పాశ్చాత్య దేశాలతో యుద్ధానికి రష్యా, చైనా రిహార్సల్స్ .. భవిష్యత్ యుద్ధాలు, ఆయుధాలు ఎలా ఉంటాయి?

ఆధునిక టెక్నాలజీని డెవలప్ చేయడంలో చైనా, రష్యాలు రేసులో ముందున్నాయి.

ఫొటో సోర్స్, GIANCARLO CASEM/US AIR FORCE

ఫొటో క్యాప్షన్, ఆధునిక టెక్నాలజీని డెవలప్ చేయడంలో చైనా, రష్యాలు రేసులో ముందున్నాయి
    • రచయిత, ఫ్రాంక్ గార్డెనర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2021 సంవత్సరంలో బ్రిటిష్ రక్షణ, భద్రతా విధానాలలో అనేక మార్పులు కనిపించాయి. డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, సైబర్ రంగాలకు బడ్జెట్‌ను పెంచారు. సంప్రదాయ ఆయుధాలు, సైనికుల మీద వెచ్చించే మొత్తాన్ని తగ్గించారు.

ఒక పక్క రష్యా ఉక్రెయిన్ బోర్డర్‌లో అలజడి రేపుతోంది. మరోవైపు సభ్యదేశాల నుంచి నాటో దళాలను ఉపసంహరించుకోవాలని కూడా ఆ దేశం కోరుతోంది.

ఇటు చైనా తైవాన్‌ను ఆక్రమించేందుకు, అవసరమైతే బలప్రయోగం చేసేందుకు సిద్ధంగా ఉంది.

దేశాల మధ్య చిన్నచిన్న ఘర్షణలు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇథియోపియా సివిల్ వార్, ఉక్రెయిన్ వేర్పాటువాద ఉద్యమాల కారణంగా 2014 నుంచి ఇప్పటి వరకు 14 వేలమంది మరణించారు.

సిరియాలో ఇస్లామిట్ స్టేట్ సృష్టిస్తున్న అలజడి కొన్ని ఆఫ్రికన్ దేశాల వరకు పాకింది.

మరి రాబోయే రోజుల్లో గొప్ప యుద్ధమంటూ వస్తే అది ఎలా ఉంటుంది? పశ్చిమ దేశాలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి ?

ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధతంత్రం ఇప్పటికే సిద్ధమైపోయింది. రష్యా, చైనాలు పశ్చిమ దేశాలతో యుద్ధమంటూ వస్తే ఏం చేయాలో ఇప్పటికే రిహార్సల్స్ కూడా ప్రారంభించాయి.

నవంబర్ 16న, రష్యా స్పేస్ మిసైల్ టెస్ట్ నిర్వహించి, సొంత ఉపగ్రహాలలో ఒక దానిని ప్రయోగాత్మకంగా పేల్చేసింది.

ఈ సంవత్సరంలోనే చైనా తన అధునాతన హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఇవి ధ్వని కంటే చాలా రెట్ల వేగంతో ప్రయాణించగలవు.

ప్రమాదకర సైబర్ దాడులు, ఆయుధాలను అడ్డుకునే టెక్నాలజీ నిత్యం ఏదో ఒకచోట వినియోగిస్తూనే ఉండటంతో, యుద్ధానికి ముందు వాతావరణం కనిపిస్తోంది.

దీనినే"సబ్-థ్రెషోల్డ్ వార్‌ఫేర్" అంటున్నారు.

సంప్రదాయ యుద్ధరీతులకు భిన్నంగా సైబర్ యుద్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, J.M. EDDINS JR/US AIR FORCE

ఫొటో క్యాప్షన్, సంప్రదాయ యుద్ధరీతులకు భిన్నంగా సైబర్ యుద్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

దూసుకుపోతున్న చైనా, రష్యా

మధ్యప్రాచ్యం పై గత రెండు దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు దృష్టి పెట్టడం ప్రత్యర్ధులు సైనిక పరంగా బలోపేతం కావడానికి దారి తీసిందని మిషెలే ఫ్లోర్నోయ్ అన్నారు. క్లింటన్, ఒబామాలు అధ్యక్షులుగా ఉన్న కాలంలో పెంటగాన్ పాలసీ చీఫ్‌గా ఫ్లోర్నోయ్ పని చేశారు.

''ఈ ఇరవైయేళ్ల కాలంలో అమెరికా, బ్రిటన్‌, వాటి మిత్రదేశాలన్నీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మధ్యప్రాచ్యంలో పోరాటం సాగించాయి. కానీ, ఇప్పుడు విపరీతమైన పవర్ కాంపిటిషన్ ఏర్పడింది'' అన్నారామె.

ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటెగ్రేటెడ్ రివ్యూను గుర్తు చేస్తూ, ''మేం మిడిల్ ఈస్ట్ బోర్డర్ మీద దృష్టి పెట్టాం. కానీ, ఆ దేశాలు మాత్రం కొత్త సాంకేతికను డెవలప్ చేయడానికి భారీగా నిధులు కేటాయించాయి'' అన్నారామె.

ఆ రెండు దేశాలు అంటే చైనా, రష్యాలే. బ్రిటన్ విడుదల చేసిన నివేదిక, పశ్చిమ దేశాలకు చైనా,రష్యాలు అసలైన పెనుముప్పు అని పేర్కొంది.

ఈ దేశాల చర్యల్లో ఎక్కువ భాగం సైబర్ కార్యకలాపాలే ఉన్నాయి. పాశ్చాత్య వ్యవస్థలను దెబ్బతీయడం, ఎన్నికలను ప్రభావితం చేయడం, సున్నితమైన డేటాను దొంగిలించడం వంటి దాడులపై ఈ రెండు దేశాలు దృష్టిపెట్టాయి.

అయితే, ఉక్రెయిన్‌ విషయంలో రష్యాతో, తైవాన్ విషయంలో చైనాతో పశ్చిమదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే ఏమవుతుంది? అది ఎటువైపు దారి తీస్తుంది?

''ఇదంతా సమాచారం మీద ఆధారపడే వేగవంతమైన వాతావరణంలో జరుగుతుందని నేను భావిస్తున్నాను'' అన్నారు మియా నౌవెన్స్. ఆమె ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో రీసెర్చర్‌గా పని చేస్తున్నారు.

చైనా తన మిలిటరీ అవసరాల కోసం డేటాను ఎలా వాడుకుంటుంది అన్నదానిపై ఆమె పరిశోధన చేస్తున్నారు.

''స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ పేరుతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా ఒక డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. ఇది స్పేస్, సైబర్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ మీద పని చేస్తుంది'' అని ఆమె వివరించారు.

అంటే ఏంటి ? శత్రువుల మధ్య సైబర్ దాడులు జరుగుతాయి. ఉపగ్రహాల నుంచి కమ్యూనికేషన్‌ను దెబ్బకొట్టడం నుంచి, సముద్ర గర్భంలో కేబుళ్లను కట్ చేయడం వరకు ఇందులో ఏదైనా ఉండొచ్చు.

''ఇదెలా ఉంటుందంటే ఇద్దరు వ్యక్తులు ఫోన్‌లు ఉపయోగిస్తుంటారు. కానీ, హఠాత్తుగా అవి పని చేయడం మానేస్తాయి. బలీయమైన దేశాలు సైబర్ సామర్ధ్యాలను దెబ్బతీయడం, ఉపగ్రహాలను ధ్వంసం చేయడంలాంటి అంశాలపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నాయి'' అని ఫ్రాంజ్ స్టెఫాన్ గాడి వివరించారు. ఆయన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో ఫ్యూచర్ వార్‌ఫేర్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నారు.

అనూహ్యంగా జరిగే దాడులు భారీ నష్టాన్ని మిగుల్చుతాయి. ఎందుకంటే శాటిలైట్‌లు ధ్వంసమైతే, శత్రువుల కదలికల మీద ఎలాంటి సమాచారం ఉండదు. ఒక్కసారిగా శత్రువు మీద పడతాడు. ఇలాంటి వాటిని తట్టుకోవడం కష్టం.

ధ్వనివేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో వెళ్లే మిసైళ్లు సిద్ధంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధ్వనివేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో వెళ్లే మిసైళ్లు సిద్ధంగా ఉన్నాయి

హైపర్ సోనిక్ క్షిపణులు

భవిష్యత్ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్న ఒక అంశం కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI). ఇది కమాండర్ల డెసిషన్లను, రెస్పాన్స్‌ను వేగవంతం చేస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అమెరికా కాస్త ముందుంది. అయితే, పశ్చిమదేశాలకు బలం ఉన్నచోట తన పరిమాణంతో చైనా వాటిని ఎదుర్కోగలదని మిషెలే ఫ్లోర్నోయ్ అభిప్రాయపడ్డారు.

ఇక పశ్చిమదేశాలు రష్యా, చైనాలకు భయపడాల్సిన, వెనకబడిన మరో కీలకమైన అంశం హైపర్ సోనిక్ మిసైల్. ఇవి ధ్వని వేగంకన్నా ఐదు నుంచి 27 రెట్లు వేగంగా ప్రయాణించగలవు. సాధారణ వార్‌హెడ్లు లేదా న్యూక్లియర్ వార్‌హెడ్లను మోసుకుపోగలవు.

రష్యా ఇటీవల జిర్కాన్ హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించింది. ఇది ప్రపంచంలో ఏ మూలనైనా దాడి చేయగలదు.

వీడియో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ మధ్య వివాదమేంటి.. అమెరికా ఎందుకు యుక్రెయిన్ పక్షం వహిస్తోంది
చైనా తయారీ డాంగ్ ఫెంగ్ మిసైల్ ప్రదర్శన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా తయారీ డాంగ్ ఫెంగ్ మిసైల్ ప్రదర్శన

వెనకబడ్డ అమెరికా

చైనా 2019లో డాంగ్ ఫెంగ్ 17 అనే హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ)ను విడుదల చేసింది. అది ఆకాశంలో అత్యంత వేగంతో దూసుకెళ్లగలదు. శత్రు దేశాలు దీనిని గుర్తించి వెంటాడటం కూడా కష్టమే.

చైనా, రష్యాల దూకుడు భిన్నంగా, అమెరికా ఇటీవలి కాలంలో ఎలాంటి గొప్ప ఆవిష్కరణలను చేపట్టలేకపోయింది. ఇప్పుడు చైనా తైవాన్ గొడవ ముదిరి యుద్ధం వస్తే, మధ్యలో దూరేందుకు అమెరికా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది.

ప్రస్తుతం 2022 ఆరంభం నాటికి ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా బలగాలు తమ శక్తులను మోహరించి ఉంచాయి. ఇందులో సైబర్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌తోపాటు ట్యాంకులు, సాయుధ వాహనాలు, సైనిక బలగాలు కూడ ఉన్నాయి. రష్యా ఒకవేళ బాల్టిక్ రాష్ట్రాలను తిరిగి ఆక్రమించుకోవాలనుకుంటే ఇదే ఆయుధాలును, యుద్ధతంత్రాన్ని ఉపయోగించవచ్చు.

అమెరికా తయారీ హైపర్ సోనిక్ మిసైల్ AGM-183A

ఫొటో సోర్స్, GIANCARLO CASEM/US AIR FORCE

ఫొటో క్యాప్షన్, అమెరికా తయారీ హైపర్ సోనిక్ మిసైల్ AGM-183A

భవిష్యత్తులో ఏం జరగనుంది?

బ్రిటన్ కూడా సంప్రదాయ యుద్ధతంత్రాలకు భిన్నంగా అత్యాధునిక విధానాలకు మారాలని నిర్ణయించుకుంది. కానీ, ఇదంతా అమల్లోకి రావడానిక కనీసం 20 ఏళ్లు పడుతుంది. ఇది చాలా పెద్ద గ్యాప్ అని ఫ్రాంజ్ స్టెఫాన్ గాడీ అభిప్రాయపడ్డారు.

''రాబోయే ఐదు, పదేళ్లలో పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో ఆ యుద్ధతంత్రాన్ని అందిపుచ్చుకోవడం కష్టం'' అన్నారాయన.

అయితే, సమయం తక్కువ ఉన్నప్పటికీ మిత్రదేశాలు పరస్పర సహకారంలో ఈ వెనకబాటును సరిదిద్దుకోవచ్చని మిషెలే ఫ్లోర్నోయ్ అభిప్రాయపడ్డారు.

''భవిష్యత్తు కోసం కలిసి పని చేయడం, సరైన విధానాలను అమలు చేయడం ద్వారా ఈ పవర్ రేసులో ముందుకు దూసుకుపోవచ్చు'' అన్నారామె.

వీడియో క్యాప్షన్, పెర్ల్ హార్బర్: అమెరికాపై జపాన్ దాడికి 80ఏళ్లు.. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)