యుక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు: ‘ప్రాణాంతక సహాయం’ పంపించిన అమెరికా

ఫొటో సోర్స్, US Embassy Kyiv
యుక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. సరిహద్దుల్లో రష్యా భారీగా సైనిక దళాలను మొహరించింది. పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో యుక్రెయిన్‌కు అమెరికా 90 టన్నుల 'ప్రాణాంతక సహాయం' అందించింది.
యుక్రెయిన్‌కు అమెరికా సైన్యం ఇవ్వాలని ఆమోదించిన సహాయంలో ఇదే మొదటి షిప్‌మెంట్. ముందుండి ఎదుర్కొనే సైనికులకు అవసరమైన పేలుడు సామాగ్రి కూడా ఇందులో ఉంది.
ఈ మధ్యనే అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ యుక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌ను సందర్శించారు. యుక్రెయిన్‌ను రష్యా ఆక్రమించుకోవాలని చూస్తే చాలా గట్టి ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అయితే, రష్యా మాత్రం యుక్రెయిన్‌పై దాడి చేయాలని కానీ, ఆక్రమించుకోవాలని కానీ ప్రణాళికలేవీ లేవని అంటోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత డిసెంబర్‌లో 200 మిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.1488 కోట్ల) రక్షణ సహాయ ప్యాకేజీకి ఆమోదం తెలిపారు.
స్వీయ రక్షణ కోసం యుక్రెయిన్‌కు ఉన్న సార్వభౌమ హక్కుకు అమెరికా ఎంతగా కట్టుబడి ఉందో ఈ షిప్‌మెంట్ చాటిచెబుతోందని కీవ్‌లోని అమెరికా ఎంబసీ తెలిపింది.
''రష్యా రెచ్చగొట్టే ధోరణి వ్యతిరేకంగా యుక్రెయిన్ సైనిక దళాలు తమ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు అమెరికా ఇలాంటి మద్దతు, సహాయం అందిస్తూనే ఉంటుంది'' అని ఫేస్‌బుక్‌లో పేర్కొంది.
సహాయాన్ని పంపించినందుకుగాను అమెరికాకు యుక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ కృతజ్ఞతలు తెలిపారు.
యుక్రెయిన్‌లో ఆందోళనలు మరింత పెరగకుండా చూసేందుకుగాను రష్యా, అమెరికా విదేశాంగ శాఖ మంత్రులు చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రాణాంతక సహాయం యుక్రెయిన్ చేరింది.
2014లో యుక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను రష్యా తన సొంతం చేసుకుంది. తదనంతర కాలంలో సరిహద్దు వద్ద లక్ష మంది సైనికులను రష్యా మొహరించడంతో.. ఈ సరికొత్త వివాదం యూరప్‌లో నిజమైన ప్రమాదాన్ని కొనితెస్తుందని సైనిక కూటమి నాటో హెచ్చరించింది.
అయితే, ఎలాంటి ఆక్రమణ ప్రణాళికలు లేవని రష్యా చెబుతూనే ఉంది.
కానీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం నాటోలో యుక్రెయిన్ చేరకూడదని డిమాండ్ చేస్తున్నారు.
సైనిక విన్యాసాలను నాటో రద్దు చేసుకోవాలని, ఈశాన్య యూరప్‌కు ఆయుధాలు పంపడాన్ని ఆపేయాలని పుతిన్ కోరుతున్నారు. ఇలా ఆయుధాలను పంపడం రష్యా భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని ఆయన చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్యాక్టీరియాలు మందులకు లొంగట్లేదు.. చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకూ యాంటిబయోటిక్స్ వాడటమే కారణమా?
- వృద్ధుడి మృతదేహంతో పోస్టాఫీసుకు వచ్చారు.. పెన్షన్ ఇవ్వమని అడిగారు.. ఆ తర్వాత..
- 10 కోట్ల మంది ఆకలి తీర్చే ఆఫ్రికా అరటి చెట్టు.. దీని పండ్లు మాత్రం తినడానికి పనికిరావు
- భర్తతో సెక్స్‌కు నో చెప్పే హక్కు భార్యకు లేదా? మ్యారిటల్ రేప్‌పై ఎందుకు చర్చ జరుగుతోంది
- ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు ఏంటి... ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














