ఝార్ఖండ్: మదర్ థెరీసా ఛారిటీ హోమ్‌లో శిశువుల అమ్మకం

మదర్ థెరీసా ఛారిటీ శిశు విక్రయం

ఫొటో సోర్స్, Reuters

ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని మదర్ థెరీసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో శిశువుల విక్రయాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. 14 రోజుల శిశువును అమ్మినందుకు చారిటీలో పనిచేస్తున్న ఒక మహిళను అరెస్ట్ చేశారు.

మదర్ థెరీసా ఛారిటీలో శిశువుల అమ్మకాలపై రాష్ట్ర శిశు సంక్షేమ సమితి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపై విచారణ జరిపారు.

శిశువు విక్రయంతో సంబంధం ఉన్న ఒక మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు, ఛారిటీలో ఉన్న మరో ఇద్దరు సిస్టర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత వారిలో ఒకరిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.

ఛారిటీలో పనిచేసే మహిళా ఉద్యోగిని అరెస్ట్ చేశామని రాంచీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ఎస్ఎన్ మండల్ వెల్లడించారు. వారు విక్రయించిన నవజాత శిశువును శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు.

"ఛారిటీ నుంచి మరికొందరు శిశువులను కూడా అక్రమంగా విక్రయించినట్టు బయటపడింది. ఆ పిల్లల తల్లుల పేర్లు కూడా సేకరించాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది" అని మండల్ తెలిపారు.

అదుపులో ఉన్న మహిళలు శిశువును అమ్మినట్టు అంగీకరించారని పోలీసులు తెలిపారు. శిశు విక్రయాలు జరిగిన కేంద్రం నుంచి లక్షా 48 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

మదర్ థెరీసా ఛారిటీ శిశు విక్రయం

ఫొటో సోర్స్, NIRAJ SINHA/BBC

మదర్ థెరీసా ఛారిటీ శిశు విక్రయం

ఫొటో సోర్స్, NIRAJ SINHA/BBC

మానవ అక్రమ రవాణాకు గురైన యువతులు, పెళ్లి కాకుండానే గర్భవతులు అయినవారికి నిర్మల్ హృదయ్-మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆశ్రయం కల్పిస్తుందని శిశు సంక్షేమ సమితి అధ్యక్షుడు రూప్ కుమార్ తెలిపారు.

"ఛారిటీలోని మహిళా ఉద్యోగులు నవజాత శిశువును ఉత్తర ప్రదేశ్‌ దంపతులకు అమ్మారు. ఆస్పత్రి ఖర్చుల పేరుతో లక్షా 20 వేల రూపాయలు తీసుకున్నారు. జువైనల్ చట్టాల గురించి తెలిసి కూడా వారు ఇలాంటి నేరానికి పాల్పడ్డారు" అని రూప్ కుమార్ అన్నారు,

ఛారిటీలోని మహిళా ఉద్యోగులు మరికొందరు పిల్లల్ని కూడా గతంలో 50 నుంచి 70 వేలకు అమ్మినట్టు శిశు సంక్షేమ సమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శిశు విక్రయాల వెనుక ఒక పెద్ద ముఠా ఉండవచ్చని శిశు సంక్షేమ సమితి అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరింది.

ప్రస్తుతం అమ్మకానికి గురైన శిశువుకు జన్మనిచ్చిన యువతి, మార్చి 19న నిర్మల్ హృదయ్-మిషనరీస్ ఆఫ్ చారిటీలో చేరిందని రూప్ కుమార్ తెలిపారు.

ఆ యువతి రాంచీలోని సదర్ ఆస్పత్రిలో ఈ ఏడాది మే 1న ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది.

పోలీసుల విచారణలో ఛారిటీ మహిళా ఉద్యోగులను ఈ ఏడాది మే 14న శిశువును అమ్మినట్టు బయటపడింది.

మదర్ థెరీసా ఛారిటీ శిశు విక్రయం

ఫొటో సోర్స్, NIRAJ SINHA/BBC

ఛారిటీ వాదన

ఛారిటీలో శిశువును అమ్మడంపై రాంచీ మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన సునీతా కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

"ఈ వార్తలు నమ్మలేకపోతున్నా. మా కేంద్రంలో ఇలా జరగడతో మేం షాకయ్యాం. నాకు తెలిసినంత వరకూ ఇలా ఎప్పుడూ జరగలేదు. శిశువును అమ్మడం, మా సంస్థ విలువలకు విరుద్ధం. మేం కూడా దీనిపై దృష్టి పెట్టాం. శిశు విక్రయం నిజమని తేలితే, మరోసారి ఇలా జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం" అని సునీతాకుమార్ చెప్పారు.

అయితే, ఆరోపణలు వచ్చిన కేంద్రంలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారి మాత్రం దీనిపై మాట్లాడడానికి నిరాకరించారు.

నియమాలు ఏం చెబుతున్నాయి?

నిబంధనల ప్రకారం ఒక యువతిని ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్చుకున్నప్పుడు, ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ వివరాలు రాష్ట్ర శిశు సంక్షేమ సమితికి ఇవ్వాల్సి ఉంటుందని సమితి అధ్యక్షుడు రూప్ కుమార్ తెలిపారు.

అయితే, జూన్ 30న శిశువును కొన్న దంపతులతో మాట్లాడిన ఛారిటీ ఉద్యోగులు వారికి ఒక చట్టపరమైన పని పూర్తి చేయాలని చెప్పారు. బిడ్డను తీసుకురావాలని కోరారు. జులై 2న ఆ దంపతులు రాంచీ రాగానే, వారి దగ్గర బిడ్డను తీసుకుని కనిపించకుండా వెళ్లిపోయారు.

మదర్ థెరీసా ఛారిటీ శిశు విక్రయం

ఫొటో సోర్స్, NIRAJ SINHA/BBC

సమితి విచారణ

బిడ్డ దూరమవడంతో దంపతులు శిశు సంక్షేమ సమితికి ఫిర్యాదు చేశారు. వారికి జరిగినదంతా చెప్పారు. దీంతో ఛారిటీలో శిశు విక్రయాల విషయం వెలుగులోకి వచ్చింది.

ఛారిటీ ఉద్యోగులను శిశు సంక్షేమ సమితి విచారించింది. అమ్మిన శిశువును తిరిగి జన్మనిచ్చిన తల్లికే అప్పగించారని గుర్తించింది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకూ బిడ్డను ఒక సంస్థ సంరక్షణలో ఉంచింది.

శిశు విక్రయాల ఆరోపణలతో ఛారిటీలో ఆశ్రయం పొందుతున్న మిగతా మహిళల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అక్కడ ఉన్న 13 మంది యువతులను శిశు సంక్షేమ సమితి మరో కేంద్రానికి తరలించింది. ఛారిటీ భవనాన్ని సీల్ చేస్తామని తెలిపింది.

శిశువును అమ్మగా వచ్చిన డబ్బులో 10 వేలు గార్డ్‌కు, 20 వేలు మహిళా ఉద్యోగులకు, మిగతా 90 వేలు చారిటీలోని ఒక సిస్టర్‌కు ఇచ్చినట్టు మహిళా ఉద్యోగులు విచారణలో తెలిపారు.

మదర్ థెరీసా ఛారిటీలో శిశు విక్రయాలపై పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

"సేవ పేరుతో జార్ఖండ్‌ మిషనరీస్ చేస్తున్న వ్యాపారం ఇప్పుడు బట్టబయలైంది" అని బీజేపీ ఎంపీ సమీర్ ఉరాన్, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు రామ్‌కుమార్ పాహన్ తాము జారీ చేసిన ఒక ప్రకటనలో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)