కోరుట్ల: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే

దీప్తి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం...

జగిత్యాల జిల్లా కోరుట్లలో కొద్ది రోజుల కిందట ( ఆగస్ట్ 28న ) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బంక దీప్తి (22) అనుమానాస్పద మృతిలో నిందితురాలు ఆమె చెల్లెలు చందనేనని పోలీసులు ప్రకటించారు.

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి చందన తన అక్క దీప్తిని ఊపిరిరాడకుండా చేసి హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్ హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి 25 ఏళ్ల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్లకు వలస వచ్చి ఇటుక బట్టీల వ్యాపారంలో స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు దీప్తి, చందన, కొడుకు సాయి ఉన్నారు.

పెద్ద కూతురు దీప్తి పుణెలో, కొడుకు సాయి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. దీప్తి గత కొంతకాలంగా కోరుట్లలో ఇంటి వద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్‌హోమ్ చేస్తున్నారు.

చిన్న కూతురు చందన హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదువుతుండేవారు.

అయితే, తల్లిదండ్రులు హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో దీప్తి హత్యకు గురైంది.

ఇంట్లో ఉండాల్సిన చిన్న కూతురు చందన కనిపించక పోవడంతో కోరుట్ల పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

దీప్తి హత్య కేసు

ఫొటో సోర్స్, JAGITYAL POLICE

ఫొటో క్యాప్షన్, చందన, ఉమర్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు

దీప్తి అనుమానాస్పద మృతి

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం....

‘‘అంతకు ముందు రోజు (ఆగస్ట్ 28న) శ్రీనివాస్ రెడ్డి, ఆయన భార్య మాధవి కలిసి హైదరాబాద్‌లోని బంధువుల గృహప్రవేశం కార్యక్రమానికి వెళ్లారు. ఇంట్లో అక్కాచెల్లెళ్లు దీప్తి, చందన మాత్రమే ఉన్నారు.

తల్లిదండ్రులు ఆగస్ట్ 29 ఉదయం పెద్ద కూతురు దీప్తికి ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ స్విచాఫ్ వచ్చింది. పక్కింటి వారికి కాల్ చేసి విషయం కనుక్కోమని వారు కోరడంతో వెళ్లి చూస్తే ఇంటికి బయటి నుండి గొళ్లెం పెట్టి కనిపించింది. లోపలికి వెళ్లి చూస్తే దీప్తి సోఫాలో చనిపోయి కనిపించింది. కాలనీ వాసులు విషయం పోలీసులకు తెలిపారు.

పోలీసుల విచారణలో ఇంట్లోని కిచెన్‌లో సగం తాగిన బ్రీజర్, వోడ్కా బాటిళ్లు కనిపించాయి. చిన్న కూతురు చందన జాడ తెలియలేదు. ఇంట్లో బీరువాలో దాచిన రూ.2లక్షల నగదు, సుమారు కిలో బంగారు ఆభరణాలు కూడా కనిపించడం లేదని తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

దీప్తి శవంపై గాయాలు, అదే సమయంలో చందన కనిపించకుండా పోవడం, ఇంట్లోని నగదు, బంగారం మాయం కావడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది.’’

ఇంజనీరింగ్‌లో వెనకబడ్డ చందన

‘‘2019 లో ఇంజనీరింగ్‌లో చేరిన చందన నెల్లూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ తన సీనియర్ ఉమర్ షేక్ సుల్తాన్‌తో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

ఈ మధ్యే ఇంజనీరింగ్ పూర్తవడంతో చందన కోరుట్లలో ఇంటి వద్ద తల్లిదండ్రులతో ఉంటున్నారు.

చందనను కలిసేందుకు ఉమర్ తరచూ కోరుట్లకు వచ్చివెళ్లేవారు.

ఆగస్ట్ 19న ఉమర్ కోరుట్లకు వచ్చినప్పుడు, తన ఇంట్లోనివారు పెళ్లికి అంగీకరించరని.. ఎక్కడికైనా వెళ్లి పెళ్లిచేసుకుందామని చందన కోరింది.

అయితే, ఉద్యోగం, డబ్బులు లేకుండా బతకడం కష్టమన్న ఉమర్ అందుకు నిరాకరించారు. చందన ఒత్తిడి చేయడంతో ఉమర్ తన తల్లి ఆలియా మహబూబ్, చెల్లెలు ఆసియా ఫాతిమా, స్నేహితుడు హఫీజ్‌లతో వాట్సప్ కాల్ మాట్లాడించి సర్దిచెప్పారు.

రెండు రోజుల తర్వాత ఉమర్‌కు ఫోన్ చేసిన చందన..తన ఇంట్లో బంగారం, డబ్బులు చాలా ఉన్నాయని, వాటిని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లిచేసుకుందామని చెప్పారు.

ఆగస్ట్‌ 28న అమ్మా నాన్న బంధువుల గృహ ప్రవేశానికి హైదరాబాద్ వెళ్తున్నారని, ఇంట్లో అక్క తప్ప ఎవరూ ఉండరని చందన ఉమర్‌కు చెప్పారు. చందన ఫోన్ చేసిన డబ్బు, బంగారం గురించి చెప్పిన వివరాలను ఉమర్ తన తల్లి, చెల్లెలు, స్నేహితులతో చర్చించారు.’’

దీప్తి హత్య కేసు

ఫొటో సోర్స్, JAGITYAL POLICE

ఫొటో క్యాప్షన్, కేసు వివరాలు వెల్లడిస్తున్న జగిత్యాల ఎస్పీ భాస్కర్

అవకాశం కోసం ఎదురు చూపు

‘‘ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న చందనకు హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశం కార్యక్రమం కలిసి వచ్చింది. ముందుగా అనుకున్న ప్రకారం బాయ్‌ఫ్రెండ్‌ ఉమర్‌ ఆగస్ట్ 28 ఉదయం 11 గంటలకు తన కారులో కోరుట్ల చేరుకున్నారు.

ఆ రోజు రాత్రి పథకం ప్రకారం చందన తన అక్క దీప్తితో వోడ్కా తాగించారు. దీప్తి మత్తులో నిద్రలోకి జారుకుంది. తన బాయ్‌ఫ్రెండ్ ఉమర్‌కు రాత్రి 2 గంటల ప్రాంతంలో మెసేజ్ చేసి ఇంటికి పిలిపించారు. ఇంటి వెనుక తన కార్ పార్క్ చేసి వెనుక గేట్ నుండి ఇంట్లోకి ప్రవేశించిన ఉమర్ బీరువాలోని బంగారు ఆభరణాలు, డబ్బు సర్దుతుండగా అలికిడికి నిద్ర లేచిన దీప్తి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో చందన, ఉమర్‌లు స్కార్ఫ్‌తో దీప్తి చేతులు కట్టేసారు. అరుపులు వినిపించకూడదని మరో స్కార్ఫ్‌ను నోట్లో కుక్కి, టేప్‌తో దీప్తి ముక్కును మూసేశారు. కాసేపటి తర్వాత దీప్తి చనిపోయిందని నిర్ధరించుకుని కట్లు విప్పేసి ఇద్దరు కలిసి ఇంట్లో నుండి బంగారం, డబ్బుతో పరారయ్యారు’’ అని ఎస్పీ భాస్కర్ వివరించారు.

దీప్తి హత్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

వాయిస్ మెసేజ్‌తో పక్కదారి పట్టించే ప్రయత్నం

హత్యకు గురైన విధానం దీప్తి కేసును సంచలనంగా మార్చింది. ఈ క్రమంలో కోరుట్ల బస్డాండ్‌లో సీసీ కెమెరాల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక జంటను చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రచారం అయింది. అయితే అది ఎవరో ప్రచారంలోకి తెచ్చిన వీడియో అనీ, చందన్, ఉమర్‌లది కాదని, తాము ఆ వీడియోను విడుదల చేయలేదని ఎస్పీ భాస్కర్ వెల్లడించారు.

ఈ క్రమంలో మీడియాలో దీప్తి హత్య విషయం రావడం, కనిపించకుండా పోయిన చందనపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంటో....చందన తన తమ్ముడికి ఒక వాయిస్ మెసేజ్ పంపారు.

అక్క దీప్తి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె అందులో పేర్కొన్నారు. అక్క ఆ రోజు వోడ్కా తాగి పడిపోయిందని, తాను బాయ్‌ఫ్రెండ్‌తో ఇంట్లో నుండి వచ్చేశాక ఏం జరిగిందో తనకు తెలియదని ఆ మెసేజ్‌లో వెల్లడించారు.

దీప్తి హత్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

టెక్నాలజీ సాయంతో కేసును ఛేదించాం: ఎస్పీ భాస్కర్

ఈ కేసును ఛేదించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడిందని జగిత్యాల ఎస్పీ భాస్కర్ అన్నారు. కేసు దర్యాప్థు వివరాలను శనివారంనాడు ఆయన జగిత్యాలలో మీడియాకు వెల్లడించారు.

‘‘దీప్తిని చంపాలనే ప్లాన్ చందన‌కు లేదు. అక్కా, చెల్లెళ్ల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. మద్యం తాగించి నిద్రపుచ్చాక బంగారం, డబ్బుతో వెళ్లిపోవాలనుకున్నారు. అయితే దీప్తి నిద్రలేవడంతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. డబ్బు, బంగారంతో కారులో హైదరాబాద్‌లోని ఉమర్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉమర్ తల్లి, చెల్లెలు, స్నేహితునితో చర్చించాక ఎవరికి దొరక్కుండా ముంబయి లేదా నాగపూర్‌ వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు’’ అని ఎస్పీ భాస్కర్ వెల్లడించారు.

‘‘కారులో నాగపూర్‌ వెళ్తున్నారన్న సమాచారంతో ఈ రోజు ఆర్మూర్ సమీపంలో ఓ దాబా వద్ద నిందితులను అరెస్ట్ చేశాం. వారి నుండి రూ.1.20 లక్షల నగదు, 70 తులాల బంగారం, హత్య సమయంలో ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసు దర్యాప్తులో ఐదు పోలీస్ టీమ్‌లు పాల్గొన్నాయి’’ అని ఎస్పీ తెలిపారు.

చందన, ఉమర్‌లతో పాటూ ఉమర్ తల్లి సయ్యద్ అలియా మహబూబ్, చెల్లెలు షేక్ అసియా ఫాతిమా, స్నేహితుడు హఫీజ్‌లను జగిత్యాల పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

వీడియో క్యాప్షన్, స్థానికుల సాహసాన్ని అభినందించిన పాక్ ఆపద్దర్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)