున్నాయి.

మహిళలు

ఫొటో సోర్స్, BBC/GOPALSHUNYA

'అధికారం మీద దృష్టి లేకపోవడమే'

రాజకీయంగా మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా బీబీసీతో మాట్లాడారు.

‘‘మన దగ్గర సారా ఉద్యమం మొదలుకుని ఏ ఉద్యమం చూసినా ఆడవా‌ళ్లే ముందుండి నడిపించారు. కానీ, ఒక్కసారి ఉద్యమం ముగిసిన తర్వాత ఆడవా‌‍ళ్లను పక్కన పెట్టి పురుష లీడర్లు ముందుకు వస్తారు. ఉద్యమాలు చేయడం వరకే మహిళలు పరిమితం అవుతున్నారు. ఆడవాళ్లకు రాజకీయాలపై అవగాహన ఉన్నప్పటికీ, వారి లక్ష్యం పొలిటికల్ పవర్ మీద ఉన్నట్లు కనిపించదు. అందుకే, అవకాశాలు రావడం లేదు’’ అని చెప్పారు

అయితే, నిత్యం ప్రజల మ‌‍ధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుంటే అవకాశాలు వస్తుంటాయని చెప్పారు ములుగు ఎమ్మెల్యే సీతక్క.

ఈ వి‌షయంపై ఆమె బీబీసీతో మాట్లాడారు.

‘‘మహిళలు రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు చాలా విమర్శలు వస్తుంటాయి. ప్రత్యర్థులు మన తప్పు లేకున్నా, వ్యక్తిగత విమర్శలు, దుష్ప్రచారం చేస్తుంటారు. ఒక మహిళ రాజకీయంగా ముందుకు వెళ్లలేకపోవడానికి అవే కారణం అవుతున్నాయి. నా విషయానికి వస్తే నేను ఎక్కువగా ప్రజల మధ్య ఉండటానికి ప్రయత్నిస్తుంటా. ఆ సమయంలో పొగడ్తలు వస్తాయి, తిట్లూ వస్తుంటాయి. అయినా రెండింటిని స్వీకరించి ముందుకు వెళ్లగలిగే ధైర్యం ఉండాలి’’ అని సీతక్క చెప్పారు.

తెలంగాణ

ఫొటో సోర్స్, ECI

కీలక నాయకుల నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా..

ఇక ప్రధాన పార్టీల కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల విషయానికి వద్దాం.

కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు చోట్ల కూడా మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నారు.

గజ్వేల్‌లో పురుష ఓటర్ల (1,31,774) కంటే మహిళా ఓటర్లు (1,33,855) సంఖ్య అధికం.

కామారెడ్డిలో పురుష ఓటర్లు 1,18,718 మంది ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,27,080గా ఉంది.

మరోవైపు మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 నుంచి నాలుగు సార్లు (2010 ఉప ఎన్నిక సహా) జరిగిన ఎన్నికల్లో ఆయనే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో 5,048 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ పురుష ఓటర్ల సంఖ్య 117,872 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,22,920గా ‌ఉంది.

సిద్దిపేటలో 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు మంత్రి టి.హరీష్ రావు.

అంతకుముందు 1985 నుంచి ఇక్కడ కేసీఆర్ వరుస విజయాలు సాధించారు.

ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య 1,15,520 కాగా పురుష ఓటర్లు 1,12,934 మంది ఉన్నారు.

ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఆయన 2009, 2014‌లో రెండుసార్లు గెలిచారు. అయితే గత ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలోనూ 1,959 మంది మహిళా ‌ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

ఇక్కడ పురుష ఓటర్లు 1,14,140 ఉండగా, 1,16,099 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

మహిళలకు ముందు నుంచి రాజకీయ పార్టీల పరంగా కొన్ని బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. అప్పుడే వారి సామర్థ్యం తెలుస్తుందని ఆమె అన్నారు.

‘‘స‌‍హజంగా ఎన్నికలప్పుడే మహిళల ప్రాధాన్యత కనిపిస్తుంటుంది. అప్పటికప్పుడు టికెట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో.. అప్పటికే ఉన్న రాజకీయ నాయకుల ‌భార్యలు, కుటుంబ సభ్యులను తీసుకువస్తున్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు బా‌‍ధ్యతలు అప్పగించడం గీటురాయిగా పెట్టుకోవాలి. అందులోనూ కులాల వారీగా రిజర్వేషన్ పెట్టుకుని ప్రోత్సహించాలి. అలా కాకుండా సీట్ల రిజర్వేషన్ ప్రకారం టికెట్లు కేటాయిస్తే అప్పటికప్పుడు పోటీ చేసేందుకే మహిళలు వస్తారు. ఒకవేళ గెలిచినప్పటికీ వారి టర్మ్ అయ్యాక మళ్లీ కనిపించరు. అందుకే మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించుకుంటూ రావాలి’’ అని సీతక్క చెప్పారు.

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

గత ఎన్నికలకు, ఇప్పటికీ తేడా ఏంటంటే...

గత (2018) ఎన్నికల నాటికి తెలంగాణలో 2,80,64,680 ఓట్లు ఉన్నాయి.

ఇందులో పురుష ఓటర్లు 1.38 కోట్ల మంది కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 1.35 కోట్లుగా ఉంది.

ఈసారి ఇరువురి సంఖ్య కొంతవరకు సమానంగా ‌ఉందని చెప్పవచ్చు.

అయినప్పటికీ, మహిళలకు అవకా‌‍‌‍శాలు కల్పించడంలో రాజకీయ పార్టీలు ఆసక్తి చూపడం లేదు.

రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసేందుకు ఛాన్స్ తక్కువగానే ఉంటోంది.

ఇప్పటికే ప్రకటించిన బీఆర్ఎస్ అ‌‍భ్యర్థుల జాబితాలో కేవలం ఏ‌డుగురు మహిళలకే పోటీ చేసే అవకాశం దక్కింది.

‘‘పంచాయతీ, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కారణంగా చాలామందికి అవకాశాలు దక్కాయి. కానీ, అసెంబ్లీ, లోక్ సభ సీట్ల విషయానికి వచ్చేసరికి పార్టీలు టికెట్లు ఇవ్వడం లేదు. కీలక నేతలు చనిపోయినప్పుడు వారి ‌భార్యలకో.. బంధువులకో మాత్రమే టికెట్లు ఇస్తున్నారు. డబ్బు, బలం ప్రధానంగా మారడంతో పోటీచేసే అభ్యర్థుల మెరిట్‌ను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు’’ అని ప్రొఫెసర్ పద్మజా వివరించారు.

మహిళా ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images

అర్బన్‌లో మగవారిదే ఆధిపత్యం

హైదరాబాద్ స‌హా చుట్టుపక్కల ఉన్న మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పురుష ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది.

మహిళలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలన్నీ రూరల్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ‌‍24 నియోజకవర్గాలుంటే, వీటన్నింటిలో మహి‌‍ళల కంటే పురుష ఓటర్లదే ఆధిక్యం.

అర్బన్‌లో మహిళలందరూ ఓటర్లుగా నమోదు చేయించుకోకపోవడమూ హెచ్చుతగ్గులకు కారణం అయ్యి ఉండొచ్చని ఎన్నికల బాధ్యతలు చూస్తున్న అధికారి ఒకరు చెప్పారు.

మహిళలకు దక్కుతున్న అవకా‌‍‌‍శాలపై సామాజిక కార్యకర్త కె. సజయ బీబీసీతో మాట్లాడారు.

‘‘మనది పితృస్వామ్య వ్యవస్థ. మహిళల ప్రాతిని‌ధ్యంపై వ్యతిరేక భావనతో ఉన్న సొసైటీ. మహిళలు స్వయం నిర్ణయాధికారంతో ఉంటారని ఏ రాజకీయ పార్టీ నమ్మడం లేదు. అందుకే రాజకీయ పార్టీల నాయకుల కుటుంబాల్లోని మ‌హిళలకే టికెట్లు దక్కుతున్నాయి’’ అని చెప్పారు.

ఇటీవల వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో మార్పు వస్తుందని ‌భావిస్తున్నారా..? అనే ప్రశ్నపై సజయ స్పందిస్తూ..

‘‘చట్టం ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనేది ఇంకా పూర్తి స్పష్టత లేదు. ప్రాథమికంగా మహిళా ప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య విలువల విషయంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల్లో మార్పు రావాలి. అందుకు సమయం పడుతుంది’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)