Tangshan and Xuzhou: చైనాలో మహిళలపై పెరుగుతున్న హింస, వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం

చైనా

ఫొటో సోర్స్, WEIBO

ఫొటో క్యాప్షన్, థాంగ్షాన్‌లోని రెస్టారెంట్‌లో మహిళను కొడుతున్న దృశ్యం
    • రచయిత, ఫ్రాన్సెస్ మావో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనాలోని థాంగ్షాన్ నగరంలో ఇటీవల ఒక రోజు రాత్రి బార్బిక్యూ రెస్టారెంట్ హడావుడిగా ఉంది. ఒక టేబిల్ దగ్గర కొంతమంది మహిళలు కూర్చుని భోజనం చేస్తున్నారు. ఒక పురుషుడు వాళ్లను సమీపించి, ఒకామెను తాకబోయాడు.

ఆమె వెనక్కు వంగి "వెళ్లు ఇక్కడి నుంచి" అని అరిచారు. అతడు ఆమెను తలపై కొడుతూ కిందకు నెట్టాడు.

అతడి స్నేహితులు కూడా చుట్టుముట్టారు. కుర్చీలు, సీసాలతో ఆ మహిళలపై చేయి చేసుకున్నారు. వారిలో కొందరిని బయటకు ఈడ్చుకొచ్చి తలపై బాదారు.

చైనాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది తాజా ఉదాహరణ. ఈ సంఘటన కలకలం రేపింది. ప్రజలు కోపంతో ఊగిపోయారు.

జనవరిలో ఒక మహిళను ఒక గుడిసెలో కట్టిపడేశారు. ఆ వార్త కూడా ఆగ్రహం రేకెత్తించిది.

ఈ రెండు ఘటనలూ ప్రజాగ్రహానికి పురికొల్పాయి. ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. చైనాలో అరుదుగా కనిపించే యాక్టివిజం తెరపైకి వచ్చింది. పురుషహంకారం, స్త్రీదేషం పట్ల ప్రశ్నలు లేవనెత్తాయి. ముఖ్యంగా యువతులు గొంతెత్తారు.

"చైనా ప్రజలు తమ సమాజాన్ని ఎలా చూస్తున్నారన్నది ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సమాజంలో పాతుకుపోయిన లింగ భేదాలు, మూస ఆలోచనలు కలవరపెడుతున్నాయి" అని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో చైనా పరిశోధకుడు పిచామన్ యోఫాంటాంగ్ అన్నారు.

చైనా

ఫొటో సోర్స్, DOUYIN

ఫొటో క్యాప్షన్, జుజౌలో మహిళ మెడకు గొలుసు కట్టి ఒక గుడిసెలో బంధించారు

బహిరంగంగా మహిళలపై హింస

మహిళలను బహిరంగంగా హింసించే వీడియోలు కలవరపరిచే స్థాయిలో సాధారణం అయిపోయాయని, భాగస్వాములే హింసకు పాల్పడుతున్నారని బీబీసీకి చెందిన చైనీస్ మీడియా మానిటరింగ్ అనలిస్ట్ కెర్రీ అలెన్ అన్నారు.

"రహస్యంగా చిత్రీకరించిన గృహహింస వీడియోలు లేదా నిఘా కెమెరాలకు చిక్కిన వీడియోలు నాకు రోజూ కనిపిస్తాయి" అని ఆమె చెప్పారు.

2013లో సెంట్రల్ చైనాలోని ఒక కౌంటీలో 1,000 మంది పురుషులను శాంపిల్‌గా తీసుకుని ఐక్యరాజ్య సమితి ఒక అధ్యయనం నిర్వహించింది. వారిలో సగం కంటే ఎక్కువమంది తమ భాగస్వామిపై శారీరక లేదా లైంగిక హింసకు పాల్పడినట్లు ఆ అధ్యయనంలో తేలింది. అదే సంఖ్యలో పురుషులు, తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి హింసను ఉపయోగిస్తామని కూడా చెప్పారు.

చైనాలో పాతుకుపోతుపోయిన లింగ భేదాలే ఈ ప్రవృత్తికి కారణమని ఐరాస రిపోర్టు తెలిపింది.

చైనా సమాజంలో "కఠినంగా వ్యవహరించడం, లైంగిక పరాక్రమం, కొన్ని సందర్భాల్లో బలప్రయోగం చేయడం పురుషత్వానికి నిదర్శనాలు" అని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.

కేవలం 2016 నుంచే చైనాలో గృహహింసను నేరంగా పరిగణించడం మొదలుపెట్టారన్నది గమనార్హం.

అయితే, చైనా సమాజంలో ఇప్పటికీ భార్యాభర్తల మధ్య గొడవల్లో జోక్యం చేసుకోవడం పట్ల విముఖత ఉందని, దాన్ని ప్రయివేటు వ్యవహారంగానే పరిగణిస్తున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

పదేళ్ల క్రితం తాను చైనాలో నివసిస్తున్నప్పుడు పట్టపగలే మహిళలపై హింసకు పాల్పడిన ఎన్నో సంఘటనలను చూశానని, "పబ్లిక్‌లో అలా వ్యవహరిస్తున్నా పక్కనున్నవాళ్లు చూస్తూ నిలబడ్డారే తప్ప, ఎవరూ కలుగజేసుకోలేదని" కెర్రీ అలెన్ చెప్పారు.

థాంగ్షాన్‌లో కూడా అదే జరిగింది. బాధితురాలికి తనపై దాడి చేసిన వ్యక్తి పరిచయం కూడా లేడు. అయినా, ఎవరూ వచ్చి ఆ హింసను ఆపలేదు.

జూజౌలో కూడా ఇలాగే జరిగింది. ఒక మహిళను తన ఇంటి బయట ఉన్న గుడిసెలో మెడకు గొలుసు వేసి కట్టేశారు.

ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, ఆమె చర్యలు ఇతరులకు ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఆమె భర్త ఆరోపించారు. అయితే, ఆమెను 1990లలో పెళ్లి పేరుతో అక్రమ రవాణా చేశారనే అనుమానం పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.

ఒక వ్లాగర్ ఆ ఊరిలో పర్యటిస్తున్నప్పుడు గుడిసెలో బంధించి ఉన్న ఆమెను వీడియో తీశారు. ఆన్‌లైన్‌లో ఆ వీడియో వైరల్ అయింది. ఆమెను అలా కట్టిపడేశారన్న విషయం బయటకు రావడానికి చాలా సమయం పట్టిందన్న వాస్తవం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

"ఆమె ఒక మనిషి. వస్తువు కాదు. 20 ఏళ్లల్లో 8 మంది సంతానాన్ని కన్న తరువాత, ఇవాళే ఆమెకు జరిగిన అన్యాయం వెలుగులోకి వచ్చిందా? దీన్లో ప్రమేయం ఉన్న ప్రభుత్వ శాఖలు ఏవీ అమాయకం కాదు" అని వీబోలో ఒక యూజర్ రాశారు.

వీడియో క్యాప్షన్, చైనా సోషల్ మీడియా యూజర్ల ఆనందానికి బలవుతోన్న ఆఫ్రికన్ పిల్లలు

మార్పు కోసం పిలుపు

థాంగ్షాన్, జుజౌలలో జరిగిన ఘటనలకు చాలామంది చైనా మహిళలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చైనాలో నేరాల రేట్లు తక్కువ, నిఘా అధిక స్థాయిలో ఉంటుంది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యానికి గురిచేసిందని పలువురు పేర్కొన్నారు.

"యూనివర్సిటీలో చదువుకుంటున్న కొంతమంది అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, వాళ్లు నిజంగానే ఆశ్చర్యపోయారు. ఈరోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే నమ్మలేకపోయారు" అని యోఫాంటాంగ్ చెప్పారు.

దాంతో, యువతులు సమాజంలో వేళ్లూనుకున్న లింగ భేదాలను ప్రశ్నిస్తున్నారని ఆమె చెప్పారు.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నేటి తరం యువత సమాజంలో మార్పుకు పిలుపునిస్తున్నారు. వీరంతా అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను, మీటూ ఉద్యమాల్లాంటి వాటిని గమనిస్తున్నారు.

చైనా సమాజంలోని పురుషాధిక్యతను ప్రశ్నిస్తూ వీబోలో కొంతమంది వ్యాసాలు రాశారు. అవి చాలా పాపులర్ అయ్యాయి.

"లైంగిక హింసను ప్రేరేపించే ఆలోచనలు, నియమాలు మన సమాజంలో బలంగా ఉన్నాయన్న విషయాన్ని ముందు అంగీకరించాలి" అని ఒక వ్యాసంలో రాశారు.

ప్రభుత్వం తీరు నిరాశాజనకం

ఈ ఘటనల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా కొందరు దుయ్యబట్టారు.

థాంగ్షాన్ నగరంలో జరిగిన ఘటన విషయంలో మొదట పోలీసులు, మీడియా కూడా దాడికి పాల్పడిన వ్యక్తికి స్థానిక ముఠాలతో లింకులు ఉన్నాయా, నేర చరిత్ర ఉందా అని వెతికారు.

ఆమెతో కేవలం "మాట్లాడడానికే" ఆ వ్యక్తి వాళ్ల టేబిల్ దగ్గరకు వెళ్లారని ఒక రిపోర్టులో రాశారు. అయితే, అది కచ్చితంగా లైంగిక వేధింపుల కేసు అని వీబోలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

జుజౌలో గుడిసెలో బంధించిన మహిళ విషయంలో కూడా పలువురు నిరసనలు తెలిపారు. చైనాలో ఇలా నిరసనలు తెలుపడం అరుదైన విషయం.

ఇద్దరు వేర్వేరు మహిళలు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. ప్రదర్శనకారులు ప్లకార్డులు పట్టుకుని ఫొటోలు దిగి, ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. ఒక పుస్తకాల దుకాణంలో స్త్రీవాద సాహిత్యాన్ని ప్రదర్శనకు ఉంచారు.

వీడియో క్యాప్షన్, చైనా అమ్మాయి, గుంటూరు అబ్బాయి లవ్ స్టోరీ

ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందా?

"స్త్రీలు కోపంతో గొంతెత్తుతున్నారు. అయితే, సమాజంలో మార్పు వస్తుందని నేను అనుకోను" అని హ్యూమన్ రైట్స్ వాచ్‌లో చైనా పరిశోధకుడు యాకియు వాంగ్ అన్నారు.

ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో థాంగ్షాన్, జుజౌ ఘటనల్లో దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. టాస్క్‌ఫోర్స్ బృందాలను నియమించింది.

జుజౌలో ఘటన నేపథ్యంలో, మహిళల అక్రమరవాణాపై పట్టు బిగిస్తామని, స్థానిక వివాహ లైసెన్సులను పునఃపరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

థాంగ్షాన్ రెస్టారెంట్‌లో దాడి తరువాత రాత్రి పూట గస్తీ ముమ్మరం చేశారు. స్థానిక పోలీసు అధికారిని విధుల నుంచి తొలగించారు.

రెండు కేసుల్లోనూ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే, జెండర్ ఆధారంగా జరిగే నేరాలను ప్రత్యేక ఘటనలుగా పరిగణిస్తూ నేరస్థులను శిక్షించడం వరకే పరిమితం కావడం ప్రభుత్వానికి అలవాటేనని చైనాలో గృహ హింస కేసులపై పనిచేసే గువో జింగ్ అన్నారు.

"ఈ ఘటనలను నిర్మాణాత్మక లోపాలుగా పరిగణించరు. వ్యవస్థాగత పరిష్కారలు లేదా దీర్ఘకాలిక పరిష్కారాల గురించి ఆలోచించరు" అని ఆమె అభిప్రాయపడ్డారు.

మార్చిలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లోని కొంతమంది పార్టీ సభ్యులు, మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను బలోపేతం చేయాలని హ్యూమన్ ట్రాఫికింగ్‌ నేరాలకు శిక్షలను పెంచాలని సూచించారు.

అయితే, ఇవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి మార్పులను సూచించలేదు సరికదా నియంత్రణ మరింత పెంచింది.

థాంగ్షాన్ దాడి విషయంలో "జెండర్ ఘర్షలను ప్రేరేపించే" పోస్టులను వీబో తొలగించింది. గతంలో జుజౌ ఘటనపై స్పందించిన పోస్టులను, సెక్సిజం గురించి చర్చించిన పోస్టులను కూడా పెరికివేసింది.

అలాగే, మహిళా హక్కుల ప్రచారంపై కూడా ఉక్కుపాదం మోపిందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. గట్టిగా మాట్లాడే స్త్రీవాదులను అరెస్టు చేశారు. కోర్టులో ఉన్న హై ప్రొఫైల్ మీటూ కేసులను కొట్టిపారేశారు.

"జెండర్ సమస్యలు, లైంగిక హింస మొదలైనవాటిపై మెరుగ్గా వ్యవహరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే శక్తులన్నిటినీ పెరికివేశారు. ఈ చర్యలన్నీ చైనాలో మహిళా హక్కులను మరింత కాలరాస్తాయి" అని వాంగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)