Ice Volcanoes: ప్లూటోపై మంచు పర్వతాలు ఎందుకు పగులుతున్నాయి? ఖగోళ శాస్త్రవేత్తలను తికమక పెడుతున్న ‘ఐస్ వోల్కనో’ల మిస్టరీ ఏమిటి?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, డేవిడ్ రోట్రీ
- హోదా, బీబీసీ ముండో
మన సౌర వ్యవస్థలో అతిపెద్ద మరుగుజ్జు గ్రహం ప్లూటో. దాని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్లూటో ఉపరితలంపై మంచు లావా పొంగిపొర్లిన జాడలు ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.
బహుశా వంద కోట్ల ఏళ్ల క్రితం ఈ లావా ఉప్పొంగి ఉండొచ్చు. అంటే ఇది జరిగి కాస్త ఎక్కువ సమయమే అయింది.
ప్రస్తుతం అక్కడ ఐస్ వోల్కనోలు క్రియాశీలంగా ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.
మన సౌర వ్యవస్థలో నాలుగో వంతు వయసుండే ప్లూటోపై ఈ విస్ఫోటాలకు అవసరమైన ఉష్ణం ఎక్కడి నుంచి వచ్చిందో శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు.
2015, జులై 14న ప్లూటో పక్క నుంచి న్యూ హొరైజన్స్ వ్యోమనౌక ప్రయాణించినప్పుడు తీసిన చిత్రాలను తాజాగా కొలరాడోలోని సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కెల్సీ సింగర్ నేతృత్వంలోని పరిశోధకులు విశ్లేషించారు.
పర్వత ప్రాంతంలా కనిపిస్తున్న ‘‘రైట్ మోన్స్’’గా పిలిచే ప్రాంతంపై సింగర్ బృందం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మిగతా ప్రాంతంతో పోలిస్తే, ఇది నాలుగు నుంచి ఐదు కి.మీ. ఎత్తుగా ఉంది. దీని వెడల్పు 150 కి.మీ. వరకు ఉంది.

ఫొటో సోర్స్, NASA
రైట్ మోన్స్ ఒక వోల్కనో అని సింగర్ బృందం చెబుతోంది. ఇది బద్దలైనప్పుడు చుట్టుపక్కల ఏర్పడిన గుండ్రని బిలం ఇప్పుడు కనిపించడం లేదు. అంటే బహుశా వంద కోట్లు(బిలియన్) లేదా రెండు వందల కోట్లు (రెండు బిలియన్లు) ఏళ్ల క్రితం ఇది విస్ఫోటం చెంది ఉండొచ్చు.
రైట్ మోన్స్ నుంచి 20 వేల క్యూబిక్ కి.మీ. మేర లావా ఉప్పొంగి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
అంగారకుడిపై అతిపెద్ద అగ్ని పర్వతాల నుంచి వెలువడిన లావాతో పోలిస్తే ఇది తక్కువే కావొచ్చు. అయితే, హవాయిలోని మౌనా లోవా విస్ఫోటం నుంచి పెల్లుబికిన లావాకు ఇది సమానం.
అయితే, అంగారకుడి వ్యాసంలో ప్లూటో వ్యాసం మూడో వంతు మాత్రమే ఉంటుంది. భూమితో పోలిస్తే ఇది ఆరో వంతు మాత్రమే. ఇంత చిన్న మరుగుజ్జు గ్రహంపై ఇంత పెద్ద విస్ఫోటం చాలా ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, NASA
రైట్ మోన్స్ విశేషాలివీ..
రైట్ మోన్స్ పర్వత వాలు ప్రాంతాల్లో దాదాపు ఒక కి.మీ. ఎత్తుల్లో చిన్న పర్వతాల్లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. వీటి విస్తీర్ణం ఆరు నుంచి 12 కి.మీ. వరకు ఉంది.
ఈ పర్వతాలు మంచు కొండలని పరిశోధకులు భావిస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఇవి ఆలస్యంగా ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నైట్రోజన్, మీథేన్‌ల కంటే మంచు స్ఫటికాలతో ఇవి ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇంత పెద్ద కొండలు ఏర్పడేందుకు అవసరమైన దృఢత్వం నైట్రోజన్, మీథేన్‌ల కంటే మంచు వల్లే వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, మధ్యలో కనిపించే రంధ్రంలో నైట్రోజన్ ఐస్ ఉండే అవకాశముందని వివరిస్తున్నారు.

ఫొటో సోర్స్, NASA
ఈ పర్వతాలు బహుశా ఐస్ వోల్కనోలు విస్ఫోటం చెందడం వల్ల పుట్టి ఉండొచ్చు. ఇలా మంచు విస్ఫోటం చెందడాన్ని క్రయోవోల్కనిజమ్ అంటారు. అంటే ద్రవ రూపంలోని రాళ్లకు బదులుగా గడ్డకట్టిన మంచు విస్ఫోటం చెందడం.
వీటి మధ్యలో రాళ్లు ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే, వెలుపలి ప్రాంతాల్లో మాత్రం నీరు, మీథేన్, నైట్రోజన్, అమ్మోనియా, కార్బన్ మోనాక్సైడ్‌లతో కూడిన మంచు ఉండొచ్చని భావిస్తున్నారు. భూమి లాంటి శిలా గ్రహాల్లానే ఇక్కడి ఉపరితలంపై కూడా భిన్న సిలికేట్ పదార్థాలు ఉండే అవకాశముంది.
ప్లూటో ఉపరితలంపై ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువే ఉంటాయి. దీంతో నీరు గడ్డకట్టడంతో ఏర్పడే మంచు చాలా గట్టిగా ఉంటుంది. ఫలితంగా దృఢమైన పర్వతాల్లాంటి నిర్మాణాలు ఏర్పడే అవకాశముంది.
ఎలా కరుగుతాయి?
రాయితో పోలిస్తే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మంచు కరుగుతుంది. అయితే, రెండు రకాల మంచులు కలిసినప్పుడు ఇంకా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మంచు ద్రవరూపంలోకి వస్తుంది.
ప్లూటోపై ఉష్ణానికి కారణమయ్యే వనరులేమీ లేకపోవడంతో క్రయోవోల్కనిక్ విస్ఫోటాలు అలానే కనిపిస్తున్నాయి.
భ్రమణంలో ఉండే గ్రహాల గురుత్వాకర్షణ వల్ల ఏర్పడే టైడల్ ఫోర్సెస్‌తో ప్లూటో అంతర్భాగం వేడెక్కే అవకాశం చాలా తక్కువ. బృహస్పతి, శని గ్రహాల చందమామల అంతర్భాగంలో ఇలాంటి ఉష్ణాన్ని మనం గమనించొచ్చు.
అయితే, ప్లూటో అంతర్భాగంలో ఉండే రాళ్లు రేడియోధార్మికతను పుట్టించే స్థాయిలో ఉండే అవకాశం లేదు.
ప్లూటో జనించినప్పుడు పుట్టిన వేడిలో కొంత ఇప్పటికీ అలానే ఉండి ఉండొచ్చని సింగర్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం అంచనా వేస్తోంది. ఈ అంచనాల ప్రకారం.. ప్లూటో పైపొరల కింద నీరు ద్రవరూపంలో ఉండొచ్చు.
ఒకవేళ రైట్ మోన్స్‌పై కనిపిస్తున్న ఈ పర్వతాలు మంచు విస్ఫోటం వల్లే జరిగితే, పైపొరల కింద మంచు గట్టి స్ఫటికాల రూపంలో ఉండే అవకాశముంది. అందుకే ఇది నీరులా ప్రవహించకుండా మట్టి దిబ్బలా పేరుకుంది.
పికార్డ్ మోన్స్ మరింత పెద్దది..
రైట్ మోన్స్‌కు దక్షిణాన మరింత పెద్ద వోల్కనో ‘‘పికార్డ్ మోన్స్’’ ఉంది. దీని మధ్యలో కూడా ఒక బిలం ఉంది.
ఈ రెండూ పక్కపక్కనే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ రెండు వోల్కనోలు ఎలా విస్ఫోటం చెందాయో తెలుసుకోవడానికి ఈ బిలాలు సహాయపడతాయి.
రైట్ మోన్స్‌తో పోలిస్తే, పికార్డ్‌పై పరిశోధకులు పెద్దగా దృష్టిపెట్టలేదు. ఎందుకంటే న్యూహొరైజన్స్ సమీపంలోకి వెళ్లినప్పటికీ ప్లూటో భ్రమణం వల్ల పికార్డ్ చీకట్లోకి వెళ్లిపోయింది.
న్యూహొరైజన్స్ చాలా వేగంగా వెళ్లడంతో కేవలం సూర్యుడివైపున్న ప్లూటో భాగాలు మాత్రమే చూడటానికి వీలుపడింది.
అయితే, ప్లూటో వాతావరణంలోని పొగ మంచు వల్ల కాస్త సూర్యరశ్మి ప్రతిబింబించి కొంతవరకు పికార్డ్‌ను చూసేందుకు వీలుచిక్కింది.
ప్లూటోపై వెలుగులోకి రాని ఇలాంటి వింతలు మరెన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు. ఈ మంచు వోల్కనోలు ఎలా పుట్టాయో తెలియడానికి దశాబ్దాలు కూడా పట్టొచ్చు.
ఇవి కూడా చదవండి:
- కర్నాటక: హిజాబ్ తర్వాత హలాల్ మాంసంపై వివాదం ఎందుకు రాజుకుంటోంది?
- అంబేడ్కర్: భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు ఈ ఆర్థికవేత్త ఆలోచనలే బాటలు వేశాయని మీకు తెలుసా?
- భారత్-పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భారత్కు అవసరమా, అనవసరమా?
- దీపిక పదుకోణె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ... ఈ స్టార్లంతా కోట్లకు కోట్ల సంపాదనతో ఏం చేస్తున్నారు?
- ‘ఇక విశాఖలో వ్యాపారం చేయను.. హైదరాబాద్లోనే చేసుకుంటా’నని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














