మంట చుట్టూ ఉన్న గిరిజనులను మావోయిస్టులు అనుకుని కాల్చి చంపారు: బీజాపూర్ ఎన్‌కౌంటర్ దర్యాప్తు నివేదిక

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
- రచయిత, ఆలోక్ ప్రకాష్ పుతుల్
- హోదా, బీబీసీ కోసం
"ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ ఏడిసమెట్ట గ్రామంలో 2013 మే 17న భద్రతాబలగాలు అమాయకులైన ఆదివాసీలను చుట్టుముట్టి ఏకపక్షంగా కాల్పులు జరిపాయి. అందులో తొమ్మిది మంది గిరిజనులు మరణించారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు".
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌గా చెబుతున్న ఘటనపై దర్యాప్తు కోసం నియమించిన జస్టిస్ వీకే అగర్వాల్ కమిటీ, ఆ ఘటన జరిగిన 8 ఏళ్ల తర్వాత తన నివేదికలో ఈ మాట చెప్పింది.
ఈ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత బస్తర్‌లో జరిగిన ఎదురుకాల్పులు, మిగతా ఎన్‌కౌంటర్ ఘటనలపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో రమణసింగ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్‌తో కలిసి ఒక ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులను కాల్చిచంపామని, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర పోలీసు అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
నివేదిక ఏం చెప్పింది
పోలీసుల వాదన పూర్తిగా అవాస్తవం అని జస్టిస్ వీకే అగర్వాల్ కమిషన్ నివేదిక చెప్పింది.
ఈ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్ చనిపోవడం గురించి కూడా చెప్పిన కమిషన్ సహచరుల కాల్పుల్లో బుల్లెట్ తగలడం వల్లే ఆయన మరణించారని తేల్చింది.
భద్రతాబలగాలకు మెరుగైన శిక్షణ, అవసరమైన పరికరాలు అందించాలని కూడా కమిషన్ తన రిపోర్టులో సిఫారసు చేసింది.
జస్టిస్ వీకే అగర్వాల్ జ్యుడిషియల్ దర్యాప్తు కమిషన్ ఎన్‌కౌంటర్లపై నివేదిక ఇవ్వడం ఇది రెండోసారి. కమిషన్ దర్యాప్తులో మావోయిస్టుల పేరుతో అమాయక గిరిజనులను కాల్చి చంపారనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంతకు ముందు 2019 డిసెంబర్‌లో జస్టిస్ వీకే అగర్వాల్ కమిషన్ 2012 జూన్‌లో బీజాపూర్ సర్కెగూడాలో జరిగినట్లు చెబుతున్న ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు చనిపోయారనే పోలీసుల వాదనను కూడా అబద్ధమని రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ చనిపోయిన వారు గ్రామంలోని గిరిజనులే అని చెప్పింది.
ఆ నివేదిక అందిన తర్వాత కూడా, రాష్ట్ర ప్రభుత్వం 17 మంది అమాయక గిరిజనుల మరణించిన కేసులో ఇప్పటివరకూ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు.
ప్రభుత్వం ఆ నివేదికను పక్కనపెట్టింది. అయితే, కమిషన్ ఈ తాజా నివేదికను మంత్రిమండలి సమక్షంలో అందించింది. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక చట్టపరమైన చర్యల దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
దర్యాప్తునకు ఎనిమిదేళ్లు
బీజాపూర్ గంగాలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడిసమెట్ట గ్రామంలో మే 17-18న రాత్రి జరిగిన కాల్పుల ఘటనపై తీవ్ర వ్యతిరేకతలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్ వీకే అగర్వాల్‌తో ఏకసభ్య దర్యాప్తు కమిషన్ ఏర్పాటుచేసింది.
దర్యాప్తు కమిషన్ పదవీకాలాన్ని ఆరు నెలలుగా నిర్ణయించారు. కానీ, ఎనిమిదేళ్ల తర్వాత ఇన్నాళ్లకు కమిషన్ ఈ ఘటనపై తన నివేదిక సమర్పించింది.
వీకే అగర్వాల్ కమిషన్ ఎనిమిది పాయింట్లపై దర్యాప్తు చేసింది. ఇంగ్లిషులో సమర్పించిన రిపోర్టులో "భయాందోళనలకు గురైన భద్రతా బలగాలు కాల్పుల వల్లే" ఈ ఘటన జరిగిందని చెప్పింది.
చనిపోయినవారిలో ముగ్గురు మైనర్లు కరమ్ బుదరూ, పునెమ్ లఖూ, కరమ్ గుడ్డూతోపాటూ కరమ్ జోగా, పునేమ్ సోనూ, కరమ్ పాండు, కరమ్ మాసా, కరమ్ సోమాలూ, బుధరామ్ గ్రామానికి చెందిన ఒక గిరిజనుడు ఉన్నారు.
మంత్రిమండలికి అందించిన ఆ నివేదికలో.. ఒక మంట చుట్టూ మనుషులు కూర్చుని ఉండడం చూసిన భద్రతాదళాలు వారిని పొరపాటున నక్సల్స్ అనుకున్నాయని, కాల్పులు జరిపాయని కమిషన్ చెప్పింది.
'బీజ్ పండూమ్' వేడుక సందర్భంగా ఆ రోజు వారంతా ఆ మంట చుట్టూ కూర్చుని ఉన్నారని విశ్వసనీయ ఆధారాల ద్వారా నిరూపితమైంది అని కమిషన్ నివేదికలో చెప్పింది.
చనిపోయిన వారు నక్సల్స్ కారని స్పష్టంగా చెప్పిన కమిషన్, కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ దేవ్ ప్రకాష్ తన సహచరుల ఫైరింగ్‌లోనే చనిపోయారని పేర్కొంది.
కమిషన్ తన నివేదికలో భద్రతా బలగాలు మొత్తం 44 రౌండ్లు ఫైర్ చేశాయని, దేవ్ ప్రకాష్ ఒక్కరే 18 రౌండ్లు ఫైర్ చేసినట్లు తెలిపింది.
ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించినట్లు కూడా కమిషన్ పేర్కొంది. అయితే ప్రభుత్వం విధానం ప్రకారం గాయపడ్డ నక్సల్స్ లేదా వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందదు. దానిని బట్టి క్షతగాత్రులు, మృతులను రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్‌గా భావించలేదనేది స్పష్టమైందని నివేదికలో చెప్పారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
భద్రతా బలగాలపై తీవ్ర వ్యాఖ్యలు
భద్రతా బలగాలకు అవసరమైన రక్షణ పరికరాలను పూర్తిగా అందించలేదని, వారికి సరైన సమాచారం కూడా ఇవ్వలేదని, పౌరులతో ఘర్షణను నివారించడానికి తగిన సూచనలు చేయలేదని కమిషన్ తన నివేదికలో చెప్పింది.
మార్చింగ్ ఆపరేషన్ ప్రారంభించడానికి ముందు భద్రతా దళాలు తగిన జాగ్రత్తలు పాటించలేదని కూడా కమిషన్ పేర్కొంది.
భద్రతా బలగాలు భయాందోళనల గురించి కమిషన్ ఒక వ్యాఖ్య కూడా చేసింది.
భద్రతా దళాలు జరిపిన ఈ కాల్పులు ఆత్మరక్షణ కోసం జరిగినవి కాదు, వారు అక్కడున్నది నక్సల్స్ అని పొరబడడం, భయపడ్డం వల్లే జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని చెప్పింది.
భద్రతా బలగాల ఆత్మరక్షణకు తగిన పరికరాలు అందించి ఉంటే, వారికి మరింత మెరుగైన నిఘా సమాచారం అందుంటే, వారు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండేవారని, కాల్పులు జరగకుండా ఉండేదని కమిషన్ సూచించింది.
భద్రతా బలగాలకు మెరుగైన శిక్షణ మాడ్యూల్ అవసరమని కమిషన్ అభిప్రాయపడింది.
సామాజిక పరిస్థితులు, మతపరమైన వేడుకల గురించి కూడా భద్రతా బలగాలకు సరైన అవగాహన ఉండాలని నివేదికలో చెప్పారు. స్థానికులతో ఎక్కువగా మాట్లాడుతుండేలా బలగాల్లో వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భావించింది.
స్థానిక వేడుకలు, గిరిజనుల కార్యక్రమాల్లో పాల్గొనేలా భద్రతా బలగాలకు సలహా ఇచ్చుండాలి, అలా వారి గిరిజనుల జీవనశైలి, వారి ఆచారాలు, అలవాట్ల గురించి తెలుస్తుంది అని చెప్పింది.
అలా వారిలో పరస్పరం ఒక నమ్మకం ఏర్పడుతుందని, కీలకమైన నిఘా సమాచారం కూడా మెరుగు పడుతుందని తెలిపింది.
దీనితోపాటూ భద్రతా బలగాలకు ఆధునిక గాడ్జెట్లు, కమ్యూనికేషన్ సాధనాలు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు, నైట్ విజన్ కెమెరాలు కూడా ఇవ్వాలని, అప్పుడే వారు ఎక్కువ సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో పనిచేయగలరని, ఒత్తిడిలో ఎలాంటి తొందరపాటు చర్యలకూ పాల్పడకుండా ఉంటారని చెప్పింది.
భద్రతాబలగాల మానసిక ఆరోగ్యం మెరుగు పడేలా అప్పుడప్పుడు సమగ్ర కోర్సులు అందించాలని, సాధారణంగా నక్సల్స్ లేదా తీవ్రవాద సంస్థలు గెరిల్లా పద్ధతిలో చేసే వ్యూహాత్మక పోరాటాన్ని ఎదుర్కునేలా విస్తృత శిక్షణ ఇవ్వాలని సూచించింది.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
ఇక ముందు ఏం జరగవచ్చు
ఏడిసమెట్ట ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్నీ(ఎస్ఐటీ) ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌పై విచారణ జరిగిన సమయంలో ఈ ఎస్ఐటీ ఐదేళ్లలో ఐదుగురి వాంగ్మూలం మాత్రమే రికార్డ్ చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత 2019 మే 3న సుప్రీంకోర్టు ఈ కేసు మొత్తం సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. 2019 జులై 4న సీబీఐ ఈ కేసులో గుర్తుతెలియని వ్యక్తులపై నేరపూరిత కుట్ర, హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కానీ, సీబీఐ నివేదిక ఇంకా రాలేదు.
ఏడిసమెట్ట ఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తు కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చెప్పారు.
"నివేదిక అందింది అనేది ముమ్మాటికీ వాస్తవం. కానీ, అసెంబ్లీలో దానిని ప్రవేశపెట్టేవరకూ దానిని బహిరంగపరచలేం. అందులో గోప్యత కూడా పాటించాలి" అని ఆయన మీడియాతో అన్నారు.
మరోవైపు, అసెంబ్లీలో ఈ నివేదిక ప్రవేశపెట్టాక తదుపరి చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, మంత్రి రవీంద్ర చౌబే చెప్పారు. "ఆ తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత, మేం చర్యల దిశగా ముందుకు వెళ్తాం" అన్నారు.
అయితే ప్రభుత్వం ఇస్తున్న భరోసాపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
గిరిజనుల హత్య కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ మౌనం పాటిస్తోందని మానవ హక్కుల అంశాల్లో చురుగ్గా ఉండే హైకోర్ట్ లాయర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రియాంక శుక్లా అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల బూటకపు ఎన్‌కౌంటర్లు ఎన్నో జరిగాయి. వాటి గురించి ఎక్కడా, ఎప్పుడూ విచారణ జరగదని ఆమె అన్నారు.
"కోర్టుల ఆదేశాలు, దర్యాప్తు కమిటీల నివేదికలను ప్రభుత్వం చెత్త బుట్టలో పడేస్తున్న పరిస్థితి ఉంది. 17 మంది గిరిజనుల బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో జ్యుడిషియల్ దర్యాప్తు కమిటీ నివేదికను 2019 డిసెంబర్‌లో అసెంబ్లీలో ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చెప్పాలి. ఆ రిపోర్టుపై చర్యలు తీసుకోకుండా దానిని పక్కనపెట్టి, హత్య నిందితులను కాపాడ్డంలో ఆయన మునిగిపోయారు" అని ప్రియాంక ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- తమిళనాడులో అశోకుడి కంటే ముందే అక్షరాస్యత.. 3200 ఏళ్ల కిందటే వరి సాగు, పట్టణ నాగరికత - పరిశోధన
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- దేశ చరిత్రను చెరిపేయడానికి మోదీ సర్కారు ప్రయత్నిస్తోందా?
- '9/11 దాడుల సూత్రధారి ఎఫ్‌బీఐ నుంచి ముందే ఎలా తప్పించుకున్నాడు’
- నాదిర్ షా: భారతదేశం నుంచి ఎన్ని లక్షల కోట్ల సంపదను దోచుకున్నారు? కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- చింగ్ షి: ఒక సెక్స్ వర్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రపు దొంగల ముఠాకు నాయకురాలు ఎలా అయ్యారు?
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- సరస్సు అడుగున బయటపడిన గ్రామం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








