కోడలి హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న జమీందార్, మరి చంపిందెవరు? 110 ఏళ్లయినా వీడని మిస్టరీ

మర్డర్ మిస్టరీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1911. అర్ధరాత్రి 2 గంటలు. తంజావూర్ జిల్లాలోని పూండి పట్టణ జమీందార్ వైద్యనాథన్ పిళ్లై ఇంటిలో నుంచి ఒక మహిళ అరుపులు వినిపించాయి.

వైద్యనాథన్ కోడలు దానపాఖ్యం అరుపులు అవి. వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి, అక్కడి దృశ్యాలను చూసి అంతా ఆశ్చర్యపోయారు.

సొంత కోడలి హత్య కేసులో ఆ జమీందారుకు ఉరిశిక్ష పడింది.

కానీ చివరికి, ఆ జమీందార్ ఉరిశిక్ష నుంచి నిర్దోషిగా బయటపడ్డారు. అయితే, ఆమెను హత్య చేసింది ఎవరు? 110 ఏళ్లు గడిచినా నేటికీ ఇది వీడని మిస్టరీగానే మిగిలిపోయింది.

దానపాఖ్యాన్ని మంచం మీదే ముక్కలుగా నరికేశారు. ఆ పక్కనే వైద్యనాథన్ కొడుకు అయ్యసామి కొడవలితో నిల్చుని ఉన్నారు. అది చూసి అంతా అవాక్కయ్యారు.

మర్డర్ మిస్టరీ

ఫొటో సోర్స్, Getty Images

అయ్యసామిని రెచ్చగొట్టిందా..

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. ఆమె మృతదేహం పడి ఉన్న తీరును పరిశీలించారు. అందరూ అయ్యస్వామే చంపేశాడని చెబుతున్నా పోలీసులు మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోయారు.

ఎందుకంటే, నరికినప్పుడు పడిపోయినట్లుగా ఆ శవం లేదు. ఎవరో తెచ్చిపడేసినట్టుంది. శరీరంపై 13 చోట్ల నరికిన గుర్తులున్నాయి. కానీ, ఆ గదిలో గొడవ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లూ లేవు.

ఒకవేళ దానపాఖ్యంను ఆ గదిలోనే నరికి ఉంటే అక్కడంతా రక్తం పడి ఉండాలి. కానీ అక్కడ అలా లేదు. అయ్యసామి మాత్రం చేతిలో కొడవలి పట్టుకుని నిల్చుని ఉండడంతో ఆయన్ను అరెస్టు చేసి మన్నార్‌గుడి కోర్టులో హాజరుపరిచారు.

వైద్యనాథన్ పిళ్లై పూండి పట్టణానికి జమీందార్. ఆయనకు చాలా ఆస్తులున్నాయి. ఆయనకు ముగ్గురు భార్యలు. వారిలో ఇద్దరు చనిపోయారు. ఆయన అక్క ముత్తాచ్చి.

ముత్తాచ్చి కూతురే వైద్యనాథన్ మొదటి భార్య. వారిద్దరికీ అయ్యసామి జన్మించారు. ఆయన బాధ్యతలు పట్టించుకోకుండా తిరిగేవారు. మొరటు మనిషి కూడా. ఆయనకు కొన్ని మానసిక సమస్యలు కూడా ఉండేవి.

మర్డర్ మిస్టరీ

ఫొటో సోర్స్, Getty Images

వైద్యనాథన్ కూడా పుట్టుకతో సంపన్నుడు కాదు. సంపన్న కుటుంబం దత్తత తీసుకోవడంతో ధనవంతుడయ్యారు. కొడుకును కన్న భార్య బాలింతగా ఉన్న సమయంలోనే చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకునేందుకు అయ్యసామిని తన తమ్ముడు సామిదేవన్‌కు దత్తత ఇచ్చారు వైద్యనాథన్.

రెండో పెళ్లి ద్వారా కూతురు తంగం పుట్టింది. రెండో భార్య కూడా బిడ్డ పుట్టిన కొద్దికాలానికే చనిపోవడంతో వైద్యనాథన్ మూడో పెళ్లి చేసుకున్నారు. మూడో భార్యకు సోమసుందరం, కల్యాణం అనే ఇద్దరు కొడుకులు.

రెండో భార్య కూతురు తంగం భర్త చనిపోవడంతో పుట్టింట్లోనే ఉండేది.

దానపాఖ్యం సంపన్న కుటుంబంలో పుట్టింది. ఆమె స్వయానా తంగం భర్తకి చెల్లెలు. ఆమెనే అయ్యసామి వివాహం చేసుకున్నారు.

వదిన, ఆడపడుచు అయిన తంగం, దానపాఖ్యానికి అస్సలు పడేది కాదు. తరచూ తగవులాడుకుంటూ ఉండేవారు.

తంగం భర్త చిన్నవయసులోనే చనిపోవడంతో దానపాఖ్యం సూటిపోటి మాటలు అంటుండేది. వైద్యనాథన్ ఆస్తిలో వాటా కావాలని అయ్యసామి కూడా అడుగుతూ ఉండేవారు.

మర్డర్ మిస్టరీ

ఫొటో సోర్స్, Getty Images

జడ్జి ముందు నోరువిప్పిన అయ్యసామి

దానపాఖ్యం తీరు వైద్యనాథన్ కుటుంబ సభ్యులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మరోవైపు, ఆస్తులు పంచకపోవడంతో అయ్యసామి భారీగా అప్పులు చేయడం ప్రారంభించారు.

దీంతో అయ్యసామికి ఆస్తి పంచి ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని, ఆస్తి అంతా తన స్వార్జితమని, అందులో భాగం ఇవ్వాల్సిన అవసరం లేదని వైద్యనాథన్ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు.

అయ్యసామి దంపతులను ఇంటి నుంచి కూడా గెంటేశారు. కానీ, బంధువుల సూచనలతో గొడవలు పడకూడదన్న షరతుతో మళ్లీ ఇంట్లోకి రానిచ్చారు.

1911లో దీపావళి పండుగకు దానపాఖ్యం ఇంటి నుంచి బహుమతులు వచ్చాయి. అందరూ కలిసి దీపావళి జరుపుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే దానపాఖ్యం హత్య జరిగింది.

ఏం జరిగిందని మన్నార్‌గుడి జడ్జి ప్రశ్నించడంతో తొలిసారి అయ్యసామి నోరువిప్పారు.

తాను ఈ హత్య చేయలేదని, కుటుంబ సభ్యులంతా కలిసి దానపాఖ్యంను బయటికి తీసుకెళ్లి నరికి చంపేసి, మళ్లీ తన గదిలోకి తీసుకొచ్చారని అయ్యసామి చెప్పారు. అప్పటి వరకూ తనను మరో గదిలో ఉంచారని ఆయన చెప్పారు.

అయ్యసామి వాదనలతో మన్నార్‌గుడి మేజిస్ట్రేట్ ఏకీభవించారు. అయ్యసామిని నిర్దోషిగా విడుదల చేయడంతో పాటు ఆయన కుటుంబాన్ని అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించారు.

మర్డర్ మిస్టరీ

ఫొటో సోర్స్, Getty Images

వైద్యనాథన్‌కు ఉరిశిక్ష

మేజిస్ట్రేట్ ఆదేశాలతో వైద్యనాథన్ నుంచి అతని ఇంట్లో పనివాళ్ల వరకూ అందరినీ అరెస్టు చేశారు. అయితే, ఆయన ఇద్దరు కుమారులు తప్పించుకున్నారు.

ఇంటి పనివాళ్లలో ఒకరు అప్రూవర్‌గా మారారు. వైద్యనాథన్ ప్రోద్బలంతోనే ఈ హత్య చేసినట్లు ఒప్పేసుకున్నారు.

ఆ తర్వాత కేసు జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టుకు బదిలీ అయింది. వైద్యనాథన్ పిళ్లై తరపున ప్రముఖ న్యాయవాది ఆర్.శతగోపాచార్య హాజరయ్యారు.

ఈ కేసులో వైద్యనాథన్ పిళ్లై తమ్ముడు సామిదేవన్ తన అన్నకు వ్యతిరేకంగా వాంగ్మాలం ఇచ్చారు. దానపాఖ్యం కలరాతో చనిపోయిందని తమకు కబురు పంపారని, తమ ఆచారం ప్రకారం మృతదేహాన్ని పూడ్చిపెట్టకుండా దహనం చేయాలని అయ్యసామిని వేడుకున్నారని ఆయన చెప్పారు.

అయితే, దానపాఖ్యంను చంపే ఉద్దేశం వైద్యనాథన్‌కు లేదని వాదనలు జరిగాయి. దానపాఖ్యంను చంపే ఉద్దేశం లేకపోతే కలరాతో చనిపోయిందని సామిదేవన్‌కు ఎందుకు చెప్పారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఈ కేసుల తంజావూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వైద్యానాథన్ పిళ్లై‌పైనే అందరికీ అనుమానం పెరిగింది. న్యాయమూర్తి కూడా ఆయనే హత్య చేసినట్లు నిర్ధరించి దోషిగా ప్రకటించారు. చివరికి వైద్యనాథన్‌కు ఉరిశిక్ష పడింది. దీంతో వైద్యనాథన్ పిళ్లై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

1912లో ఈ కేసు విచారణ వచ్చింది. సీఎఫ్ నేపియర్ ప్రాసిక్యూషన్ లాయర్‌గా నియమితులయ్యారు. వైద్యనాథన్ తరపున ప్రముఖ న్యాయవాది స్వామినాథన్ వాదనలు వినిపించారు.

దానపాఖ్యం శరీరంపై ఉన్న గుర్తులను బట్టి సాధారణ మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ హత్య చేయలేదని, అయ్యసామే ఈ హత్య చేశాడని స్వామినాథన్ వాదించారు.

మర్డర్ మిస్టరీ

ఫొటో సోర్స్, Getty Images

అసలు దానపాఖ్యంను ఎవరు చంపారు?

ఈ కేసు విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల బెంచ్‌లో ఒకరు వైద్యనాథన్‌ను దోషిగా తేల్చారు. మరో న్యాయమూర్తి నిర్దోషి అని ప్రకటించారు. దీంతో కేసు మూడో న్యాయమూర్తి బెంచ్‌ వద్దకు వెళ్లింది.

కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి శంకరన్ నాయర్ వైద్యనాథన్ పిళ్లైని దోషిగా నిర్ధారించి, ఉరిశిక్ష విధించారు.

అయితే, వైద్యానాథన్ పిళ్లై తరపు న్యాయవాది మాత్రం ఆ కేసును వదల్లేదు. లండన్‌లోని ప్రీవీ కౌన్సిల్‌కు టెలిగ్రాఫ్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో వైద్యనాథన్ ఉరిశిక్ష అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు(స్టే) ఇచ్చారు.

నాలుగు నెలల తర్వాత ప్రీవీ కౌన్సిల్‌లో విచారణ ప్రారంభమైంది. సర్ రాబర్ట్ ఫిన్‌లే కేసు విచారణ జరిపారు. ఈ కేసులో వైద్యనాథన్ తరపున స్వామినాథన్ లండన్ వెళ్లారు.

నాలుగు రోజుల విచారణ తర్వాత, హత్య కేసులో వైద్యానాథన్ పిళ్లై నిర్దోషిగా విడుదలయ్యారు. అయితే, దానపాఖ్యంను చంపింది ఎవరు? అది మాత్రం ఇంకా తేలలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)