వైసీపీ వారికి సర్వీస్ అందించబోమన్న జెనెక్స్: కులాల వారీగా గూగుల్ రేటింగ్స్?

గూగుల్ రేటింగ్స్
ఫొటో క్యాప్షన్, వైసీపీ వారికి సర్వీసులు ఇవ్వబోమంటూ పెట్టిన బోర్డు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గూగుల్ బిజినెస్ రేటింగ్...ఇప్పుడు ఏ వ్యాపారం బాగా సాగాలన్నా అతిముఖ్యమైన పాయింట్.

ఫలానా స్టోర్‌లో ఫలానా ప్రొడక్ట్ ఎలా ఉంటుంది నుంచి మొదలుకొని ఫలానా కంపెనీ సర్వీస్ ఎలా ఉంటుందనే ప్రశ్న వరకూ.. ఇదివరకట్లా ఎవర్నీ ఆరా తీయక్కర్లేదు.

ఆ సంస్థ పేరు గూగుల్‌లో సెర్చ్ చేసి రేటింగ్ చూసి, కింద ఇచ్చిన రివ్యూస్ చదివితే సరిపోతుంది..

మామూలుగా వ్యాపారులు తమ సంస్థకు మంచి రేటింగ్ కోసం తాపత్రయపడతారు. తమకు రేటింగ్ ఇవ్వమని వచ్చిన కష్టమర్లను అడుగుతుంటారు.

గూగుల్ రేటింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గూగుల్ రేటింగ్స్ బిజినెస్‌లో కీలకంగా మారాయి.

రేటింగ్ ఇస్తే డిస్కౌంట్లు ఇచ్చేవాళ్లు, కష్టమర్లను షాపులో కూర్చోబెట్టే దగ్గరుండి రేటింగ్ ఇచ్చే వరకూ వదలకుండా మొహమాటపెట్టే వారూ, రేటింగ్‌లు ఇప్పించడం కోసమే ప్రత్యేకంగా ఉద్యోగులను కేటాయించే వారూ కూడా ఉన్నారు.

వ్యాపారాలకు ఇంత కీలకమైన గూగుల్ రేటింగ్‌కి ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలు తోడయ్యాయి.

ప్రస్తుతం ఆంధ్రలో నడుస్తోన్న రాజకీయ యుద్ధానికి ఈ రేటింగులు వేదికగా మారాయి. తమ పార్టీకి అనుకూల వ్యాపార సంస్థల రేటింగ్ పెంచేందుకు, తమకు వ్యతిరేక వ్యాపార సంస్థ రేటింగ్ తగ్గించేందుకు ఆయా పార్టీల సోషల్ మీడియా అభిమానులు ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు నాయుడు అరెస్టుతో గూగుల్ రేటింగ్స్ వ్యవహారం మొదలైంది.

ఏపీ రాజకీయాల ప్రభావం

ప్రస్తుతం ఆంధ్రలో చంద్రబాబు అరెస్టు తరువాత, ఆంధ్రా బయట ఉండే చంద్రబాబు అభిమానులు రకరకాల పద్ధతుల్లో తమ సంఘీభావం చెబుతున్నారు. ఇందులో ఒక అడుగు ముందుకు వేసిన హైదరాబాద్ కి చెందిన జెనెక్స్ ఇండియా అనే కార్ రీడిజైనింగ్ సంస్థ, చంద్రబాబుకు మద్దతుగా వైసీపీ వారికి తమ సేవలు అందించబోమంటూ బోర్డు పెట్టింది.

సినిమాల్లో కనిపించే భారీ కాన్వాయ్‌లు, సినిమాల్లో హీరోలు వాడే ప్రత్యేకమైన వాహనాలు, బయట రాజకీయ నాయకుల వాహనాలు డిజైన్ చేసి సిద్ధం చేయడంలో ఈ సంస్థకు బాగా పేరుంది.

చాలా సినిమాలకు వాహనాలు డిజైన్ చేయడంతో పాటూ ఆంధ్రాకు చెందిన పలువురు నాయకుల వాహనాలు కూడా ఈ సంస్థ డిజైన్ చేసింది.

‘‘హైదరాబాద్ లోని మాదాపూర్, సైబరాబాద్ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి పునాది చంద్రబాబు. ఈ ప్రాంతంతో పాటే నా సంస్థా అభివృద్ధి చెందింది. ఆయనకు మద్దతుగా వైయస్సార్సీపీ వారికి సేవలు అందించను అనే నిర్ణయం తీసుకుని బోర్డు పెట్టాను.’’ అని మీడియాకు చెప్పారు ఆ సంస్థ అధిపతి అమర్.

అయితే కథ అక్కడితో అయిపోలేదు. ఆ బోర్డు వైరల్ అయింది. ఏ వ్యాపారీ సహజంగా చేయని పని చేసిన జెనెక్స్ సంస్థ ఇప్పుడు రేటింగ్ వార్‌కి వేదిక అయింది.

గూగుల్ రేటింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గూగుల్ రేటింగ్స్

రేటింగ్ వార్

ఆరు స్టోర్లతో నడుస్తోన్న ఈ సంస్థ గూగుల్ ప్రొఫైల్‌పై ప్రత్యర్థులు రేటింగ్ ఎటాక్-రివేంజ్ మొదలు పెట్టారు. ఈ ప్రకటనకు ముందు ఆ సంస్థ రేటింగ్ ఎంతో పరిశీలించే అవకాశం బీబీసీకి దొరకలేదు. కానీ ఎక్కువ మంది చెప్పిన సమాచారం ప్రకారం 3.8 ఉండేది.

చంద్రబాబుకు అనుకూల ప్రకటన రాగానే, వైయస్సార్సీపీ అభిమానులు ఆ సంస్థకు తక్కువ రేటింగ్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో అది ఒక దశలో 3.4 వరకూ తగ్గిపోయింది.

ఈ విషయం గమనించిన టీడీపీ అభిమానులు ఆ సంస్థకు ఎక్కువ రేటింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో అది ప్రస్తుతం 4.5 వరకూ వెళ్లింది. ఆ సంస్థ రేటింగ్స్ చూసినప్పుడు గత రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో జనాలు అత్యధిక, అత్యల్ప రేటింగు ఇచ్చిన వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గూగుల్ రేటింగ్స్
ఫొటో క్యాప్షన్, ఆయా కులాలకు చెందిన వారు అనుకూలంగా, వ్యతిరేకంగా రేటింగ్‌లు ఇవ్వడం కనిపించింది.

ఆ సంస్థకు ఇప్పుడు 1300కి పైగా రేటింగులు ఉండగా, వాటిలో సగం వరకూ ఈ రెండు మూడు రోజుల్లో వచ్చినవే అనేది స్పష్టంగా కనిపిస్తోంది. పేరు చివర రెడ్డి అని, చౌదరి అని ఉన్న వాళ్లు ఇచ్చిన రేటింగులు కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి.

అయితే, వైసీపీ వారికి సర్వీసులు ఇవ్వవద్దన్న తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు అమర్.

‘‘సమస్య అయినా సిద్ధమే. ఫైనాన్షియల్, బిజినెస్ వీక్ అయినాగానీ, పడిపోతే లేవలేనని భయం లేదు. గతంలో నేను పనిచేసిన వైయస్సార్సీపీ వారికి ఈసారి వర్క్ చేయను. నష్టపోయినా పర్వాలేదు.’’ అంటూ ఒక యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అమర్.

అయితే, మీ షాపుకు వచ్చేవాళ్లు ఏ పార్టీ వారు అన్నది ఎలా గుర్తు పడతారంటూ కొందరు యూజర్లు జెనెక్స్ కంపెనీ ఓనర్‌ను ప్రశ్నిస్తున్నారు.

గూగుల్ రేటింగ్స్

రేటింగు ఉంటేనే రాబడి..

అబ్బాయిలు సెలూన్‌కి వెళ్లాలన్నా, అమ్మాయిలు పార్లర్ కి వెళ్లాలన్నా.. రోగులు ఆసుపత్రులకు వెళ్లాలన్నా రేటింగ్ చూస్తున్నారు. అనేక మంది పేరున్న వైద్యులు కూడా తమ ఆసుపత్రికి వచ్చిన రోగులను దగ్గరుండి తమకు గూగుల్ రేటింగ్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్ల విషయం చెప్పక్కర్లేదు.

గూగుల్ రేటింగ్‌తో సంబంధం లేకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఉబర్, ఓలా వంటి సంస్థల్లో అక్కడ రేటింగుల ప్రత్యేకత వాటికుంది.

‘‘ఈ రోజుల్లో ఎవరూ ఏం కొనాలన్నా, ఏ సర్వీస్ తీసుకోవాలన్నా రేటింగ్ కచ్చితంగా చూస్తున్నారు. కనీసం 4 రేటింగ్ లేకపోతే ఎవరూ వాటివైపు కూడా చూడడం లేదు. అయితే కేవలం రేటింగ్ మాత్రమే చూస్తే సరిపోదు. ఎంతమంది ఆ రేటింగ్ ఇచ్చారో కూడా చూడాలి. అంటే పది మంది మాత్రమే రేటింగ్ ఇచ్చి అప్పుడు ఐదుకు ఐదూ ఉంటే వృ‌థా. వీలైనంత ఎక్కువ మంది హై రేటింగ్ ఇచ్చి ఉండాలి.’’ అని బిజినెస్ ఎనలిస్ట్ నాగేంద్ర సాయి బీబీసీతో అన్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్టు

ఫొటో సోర్స్, UGC

గూగుల్ రేటింగులు ఆంధ్రలో రాజకీయం, కులం రంగు తీసుకున్నాయి కానీ ఆ రేటింగులపై వివాదం గతం నుంచీ ఉంది.

కొందరు భారతీయులు కొన్ని అమెరికన్ సంస్థలకు కావాలని తక్కువగా వన్ స్టార్ రేటింగ్ ఇచ్చి, తరువాత వాటిని తొలగించడానికి ఆయా సంస్థల నుంచి డబ్బు వసూళ్లు చేసిన ఘటనలు కూడా జరిగాయి.

ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి గూగుల్ తలపట్టుకుంటోంది.

వీడియో క్యాప్షన్, చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం ఇదేనా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)