సైకిల్‌పై వెళ్తుంటే చున్నీ లాగిన ఆకతాయి, రోడ్డుపై పడి చనిపోయిన విద్యార్థిని, అసలేం జరిగిందంటే..

ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలంటున్న ప్రచారకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాలికల్ని వేధించే ఆకతాయిలపై కఠినంగా వ్యవహరించాలంటున్న ప్రచారకర్తలు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్ జిల్లాలో ఓ బాలిక మరణం ఈవ్ టీజింగ్ వికృత రూపాన్ని బయటపెట్టింది.

ఇద్దరు బాలికలు అమాయకంగా సైకిల్ తొక్కుతూ వెళుతున్న దృశ్యం సీసీటీవీ వీడియోలో కనిపిస్తోంది. వారిద్దరూ స్కూల్ యూనిఫామ్‌లో ఉన్నారు.

ఈ ఇద్దరు విద్యార్ధినులు ఖాళీ రోడ్డుపై పక్కపక్కనే సైకిల్ తొక్కుతున్నారు.

బైకుపై వచ్చిన ఇద్దరు ఆకతాయిలు వారిని ఓవర్ టేక్ చేశారు. ఒక వ్యక్తి ఓ బాలిక చున్నీ లాగాడు. దీంతో ఆ బాలిక పట్టుతప్పి వెనుక వస్తున్న మరో బైకు కింద పడిపోయింది.

దీంతో ఆ బాలికతోపాటు మోటారు సైక్లిస్ట్ కూడా రోడ్డుపైన పడిపోగా, ఎదురుగా వస్తున్న మరో మోటారు సైకిల్ బాలికపై నుంచి వెళ్ళింది.

"నా బిడ్డను చూసిన క్షణమే.. తను చనిపోయిందని నాకు తెలిసిపోయింది" అని బాలిక తండ్రి సబ్జిత్ వర్మ చెప్పారు.

సంఘటనాస్థంలో ఉన్న మరో బాలిక నుంచి సమాచారం అందుకోగానే ఆయన పరుగున వచ్చారు.

సంఘటన జరగ్గానే అక్కడ గుమిగూడిన ప్రజలు బాలికను ఓ టెంపోలో ఆస్పత్రికి తరలించారు.

కానీ, బాలికను ఆస్పత్రికి తీసుకువచ్చేసరికే "చనిపోయిందని" డాక్టర్లు చెప్పారు. తలకు తీవ్రగాయాలు కావడంతోపాటు దవడ ఎముకలు విరిగిపోవడం వల్ల ఆమె మృతి చెందినట్టు చెప్పారు.

"పాప నుంచి ఎటువంటి చివరిమాటలు లేవు, గుడ్ బైలు లేవు" అంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు.

వర్మ భార్య ఎనిమిదేళ్ళ కిందట మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో పెద్దవారిద్దరికి పెళ్ళి చేశారు. 17 ఏళ్ళ మూడో కుమార్తె మాత్రమే ఆయనతో ఉంటోంది. ఈ బాలిక చదువులో ఎంతో చురుకుగా ఉండేది. డాక్టర్ కావాలనుకునేదని ఆయన చెప్పారు.

‘‘బాలిక చనిపోవడానికి రెండు రోజుల ముందు స్కూల్ బయట తనతోపాటు మరికొందరు బాలికలను కొందరు అబ్బాయిలు వేధిస్తున్నారని చెప్పింది. దీనిపై ఇతర విద్యార్థినులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అబ్బాయిలు ఉదయం, సాయంత్రం స్కూలు దగ్గరే తచ్చాడేవారు. కొన్నిసార్లు బైక్ రేసులతో చక్కర్లు కొట్టేవారు’’ అని వర్మ వివరించారు.

కూతురు మృతితో వర్మ గుండె ముక్కలైంది. ‘‘నా బిడ్డను చంపిన వాళ్లను ఉరితీయాలి" అని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

వీధుల్లో భద్రత కల్పించాలంటున్న విద్యార్థినులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వీధుల్లో భద్రత ఉండాలంటున్న విద్యార్థినులు

ఉత్తర్ ప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

ఈ కేసులో పోలీసులు ముగ్గరు అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనరని తెలుస్తోంది. మరొక అనుమానితుడి కోసం గాలిస్తున్నారు.

సంఘటన జరిగిన నాటి నుంచి అనేకమంది అధికారులు వస్తున్నారని, ఒక మంత్రి కూడా వచ్చారని, కానీ తమకు ఎటువంటి పరిహారం అందలేదని వర్మ చెప్పారు.

ఈ సంఘటన వీడియో ఫుటేజీ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవడంతోపాటు హెడ్ లైన్స్‌గా రావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వీధులలో మహిళలను వేధించేవారి కోసం యమధర్మరాజు ఎదురుచూస్తుంటాడని హెచ్చరించారు.

దీని తరువాత ఇద్దరు అనుమానితుల కాళ్ళపై కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. అనుమానితులను వైద్యపరీక్షలకు తీసుకువెళ్తుండగా తమ ఆయుధాలను అపహరించి పారిపోవడానికి ప్రయత్నించారని, మరోక నిందితుడు పారిపోయే క్రమంలో కాలు విరగ్గొట్టుకున్నాడని పోలీసులు చెప్పారు.

అయితే, తమ పిల్లలకు ఈ సంఘటనతో సంబంధం లేదని నిందితుల కుటుంబాలు అన్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో తమ పిల్లలు లేరని, పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో తమ పిల్లలను గాయపరిచారని ఆరోపించాయి. కేసు విచారణ వేగవంతం చేశామని, నెలలోపు తీర్పు వస్తుందని భావిస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు.

బాలిక మృతితో వీధులలో మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.

ఇలాంటి కేసులను స్థానిక మీడియా ఈవ్ టీజింగ్‌గా వర్ణించడాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈవ్ టీజింగ్ బదులు ‘స్ట్రీట్ సెక్సువల్ హరాస్‌మెంట్’ (వీధుల్లో లైంగిక వేధింపులు) అనే పదాన్ని వాడాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

ఈవ్ టీజింగ్ అనే పదాన్ని కేవలం ఏడిపించడంగా చూస్తున్నారని, కానీ అది చాలా ప్రమాదకరమైనదని, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం పనిచేస్తున్న సేఫ్టీపిన్ కో ఫౌండర్ కల్పనా విశ్వనాథ్ చెప్పారు.

ఇదంతా బాలీవుడ్ సినిమా వ్యవహారంలా కనిపిస్తుంటుంది. హీరో అమ్మాయి వెనుకపడటం, హీరోయిన్‌కు కూడా ఆ పని ఇష్టమైనట్టుగా చూపడం చేస్తుంటారు. ఇది నేరం మాత్రమే కాదు, హింస కూడా. ఈ హింసను ఈవ్ టీజింగ్ పేరుతో పిలిచి తేలిక చేసే పని చేయద్దని ఆమె అంటున్నారు.

రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆకతాయిలను కనిపెట్టడం కష్టంగా మారుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆకతాయిలను కనిపెట్టడం కష్టంగా మారుతోంది

మహిళలు ఇల్లు దాటినప్పటి నుంచి ఆకతాయిల వేధింపులు పెరుగుతున్నాయి. రోడ్డుపై నడుస్తున్నప్పుడో, రద్దీగా ఉండే ప్రయాణసాధనాలలో ఉన్నప్పుడు గిచ్చడం, లేదంటే మోచేయి మహిళల వక్షోజాల్ని తగిలేలా చేయడం లాంటి చేదు అనుభవాలు ప్రతి మహిళకు ఉండే ఉంటాయి.

మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి వేధింపులపై ఐపీసీలోని ఆర్టికల్ 354 కింద కేసులు నమోదు అవుతుంటాయి. కానీ అంబేడ్కర్ నగర్ మృతి కేసులో పోలీసులు మేల్కొని ఈ కేసులతోపాటు తీవ్రమైన అభియోగాలు కూడా మోపారు.

2021లో భారత ప్రభుత్వ క్రైమ్ డేటాలో లభించిన సమాచారం మేరకు పోలీసులు దాదాపుగా ఇలాంటి కేసులను 90 వేలకుపైగా నమోదు చేశారు. ఇది మొత్తం 4,28,278 కేసులలో 13.4 శాతం గా ఉంది. ఏళ్ళ కొద్దీ ఈ కేసులు పేరుకుపోతుండటంతో దాదాపు 5 లక్షల కేసులు కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయని ఈ డేటా వివరిస్తోంది.

కానీ వీధులలో వేధింపులపై కేసులు నమోదు చాలా తక్కువగా ఉంది. ఎక్కువమంది మహిళలు తమను ఎవరైనా తాకినా, అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసినా పోలీసుస్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదు చేయరని కల్పనా విశ్వనాథ్ చెప్పారు. కొన్నిసార్లు బాగా రద్దీగా ఉండే ప్రదేశాలలో తమను ఎవరు ఇబ్బంది పెట్టారో కనుక్కోవడం కూడా మహిళలకు కష్టమవుతుంది.

అంబేడ్కర్ నగర్ సంఘటనలోని విషాదమే న్యూస్‌గా మారేందుకు అవకాశమిచ్చిందని ఆమె చెప్పారు. "ఒకవేళ ఆ బాలిక చనిపోకుండా, మామాలుగా పైకిలేచి, బట్టలు దులుసుకుని వెళ్ళిపోయి ఉంటే ఎవరూ దీని గురించి మాట్లాడేవారు కాదు" అని ఆమె అన్నారు.

ఇలాంటి వేధింపుల గురించి మాట్లాడటం వలనే అబ్బాయిలను మార్చడం సాధ్యమవుతుంది. కానీ ఇది చాలా కాలం పడుతుంది.

మీడియాలోనూ ఇటువంటి విషయాలను మాట్లాడే వ్యవస్థ మెరుగుపడాలి.

ఏది ఆమోదయోగ్యమైన ప్రవర్తన అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. పోలీసులు కూడా మహిళలనుంచి వచ్చే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలి. పోలీసులు అన్నిచోట్లా ఉండరు కనుక సంఘటన జరిగిన చోట ఉన్న స్థానికులే చొరవ చూపాలి.

"మనం మరో మార్గాన్ని చూడకుండా అబ్బాయిలంటే అలానే ఉంటారని చెప్పకూడదు. అబ్బాయిలు అలా ఉండేందుకు మనం అనుమతించకూడదు" అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)