Cristiano Ronaldo: గోవాలో పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఆటగాడి విగ్రహం ఏర్పాటుపై స్థానికుల నిరసన

గోవాలో క్రిస్టియానో రోనాల్డో విగ్రహం

ఫొటో సోర్స్, @MichaelLobo76

ఫొటో క్యాప్షన్, గోవాలో క్రిస్టియానో రోనాల్డో విగ్రహం

పోర్చుగీస్ ఫుట్‌‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో విగ్రహాన్ని గోవాలో ఏర్పాటుచేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గోవాలో ఫుట్‌బాల్ క్రీడకు ఆదరణ ఎక్కువ. రొనాల్డో విగ్రహ ఏర్పాటు వల్ల యువతకు ఫుట్‌బాల్ ఆడేందుకు స్ఫూర్తి కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

గోవా గతంలో పోర్చుగీస్ కాలనీగా ఉండేది. పోర్చుగల్ నుంచి గోవా స్వాతంత్ర్యం సాధించి 60 ఏళ్లవుతోంది.

అయితే... రొనాల్డో విగ్రహం ఏర్పాటు చేయడానికి బదులు స్థానిక ఫుట్ ‌బాల్ క్రీడాకారులకు గౌరవం ఇచ్చి ఉండాల్సిందని.. భారత జాతీయ ఫుట్ బాల్ జట్టులో అనేక మంది గోవాకు చెందిన క్రీడాకారులు ఉన్నారని, వారిని గౌరవించుకోవాల్సి ఉందని విమర్శకులు అంటున్నారు.

"రొనాల్డో విగ్రహాన్ని స్థాపించడం చాలా నిరుత్సాహంగా ఉంది. సమీర్ నాయక్, ఎం.బ్రూనో కౌటిన్హో లాంటి మన ఆటగాళ్లను చూసి గర్వపడటం నేర్చుకోవాలి" అని గోవా స్థానికుడొకరు ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థకు చెప్పారు.

ఈ విగ్రహావిష్కరణ సమయంలో కొందరు స్థానికులు నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించింది.

గోవాలో పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టుకు అభిమానులు ఉన్నారు. పోర్చుగీసు వారు ఈ ప్రాంతాన్ని పాలించడంతో అక్కడి చాలామందికి పోర్చుగల్‌తో సంబంధాలున్నాయి. గోవాకు చెందిన చాలామంది పోర్చ్‌గల్‌లో ఉన్నారు.

కానీ, గోవా 60వ వార్షికోత్సవం సందర్భంగా రొనాల్డో విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని కొంత మంది భారతీయులు అవమానకరంగా భావించారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 14 ఏళ్ల తర్వాత గోవా పోర్చుగల్ పాలన నుంచి విముక్తి అయింది.

రొనాల్డో

ఫొటో సోర్స్, Getty Images

"ఈ ఏడాది ఒక పోర్చుగీస్ ఫుట్‌బాల్ క్రీడాకారుడి విగ్రహాన్ని స్థాపించడం ఒక అపవిత్రమైన కార్యం. దీనిని మేం ఖండిస్తున్నాం" అని రైట్ వింగ్ కు చెందిన గురు శిరోద్కర్ ఐఏఎన్‌ఎస్‌కు చెప్పారు.

"ఇలా చేయడం గోవాలో చాలా మంది స్వాతంత్ర్య పోరాట యోధులను అవమానపరిచినట్లే" అని ఆయన అన్నారు.

ఫుట్ బాల్ క్రీడను మరింత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్లేందుకు యువతకు స్ఫూర్తి కలిగించేందుకు స్థానిక యువత అభ్యర్ధన మేరకు ఈ విగ్రహాన్నిస్థాపించినట్ల బీజేపీకి చెందిన నాయకుడు మైకేల్ లోబో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఆయన విగ్రహం దగ్గర తీయించుకున్న ఫోటోను కూడా జోడించారు.

భారతదేశంలో ప్రముఖంగా ఆడే ఆట క్రికెట్ అయినప్పటికీ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫుట్ బాల్‌కు కూడా మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌ను కేరళ, గోవా, వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ అభిమానిస్తారు.

క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్‌కు ఆడుతున్నారు. ఆయనకు చాలా మంది అభిమానులున్నారు.

రొనాల్డో విగ్రహంపై వివాదం ఏర్పడడం ఇదే తొలిసారి కాదు. 2017లో రొనాల్డో విగ్రహాన్ని ఎగతాళి చేయడంతో, చివరకు దానిని పోర్చుగల్‌లో మదీర ఎయిర్ పోర్టుకు తరలించి అక్కడ ప్రతిష్టించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)