Elon Musk: చంద్రున్ని ఢీకొట్టననున్న 'స్పేస్ ఎక్స్' రాకెట్

2015లో స్పేస్ ఎక్స్ రాకెట్ 'ఫాల్కన్ 9'ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2015లో స్పేస్ ఎక్స్ రాకెట్ ‘ఫాల్కన్ 9’ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు
    • రచయిత, జార్జినా రనార్డ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి ప్రయోగించిన ఒక రాకెట్, చంద్రున్ని ఢీకొట్టి పేలిపోనుంది.

2015లో 'ఫాల్కన్ 9 బూస్టర్' అనే రాకెట్‌ను ప్రయోగించారు. మిషన్‌ను పూర్తి చేసిన తర్వాత తిరిగి భూమిని చేరడానికి తగినంత ఇంధనం లేకపోవడంతో అది అంతరిక్షంలోనే మిగిలిపోయింది.

చంద్రున్ని ఢీకొట్టే తొలి అనియంత్రిత రాకెట్ ఇదే కానుందని ఖగోళ శాస్త్రవేత్త జొనాథన్ మెక్‌డోవెల్, బీబీసీ న్యూస్‌తో అన్నారు. దీనివల్ల కలిగే ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు.

ఏడేళ్ల క్రితం, మిలియన్ మైళ్ల దూరం ప్రయాణించి వాతావరణ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి చేర్చిన ఈ రాకెట్ అప్పటినుంచి అక్కడి కక్ష్యలోనే తిరుగుతోంది.

స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్‌ 'స్పేస్ ఎక్స్'లో భాగంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. స్పేస్ ఎక్స్ అనేది ఒక వాణిజ్య సంస్థ. ఇతర గ్రహాలను నివాసయోగ్యంగా మార్చాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు.

''2015 నుంచి రాకెట్‌పై భూమి, చంద్రుడు, సూర్యునిలకు చెందిన వివిధ గురుత్వాకర్షణ బలాలు పనిచేశాయి. వీటివల్లే రాకెట్ మార్గం కొంతవరకు అస్తవ్యస్తంగా మారుతోంది. ఇప్పటికే అది నాశనమైంది. కేవలం గురుత్వాకర్షణ నియమాలను పాటిస్తోంది'' అని అమెరికాలోని హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ప్రొఫెసర్ మెక్‌డోవెల్ వివరించారు.

వీడియో క్యాప్షన్, ఎలాన్ మస్క్ స్కూల్‌లో సీటు సాధించిన వరంగల్ బాలుడు

మిషన్ పూర్తి చేసిన తర్వాత భూమికి తిరిగిరావడానికి తగినంత శక్తి లేకపోవడంతో... అంతరిక్షంలోని మిగిలిపోయిన లక్షలాది వ్యర్థభాగాల్లో ఇది కూడా చేరింది.

''దశాబ్దాలుగా చూసుకుంటే మనం 50 పెద్ద వస్తువుల జాడను కోల్పోయి ఉండవచ్చు. మనకు తెలియకుండా గతంలో కూడా ఇలాంటివి జరిగి ఉండొచ్చు. కానీ మనకు తెలిసి, మనం ధ్రువీకరించగలిగే తొలి కేసుగా ఇది నిలవనుంది'' అని ప్రొఫెసర్ మెక్‌డోవెల్ చెప్పారు.

'ఫాల్కన్ 9' రాకెట్ గతించడం గురించి స్పేస్ వెబ్‌సైట్‌ 'ఆర్స్ టెక్నికా'లో జర్నలిస్ట్ ఎరిక్ బెర్గర్, తన బ్లాగ్‌లో డేటా అనలిస్ట్ బిల్ గ్రే చెప్పారు.

మార్చి 4వ తేదీన రాకెట్, చంద్రున్ని ఢీకొట్టనుంది. ఆ తర్వాత పేలిపోతుంది.

''సాధారణంగా ఇది 4000 కిలోల లోహ పరికరం. దీనికి వెనుక భాగంలో రాకెట్ ఇంజన్ ఉంటుంది. ఒక రాయిని ఇది గంటకు 5000 మైళ్ల వేగంతో ఢీకొడితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి'' అని ప్రొఫెసర్ మెక్‌డోవల్ వ్యాఖ్యానించారు.

ఇది ఢీకొట్టడం వల్ల చంద్రుని ఉపరితలంపై ఒక చిన్న కృత్తిమ బిలం ఏర్పడుతుంది.

ఈ రాకెట్ జనవరి 5న భూమికి దగ్గరగా ప్రయాణించిందని, మార్చి 4న చంద్రున్ని ఢీకొట్టే అవకాశం ఉందని బిల్ గ్రే చెప్పారు. భూమికి సమీపంలో ఉన్న అంతరిక్ష వస్తువులను ఒక సాఫ్ట్‌వేర్ సహాయంతో ఆయన ట్రాక్ చేస్తుంటారు.

2009లో ప్రొఫెసర్ మెక్‌డోవెల్, ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో ఫాల్కన్ 9 పరిమాణంలో ఉన్న రాకెట్‌తో చంద్రున్ని ఢీకొట్టారు. ఈ ఘర్షణకు సంబంధించిన సాక్ష్యాలను సెన్సార్ల ద్వారా సేకరించారు. వీటి ఆధారంగా చంద్రునిపై ఏర్పడ్డ బిలం గురించి అధ్యయనం చేస్తారు.

''తాజాగా ఫాల్కన్ 9 రాకెట్, చంద్రున్ని ఢీకొట్టడం ద్వారా శాస్త్రవేత్తలు కొత్తగా నేర్చుకుదేమీ ఉండదని'' మెక్‌డోవెల్ చెప్పారు.

అంతరిక్ష శిధిలాల వల్ల ప్రస్తుతం ఎలాంటి ప్రభావాలు కనిపించకపోయినప్పటికీ, భవిష్యత్‌లో వీటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉండొచ్చని ఆయన చెప్పారు.

ఇప్పటినుంచి మార్చి 4 వరకు ఏం జరగనుంది? చంద్రున్ని ఢీకొట్టేవరకు కూడా ఆ రాకెట్ గురుత్వాకర్షణ నియమాలను పాటిస్తూ అంతరిక్షంలో తిరుగుతూనే ఉంటుంది.

వీడియో క్యాప్షన్, జేమ్స్ వెబ్: హబుల్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన టెలిస్కోప్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)