తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే

Revanth Reddy, KCR, Kishan Reddy

ఫొటో సోర్స్, facebook

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. మొన్నటి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో జమిలి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం లేకపోవడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగాల్సి ఉంది.

పాలక భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్-గత ఎన్నికలలో టీఆర్ఎస్) ఇప్పటికే 115 స్థానాలలో తన అభ్యర్థులను ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్లు కోరుతున్న నాయకుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు ఇప్పటికే ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఒక విడత సమావేశమైంది.

మిగతా పార్టీలూ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

అన్ని పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నవారు, ఇప్పటికే టికెట్లు ఖరారైనవారు నియోజకవర్గాలతో తిరుగుతుండడం.. రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు సభలు నిర్వహిస్తుండడంతో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.

KCR

ఫొటో సోర్స్, Getty Images

లోక్‌సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎందుకంటే..

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆ ఏడాది మే నెలలో పోలింగ్ జరిగింది.

అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

తెలంగాణ ప్రాంతంలో ఆ ఎన్నికలలో ఎక్కువ సీట్లు సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

అప్పటి అసెంబ్లీకి 2019 మే నెల వరకు గడువు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది నెలలు ముందుగా 2018 సెప్టెంబర్ 6న తన పదవికి రాజీనామా చేశారు.

దీంతో సాధారణ ఎన్నికలకు అప్పటికి 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండడంతో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ECI

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్నికల సంఘం కార్యాలయం

దాంతో 2018 అక్టోబర్ 6న అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాలకూ అప్పుడే షెడ్యూల్ విడుదల చేశారు.

దాని ప్రకారం 2018 నవంబర్ 12 నుంచి నామినేషన్లు స్వీకరించి డిసెంబర్ 7న తెలంగాణ వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు.

డిసెంబర్ 13న ఓట్లను లెక్కించడంతో ఫలితాలు వెల్లడయ్యాయి.

టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలవడంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

దీంతో ప్రస్తుత అసెంబ్లీ పూర్తి కాలం కొనసాగుతుండడంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడానికి అవకాశమేర్పడుతోంది.

ఆ లెక్కన 2018 తరహాలోనే ప్రస్తుతం 2023లో నవంబర్, డిసెంబర్ నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ జరగొచ్చన్న అంచనాలు అన్ని రాజకీయ పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.

Rahul Gandhi, Chandrababu

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి పోటీ చేశాయి.

2018 అసెంబ్లీ ఎన్నికలలో ఏమైంది?

2018 అసెంబ్లీ ఎన్నికలలో అప్పటికే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లున్నాయి. 2019లో టీఆర్ఎస్ పార్టీ 119 సీట్లకూ పోటీ చేసింది.

కాంగ్రెస్, తెలుగుదేశం(టీడీపీ), తెలంగాణ జన సమితి(టీజేఎస్), సీపీఐలు కలిసి మహా కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ 94 సీట్లలో, టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 3 సీట్లలో పోటీ చేశాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 117 సీట్లకు పోటీ చేసింది. వామపక్షాలలోని మరో కీలక పార్టీ సీపీఎం సొంతంగా పోటీ చేసి 26 స్థానాలలో అభ్యర్థులను నిలిపింది.

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 19 స్థానాలలో పోటీ చేసింది.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది?

అప్పటి అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమతి అత్యధికంగా 88 స్థానాలను గెలిచింది.

జాతీయ పార్టీ కాంగ్రెస్ 19 సీట్లలో విజయం సాధించింది.

తెలుగుదేశం పార్టీ రెండు చోట్ల గెలిచింది.

ఎంఐఎం 7 సీట్లను గెలిచింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది.

వీరు కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్‌గా ఒకరు గెలిచారు.

Raja Singh

ఫొటో సోర్స్, twitter/RajaSingh

ఫొటో క్యాప్షన్, బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరే గెలిచారు.

ఎవరా ఇండిపెండెంట్, ఫార్వర్డ్ బ్లాక్, బీజేపీ, టీడీపీ విజేతలు?

వైరా(ఎస్టీ) నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లావుడ్యా రాములు విజయం సాధించారు.

రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేసిన కోరుకంటి చందర్ కూడా విజయం సాధించారు. ఆయన అనంతరం టీఆర్ఎస్‌లోనే చేరిపోయారు.

ఇక బీజేపీ నుంచి గోషా మహల్‌లో పోటీ చేసిన రాజాసింగ్ విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీ తరఫున సత్తుపల్లి(ఎస్సీ) నియోజకవర్గంలో పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట(ఎస్సీ) నియోజకవర్గంలో పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు.

Y S Sharmila Reddy

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుత 2023 ఎన్నికలలో ఎవరు ఎటువైపు?

ప్రస్తుతం జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఇంతవరకు నిర్ణయం కాలేదు. ఇంతవరకు ఏ పార్టీలూ కూటమిగా ఏర్పడలేదు.

పాలక బీఆర్ఎస్ ఈసారి కూడా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లనుంది. కొద్ది నెలల కిందట జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ వామపక్షాలతో కలిసి పోటీ చేసినప్పటికీ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం సొంతంగా పోటీ చేస్తామని చెప్పింది. అయితే, ఎంఐఎం పోటీ చేసే కొన్ని నియోజకవర్గాలలో స్నేహపూర్వక పోటీ ఉంటుందంటూ కేసీఆర్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధమవుతోంది.

మరో ప్రధాన పార్టీ బీజేపీకి జాతీయ స్థాయి కూటమి ఎన్డీయేలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామని ఇప్పటికే ఒకసారి ప్రకటించారు.

అయితే, జనసేన కార్యకలాపాలు ఏమీ తెలంగాణలో ఇంతవరకు లేవు. దీంతో ఆయన బీజేపీతో కలిసి పోటీ చేస్తారా.. అసలు ఆ పార్టీ గుర్తుతో అభ్యర్థులను నిలుపుతారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయా.. వేర్వేరుగా పోటీ చేస్తాయా అన్నది ఇంకా తేలలేదు.

షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ త్వరలో కాంగ్రెస్‌లో విలీనం కావొచ్చు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇటీవల మాట్లాడుతూ సెప్టెంబరు నెలాఖరులోగా దీనికి సంబంధించి నిర్ణయం వెలువడొచ్చని, విలీనం లేకుంటే మాత్రం 119 నియోజకవర్గాలలోనూ పోటీ చేస్తామని చెప్పారు.

గత ఎన్నికలలో కొంత కార్యకలాపాలు కనిపించిన కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జన సమితి పార్టీ ఈసారి అంతగా యాక్టివ్‌గా కనిపించలేదు.

వీడియో క్యాప్షన్, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి ఏం చెప్పాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)