RRB NTPC: రైలుకు నిప్పుపెట్టిన అభ్యర్థులు, వారి ఆగ్రహానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Neeraj Sahai
- రచయిత, సరోజ్ సింగ్, విష్ణునారాయణ్
- హోదా, బీబీసీ న్యూస్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రారంభమైన అభ్యర్థుల ఆందోళన హింసాత్మకంగా మారింది.
అభ్యర్థులు బిహార్‌లోని గయ రైల్వే స్టేషన్‌లో రెండు రైళ్లకు నిప్పు పెట్టారు. ఇందులో ఒక గూడ్సు రైలు, ఒక ప్యాసింజర్ రైలు ఉన్నాయి. దీంతోపాటు 20 బోగీల అద్దాలు పగిలిపోయాయి.
అభ్యర్థులను అక్కడ నుంచి పంపేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. నిరసన తెలుపుతున్న అభ్యర్థుల సంఖ్య దాదాపు 10 వేల వరకు ఉంటుందని సమాచారం.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఆగ్రహంతో ఉన్న విద్యార్థులను తప్పుదోవ పట్టించవద్దని గయా సీనియర్ ఎస్పీ ఆదిత్య కుమార్ విజ్ఞప్తి చేశారు.
"ఈ ఘటనపై రైల్వే శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకూడదు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నాము" అని ఆయన అన్నారు.
అభ్యర్థుల ఆందోళనపై రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని ఆయన అభ్యర్ధులకు హామీ ఇచ్చారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేయవద్దని నిరసనకారులకు సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఎందుకు ఆందోళన
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఆర్‌ఆర్‌బీ-ఎన్‌టీపీసీ) పరీక్ష ఫలితాల్లో అవినీతి జరిగిందంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రిక్రూట్‌మెంట్లలో అవకతవకలు జరిగాయని, అనర్హులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
తాజాగా వెలువడిన పరీక్షా ఫలితాలు, రిక్రూట్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై చాలామంది అభ్యర్ధులు ఆగ్రహంగా ఉన్నారు.
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంది.
కొన్ని నెలల కిందట ఆర్‌ఆర్‌బీ-ఎన్‌టీపీసీ విభాగంలో వివిధ పోస్టుల కోసం వేల సంఖ్యలో ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
మంగళవారం, పట్నా, భోజ్‌పూర్, నవాడా, సీతామర్హి, నలంద సహా బిహార్‌లోని పలు జిల్లాల్లో భారీ ప్రదర్శనలు,ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై వార్తలు వచ్చాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్, ప్రయాగ్‌రాజ్ స్టేషన్లలో విద్యార్థుల ఆందోళనలు జరిగాయి. కోపోద్రిక్తులైన విద్యార్థులను అదుపు చేయడానికి పోలీసులు బలప్రయోగం చేశారు. ప్రభుత్వ చర్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రైల్వే విచారణ కమిటీ ఏర్పాటు
నిరసనల్లో హింస చెలరేగడంతో రైల్వేశాఖ ఎన్‌టీపీసీ సహా మరికొన్ని టెస్టులను తాత్కాలికంగా నిలిపేసింది.
నిరసన తెలిపిన విద్యార్థుల ఫిర్యాదులపై విచారణకు రైల్వే కమిటీని ఏర్పాటు చేసింది.
ఆర్ఆర్‌బీ పరీక్షల ఫలితాలపై ఆందోళన సృష్టించి, హింసకు కారకులైన విద్యార్థులను వీడియో రికార్డింగ్ ద్వారా గుర్తిస్తామని, వారికి రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వబోమని రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
ఈ ఫలితాలపై బిహార్‌తోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. ఈ ప్రదర్శనల్లో నిరసనకారులు రైళ్లకు నిప్పుపెట్టడం. పట్టాలపై బైటాయంపు, ధర్నాలు చేశారు. ఈ ఆందోళన కారణంగా రైల్వే శాఖకు నష్టం జరిగిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేస్తున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫొటో సోర్స్, getty images / Hindustan Times
ఇప్పుడే వివాదం ఎందుకు ?
2022 జనవరి 14న ఆర్‌ఆర్‌బీ-ఎన్‌టీపీసీ పరీక్షా ఫలితాలు ప్రకటించారు. మరి 24వ తేదీ నుంచి ఎందుకు ఆందోళనలు మొదలయ్యాయి?
ఈ సందేహానికి సమాధానాలు కనుగొనేందుకు బీబీసీ ఇరువర్గాలతో మాట్లాడింది.
ఏ పరీక్షతో వివాదం?
దేశవ్యాప్తంగా రైల్వేలో ఉద్యోగుల రిక్రూట్‌మెంట్ కోసం 21 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ) ఉన్నాయి. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పరీక్షలను నిర్వహించడం వీటి పని.
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ విద్యార్థులు ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది రెండు పరీక్షల విషయంలో. రైల్వే మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్, అధికార ప్రతినిధి రాజీవ్ జైన్ ప్రకారం, ఈ రెండు పరీక్షల్లో ఒకటి- ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష, రెండోది గ్రూప్ సి, లెవెన్1 పరీక్ష.
ఆర్‌ఆర్‌బీ-ఎన్‌టీపీసీ అంటే 'రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ'. ఈ పరీక్షలో వివిధ పే-గ్రేడ్‌లలో దాదాపు 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.
2019లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఆలస్యమైంది.
డిసెంబర్ 2020, జూలై 2021 మధ్య, దేశవ్యాప్తంగా ఈ రిక్రూట్‌మెంట్ కోసం మొదటి దశ పరీక్ష నిర్వహించారు. ఫలితాలను 2022, జనవరి 14న ప్రకటించారు.
ఇప్పుడు దాని రెండో దశ పరీక్ష 2022 ఫిబ్రవరి 15న జరగాల్సి ఉంది. కానీ ఈ నిరసనల కారణంగా ఈ పరీక్ష తాత్కాలికంగా వాయిదా పడింది.

ఫొటో సోర్స్, Hindustan Times
గ్రూప్-సి, లెవెల్1
ఈ పరీక్షకు దాదాపు లక్ష ఖాళీలతో 2019 సంవత్సరంలోనే నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 1 కోటి 15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ, దీనికి మొదటి దశ పరీక్ష కూడా నిర్వహించలేదు.
2022 ఫిబ్రవరి 23న ఈ మొదటి దశ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ, అది కూడా వాయిదా పడింది.
తక్కువ పోస్టులకు ఎక్కువ దరఖాస్తులు రావడంతో తమకు సమస్యలు పెరిగాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఈ కేటగిరీ పరీక్షను రెండు దశల్లో నిర్వహించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
విద్యార్థుల అసంతృప్తి
బిహార్‌లో ఆందోళన నిర్వహిస్తున్న అభ్యర్ధులకు ఒక అసోసియేషన్ అంటూ ఏమీ లేదు. వారు కోచింగ్ తీసుకుంటున్న ఇనిస్టిట్యూట్ లు వారికి సహకరిస్తున్నాయి.
''ఈ రెండు పరీక్షల నిర్వహణలో అనేక లోపాలున్నాయి'' అని ఖాన్ అకాడెమీని నిర్వహిస్తున్న అధ్యాపకుడొకరు బీబీసీతో అన్నారు.
ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలో కొన్ని పోస్టులకు కనీస విద్యార్హత 12వ తరగతి కాగా కొన్నింటికి మాత్రం డిగ్రీ. ఈ పోస్టులను పే-గ్రేడ్ ప్రకారం వివిధ స్థాయిలుగా విభజించారు.
ఈ పరీక్ష ద్వారా, లెవల్ 2 నుండి లెవల్ 6 వరకు ఉన్న పోస్టులకు రిక్రూట్‌మెంట్లు జరగాలి. ఉదాహరణకు, లెవెల్ 2లోని ఒక పోస్ట్ జూనియర్ క్లర్క్. దీనికి కనీస విద్యార్హత 12వ తరగతి ఉత్తీర్ణత. స్టేషన్ మాస్టర్ పోస్ట్ లెవెల్ 6, దీనికి కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్.
కానీ, గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కూడా లెవల్ 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. దీనివల్ల 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని భావిస్తున్నారు. సాంకేతికంగా అలా చేయడాన్ని ఎవరూ నిషేధించలేరు.
ఇక్కడ రెండో సమస్య కూడా ఉంది. మొదటి దశ పరీక్షలో, మొత్తం ఖాళీలకంటే 20 రెట్లమందిని అంటే 1:20 నిష్పత్తిలో అభ్యర్ధులు పాసవుతారని బోర్డు తన అడ్వర్టయిజ్ మెంట్లో పేర్కొంది. అంటే, రెండో దశలో ఎక్కువమంది అభ్యర్ధులకు అవకాశం లభిస్తుంది.
రైల్వే వర్గాలు మరో విషయాన్ని కూడా చెప్పాయి. మొదటి దశలో ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించిన విద్యార్ధులు చాలామంది ఉంటారు. ఇలాంటి వారిని వేర్వేరు పోస్టులకు అర్హత సాధించిన ఒక అభ్యర్ధిగా కాకుండా, ఎన్నిపోస్టులకు అర్హత సాధిస్తే అంతమంది అభ్యర్ధులుగా లెక్కిస్తోంది.
ఆయా దరఖాస్తులకు వారికి ఇచ్చిన రోల్ నంబర్ ఆధారంగా భిన్నమైన అభ్యర్ధులుగా పరిగణిస్తోంది. ఉదాహరణకు, శ్యామ్ అనే వ్యక్తి నాలుగు పోస్టులకు అర్హత సాధిస్తే అతన్ని నలుగురు అభ్యర్ధుల కింద రైల్వే శాఖ గణిస్తోంది.
అయితే, ఇలాంటి వారిని ఒక అభ్యర్ధిగా మాత్రమే పరిగణించాలని విద్యార్థులు అంటున్నారు. 'వన్ క్యాండిడేట్-వన్ రిజల్ట్" అన్నది అభ్యర్ధుల నినాదాల్లో ఒకటి. ఇలా చేయడం వల్ల ఎక్కువమంది అభ్యర్ధులకు అవకాశం వస్తుందన్నది వారి వాదన.
ప్రస్తుతం రైల్వేశాఖ విడుదల చేసిన ఫలితాల్లో వాస్తవంగా 10 రెట్లు మాత్రమే ఫలితాలు ఉన్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు.
అయితే, విద్యార్థుల వాదనపై రైల్వేశాఖ కూడా పత్రికా ప్రకటన ద్వారా సమాధానమిచ్చింది.
''మొదటి దశలో అర్హత సాధించిన అభ్యర్థికే రెండో దశకు అవకాశం కల్పించాలని వారు వాదిస్తున్నారు. నాలుగు పోస్టులకు అర్హత సాధించినా, చివరికి ఒక పోస్ట్‌లో మాత్రమే ఉద్యోగం చేయగలడు. కాబట్టి ఫలితాలను ఇలా ప్రకటించడంలో ఇబ్బంది లేదు" అని అందులో పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
రెండో పరీక్షలోనూ సమస్యలే
ఇక గ్రూప్-సి, లెవల్-1 పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. దీనిపై కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇవి చాలా తక్కువ జీతం పోస్టులని కొందరు విద్యార్థులు పేర్కొంటున్నారు.
ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్ష నాలుగేళ్ల తర్వాత వచ్చింది. అందులోనూ దరఖాస్తుకు, పరీక్షకు మధ్య రెండేళ్లు గడిచిపోయాయి.ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే చెబితే విద్యార్థులకు సన్నద్ధమయ్యేందుకు సమయం దొరికేదని విద్యార్థులు అంటున్నారు.
విద్యార్థుల ఈ వాదనపై రైల్వేశాఖ స్పందిస్తూ ''ఈ పోస్టుల దరఖాస్తులో అనేక సాంకేతిక లోపాల కారణంగా ఈ అంశం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)కి చేరింది. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌లలో పెద్ద సంఖ్యలో సాంకేతికంగా తప్పుడు ఫొటోలు, సంతకాలను గుర్తించాం. దాదాపు ఐదున్నర లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి" అని పేర్కొంది.
క్యాట్ ఆర్డర్ తర్వాత, రైల్వేశాఖ అభ్యర్థులకు డిసెంబర్ 15, 2021 వరకు ఆన్‌లైన్ లింక్ ద్వారా అవకాశం కల్పించింది. ఆ తర్వాతనే దరఖాస్తుదారుల జాబితా ఖరారు చేసింది. ఇప్పుడు అభ్యర్ధుల సంఖ్య దాదాపు కోటి 15 లక్షలకు చేరింది.
అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పరీక్షను రెండు దశల్లో నిర్వహించడం తప్ప మరో మార్గం లేదని రైల్వేశాఖ చెబుతోంది.

ఫొటో సోర్స్, getty images/ Hindustan Times
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మాత్రమే ఎందుకు ఆందోళనలు?
నిజానికి ఈ పరీక్ష జాతీయ స్థాయిలో జరిగింది. అయితే, బిహార్-యూపీలలో రైల్వే ఉద్యోగాల క్రేజ్ ఎక్కువ. బహుశా ఈ రెండు రాష్ట్రాల్లో వ్యతిరేకత ఎక్కువ కావడానికి ఇదే కారణం కావచ్చు.
విద్యార్థుల ఆందోళనల కారణంగా ఇప్పుడు రెండు పరీక్షల తేదీలను పొడిగించి, సమస్యలను గుర్తించడానికి కమిటీని ఏర్పాటు చేశారు.
విద్యార్థులు తమ ఫిర్యాదులు, సూచనలను ఫిబ్రవరి 16 వరకు కమిటీ ముందు ఉంచవచ్చు.
ఇవి కూడా చదవండి:
- విజయనగరం: దక్షిణ భారతంలో చిట్టచివరి హిందూ సామ్రాజ్యం ఎలా పతనమైంది? తళ్లికోట యుద్ధంలో నలుగురు సుల్తానులు ఏకమై ఎలా ఓడించారు
- యుక్రెయిన్ సంక్షోభం: ‘యుద్ధానికి ముందు, ఇప్పుడు నా ఊరికి పోలికే లేదు’
- తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
- పద్మ అవార్డులు: మొగిలయ్య, గరికపాటిలకు పద్మశ్రీ.. ఎల్లా సుచిత్ర, ఎల్లా కృష్ణలకు పద్మ భూషణ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











