పిల్లలను కిడ్నాప్ చేసి కొట్టి చంపే సీరియల్ కిల్లర్స్ ఈ మహిళలు - ఎలా దొరికారంటే

ఫొటో సోర్స్, SWATI PATIL/BBC
- రచయిత, అరుంధతీ రనడే-జోషి
- హోదా, బీబీసీ మరాఠీ
33 ఏళ్ల నాటి నేరానికి సంబంధించి 25 ఏళ్లకు పైగా సాగిన కేసు ఇది.
మహారాష్ట్రలో ముగ్గురు మహిళలు చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి, చంపేసిన భయానక నేరం ఇది.
ఈ ముగ్గురు దాదాపు 42 మంది పిల్లలను అపహరించారు. వారిలో చాలామందిని చంపేశారు.
ఈ మారణకాండ ఆరేళ్లు కొనసాగింది, ఈ కేసు చిక్కుముడులు వీడటానికి చాలా సంవత్సరాలు పట్టింది.
మొత్తంగా 13 మంది పిల్లలను కిడ్నాప్ చేశారని, వారిలో కనీసం ఆరుగురిని దారుణంగా హత్య చేశారని రుజువు చేయగలిగారు పోలీసులు. వారికి మరణ శిక్ష కూడా పడింది.
అయితే, క్షమాభిక్షపెట్టాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు దోషులు. దీంతో ఉరి వాయిదా పడింది. అయితే రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు.
అనంతరం నాటకీయ పరిణామాల మధ్య వీరి కేసు మరో మలుపు తిరిగింది.
ఈ సీరియల్ కిల్లర్ అక్కాచెల్లెల్లు ఎవరు?
1990 నుంచి 1996 మధ్య కాలంలో ముంబయి శివారు ప్రాంతాలు, పుణె, నాసిక్, కొల్హాపూర్ వంటి నగరాల నుంచి పిల్లలు అదృశ్యమయ్యారు. దాదాపు 42 మంది పిల్లలను ముగ్గురు మహిళలు అపహరించినట్లు పోలీసుల వాదన.
పుణేలోని ఓ మురికివాడలో అంజనాబాయి గావిత్, ఆమె కూతురు సీమా అలియాస్ దేవకి గావిత్, మరో కూతురు రేణుకా షిండే (అలియాస్ రింకూ అలియాస్ రతన్) ఒక గదిని అద్దెకు తీసుకుని నివసించేవారు.
వీరు కూలీ పనులతో పాటు దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవారు. రేణుక భర్త కిరణ్ షిండే అప్పట్లో పుణెలో టైలర్‌గా పనిచేసేవాడు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సొంత కొడుకుతో ప్రారంభమై..
సీమ, రేణుక, వారి తల్లి అంజనాబాయి రద్దీగా ఉండే ప్రదేశాలు, మార్కెట్‌లు, జాతరల్లో నగలు, పర్సులు చోరీ చేసేవారు.
1990లో రేణుక ఒకసారి రద్దీగా ఉండే ప్రదేశంలో ఓ మహిళ పర్సు లాక్కుంది. అయితే ఆమెను పట్టుకున్నారు జనం.
ఆ సమయంలో రేణుక రెండేళ్ల కుమారుడు ఆమెతో పాటే ఉన్నాడు. పట్టుబడిన తర్వాత రేణుక 'నేను దొంగను కాదు. చిన్న పిల్లాడితో ఉన్న నేను ఎలా దొంగతనం చేస్తాను' అని అనడంతో అక్కడున్న వారు వదిలేశారు.
జరిగిన విషయాన్ని ఆమె తన తల్లి, సోదరికి చెప్పారు. దీంతో దొంగతనం చేయడానికి ఇది 'సురక్షితమైన' మార్గమని భావించారు తల్లీకూతుళ్లు.
అనంతరం తల్లీకూతుళ్లు అనాథలు, బిచ్చగాళ్ల పిల్లలను అపహరించి, వివిధ నగరాలకు తీసుకెళ్లేవారు. అక్కడ జాతరలు, దేవాలయాలు వంటి రద్దీ ప్రదేశాల్లో దొంగతనాలు చేసేవారు.
పిల్లాడితో ఉన్న మహిళను ఎవరూ దొంగగా చూడరు. దీన్ని ఆసరాగా చేసుకుని ముగ్గురు మహిళలు దొంగతనం చేసేవారు.
ఒకసారి అంజనాబాయి తన కూతుళ్లతో దొంగతనానికి, ఒక ఏడాదిన్నర బాబును తీసుకుని వెళ్లింది. కొద్ది రోజుల క్రితం ఆ బాలుడిని బిచ్చగాడి దగ్గరి నుంచి ఈ అక్కాచెల్లెళ్లు అపహరించారు. అతన్ని సంతోష్ అని పిలుచుకునేవారు
అక్కడ సీమ నగలు చోరీ చేస్తుండగా పట్టుబడింది. జనం గుమిగూడారు. అక్కడి మహిళలు సీమను కొట్టడం ప్రారంభించారు. దీంతో అంజనాబాయి కూతురిని కాపాడేందుకు సంతోష్‌ను నేలకు కొట్టి కేకలు వేయడం ప్రారంభించింది.
ఒక్కసారిగా ఏడుస్తున్న తల్లీబిడ్డలను చూసి కనికరించి, అక్కడున్నవారు సీమను విడిచిపెట్టారు.
అక్కడి నుంచి తల్లీకూతుళ్లు పారిపోయే క్రమంలో అంతకుముందు తగిలిన గాయానికి సంతోష్ ఏడుపు ఆపలేదు. దీంతో అంజనాబాయికి కోపం వచ్చి, బాలుడి తలను స్థంభానికి కొట్టింది. దీంతో సంతోష్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం బాలుడిని సమీపంలో పాతిపెట్టి, ముగ్గురూ వెళ్లిపోయారు.
బాలుడిని చంపిన తర్వాత వారు సురక్షితంగానే ఉండటంతో తల్లీకూతుళ్లలో ధైర్యం పెరిగింది. ఆ తర్వాత పిల్లలను చంపేయడం వారికి అలవాటైపోయింది. దొంగతనం చేస్తుండగా దొరికిన సమయంలో ఎప్పుడైనా జనం చుట్టుముడితే పిల్లలను కొట్టడం అలవాటు చేసుకునేవారు.
ముఖ్యంగా రేణుక, సీమలు పిల్లలను అపహరించడం మొదలుపెట్టారు. ఎక్కువగా అనాథలు, మురికివాడల్లోని పిల్లలను కిడ్నాప్ చేసేవారు.
పిల్లలను నేలకేసి కొట్టడం, తొక్కి చంపడం
రేణుక, సీమ, అంజనా గవిత్‌లు కలిసి 42 మంది పిల్లలను అపహరించి ఉండొచ్చని పోలీసులు భావించారు.
వారిలో చాలా మందిని చంపారని, కానీ, దానికి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో పోలీసులు కొన్నింటిని మాత్రమే రుజువు చేయగలిగారు.
మొత్తంగా 13 మందిని కిడ్నాప్ చేశారని, వారిలో కనీసం ఆరుగురిని హత్య చేశారని రుజువు చేయగలిగారు పోలీసులు.
అపహరణకు గురైన పిల్లల్లో చాలామంది చిన్నవారే. ఎలాంటి ఆయుధం లేకుండా వారిని చంపేయడం వల్ల పోలీసులకు ఆధారాలు చిక్కలేదు.
నేలకు, స్తంభానికి చిన్నారుల తలను కొట్టడం, గొంతు బిగించడం, ముక్కులు, నోరు నొక్కడం ద్వారా చాలామందిని చంపేశారు తల్లీకూతుళ్లు.
ఒకరిని తొక్కి చంపారని పోలీసులు తెలిపారు. అయితే చాలామంది పిల్లల మృతదేహాలు కనుగొనలేకపోవడంతో, వాటిని నిరూపించలేకపోయారు పోలీసులు.
తల్లీకూతుళ్ల నేరాలు ఎలా బయటపడ్డాయి?
అంజనాబాయి భర్త రెండో భార్య కారణంగా నేరం వెలుగులోకి వచ్చింది.
మొదటి భర్త చనిపోవడంతో మాజీ సైనికుడైన మోహన్ గావిత్‌ను పెళ్లి చేసుకుంది అంజనాబాయి . అయితే అంజనాబాయి ప్రవర్తన నచ్చక వారిని వదిలేశాడు మోహన్ గవిత్. అనంతరం మరో పెళ్లి చేసుకున్నారు.
ఆయన రెండో భార్యకు ఓ కూతురు పుట్టింది. ఆమె పేరు క్రాంతి. అయితే అంజనాబాయి తన భర్త, ఆయన మరో భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.
వారిద్దరి కుమార్తె అయిన క్రాంతిని హత్య చేసింది.
నాసిక్ సమీపంలోని గ్రామంలోని పొలంలో 9 ఏళ్ల క్రాంతి మృతదేహం కనుగొన్నారు పోలీసులు.
మోహన్ గవిత్ రెండో భార్య ఫిర్యాదుతో పోలీసులు అంజనాబాయిని విచారించారు. సీమ, రేణుకలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో రేణుక ముందుగా నోరు విప్పింది.
అంజనాబాయి, రేణుక, సీమ, కిరణ్ షిండేలు 19 ఆగస్టు 1995న క్రాంతిని పాఠశాల నుంచి కిడ్నాప్ చేశారు. మూడున్నర నెలల పాటు పుణెలో క్రాంతిని తమతోనే ఉంచారు.
1995 డిసెంబర్ 6న వారందరూ క్రాంతితో కొల్హాపూర్ జిల్లాలోని నర్సోబాచి వాడికి వచ్చారు. దత్ జయంతి కారణంగా అక్కడి ఆలయం కిక్కిరిసిపోయింది.
దేవుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చి, క్రాంతిని ఎస్టీ స్టాండ్ పక్కనే ఉన్న పొలంలో గొంతుకోసి హత్య చేశారు. మృతదేహాన్ని నది ఒడ్డున పడేసినట్లు అక్కాచెల్లెళ్లు తెలిపారు.
అయితే అప్పటికే తప్పిపోయిన పిల్లల కేసుపై దృష్టి సారించిన ఓ పోలీసు అధికారికి వీరిపై అనుమానం కలిగింది. దీంతో కేసు మరో మలుపు తిరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
బయటిపడిన సీరియల్ హత్యలు
నాసిక్ పోలీసులు అంజనాబాయిని అరెస్టు చేసినట్లు కొల్హాపూర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సుహాస్ నాద్ గౌడకు సమాచారం అందింది.
కొల్లాపూర్‌కు చెందిన కొందరు చిన్నారులు అదృశ్యమైన ఘటనపై అంజనాబాయి, ఆమె కుమార్తెలను సుహాస్ విచారించారు.
అనంతరం కిరణ్ షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రేణుక, కిరణ్‌లు నేరాలను అంగీకరించారు.
అయితే ఆరేళ్లలో జరిగిన నేరాలన్నింటికి సాక్ష్యాధారాలు సేకరించడం కష్టమైన పనే. అంతేకాకుండా పోలీసుల ఎదుట నిందితుల నేరాంగీకారం ఒక్కటే కోర్టులో నిలబడదు.
‘‘పలు జిల్లాల పోలీసు బృందాలు కలిసి పనిచేయడం ప్రారంభించాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం దర్యాప్తు చేసి కొల్హాపూర్ సెషన్స్ కోర్టులో కేసు పెట్టింది." అని హిందూస్థాన్ టైమ్స్‌తో అప్పటి పోలీసు అధికారి సుహాస్ నాదగౌడ తెలిపారు.
రేణుక, సీమ జడ్జి ముందు నేరం ఒప్పుకోలేదు. అయితే, రేణుక భర్త కిరణ్ షిండే అఫ్రూవర్‌గా మారి, నేరాలు ఎలా చేశారో వివరించాడు.
ఈ నలుగురూ చేసిన క్రూరమైన పనులు కిరణ్ వెల్లడించడంతో ఘటన దేశాన్నే కుదిపేసింది. ఈ ఉదంతం 1996లో వెలుగులోకి వచ్చింది.
అయితే, కేసు విచారణలో ఉండగా అంజనాబాయి (50) మరణించింది. అక్కాచెల్లెళ్లపై కొల్హాపూర్ సెషన్స్ కోర్టులో కేసు నడిచింది.
రేణుకా షిండే, సీమా గవిత్‌లకు కోర్టు మరణశిక్ష విధించింది. అఫ్రూవర్‌గా మారినందుకు క్షమాభిక్ష ప్రసాదించడంతో కిరణ్ విడుదలయ్యారు.
మృతిచెందిన చాలామంది పిల్లల తల్లిదండ్రులు పేదవారు కావడంతో వారు ఎక్కువగా కోర్టుల చుట్టూ తిరగలేకపోయారు.
దీంతో కొన్ని కేసుల్లో మాత్రమే రేణుకా, సీమాలకు శిక్ష పడింది.
చిన్నారులను చంపిన ఈ ముగ్గురిపై అప్పట్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విచారణ సందర్భంగా కోర్టు ఆవరణలో జనం భారీగా ఉండేవారని, ముఖ్యంగా మహిళలు వచ్చేవారని సీనియర్ జర్నలిస్ట్ మహేష్ కుర్లేకర్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్షమాభిక్ష పిటిషన్‌తో మరో తీర్పు
13 మంది పిల్లలను కిడ్నాప్ చేసి వారిలో కనీసం ఆరుగురిని చంపినందుకు రేణుకా షిండే, సీమా గావిత్‌లను కొల్హాపూర్ సెషన్స్ కోర్టు 2001 జూన్ 28న దోషులుగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది.
ఆ తర్వాత బాంబే హైకోర్టు మరణశిక్షను సమర్థించింది. 2006లో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. అనంతరం ఇరువురు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారు.
ఐదేళ్ల అనంతరం క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించారు. అయితే జాప్యం కారణంగా ఉరిశిక్షను రద్దు చేయాలంటూ దోషులైన అక్కాచెలెళ్లు కోర్టుకు వెళ్లారు. కేసు 2021లో బాంబే హైకోర్టులో విచారణకు వచ్చింది.
2022 జనవరి 20న ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది న్యాయస్థానం. ఇరువురు అక్కాచెల్లెళ్లు జీవితాంతం ఎరవాడ జైలులో శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.
ప్రస్తుతం రేణుక వయసు 49, సీమా వయసు 44 ఏళ్లు.
ఆలస్యం ఎందుకైంది?
సీమా 2008 అక్టోబర్ 10న, రేణుక 2009 అక్టోబర్ 17న క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు.
ఐదేళ్ల తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దానిని తిరస్కరించడంతో, జాప్యాన్ని సవాలు చేస్తూ ఉరిని రద్దు చేయాలని 2014లో అక్కాచెల్లెల్లు కోర్టులో పిటిషన్ వేశారు.
7 సంవత్సరాల 10 నెలల 15 రోజులు ఆలస్యం కావడానికి స్పష్టమైన కారణం లేనందున ఇరువురి ఉరిని రద్దు చేసి, జీవిత ఖైదు విధిస్తున్నట్లు కోర్టు తీర్పు చెప్పింది.
ఇలాంటి క్షమాభిక్ష పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడం, సాధారణ విధానం కారణంగా క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం ఆలస్యమైందని కోర్టు భావించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది.
ముంబైలోని మంత్రిత్వ శాఖలో జరిగిన అగ్నిప్రమాదంలో క్షమాభిక్ష దరఖాస్తు కాలిపోయిందని తెలిపింది. కొత్త పత్రాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం మరింత సమయం తీసుకోవడంతో జాప్యం జరిగిందని చెప్పింది.
ఇవి కూడా చదవండి
- ఉదయనిధి స్టాలిన్: సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు వివాదంగా మారాయి..
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
- కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం మంచిదా, కాదా?
- 'ఓ మై గాడ్, అది భూమి'.. ఉచితంగా స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన తల్లీకూతుళ్ల అనుభవాలు
- ఐవీఎఫ్: పిల్లలను కనాలనుకొనే జంటలకు ఉచితంగా 5 లక్షల చికిత్స.. గోవా ఈ పథకం ఎందుకు తెచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














