రోబో 2.0: ముప్పై ఏళ్లుగా తగ్గని రజినీకాంత్ మేజిక్

ఫొటో సోర్స్, Facebook/2.o
- రచయిత, శివకుమార్ ఉళగనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణాది సూపర్ స్టార్‌గా పేరున్న రజినీకాంత్ నటించిన 2.0 చిత్రం గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దాదాపు 10వేల స్క్రీన్లపై ఈ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.
కొంత కాలంగా చర్చంతా ఈ భారీ బడ్జెట్ చిత్రం చుట్టూనే నడుస్తోంది. దానికి ఓ రకంగా రజినీకాంతే కారణం. ఒకటీ రెండూ కాదు, 30ఏళ్లుగా దక్షిణాదిలో ఆయన అనుభవిస్తున్న స్టార్‌డమ్ కారణంగా, రజినీ సినిమా విడుదలైన ప్రతిసారీ అంచనాలు ఎక్కువగానే ఉంటాయి.
భారత్‌తో పాటు జపాన్, అమెరికా లాంటి దేశాల్లోనూ ఆయనకు భారీగా అభిమానులున్నారు. చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా ఆయన సినిమాలను ఇష్టపడతారు.
చాలామంది యువ హీరోలకు సైతం సాధ్యంకాని ఆ మేజిక్‌ను రజినీ ఇన్నేళ్లుగా ఎలా సృష్టిస్తున్నారు?
‘1980, 90ల్లో యువతకు సినిమాలు, క్రీడలు తప్ప వేరే వినోద మార్గాలు ఉండేవి కాదు. అలాంటి సమయంలో రజినీకాంత్ భారతీయ సినిమాల్లో ఓ సూపర్ హీరోలా ప్రత్యక్షమయ్యారు’ అంటారు సారా సుబ్రమణియం అనే సినీ విమర్శకురాలు.
‘రజినీకాంత్ సినిమా విడుదల రోజున మొదటి ఆట చూడటమంటే చాలా గొప్ప విషయంగా భావించేవారు. ఆ రోజు థియేటర్ బయట కనిపించే సందడిని మాటల్లో చెప్పలేం’ అంటారామె.
‘ఆయన డైలాగులు చెప్పే విధానం ఇతరులకంటే చాలా భిన్నంగా ఉంటుంది. అదే ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావం చూపింది. దానికితోడు డైలాగుల్లోని పంచ్‌ల కారణంగా అవి ఎక్కువ కాలంపాటు ప్రేక్షకులకు గుర్తుండిపోయేవి. ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన స్టైల్, బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు భాషతో సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల్లోనూ తనదైన ముద్ర వేశారు’ అని రజినీకాంత్ ప్రభావం పెరగడానికి వెనక కారణాలను చెబుతారు సారా.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి కొన్ని సినిమాల్లో రజినీ చేసే ఫైట్లు నమ్మశక్యంగా ఉండవు. అయినా కూడా ప్రేక్షకులు వాటిని ఇష్టపడతారు. దానికి కారణం ఆ ఫైట్లు చేసింది రజినీకాంత్ కావడం... అని సారా వివరిస్తారు. అందుకే ఆయన్ను హీరోలకే హీరో అంటారని ఆమె చెబుతారు.
‘చాలామంది తెలుగు, బాలీవుడ్ హీరోలు కూడా రజినీకాంత్ తమ అభిమాన హీరో అని చెబుతారు. షారుక్ ఖాన్ తన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో లుంగీ డాన్స్ పాటను రజినీకాంత్‌కు అంకితమిచ్చారు. ఇది కేవలం వ్యాపారం కోసం చేసింది మాత్రమే కాదు. ఆయనకు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ కూడా కారణం.
దేశవ్యాప్తంగా రజినీకాంత్‌కు చాలామంది అభిమానులు ఉన్నప్పటికీ, రాజకీయాల్లోకి ప్రవేశించి, కొన్ని వ్యాఖ్యలు చేశాక కూడా ఆయనకు అదే స్థాయిలో ఆదరణ కొనసాగుతుందా అనే సందేహాలు ఉన్నాయి. ఆయనను చాలా ఆదరించే అభిమానులు కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను అంగీకరిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకం.
2.O సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఎలా ఉన్నా, తమిళనాడులో మాత్రం ఇతర రజినీ సినిమాలకు ఉన్నంత స్థాయిలో అక్కడ ప్రీ బుకింగ్ జరగలేదు. సోషల్ మీడియాలో కూడా ఆ సినిమాపై ఎక్కువ చర్చ జరగట్లేదు’ అని సారా వివరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరాడంబరత ఆయన ప్రత్యేకత: అశ్వినీదత్
తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రజినీకాంత్‌కు మంచి ఆదరణ ఉంది. తెలుగులో ఇతర హీరోలు చాలామంది ఉన్నప్పటికీ రజినీకాంత్‌కు ఉన్న పాపులారిటీ వేరు.
‘ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ అందరికంటే చాలా భిన్నంగా ఉంటాయి. అదే ఇతర హీరోల నుంచి ఆయన్ను వేరు చేస్తుంది. అన్ని వయసుల ప్రేక్షకులకు దగ్గరైన నటుడు రజినీకాంత్’ అంటారు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్. రజినీకాంత్‌తో ‘కథానాయకుడు’ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ ఆయనే నిర్మించారు.
సినిమాల్లోనే కాదు, షూటింగ్ స్పాట్‌లోనూ ఆయన వ్యవహార శైలి అందరికీ నచ్చుతుందంటారు అశ్వినీదత్. వెండితెర మీద ఆయన ప్రతి కదలికా ఒక మేజిక్‌లా ఉంటుందంటారాయన.
‘నటనకు తోడు నిరాడంబరత కూడా ఆయనకు ఆభరణం. అందుకే అన్ని చోట్లా ఆయన అభిమానులను పొందగలిగారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు దక్కిన ఆదరణకు అదే కారణం’ అంటారు అశ్వినీదత్.

ఫొటో సోర్స్, Getty Images
ఒకే ఒక్కడు.. రజినీ
‘చాలామందిలానే నేనూ రజినీకాంత్ సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో సినిమా చేయాలన్నది నా కల. ఇప్పుడది నిజమైంది’ అంటారు కార్తీక్ సుబ్బరాజ్. రజినీకాంత్ తదుపరి చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.
కార్తీక్ తీసిన ‘పిజ్జా’ సినిమా తెలుగులోనూ ఆదరణ పొందింది. ‘దేశంలోని పెద్ద నటుల్లో ఆయన ఒకరు. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన అనుసరిస్తున్న నటనా శైలి, డైలాగ్ డెలివరీ కారణంగానే ఆయన క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతోంది. నటనలో ఆయన వేగాన్ని ఎవరూ అందుకోలేరు. ఆ స్థాయిలో ఆదరణ పొందే నటులు ఇప్పట్లో రాకపోవచ్చు. అంత పేరున్నప్పటికీ ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. అదే రజినీ ప్రత్యేకత’ అంటారు కార్తీక్.
రజినీకి దేశంలో చాలా పేరున్న మాట వాస్తవమేనని, కానీ మలేసియా లాంటి దేశాల్లో ఉన్న తమిళుల కారణంగా అక్కడ ఆయనకు ఆదరణ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుందని రామసామి అనే సినీ విమర్శకుడు చెబుతారు.
‘ముత్తు’ సినిమా ద్వారా జపాన్‌లో రజినీకాంత్‌కు దక్కిన ఆదరణ గురించి ప్రశ్నిస్తే... ఆ సినిమాలో రజినీ పాత్ర గతంలో ఆసియా ప్రాంతాన్ని పాలించిన ఓ రాజుకు దగ్గరగా ఉంటుందని, అందుకే జపాన్ వాసులు దాన్ని ఇష్టపడి ఉండొచ్చని ఆయన అంటారు.
‘సినిమాల్లో రజినీకాంత్ ఓ ప్రణాళిక ప్రకారం నటిస్తారు. శరీర కదలికలపై మంచి పట్టున్న ఆయన, ఆ కదలికల ద్వారానే ఓ కొత్త స్టయిల్‌ను తీసుకొచ్చారు. అభిమానులు రజినీకాంత్‌లో ఎక్కువ ఇష్టపడేది ఆ స్టైల్‌నే. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన నటిస్తారు.
అందుకే పిల్లలు కూడా దాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. అలా ఓ ప్రత్యేక రజినీకాంత్ స్టైల్ పుట్టుకొచ్చింది’ అంటారు రామసామి.
‘రాజకీయ ప్రసంగాల్లో కూడా చాలా పకడ్బందీగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఆ శైలి ఓ రకంగా ఇప్పుడు ఆయనలో భాగమైపోయింది. ఆయన సినిమాల్లో డైలాగులను కూడా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగానే రాస్తారు’ అని రామసామి వివరించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









