చంద్రబాబు రిమాండ్: వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలు ఏమన్నారు

ఫొటో సోర్స్, YCP/Janasena/TDP
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును నాయుడికి విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రేపు బంద్ చేపట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ బంద్‌కు జనసేన సంఘీభావం ప్రకటించింది.
చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై ఆంధ్రప్రదేశ్‌లోని పాలక పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు స్పందించారు.
పాలక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చంద్రబాబు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తుండగా.. టీడీపీ, జనసేన నేతలు చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతీకార రాజకీయాలతో తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, YSRCP
‘‘చంద్రబాబు చరిత్ర అంతా కుంభకోణాలే’’
తాజా పరిణామలపై సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘బలమైన ఆధారాలు ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. ఇంతకంటే పెద్దపెద్ద నాయకులే అరెస్టయ్యారు. కోర్టులకు వెళ్లారు. కానీ, ఇలా ఎవరూ ప్రవర్తించడం లేదు. అందుకే మేం మాట్లాడాల్సి వస్తోంది’’ అని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
‘‘రూ.3300 కోట్లు ప్రజల సొమ్ము నేరుగా బయటకు పంపించి డొల్ల కంపెనీల ద్వారా దోచుకున్నారు. ఆయనకు తెలియదు అనుకోవడానికి వీల్లేదు. ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టే మేం సంతకాలు పెట్టామని సీనియర్ అధికారులు చెబుతున్నారు. డబ్బులను కొట్టేయడానికి భారీ బోగస్ ప్లాన్ సృష్టించారు’’ అని ఆయన ఆరోపించారు.
‘‘గత 40 ఏళ్లుగా చంద్రబాబు కుంభకోణాలు తప్పితే ఏమైనా ఉన్నాయా? అన్నీ ఆయనవి అక్రమ మార్గాలే. పైగా తొడగొట్టడాలు, గొప్పలు చెప్పుకోవడాలు’’ అని ఆయన అన్నారు.
‘‘ఆయన కొడుకు ఎన్ని అసభ్యకరమైన పదాలను నిన్న ఉపయోగించారు. అసలు అధికారులని కూడా చూడలేదు. నోటికి ఎంత మాట వస్తే అంత అన్నారు. మీ నాయకుడి చేసిన అవినీతి గురించి కేసు పెడితే, మీరు అల్లర్లు సృష్టిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Janasena
‘జగన్ అందరినీ నేరగాళ్లుగా చూపించాలనుకుంటున్నారు’
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడారు.
‘‘జగన్ దేశంలోనే ధనిక సీఎం. ఆయన ఏం పనిచేశాడో తెలియదు. భారీగా ఆస్తులు మాత్రం పెరిగిపోయాయి. అక్రమంగా డబ్బులు సంపాదించినవారు నేడు మిగతావారిని నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
‘‘నేను చంద్రబాబుకు మద్దతు తెలపాలి అనుకున్నాను. మన కోసం ఒక వ్యక్తి నిలబడినప్పుడు మనం తిరిగి వారి కోసం నిలబడాలి. అంతేకానీ నేను నేరుగా ఏసీబీ కోర్టుకు వెళ్తున్నానని, మీకుమీరే ఊహించుకొని శాంతి, భద్రతల సమస్యను సృష్టించారు. నేనేమీ కోర్టుకు వెళ్లాలి అనుకోలేదు’’ అని ఆయన అన్నారు.
‘‘కోనసీమ వారాహి యాత్ర సమయంలోనూ 2,000 మంది క్రిమినల్స్‌ను దించారు. ఇలాంటివి చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కేంద్రం హెచ్చరించింది కూడా. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మీరు నేరాలు చేస్తే మీరే భయపడాలి. కానీ, నేనెందుకు భయపడాలి. ఇలాంటి పనులన్నీ నాకు, జనసేనతోపాటు టీడీపీకి కూడా బలాన్ని ఇస్తున్నాయి’’ అని పవర్ అన్నారు.
‘‘బెయిలు మీద వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. చట్టాలను చక్కగా అమలుచేస్తే అసలు ఇలాంటి వాళ్లు ముఖ్యమంత్రి కాలేరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘దివ్యాంగులను బెదిరిస్తావు. ప్రజలను, అధికారులను బెదిరిస్తావు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశావు. జీ20 నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ అరెస్టు చేయించారు. కేంద్రం మీకు సాయం చేసింది. కానీ, నేడు జీ20 లాంటి పెద్ద కార్యక్రమంపై ప్రజల ఆసక్తి లేకుండా చేశారు’’ అని ఆయన అన్నారు.
‘‘కారులో ఉండనివ్వవు. హోటల్ రూమ్ లోనుంచి బయటకు రానివ్వవు. మరి ఇంకేం చేయమంటావు. నాలాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడికే ఇలా చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి’’ అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, TDP
‘రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారు’
చంద్రబాబుకు బెయిలు కోసం ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తామని టీడీపీ సీనియర్ నాయకుడు ధూళీపాళ్ల నరేంద్ర అన్నారు.
‘‘మా వాదనలు మేం సమర్థంగా వినిపించాం. కానీ, సాంకేతిక అంశాలతో బెయిలును తిరస్కరించారు. మేం ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తాం’’అని ఆయన తెలిపారు.
‘‘మచ్చలేని మా చంద్రబాబును జైలుకు పంపించారు. వైసీపీ రాజకీయ కుట్రకు ఆయన బలి అయ్యారు. యువ నాయకుడు లోకేశ్ నేతృత్వంలో మేం దీనిపై పోరాడతాం’’ అని ఆయన అన్నారు.
‘‘మేం ఈ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తాం. చంద్రబాబు నేతృత్వంలోనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది’’ అని ఆయన చెప్పారు.
మరోవైపు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. ‘‘రొమ్ము విరిచి జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడని అంటున్నారు. మరి కోడికత్తి కేసులో ఇవాళ్టి వరకూ సాక్ష్యం ఇవ్వడానికి ఎందుకు ఆయన ముందుకు రావడం లేదు. ఈ కేసులో కుట్రలేదని ఎన్‌ఐఏ కూడా చెప్పింది. కేవలం ఎన్నికల ముందు అధికారం కోసమే ఆ కేసును సృష్టించారు. అంత ఛాతీ ఉన్న నాయకుడు ఎందుకు ఆ కేసుపై మాట్లాడడు?’’ అని నరేంద్ర ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, TDP
బంద్‌కు టీడీపీ పిలుపు
రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్ చేపట్టాలని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
‘’40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. దీనికి నిరసనగా చేపడుతున్న బంద్‌లో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజలు పాల్గొనాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లు ఏంటి, వాటికి ఎలాంటి శిక్షలుంటాయి?
- కోడలి హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న జమీందార్, మరి చంపిందెవరు? 110 ఏళ్లయినా వీడని మిస్టరీ
- ఆంధ్రప్రదేశ్: ఏసీబీ కోర్టుకు చంద్రబాబు, ఎఫ్ఐఆర్లో పేరు చేర్చిన సీఐడీ
- మొరాకో భూకంపం: ‘నా కుటుంబంలో 10 మంది చనిపోయారు’
- మొరాకో: రాజరికాన్ని రద్దుచేయాలంటూ ఒకప్పుడు ప్రజలు తిరగబడిన దేశం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














