పెండ్యాల రాఘవరావు: ఒకేసారి 3 స్థానాల్లో గెలిచిన నేత.. ఆయన తర్వాత ఇది ఎన్టీఆర్‌కే సాధ్యమైంది

పెండ్యాల రాఘవరావు

ఫొటో సోర్స్, Raghava Rao Family/Na Praja Jeevitham

ఫొటో క్యాప్షన్, పెండ్యాల రాఘవరావు
    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశ ఎన్నికల చర్రితలో ఎన్నో అరుదైన రికార్డులున్నాయి. అందులో పెండ్యాల రాఘవరావు సాధించిన విజయం కూడా ఒకటి.

ఆయన సాధించిన రికార్డ్‌ను సమం చేయడం అటల్ బిహారీ వాజపేయీ వంటి జాతీయ స్థాయి నేతకూ సాధ్యం కాలేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆ రికార్డ్‌ను సమం చేశారు.

పెండ్యాల రాఘవరావు 70 ఏళ్ల కిందట ఒకేసారి జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి మూడు చోట్లా విజయం సాధించారు.

అలాంటి రికార్డ్ తెలుగు రాష్ట్రాలలో మళ్లీ ఎన్టీఆర్‌కు సాధ్యమైంది.

Jail

ఫొటో సోర్స్, Getty Images

జైలు నుంచే నామినేషన్.. అయినా మూడు చోట్ల విజయం

1952 సాధారణ ఎన్నికలలో కమ్యూనిస్ట్ నాయకుడు పెండ్యాల రాఘవరావు ఈ రికార్డ్ సాధించారు. అప్పుడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. రాఘవరావు వరంగల్‌ లోక్‌సభ స్థానంతో పాటు హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభ స్థానాల నుంచి పోటీ చేశారు.

పీడీఎఫ్‌ అభ్యర్థిగా ఈ మూడు స్థానాల నుంచి బరిలో నిలిచిన ఆయన, అన్ని చోట్లా విజయం సాధించారు.

అయితే, గెలిచాక హన్మకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలను వదులుకుని వరంగల్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

రాఘవరావు ఈ ఎన్నికలలో నామినేషన్ వేసే సమయానికి జైలులో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసినందుకు అప్పటి ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టింది.

ఈ ఎన్నికలలో విజయం సాధించేనాటికి రాఘవరావు వయసు 35 ఏళ్లే.

Kaloji Narayana Rao

ఫొటో సోర్స్, Kaloji Narayana Rao University of Health Sciences

ఫొటో క్యాప్షన్, కాళోజీ నారాయణ రావు

వరంగల్‌లో కాళోజీపై విజయం

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాఘవరావు ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యర్థిగా పోటీ చేయగా, కాంగ్రెస్ తరఫున కాళోజీ నారాయణ రావు పోటీ చేశారు.

సోషలిస్ట్ పార్టీ నుంచి కె.సోమయాజులు బరిలో దిగారు.

ఈ ముగ్గురిలో రాఘవరావు అత్యధికంగా 77,267 ఓట్లు సాధించడంతో ఆయనకు విజయం దక్కింది.

హన్మకొండ, వర్ధన్నపేటలో..

అదే సమయంలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో హన్మకొండ, వర్ధన్నపేట నియోజకవర్గాల నుంచి పెండ్యాల రాఘవరావు పోటీ చేశారు.

ఆ రెండు నియోజకవర్గాల నుంచీ ఆయన విజయం సాధించారు.

దీంతో మొత్తం మూడు నియోజకవర్గాల నుంచి ఒకేసారి ఆయన విజయం సాధించినట్లయింది.

అటల్ బిహారీ వాజపేయీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అటల్ బిహారీ వాజపేయీ

వాజపేయీ మూడు చోట్ల పోటీ చేసినా...

రాఘవరావులా ఒకేసారి మూడు నియోజకవర్గాల నుంచి ఎన్టీఆర్ మాత్రమే గెలిచారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ ఒకేసారి మూడు స్థానాల్లో పోటీచేసినప్పటికీ, ఒక్క స్థానంలో మాత్రమే గెలిచారు.

1957 ఎన్నికలలో భారతీయ జన్ సంఘ్ నేతగా ఉన్న వాజపేయీ ఏకంగా మూడు స్థానాల నుంచి పోటీ చేశారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని బలరాంపూర్, మథుర, లఖ్‌నవూ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేశారు.

బలరాంపూర్‌లో విజయం సాధించిన ఆయన లఖ్‌నవూ‌, మథురలో ఓటమి పాలయ్యారు.

మథుర లోక్‌సభ నియోజకవర్గంలో వాజపేయీ కేవలం 23,620 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. ఆ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి రాజా మహేంద్ర ప్రతాప్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దిగంబర్ సింగ్ రెండో స్థానంలో, మరో స్వతంత్ర అభ్యర్థి పూరన్ మూడో స్థానంలో నిలిచారు.

మరో స్థానం లఖ్‌నవూలోనూ వాజపేయీ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి పులిన్ బేహారీ బనర్జీ అక్కడ విజయం సాధించారు. వాజపేయీ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బనర్జీకి 69,519 ఓట్లు రాగా, వాజపేయీ 57,034 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

వాజపేయీ తాను పోటీ చేసిన మూడో స్థానం బలరాంపూర్‌లో మాత్రం విజయం సాధించారు. వాజపేయీకి 1,18,380 ఓట్లు రాగా, ఆయన చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి హైదర్ హుస్సేన్ 1,08,568 ఓట్లు తెచ్చుకున్నారు.

బలరాంపూర్‌లో సాధించిన ఈ విజయంతో వాజ్‌పేయీ తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు.

ఎన్టీ రామారావు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్టీ రామారావు

ఎన్టీఆర్ మూడు చోట్ల పోటీ చేసినప్పుడు ఏమైంది?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్టీఆర్ మూడు స్థానాల నుంచి పోటీ చేశారు.

ఎన్టీఆర్ 1985లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో కోస్తాలోని గుడివాడ, రాయలసీమలోని హిందూపురం, తెలంగాణలోని నల్గొండ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు.

మూడు చోట్లా ఆయన విజయం సాధించారు.

గుడివాడలో ఎన్టీఆర్ 49,660 ఓట్లు సాధించగా ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబుకు 42,003 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలలో గుడివాడలో మరో ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులూ పోటీ పడ్డారు.

నల్గొండ అసెంబ్లీ స్థానంలో ఎన్టీ రామారావుకు 49,788 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి మందాడి రామచంద్రారెడ్డి 18,201 ఓట్లు సాధించారు. దీంతో రామారావు సుమారు 30 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచినట్లయింది.

ఇక్కడ మరో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ పడినప్పటికీ ఎవరికీ డిపాజిట్ కూడా రాలేదు.

హిందూపురంలో ఎన్టీ రామారావు 56,599 ఓట్లు సాధించి గెలిచారు. అక్కడ పోలైన మొత్తం ఓట్లలో 75.64 శాతం ఎన్టీఆర్‌కే వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇ.ఆదిమూర్తి 16,070 ఓట్లు పొందారు. మరో అయిదుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా ఇక్కడ పోటీ పడ్డారు.

ఇలా పోటీ చేసిన మూడు స్థానాలలోనూ విజయం సాధించిన ఎన్టీ రామారావు నల్గొండ, గుడివాడ స్థానాలను వదులుకుని హిందూపురానికి ప్రాతినిధ్యం వహించారు.

అయితే.. ఆ తరువాత ఎన్నికలలో ఎన్టీఆర్ హిందూపురం, తెలంగాణ ప్రాంతంలోని కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి పోటీచేయగా కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు.

పెండ్యాల రాఘవరావు విగ్రహం

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, పెండ్యాల రాఘవరావు విగ్రహం

ఎవరీ పెండ్యాల రాఘవరావు?

పెండ్యాల రాఘవరావు 1917 మార్చి 15న వరంగల్ జిల్లా చినపెండ్యాలలో జన్మించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి, పోరాటాలు సాగించి జైలు పాలైన నాయకుడు రాఘవరావు.

‘నా ప్రజా జీవితం’ పేరిట ఆయన రాసిన ఆత్మకథలో ఆయన నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులతో పాటు తాను సాగించిన పోరాటాలు, రాజకీయ పరిస్థితులనూ వివరించారు.

ముఖ్యంగా అంటరానితనానికి వ్యతిరేకంగా, మహిళల అణచివేతకు, వారిపై ఉన్న ఆంక్షలకు వ్యతిరేకంగా రాఘవరావు ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణ రైతాంగ పోరాటంలోనూ ఆయన పాలుపంచుకున్నారు.

స్వాతంత్ర్య పోరాట యోధుడిగా, కమ్యూనిస్ట్ నేతగా ఆయన ఎన్నో ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు.

హైదరాబాద్ రాష్ట్రంలో పోలీస్ యాక్షన్ సమయంలో మూడేళ్లు ఆయన జైలులోనే ఉన్నారు. ఆ సమయంలోనే 1952లో జైలు నుంచే నామినేషన్ వేసి ఎన్నికలలో గెలిచారు.

ఏడో తరగతి వరకే చదువుకున్నప్పటికీ తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడేవారని, అందుకే మూడు చోట్ల నుంచి ఆయన గెలిచినప్పటికీ అందులోని రెండు శాసనసభ సీట్లను వదులుకుని లోక్‌సభ‌కు ప్రాతినిధ్యం వహించాలని అప్పటి కమ్యూనిస్ట్ నాయకులు ఆయనకు సూచించారని రాఘవరావు కుమార్తె కొండపల్లి నీహారిణి వివిధ సందర్భాలలో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)