తమిళనాడులో అశోకుడి కంటే ముందే అక్షరాస్యత.. 3200 ఏళ్ల కిందటే వరి సాగు, పట్టణ నాగరికత - పరిశోధన వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి స్టాలిన్

ఫొటో సోర్స్, DEPARTMENT OF ARCHEOLOGY, TAMIL NADU
తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని శివగలైలో జరిపిన తవ్వకాల్లో పురాతన కాలం నాటి వరి వంగడాలు బయటపడ్డాయి. వాటిని పరీక్షించగా, అవి 3,175 ఏళ్ల నాటి వంగడాలుగా రుజువైందని తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
తమిళనాడు చుట్టు పక్కల చాలా చోట్ల పురావస్తు శాఖ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ అధ్యయన ఫలితాల గురించి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ తవ్వకాల ద్వారా ఏం తెలుస్తోంది?
తమిళనాడు పురావస్తు శాఖ, రాష్ట్రంలోని కీళడి క్లస్టర్, ఆదిచనల్లూర్, శివగలై, కోర్కై, గంగైకొండ సోలాపురం, మైలదుంపరాయి, కొడుమనాల్‌లో తవ్వకాలను చేపడుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాష్ట్ర అసెంబ్లీలో ఈ తవ్వకాలకు సంబంధించిన 110 పేజీల నివేదిక గురించి ప్రస్తావించారు. ఈ నివేదికకు సంబంధించిన వీడియోతో పాటు చిన్న ప్రచురణను కూడా విడుదల చేశారు.
మదురై సమీపంలోని కీళడి క్లస్టర్‌లో 2015లో జరిపిన తవ్వకాల్లో భారీ భవనాల సముదాయం బయల్పడింది. దీంతో తమిళనాడు పురావస్తు సంపదపై అందరి దృష్టి నిలిచింది. కీళడి క్లస్టర్‌లో మూడు దశల పాటు తవ్వకాలు జరిపిన భారత పురావస్తు శాఖ ఆ తర్వాత దానిపై ఆసక్తి చూపలేదు. దీంతో ఆ బాధ్యతను తీసుకున్న తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ 2017 నుంచి తవ్వకాలను చేపడుతోంది.

ఫొటో సోర్స్, DEPARTMENT OF ARCHEOLOGY, GOVERNMENT OF TAMIL NADU
కీళడిలో బయల్పడిన వివిధ రకాల వస్తువులు, భవనాలు అక్కడి నాగరికత ఉనికిని తెలియజేస్తున్నాయి. తమిళనాడులో నదీ పరివాహక పట్టణ నాగరికత లేదని అందరూ నమ్మేవారు. అంతేకాకుండా బ్రాహ్మి (తమిళ్) అక్షరాలను మౌర్యులు సృష్టించారని, వాటిని తర్వాత తమిళనాడుకు తీసుకువచ్చారని చెబుతుంటారు. కానీ కీళడి తవ్వకాలు, తమిళనాడు పట్టణీకరణ గురించి వాడుకలో ఉన్న నమ్మకాలను మార్చివేశాయి. బ్రాహ్మి లిపి పూర్వ కాలంలోనే తమిళనాడులో ఉపయోగించారని ఇందులో బయల్పడిన కుండల ద్వారా తెలుస్తోంది.
యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా శాసనాలను విశ్లేషించినప్పుడు, అవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినవని తేలింది.
నలుపు కుండలు
అక్కడ నదీ పరివాహక మైదానాలకు సంబంధించినవిగా భావించే అరుదైన నలుపు రంగు కుండలు, పెద్ద భవనాలు, బ్రాహ్మి అక్షరాలతో కూడిన కుండలు, పూసలు, పాచికలు, రాళ్లను కనుగొన్నారు.
ప్రస్తుత తవ్వకాల్లో వెలువడ్డ వస్తువుల ద్వారా గతంలో కీళడి క్లస్టర్ అనేది పెద్ద నగరంగా విలసిల్లినట్లు తెలుసుకున్నారు. శ్రీలంకతోనూ భారత్ వాణిజ్య సంబంధాలు జరిపి ఉండవచ్చని తమిళనాడు పురావస్తు శాఖ వెల్లడించింది.
సూర్యుడు, చంద్రుడు నమూనాలు కలిగిన నాణేలతో పాటు శాసనాలు కూడా అక్కడ కనుగొన్నారు. ఆ నాణేలను, హార్దేకర్ నాణేలతో పోల్చి చూసిన నాణేల పరిశోధకురాలు సుష్మిత అవి మౌర్యుల కాలాని కంటే ముందునాటివని చెప్పినట్లు పురావస్తు శాఖ తెలిపింది. ఈ నాణేల ద్వారా కీళడి, ఉత్తర భారత దేశం మధ్య వాణిజ్య సంబంధాలున్నట్లు నిర్ధారించింది.
కీజి, కోర్కైలలో బయల్పడిన నల్లటి కుండలను భారత పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ రాకే తివారీ, బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్ర ఎన్. తివారీ విశ్లేషించారు. వారు కూడా నదీ పరివాహక ప్రాంతాలతో ఉత్తర భారత వాణిజ్య సంబంధాలను ధ్రువీకరించారు.
కీళడిలో వెలువడ్డ వస్తువులను గతంలో కార్బన్ డేటింగ్ ఆధారంగా పరీక్షించగా అవి క్రీ.పూ 585 నాటివిగా తేలింది. ప్రస్తుత పరీక్షల్లోనూ అదే విషయం రుజువైంది.
ఆదిచనల్లూర్ అధ్యయనం
ఆదిచనల్లూర్‌లో ఇప్పటివరకు స్మశాన వాటికల్లో మాత్రమే తవ్వకాలు జరిపారు. కాబట్టి పూర్వీకుల అంత్యక్రియలకు సంబంధించిన విధానాలు, అంత్యక్రియల కోసం వాడిన కుండలు, ఆ ఆచారాలకు సంబంధించిన సమాచారం మాత్రమే లభ్యమైంది. నాటి కాలపు ప్రజల జీవనశైలి గురించి ఎవరికీ తెలియదు. ఆదిచనల్లూర్ ప్రజల జీవన విధానాలు తెలుసుకునేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. ఇందులో ఇనుప యుగం, చారిత్రక యుగాల నాటి పరిసరాల గురించి బయటపడింది. రాతియుగం నాటి రాతి ఆయుధాలను కూడా కనుగొన్నారు. దీంతో ఇనుప యుగం నాటి కంటే ముందు నుంచే ఇక్కడ ప్రజలు నివసించి ఉండేవారని నమ్ముతున్నారు. అక్కడ ఇనుప యుగంలో వాడిన దహన సంస్కారాలకు సంబంధించిన వస్తువులు, కుండలు తవ్వకాల్లో బయట పడ్డాయి.
ఆదిచనల్లూర్‌లో 847 వస్తువులతో పాటు వివిధ రకాల కుండల్ని కనుగొన్నారు. ఆదిచనల్లూర్‌లో తొలిసారిగా కుండలపై తమిళ్ శాసనాలను కనుగొన్నారు. గ్రాఫిటీతో కూడిన 5000లకు పైగా కుండలు లభించడం విశేషం.

ఫొటో సోర్స్, DEPT. OF ARCHEOLOGY, GOTN.
నలుపు, ఎరుపు రంగు కుండలు
అక్కడి పరిసరాల్లో జరిపిన తవ్వకాల్లో అత్యంత నాణ్యమైన సాంకేతికతో తయారుచేసిన కుండలు లభ్యమయ్యాయి. ఇవి నలుపు, ఎరుపు రంగుల్లో ఉండి చుక్కలను కలిగి ఉన్నాయి. గిన్నెలు కూడా అదే తరహాలో ఉన్నాయి.
వాటితో పాటు అక్కడ రాగి, ఇనుప ఉంగరాలు, గాజు పూసలు, దంతపు పూసలు, గాజులు, ఎముకలతో చేసిన పూసలు, టెర్రాకోట పూసలు, టెర్రాకోట గాజులు బయటపడ్డాయి. పొరునై నది ఒడ్డున నివసించిన ప్రజలు ధరించిన ఆభరణాల వివరాలను ఇవి వెల్లడించాయి.
రాళ్ల పరికరాలు
ఈ తవ్వకాల్లో ప్రతిరోజు ఇళ్లలో ఉపయోగించే వస్తువులను కనుగొన్నారు. అవన్నీ కూడా రాతి నిర్మాణాలు కావడం విశేషం. వీటిలో రూబెల్ స్టోన్స్, గ్రైండ్ స్టోన్స్, టూలింగ్ స్టోన్లలతో పాటు టెర్రాకోటతో చేసిన మానవులు, పక్షుల చిత్రాలను కూడా ఉన్నాయి.
ఒక క్రమ పద్ధతిలో అమర్చిన 21 టెర్రాకోట పైపులను కూడా కనుగొన్నారు. ఇళ్లలో డ్రైనేజీ వ్యవస్థ కోసం వీటిని ఉపయోగించినట్ల భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, DEPT OF ARCHEOLOGY, GOTN.
శివగలై తవ్వకాలు
తూత్తుకుడి జిల్లాలోని ఎరల్ వట్టం ప్రాంతంలో శివగలై ఉంది. తూత్తుకుడి జిల్లాకు 31 కి.మీ దూరంలో తమిరభరణి నది ఒడ్డున ఉన్న శ్రీవైకుండానికి 10 కి.మీ దూరంలో ఉంటుంది.
ఇక్కడి తొలిదశ తవ్వకాల్లో తమిళ లిపిలోని 'ఆదాన్' శిలాశాసనంతో ఉన్న కుండను కనుగొన్నారు. ఆదిచనల్లూర్ తరహాలో ఇక్కడ రాగి, బంగారు వస్తువులేవీ దొరకలేదు. కానీ నలుపు, ఎరుపు రంగులోని కుండలు, ఇతర పాత్రలు, పాత్రల్ని కప్పి ఉంచే ప్లేట్లు బయల్పడ్డాయి. ఇవన్నీ తెలుపు రంగులో అలంకరించి ఉన్నాయి. ఇవన్నీ శివగలై ప్రాంతంలోని ప్రజల వైభవాన్ని చాటుతున్నాయి. ఇక్కడ దొరికిన వరి ధాన్యాలను పరీక్షించగా అవి క్రీ.పూ 1155 నాటివిగా తేలింది.
ఆదిచనల్లూర్‌లో బయల్పడిన రాగి, బంగారు వస్తువులు అక్కడి అద్భుతమైన సామాజిక, ఆర్థిక వ్యవస్థ గురించి తెలుపుతున్నాయని పురావస్తు శాఖ చెప్పింది.

ఫొటో సోర్స్, DEPARTMENT OF ARCHEOLOGY, GOVERNMENT OF TAMILNADU
కోర్కై ప్రాంతం రాజధానిగా ఉండేదా?
తూత్తుకుడి జిల్లాలో ఉన్న ఈ కోర్కై ప్రాంతంలో తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ 1968-69 కాలంలో తవ్వకాలు చేపట్టింది. పాండ్య రాజుల కాలంలో కోర్కై ప్రాంతం రాజధానిగా ఉండేదని చెబుతుంటారు. ఇక్కడ బయల్పడిన వస్తువులను పరీక్షించగా, అవి క్రీ.పూ 785 కాలానికి చెందినవిగా తెలిసింది.
ఇక్కడ శంఖాలు, గాజుల తయారీ పరిశ్రమ ఉజ్వలంగా వెలిగినట్లు రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన పరిశోధనల్లో తేలింది. తవ్వకాల్లో విరిగిన గాజులతో పాటు శంఖాలు బయటపడటంతో పురావస్తు శాఖ ఈ నిర్ణయానికి వచ్చింది.
ఫిల్టర్ చేసే పైప్
చతురస్రాకారపు ఇటుకల నిర్మాణాన్ని ఇక్కడ కనుగొన్నారు. ఇది 2.35 మీటర్ల పొడవుండి, 29 బ్లాక్‌లతో పాటు మధ్యలో ఒక క్యారియర్‌ను కూడా కలిగి ఉంది. సక్కన్ శిలలపై ఈ ఇటుకల నిర్మాణాన్ని నిర్మించారు. అందులో డ్రైనేజీ రంధ్రాలతో కూడిన, 9 దశల వడపోత గొట్టాన్ని అమర్చారు.
తమిళనాడుకు, ఇతర దేశాలకు మధ్య వర్తక వాణిజ్య సంబంధాలు ఉండేవని ఇక్కడ కనుగొన్న పాశ్చాత్య డిజైన్లతో కూడిన కుండల ఆధారంగా పురావస్తు శాఖ పేర్కొంది. క్రీ.పూ 5వ శతాబ్ధం నాటి గంగానది మైదానాలకు చెందిన సామగ్రిని కూడా ఇక్కడ గుర్తించారు.
క్రీ.పూ 6వ శతాబ్ధానికి ముందు దక్షిణ భారతదేశం, మిగిలిన ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నట్లు నదీ మైదానాల్లో లభించిన వెండి నాణేలు, నలుపు పూత కలిగిన వంట ఇంటి సామగ్రి ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని రాకేశ్ తివారీతో పాటు బనారస్ హిందు యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సింగ్ వెల్లడించారు.
అనేక పురావస్తు ప్రదేశాలు ఉన్నందున కోర్కై ప్రాంతం, క్రీ.పూ 8వ శతాబ్ధానికి ముందు నిర్మించబడి ఉంటుందని అందరూ నమ్ముతున్నారు.
మైలదుంపరాయి సమీపంలోని వరదాన్‌పల్లి, కప్పలవాడి తవ్వకాల ద్వారా 4000 ఏళ్ల క్రితమే ఇక్కడ వ్యవసాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ తవ్వకాల నివేదికలను చదివిన తమిళనాడు పురావస్తు, పరిశ్రమల శాఖ మంత్రి తంగమ్ తెన్నరసు వీటిద్వారా తమిళనాడు పూర్వ చరిత్ర, కాలక్రమం తెలుస్తోందని అన్నారు.

ఫొటో సోర్స్, DEPT OF ARCHEOLOGY, GOTN.
''మధురైలోని మంగుళంలో 'పాండియన్ నెడున్‌చెలియన్' పేరుతో కనుగొన్న శిలాశాసనం క్రీ.పూ 2వ శతాబ్ధం నాటిది. గతంలో దీన్ని తమిళుల సాహిత్య చరిత్రకు సంబంధించినదని నమ్మేవారు. ఇప్పుడు మావద్ద రుజువులు కూడా ఉన్నాయి. పులిమాంకొంబైలోని శిలాశాసనం కూడా దీన్నే రుజువు చేస్తోంది. కీళడి క్లస్టర్, శివగలైలో ఆధాన్ పేరుతో కుండలు బయల్పడ్డాయి. తమిళులకు లిపి లేదు అని ఒకప్పుడు నమ్మేవారు. అశోకుని ద్వారా తమిళులకు తమిళ్ బ్రాహ్మి లిపి లభించిందని చెబుతుంటారు. కానీ ఈ తవ్వకాల ద్వారా తమిళనాడుకు అశోక కాలం నాటి కంటే ముందు నుంచే అక్షరాస్యతతో పాటు నాగరికత ఉన్నట్లు వెల్లడైంది'' అని ఆయన వివరించారు.
తమిళనాడు చేపడుతోన్న ఈ పరిశోధనలో ఇండియన్ జియోమాగ్నటిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ముంబై, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, రియోట్ సెన్సింగ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ భారతీదాసన్ యూనివర్సిటీ, రియోట్ సెన్సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అన్నా యూనివర్సిటీ, చెన్నై ఐఐటీ సంయుక్తంగా పాల్గొన్నాయి.
తవ్వకాలు చేపట్టిన ప్రదేశాలను గుర్తించడంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, మాగ్నోమీటర్ సర్వే తదితర సాంకేతికతలను ఉపయోగించారు.
ఇవి కూడా చదవండి:
- 9/11: మూడు వేల మందిని చంపిన నిందితులపై 20 ఏళ్లు గడిచినా అమెరికా చర్యలు ఎందుకు తీసుకోలేదు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- బ్రాలో దాక్కుని 6,500 కిలోమీటర్లు ప్రయాణించిన బల్లి
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- అఫ్గానిస్తాన్: కో-ఎడ్యుకేషన్ రద్దు, విద్యార్థినులకు హిజాబ్ తప్పనిసరి
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













