యుక్రెయిన్-రష్యా : నాటో నౌకల కోసం యుక్రెయిన్ విజ్ఞప్తి

ఫొటో సోర్స్, Getty Images
క్రిమియా తీరంలో ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో తన నావికా బలగాలను పంపాలని యుక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో విజ్ఞప్తి చేశారు.
వాటి వల్ల యుక్రెయిన్‌కు భద్రత ఉంటుందని జర్మనీకి చెందిన బిల్డ్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశాభావం వ్యక్తం చేశారు.
కెర్చ్ జలసంధి గుండా నల్ల సముద్రం నుంచి అజోవ్ సముద్రంలోకి ప్రవేశిస్తున్న మూడు యుక్రెయిన్ బోట్లపై ఆదివారం రష్యా కాల్పులు జరిపి, వాటిలోని సిబ్బందిని అదుపులోకి తీసుకుంది.
రష్యా-యుక్రెయిన్‌ల మధ్య వివాదం నేపథ్యంలో పోరోషెంకో యుక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలలో 30 రోజుల పాటు సైనికపాలన విధించారు.
అయితే 2019లో జరగనున్న యుక్రెయిన్ ఎన్నికల్లో తన రేటింగ్‌లను పెంచుకోవడానికే పోరోషెంకో ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడుతున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, AFP
పోరోషెంకో ఏం చెప్పారు?
పుతిన్ మొత్తం అజోవ్ సముద్రాన్నే ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బిల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోరోషెంకో ఆరోపించారు.
''మాకు అత్యంత సన్నిహిత దేశాలలో జర్మనీ ఒకటి. నాటో సభ్యదేశాలు తమ నౌకలను అజోవ్‌కు పంపి.. యుక్రెయిన్‌కు సహాయం చేస్తాయని, మా దేశానికి భద్రత కల్పిస్తాయని ఆశిస్తున్నా'' అన్నారు.
''మొదట క్రిమియా, తర్వాత తూర్పు యుక్రెయిన్, ఇప్పుడు మొత్తం అజోవ్ సముద్రం. పుతిన్‌ను ఇప్పుడు నిలవరించకుంటే జరగబోయే పరిణామాల గురించి జర్మనీ ఆలోచించాలి'' అని పోరోషెంకో అన్నారు.
సోమవారం నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ యుక్రెయిన్ నౌకలను, నావికులను విడుదల చేయాలని రష్యాకు విజ్ఞప్తి చేశారు. మాస్కో తన చర్యలపై తలెత్తబోయే పరిణామాల గురించి ఆలోచించాలని హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రిమియా తీరంలో ఏం జరిగింది?
క్రిమియా తీరంలో మూడు యుక్రెయిన్ గన్ బోట్లపై రష్యాకు చెందిన సరిహద్దు గస్తీ బలగాలు జరిపిన కాల్పులలో కనీసం ముగ్గురు యుక్రెయిన్ నావికులు గాయపడ్డారు.
యుక్రెయిన్ బోట్లు అజోవ్ సముద్రం గుండా యుక్రెయిన్ నగరం మారియుపోల్‌కు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
అయితే యుక్రెయిన్ తన సభ్యదేశం కానప్పటికీ ఆ దేశానికి నాటో పూర్తి మద్దతు తెలిపింది.
పుతిన్ ఏమన్నారు?
''ఇది కచ్చితంగా రెచ్చగొట్టే చర్యే. 2019 మార్చిలో జరగబోయే ఎన్నికల్లో నెగ్గేందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు'' అని పుతిన్ ఆరోపించారు.
పోరోషెంకో రేటింగ్స్ చాలా దారుణంగా పడిపోయాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఆయనకు ఓటు వేస్తామని తెలుపగా, 50 శాతం మంది ఓటు వేయబోమన్నారు.
ఒక చిన్న సంఘటన ఆధారంగా సరిహద్దుల్లో సైనిక పాలన విధించడాన్ని పుతిన్ తప్పుబట్టారు. యుక్రెయిన్ బోట్లు తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాయి కాబట్టి, రష్యా వాటిని అదుపులోనికి తీసుకోవడాన్ని సమర్థించుకున్నారు.

ఇతర ప్రతిస్పందనలు ఏమిటి?
యుక్రెయిన్ తన సభ్యదేశం కానప్పటికీ ఆ దేశానికి నాటో పూర్తి మద్దతు తెలిపింది.
మరికొన్ని పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు కూడా యుక్రెయిన్ ప్రబుత్వానికి మద్దతు తెలిపాయి.
బుధవారం రష్యా చర్యలను యూరోపియన్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. యుక్రెయిన్‌పై బలప్రదర్శనకు దిగడాన్ని తప్పుబట్టింది. యుక్రెయిన్ బోట్లను విడుదల చేసి, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరింది.
రష్యాపై కొత్త ఆంక్షలు విధించాలని పోలెండ్ కోరగా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని జర్మనీ, ఫ్రాన్స్ అభిప్రాయపడ్డాయి.
ఈ శుక్ర, శనివారాలలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా పుతిన్‌తో ఏర్పాటైన సమావేశానికి తాను హాజరుకాబోనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








