యుక్రెయిన్ సంక్షోభం: ‘యుద్ధానికి ముందు, ఇప్పుడు నా ఊరికి పోలికే లేదు’

ఫొటో సోర్స్, ALEXANDER NEMENOV/AFP
ప్రస్తుతం తూర్పు యుక్రెయిన్‌లోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల గురించిన సమాచారం అంతగా బయటికి రాదు. ఇప్పుడు రష్యా మిలిటరీ కదలికలతో వీటి గురించి చర్చ జరుగుతోంది.
2014లో రష్యా డొనెట్స్క్ నగరాన్ని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న సమయంలో అక్కడి నుంచి బయటకు వచ్చిన ఓ స్థానికుడి కథ ఇది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పేరును ఇక్కడ ప్రస్తావించడం లేదు.
యుక్రెయిన్ రాజధాని కీవ్, డొనెట్స్క్‌లోని సెంట్రల్ స్టేషన్ మధ్య గతంలో స్లీపర్ రైలు నడిచేది. కానీ, ఇప్పుడు బస్సులో ప్రయాణించాలి. దీనికి 27 గంటల సమయం పడుతుంది. దీనికన్నా యూరప్ నుంచి న్యూజీలాండ్ ప్రయాణం చాలా సుఖంగా ఉంటుంది.
యుక్రెయిన్ నుండి నేరుగా రష్యన్ మద్దతుగల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న భూభాగాలకు వెళ్లేందుకు నాకు అనుమతి లేదు. నేను రష్యా మీదుగా చాలా దూరం ప్రయాణించి రావాలి.
సాంకేతికంగా యుక్రెయిన్ పౌరులు ఈ మార్గంలో వెళ్లడం చట్టవిరుద్ధం. కాబట్టి మా మినీ బస్సు రష్యా సరిహద్దుకు చేరుకున్నప్పుడు, దగ్గర్లోని రష్యన్ పట్టణంలో పెళ్లికి వెళ్తున్నామని చెప్పండని మా బస్సు డ్రైవర్ సూచించాడు.
యుక్రెయిన్‌లోని తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతాలకు వెళ్లడానికి మేం మరొక వాహనానికి మారాల్సి వచ్చింది. దీని రిజిస్ట్రేషన్ ప్లేట్‌లను డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(డీఎన్‌ఆర్) అనే పేరుతో జారీ చేస్తారు. వీటికి మిగతా ప్రపంచం నుంచి గుర్తింపు లేదు.

ఫొటో సోర్స్, Getty Images
మేం సరిహద్దు దగ్గరికి వచ్చినప్పుడు నేను నా ఇంటర్నల్ యుక్రేనియన్ పాస్‌పోర్ట్‌తో బోర్డర్ దాటగలను. నేను ఇంతకు ముందే డొనెట్స్క్‌లో అడ్రస్‌తో రిజిస్టర్ చేసుకుని ఉన్నాను.
బోర్డర్ దగ్గర ఉన్న భద్రతా సిబ్బంది మా అందరి దగ్గరి నుంచి పాస్‌పోర్టులు తీసుకున్నారు. కాసేపటికి నాది మినహా మిగతా అందరికీ పాస్‌పోర్టులు తిరిగి ఇచ్చేశారు.
మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలంటూ నన్ను వ్యాన్ దిగమన్నారు. ఒక రూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఒక పాత కంప్యూటర్ ఉంది. నేను కంగారు పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను.
లెదర్ జాకెట్ వేసుకున్న ఓ వ్యక్తి నన్ను నిశితంగా గమనిస్తూ కూర్చోమని సీటు చూపించారు.
"నీ వయసెంత, ఎక్కడ పని చేస్తున్నావు, ఇక్కడికి తరచుగా వస్తుంటావా" అని అడిగారు. కాసేపటి నన్ను వెళ్లిపొమ్మన్నారు.
మేం సరిహద్దును దాటి, మా పాత ఊరుకు చేరుకోవడానికి ఇంకా 120 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఎలాగో మా ఊరు దగ్గరకు చేరుకున్నాను. కానీ, అది ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. మునుపటి డొనెట్స్క్‌లాగా లేదు.
ఇప్పటికి 10 సంవత్సరాల ముందు యుక్రెయిన్, పోలాండ్‌లలో జరిగిన యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్‌కు డొనెట్స్క్ ప్రధాన వేదిక. టోర్నమెంట్ కోసం ప్రధాన నగరాన్ని దాదాపు పునర్నిర్మించారు. కొత్తగా విమానాశ్రయం కట్టారు. రోడ్లు బాగు చేశారు. కొత్త కొత్త హోటళ్లు నిర్మించారు.

ఫొటో సోర్స్, Getty Images
యూరో 2012 సమయంలో నగరం అంతా ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్ అభిమానులతో నిండిపోయింది. ఇది అత్యంత సంతోషకరమైన యూరప్ నగరంలా కనిపించింది.
ఇప్పుడు 2022 ప్రారంభం నాటికి నగరం గుర్తించలేని విధంగా మారిపోయింది. యుద్ధం తాలూకు గాయాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి.
సిటీ సెంటర్‌లోని ఒక ప్రముఖ రష్యన్ భవనం తిరుగుబాటు ప్రభుత్వపు పన్నుల మంత్రిత్వ శాఖకు నిలయంగా మారింది. బిల్డింగ్ మంచి స్థితిలోనే ఉంది. చక్కని గార్డెన్లు, పూల తోటలు కనిపిస్తున్నాయి.
కానీ, సమీపంలోని అనేక షాపులు, కేఫ్‌లను మూసేశారు. ఖాళీగా ఉన్న ప్లేగ్రౌండ్ కలుపు మొక్కలతో నిండిపోయింది. ఆ దగ్గర్లోనే ఉన్న స్పోర్ట్స్ సెంటర్‌లోని అవుట్ డోర్ టెన్నిస్ కోర్టులు మరింత దారుణంగా ఉన్నాయి. అక్కడ మనిషి ఎత్తున పొదలు పెరిగాయి.
విశాలమైన వైట్ స్వాన్ షాపింగ్ సెంటర్ గతంలో రకరకాల షాపులతో సందడి చేసేది. బూట్ల నుంచి ఆభరణాల వరకు అన్ని రకాల షాప్‌లుండే ఆ భవనం ఇప్పుడు దెయ్యాల కొంపలా కనిపిస్తోంది.
అయితే, డొనెట్స్క్ మొత్తం ఇలానే ఉందని చెప్పలేం. సిటీ సెంటర్‌లోని మరొక భాగంలో అనేక రెస్టారెంట్లు, కేఫ్‌లలో కస్టమర్‌లు చాలామంది కనిపించారు. ఇంకొంచెం ముందుకు వెళిత ఈశాన్య ప్రాంతంలో అనేక ఇళ్లు, వీధులు కనిపిస్తాయి. కానీ, అన్ని ఇళ్లు బుల్లెట్ తగలడంతో స్వల్పంగా దెబ్బతిని కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సెప్టెంబర్ 2014లో డొనెట్స్క్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ జరిగిన పోరాటం కారణంగా ఈ ప్రాంతమంతా తీవ్రంగా దెబ్బతిన్నది. సిటీ సెంటర్‌కు దగ్గరగా ఉన్న కొన్ని భవనాలను బాగు చేశారు. కానీ, చాలా వరకు బలహీనంగా ఉన్నాయి.
యుద్ధానికి ముందున్నట్లుగానే పగటి పూట డొనెట్స్క్ వీధులు చాలా బిజీగా కనిపిస్తాయి. కానీ, రాత్రి కాగానే దాదాపు ఎవరూ కనిపించరు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించే కర్ఫ్యూకి ముందే అందరూ ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తారు.
సిటీ సెంటర్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో డొనెట్స్క్ఆర్ట్స్ సెంటర్ ఉండేది. దానిని ఇప్పుడు జైలుగా మార్చారు. యుద్ధానికి ముందు ఇక్కడ ఉన్న బెనెటన్, నైక్, జారా, అడిడాస్ వంటి అంతర్జాతీయ హై స్ట్రీట్ షాపులన్నీ ఇప్పుడు మాయమయ్యాయి.
దుస్తులు, బూట్లు, గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి, చాలామంది స్థానికులు రష్యా సరిహద్దును దాటవలసి ఉంటుంది. అంత స్థోమత లేని వారు చిన్న మార్కెట్లు, దుకాణాలకు వెళతారు. అక్కడ దొరికే సరుకు నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటుంది.
సూపర్ మార్కెట్ షెల్ఫులు ఆల్కహాల్, స్నాక్స్‌తో నిండి ఉన్నాయి. మంచి క్వాలిటీ సరుకు కావాలంటే ధర అధికంగా ఉంటుంది.
నేను డొనెట్స్క్ నుండి బయలుదేరడానికి ముందు రోజు సాయంత్రం నా స్కూల్ మేట్‌ను కలిశాను. మేమిద్దరం లెనిన్ స్క్వేర్‌లోని ఒక కేఫ్‌కి వెళ్లాం. 2014లో మెక్‌డొనాల్డ్స్ డొనెట్స్క్‌లోని తన అవుట్‌లెట్‌లను మూసేసింది. వాటి స్థానంలో డాన్‌మాక్ అనే కొత్త పేరుతో మూడు కొత్త షాపులు తెరుచుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నేను, నా ఫ్రెండ్ బర్గర్‌లు, ఫ్రై, కాఫీ ఆర్డర్ చేశాను. టేస్ట్ ఏమీ బాగలేదని నేను అన్నాను.
"ఇక్కడ తిండి అంతా ఇలాగే తయారైంది" అన్నాడు నా మిత్రుడు. "మనం తిన్నవన్నీ చాలా తక్కువ క్వాలిటీ ఫుడ్. ఇంతకు ముందు మంచి ఫాస్ట్‌ఫుడ్ దొరికేది. ఇప్పుడంతా నాణ్యత లేని సరుకుతో నింపేశారు" అన్నాడు.
"మేం నరకంలో ఉన్నాం. జనం ఎలాగో బతుకుతున్నారు. మా వీధుల్లోని నినాదాలు మాత్రం ఉజ్వల భవిష్యత్తును ఇస్తామని ప్రగల్బాలు పలుకుతుంటాయి" అన్నాడు నా మిత్రుడు.
మళ్లీ ఈ ప్రాంతం యుక్రెయిన్‌లో కలుస్తుందా అని నేను నా మిత్రుడిని అడిగాను.
ఇక్కడ చాలామంది స్థానికులకు రష్యన్ పాస్‌పోర్టులున్నాయని, 2014 నుంచి అనేక కొత్త తరాలు పుట్టాయని, నా ఫ్రెండ్ అన్నాడు.
ఇక్కడి ప్రభుత్వం కింద పని చేస్తున్నవారెవరూ తిరిగి యుక్రెయిన్‌లో కలవాలని కోరుకోవడం లేదని, ఏళ్లు గడిచే కొద్దీ ఇది మళ్లీ యుక్రెయిన్‌లో కలిసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని నా ఫ్రెండ్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా-కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయుల మృతి: గుజరాత్‌లోని ఈ గ్రామ ప్రజలు ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు?
- జుగాడ్ జీప్‌ను ఇచ్చి బొలెరో తీసుకున్న దత్తాత్రేయ.. హామీ నెరవేర్చుకున్న ఆనంద్ మహీంద్ర
- గుడివాడ కాసినో... వీడియోల్లో ఏముంది
- 19ఏళ్ల అమ్మాయి ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టివచ్చింది
- అయోధ్యలో 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం: 'అయ్యా, మమ్మల్నందరినీ ఇక్కడే పాతిపెట్టి, మా భూమిని తీసుకోండి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












