చైనా: అంతరిక్షంలో నంబర్ 1 కావాలనుకుంటుందా? ప్రయోగాలకు నిధులు సమకూరుస్తున్నది ఎవరు

ఫొటో సోర్స్, BBC; Getty Image; Nasa
- రచయిత, వాన్‌యువాన్ సంగ్, జన తౌషిన్స్‌కీ
- హోదా, బీబీసీ న్యూస్
ముగ్గురు చైనా వ్యోమగాములు ఆరు నెలల ప్రత్యేక మిషన్ మొదలుపెట్టారు.
వీరు తమ కొత్త అంతరిక్ష కేంద్రంలో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.
భవిష్యత్‌లో అంతరిక్ష అగ్రరాజ్యంగా ఎదగాలనే లక్ష్యంగా దిశగా చైనా అడుగులు వేస్తోంది.

తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం ఏమిటి?
తియాంగాంగ్ లేదా ‘‘హెవెన్లీ ప్యాలెస్’’గా పిలుస్తున్న కొత్త అంతరిక్ష కేంద్రం తొలి మాడ్యూల్‌ను గత ఏడాది చైనా కక్ష్యలోకి పంపించింది. ఈ ఏడాది చివరినాటికి సైన్స్ ల్యాబ్‌తోపాటు మరిన్ని మాడ్యూల్స్‌ను కూడా అంతరిక్షంలోకి పంపేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోంది.
వచ్చే ఏడాది ‘‘షుంటియాన్’’గా పిలిచే స్పేస్ టెలిస్కోప్‌ను కూడా చైనా అంతరిక్షంలోకి పంపనుంది. సర్వీసింగ్‌కు, ఇంధనం నింపుకొనేందుకు ఈ టెలిస్కోప్.. అంతరిక్ష కేంద్రానికి సమీపానికి వెళ్తుంది.
తియాంగాంగ్‌లో ఇంధన ఉత్పత్తి, ప్రొపల్షన్, వ్యోమగాములు ఉండేందుకు లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, లివింగ్ క్వార్టర్స్ లాంటి ప్రత్యేక సదుపాయాలున్నాయి.
అంతరిక్షంలో సొంతంగా వ్యోమగాములను పంపించి, అంతరిక్ష కేంద్రం నిర్మిస్తున్న మూడో దేశం చైనా. ఇప్పటికే సోవియట్ యూనియన్ (నేటి రష్యా), అమెరికా ఈ ఘనత సాధించాయి.
తియాంగాంగ్‌పై చైనా చాలా ఆశలు పెట్టుకుంది. 2031లో సర్వీస్ నుంచి తొలగించనున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని భావిస్తోంది.
ప్రస్తుతం ఐఎస్ఎస్‌లో చైనా వ్యోమగాములను అనుమతించడం లేదు. చైనాతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా డేటాను పంచుకునేందుకు అమెరికా చట్టాలు అనుమతించకపోవడమే దీనికి కారణం.

అంగారకుడిపైకీ..
చైనా లక్ష్యాలు కేవలం అంతరిక్ష కేంద్రానికి మాత్రమే పరిమితం కావు.
భూమికి సమీపంలోని కొన్ని గ్రహ శకలాల నుంచి రాళ్ల నమూనాలను భూమికి తీసుకురావాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది.
2030నాటికి చంద్రుడిపైకి తమ దేశానికి చెందిన తొలి వ్యోమగాములను పంపాలని చైనా భావిస్తోంది.
మరోవైపు అంగారకుడు, బృహస్పతిల నుంచి కూడా శిలలను తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి?
అంతరిక్షంలో తమ ప్రయోగాల పరిధిని చైనా ఒకవైపు విస్తరిస్తుంటే.. మరోవైపు మరికొన్ని దేశాలు కూడా చంద్రుడిపైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
2025నాటికి తమ దేశానికి చెందిన వారితోపాటు ఇతర దేశాల వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని నాసా భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే ఎస్ఎల్ఎస్ రాకెట్‌ను కెన్నడీ స్పేస్ సెంటర్‌లో పరీక్షించి చూశారు. మరోవైపు జపాన్, దక్షిణ కొరియా, రష్యా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా తమ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఇప్పటికే భారత్ రెండో ప్రధాన మూన్ మిషన్‌ను పూర్తిచేసుకుంది. మరోవైపు 2030నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా నాసాతో కలిసి మూన్ మిషన్‌లపై పనిచేస్తోంది. మరోవైపు చంద్రుడిపైకి కొన్ని వరుస ఉపగ్రహాలను పంపేందుకు సిద్ధమవుతోంది. వీటి సాయంతో భూమిపై ఉండేవారితో సమాచారం పంచుకునేందుకు వ్యోమగాములకు తేలిక అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- అంతరిక్షం తమదని ఏ దేశమూ చెప్పుకోవడానికి లేదా ప్రకటించుకోవడానికి వీల్లేదని ఐక్యరాజ్యసమితి అవుటర్ స్పేస్ ట్రీటీ-1967 చెబుతోంది.
- అంతరిక్ష వనరులను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోకూడదని ఐరాస మూన్ అగ్రిమెంట్-1979 చెబుతోంది. అయితే, అమెరికా, చైనా, రష్యా దీనిపై సంతకం చేసేందుకు నిరాకరిస్తున్నాయి.
- ప్రస్తుతం ఆర్టిమిస్ ఎకార్డ్స్‌ను అమెరికా ప్రోత్సహిస్తోంది. చంద్రుడిపై ఖనిజాలను తవ్వి తీసుకునేందుకు ఈ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు.
- అయితే, రష్యా, చైనా ఈ ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు నిరాకరిస్తున్నాయి. అంతరిక్ష వనరులపై అమెరికా ఏకపక్షంగా ఒప్పందాలు చేసుకోవడం కుదరదని అంటున్నాయి.
చైనా అంతరిక్ష ప్రయోగాల చరిత్ర ఏమిటి?
1970లో చైనా తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఆ తర్వాత చైనాలో కల్చరల్ రివొల్యూషన్‌తో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
అప్పటికి అమెరికా, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, జపాన్‌లు మాత్రమే చెప్పుకోదగిన స్థాయిలో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించాయి.
గత పదేళ్లలో చైనా 200కుపైగా రాకెట్లు ప్రయోగించింది.
ఇప్పటికే చంద్రుడిపై శిలల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు చాంగె-5 మిషన్‌ను చైనా చేపట్టింది. చంద్రుడి ఉపరితలంపై చైనా జెండాను ఎగురవేసింది. కావాలనే అమెరికా జెండా కంటే పెద్ద జెండాను అంతరిక్షంలోకి చైనా పంపించింది.
షెంఝౌ-14 ప్రయోగంతో కలిపి మొత్తంగా చైనా 14 మంది వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించింది. అమెరికా (340), సోవియట్ యూనియన్ (130)తో ఈ రేసులో చాలా ముందున్నాయి.
అయితే, చైనాకు కొన్ని ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. 2021లో ఒక చైనా రాకెట్ అంతరిక్షంలో నియంత్రణ కోల్పోయి అట్లాంటిక్ సముద్రంలో కుప్పకూలింది. 2020లోనూ రెండు రాకెట్ ప్రయోగాలు విఫలమయ్యాయి.
ప్రయోగానికి నిధులు ఎక్కడివి?
చైనా అంతరిక్ష ప్రయోగాల కోసం 3,00,000 మంది పనిచేస్తున్నట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ జిన్‌హువా వెల్లడించింది. నాసా కోసం పనిచేస్తున్న వ్యోమగాముల కంటే ఇది 18 రెట్లు ఎక్కువ.
చైనీస్ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్‌ను 2003లో ఏర్పాటుచేశారు. మొదట్లో దీని వార్షిక బడ్జెట్ 300 మిలియన్ల డాలర్లు (రూ.2,329.57 కోట్లు).
అయితే, 2016లో అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులను చైనా ఆహ్వానించింది. ప్రస్తుతం ఏడాదికి 1.5 బిలియన్ డాలర్లు (రూ.11648 కోట్లు) ప్రైవేటు పెట్టుబడులు వచ్చినట్లు చైనా మీడియా పేర్కొంది.
అంతరిక్షంపై ఇంత ఎందుకు?
ఉపగ్రహ సాంకేతికత అభివృద్ధిపై చైనా ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్లు, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, వాతావరణ అంచనాలపై దృష్టిసారిస్తోంది.
అయితే, చైనా ప్రయోగిస్తున్న చాలా ఉపగ్రహాలను సైనిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలపై నిఘా పెట్టడం, దీర్ఘశ్రేణి క్షిపణులకు నావిగేషన్ వ్యవస్థల కోసం వీటిని ప్రయోగిస్తున్నారు.
‘‘హైప్రొఫైల్ మిషన్లతోపాటు అంతరిక్షంలో అన్ని రంగాలపైనా చైనా దృష్టి సారిస్తోంది. వారికి రాజకీయ లక్ష్యాలున్నాయి. ప్రయోగాలకు అవసరమైన నిధులను వారు సమకూర్చుకోగలుగుతున్నారు’’అని పోర్ట్స్ మౌత్ యూనివర్సిటీలోని స్పేస్ ప్రాజెక్ట్ మేనేజర్ లూసిండా కింగ్ చెప్పారు.
చంద్రుడిపై చైనా చేపడుతున్న ప్రయోగాల్లో చాలావరకు అక్కడి అరుదైన లోహాలు, ఖనిజాల కోసమేనని ఆయన చెప్పారు.
అయితే, ఇతర దేశాల మన్ననలు పొందడంపైనే చైనా ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోందని లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ పాలసీకి చెందిన ప్రొఫెస్ సెయిడ్ మోస్టెషర్ చెప్పారు. ‘‘అంతరిక్షంలో తమ శక్తి, సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించడంపైనే చైనా ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోంది’’అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- వాతావరణ లక్ష్యాలు: చేసిన హామీలకు దేశాలు కట్టుబడుతున్నాయా? ఎంతవరకు నెరవేర్చుతున్నాయి?
- పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? ‘సూపర్ మామ్’గా ఉండటం కరెక్టేనా?
- పుతిన్ కాల్పుల విరమణ ప్రకటిస్తారా? యుక్రెయిన్ గెలుస్తుందా
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














