మయా నాగరికత: మనం ఇప్పుడు వాటర్ ఫిల్టర్లలో వాడుతున్న జియోలైట్ గురించి మయన్లకు ఆనాడే తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
మయా నాగరికతలో ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా నిలిచిన టికల్ నగరంలోని ఎత్తైన సున్నపురాయి పిరమిడ్లు సందర్శకులను ఆకర్షిస్తాయి.
1,500 ఏళ్ల క్రితం నాటి మయా నాగరికత కాలంలో లోహపు పనిముట్లు, చక్రాల సాయం లేకుండా నిర్మించిన ఈ పొడవైన రాతి కట్టడాలు మయా రాజులకు, వారి ఆస్థాన పురోహితులకు అధికార పీఠాలుగా విలసిల్లేవి.
మయా నాగరికత మెక్సికోలోని యుకటాన్ ద్వీపకల్పం, గ్వాటెమాలా, బెలిజ్, అలాగే హోండురస్, ఎల్ సాల్వడార్ ప్రాంతాలలోని కొంత భాగంలో విస్తరించి ఉండేది.
ఇటీవల, లేజర్ టెక్నాలజీ సహాయంతో చేపట్టిన పరిశోధనలో మయా నాగరికతకు చెందిన 60,000 శిథిలాలు బయటపడ్డాయి.
గ్వాటెమాల అడవి కింద నిద్రిస్తోన్న నాగరికత శిథిలాలను గుర్తించడానికి పరిశోధకులు లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు.
ఈ రాతి కట్టడాల పరిసరాల్లో ఒకప్పుడు కోటి లేదా కోటిన్నర మంది ప్రజలు జీవించి ఉంటారని అంచనా వేస్తున్నారు.
పెద్ద పెద్ద రాజభవనాలు, ఆలయాల సమక్షంలో ప్రతి ఒక్కరూ సూర్యుడి గతిని పరిశీలిస్తూ ఉండేవారు. మయా నాగరికతలో వాస్తుశిల్పులు, ఖగోళ శాస్త్రవేత్తలకు కొదవ లేదు.
అయితే, ఎలాంటి ఆధునిక పనిముట్ల సహాయం లేకుండా నిర్మించిన ఈ ఎత్తైన రాతి కట్టడాల వెనుక, గ్రహణాలను కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యం వెనుక ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
టికల్‌లో మయా నాగరికత మనుగడకు మూలకారణమేంటి?
మయా నాగరికత వర్థిల్లడానికి ప్రధాన కారణం నీరు అని శాస్త్రవేత్తలు ఇటీవలే కనుగొన్నారు. ఈ ప్రాంతంలో నదులు, సరస్సులు లేనందువల్ల, వర్షాకాలంలో వచ్చే నీటిని సేకరించి నిల్వ చేసుకోవడానికి భారీ జలాశయాలను నిర్మించడం తప్ప మయన్ ప్రజలకు మరో మార్గం లేదు.
సంవత్సరంలో నాలుగు నుంచి ఆరు నెలలు వర్షాలు పడని ఈ ప్రాంతంలో 40,000 నుంచి 2,40,000 మంది (8వ శతాబ్ద కాలానికి) ప్రజలు టికల్ నగరంలో నివసించేవారని అంచనా.
ఈ భారీ జలాశయాలే టికల్‌లో వెయ్యేళ్ల కన్నా ఎక్కువగా మయా నాగరికత వర్ధిల్లడానికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టికల్‌లో మయా నాగరికత క్రీ.పూ 600 నుంచి క్రీ.శ 900 వరకు విలసిల్లింది.
మాయ ప్రజలు పశ్చిమార్థ గోళంలోనే అత్యంత పురాతనమైన నీటి శుద్ధీకరణ వ్యవస్థను సృష్టించారని పురావస్తు శాస్త్రవేత్తలు గత ఏడాది చేసిన పరిశోధనలో తేలింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
జియోలైట్ వాడకం
మయా ప్రజలు జలాశయాల్లో నీటిని వడకట్టేందుకు వాడిన కీలకమైన పదార్థాలలో జియోలైట్ ఒకటి. దీన్ని ఇప్పడు కూడా వాటర్ ఫిల్టర్‌లలో వాడుతున్నారు.
దీన్నిబట్టి మయా నాగరికతలో నీటి శుద్ధీకరణ ఎంత అధునాతనంగా ఉండేదో ఊహించవచ్చు.
అగ్నిపర్వతాలు పేలినప్పుడు మిగిలే బూడిద, ఆల్కలీన్ భూగర్భజలాలతో కలిసినప్పుడు ఏర్పడే రసాయన చర్య కారణంగా అల్యూమినియం, సిలికాన్, ఆక్సిజన్‌లతో కూడిన జియోలైట్ ఏర్పడుతుంది.
ఇది ప్రత్యేకమైన భౌతిక, రసాయన లక్షణాలను కలిగి ఉంటుంది. భారీ లోహాల నుంచి సూక్ష్మజీవుల (మైక్రోబ్స్) వరకూ కలుషితాలను నీటి నుంచి వడకట్టడంలో సహాయపడుతుంది.
ఈ పదార్థం లోపల సూక్ష్మరంధ్రాలతో కూడిన గదులవంటి నిర్మాణం ఉంటుంది. నీటిలో ఉండే కలుషితాలు రంధ్రాలపైనే అతుక్కుంటాయి. దాంతో, స్వచ్ఛమైన నీరు ఈ సూక్ష్మరంధ్రాల గుండా బయటకు వెళ్తుంది.
అయితే, ఈ జియోలైట్‌ను టికల్‌లోని ఒక జలాశయంలో మాత్రమే కనుగొన్నప్పటికీ, అక్కడ లభించిన అనేక మట్టి పాత్రల్లో జియోలైట్ అవశేషాలు కనిపించాయి. దీనినిబట్టి, ఈ జలాశయాల్లో శుద్ధిచేసిన నీటిని ప్రత్యేకంగా తాగడానికి వాడేవారని అర్థమవుతోంది.
జియోలైట్ అవశేషాలు లభ్యమైన జలాశయాలను ప్రస్తుతం 'కొరియెంటల్స్' అని వ్యవహరిస్తున్నారు.
చరిత్రలో ఇప్పటివరకు లభించిన ఆధారాల దృష్ట్యా, నీటి వడపోతకు జియోలైట్‌ను వాడడం తొలిసారిగా మయా నాగరికతలోనే కనిపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీని తర్వాత 1627లో అంటే దాదాపు 1,800 సంవత్సరాల తరువాత బ్రిటిష్ సైంటిస్ట్ రాబర్ట్ బేకన్ జియోలైట్‌ను శాండ్ ఫిల్ట్రేషన్ (నీటిని వడపోసే ఒక పద్ధతి)లో వాడిన ఆధారాలు కనిపిస్తునాయని అంటున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
జియోలైట్‌ను వాడి నీటిని శుద్ధిపరిచే వ్యవస్థను మయా ప్రజలు మొట్టమొదటగా క్రీ.పూ 164లో నిర్మించినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
అంతకుముందు గుడ్డతో వడకట్టేవారు. ఈ గుడ్డను 'హిపోక్రాటిక్ స్లీవ్' అని పిలిచేవారు. దీన్ని పురాతన గ్రీకు నాగరికతలో క్రీ.పూ 500లో కనుగొన్నారు.
అయితే, బ్యాక్టీరియా లేదా సీసం వంటి కంటికి కనిపించని కలుషితాలను తొలగించడంలో మయా ప్రజల నీటి శుద్ధీకరణ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉండేది.
"అమెరికా ఆదివాసులు ప్రాచీన గ్రీస్, ఈజిప్ట్, ఇండియా, చైనాల మాదిరి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగి లేరని పురావస్తు శాస్త్రవేత్తల్లో, ఆంత్రపాలజిస్టుల్లో ఓ అభిప్రాయం ఉండేది.
ఒక అమెరికన్‌గా ఇది నాకు ఆందోళన కలిగించేది. ఇప్పుడు మాయ నాగరికతలో బయటపడిన అధునాతన సాంకేతికత ఈ నాగరికతలన్నిటి కన్నా పురాతనమైనది" అని సిన్సినాటి విశ్వవిద్యాలయంలోని పురావస్తు భూవిజ్ఞాన శాస్త్రవేత్త, మయా నాగరికతలో జియోలైట్ వినియోగాన్ని అధ్యయనం చేస్తున్న బృందంలోని ప్రధాన పరిశోధకుడు కెన్నెత్ టేంకర్స్‌లీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టికల్ ప్రాంతంలో నీటి సమస్య
టికల్ ప్రాంతంలో రెండే రుతువులు ఉంటాయి. ఒకటి అధిక వర్షపాతంతో కూడినది. రెండు, పూర్తి వర్షాభావంతో కూడిన పొడి వాతావరణం.
మరో సవాలు ఏమిటంటే, ఇక్కడ వర్షపు నీరు వేగంగా భూమిలోకి ఇంకిపోతుంది. త్వరగా భూమి పైపొరలోకి ఇంకిపోయి సున్నపురాయిని కరిగించే ఆమ్లంగా మారిపోతుంది. అందుకే ఈ ప్రాంతంలో ప్రధానంగా సున్నపురాతి పలకలు కనిపిస్తాయి.
వర్షపు నీరు భూమి లోపల సుమారు 200మీటర్ల అడుగుకు చేరిపోతుంది. ఇంత లోతుగా భూమిని తవ్వి నీటిని బయటకు తోడడం మయా ప్రజలకు అసాధ్యం.
చుట్టుపక్కల ఏ రకమైన నదులూ లేకపోవడం, వర్షపు నీరు త్వరగా ఇంకిపోవడం మాయ ప్రజలకు పెద్ద సవాలుగా నిలిచి ఉండవచ్చు. ఇందువల్ల నీటిని నిల్వ చేసుకునేందుకు ఏదో ఓ మార్గం తప్పక కనిపెట్టాల్సిన అవసరం మయా ప్రజలకు ఏర్పడి ఉంటుంది. అప్పుడే జలాశయాల సృష్టి జరిగి ఉంటుంది.
టికల్ చుట్టూ కొండలు ఎక్కువగా ఉండడం వలన, వాటి మీంచి జాలువారే వర్షపు నీటిని సేకరించడం తేలికే.
టికల్‌లోని సెంట్రల్ ప్లాజాలో ఆలయం 1కి, 2కి మధ్య ఉన్న రాళ్లను గమనిస్తే, అవి పల్లానికి నీటిని పంపే విధంగా వాలుగా ఉంటాయి. వాటి నుంచి జలువారిన నీరు ఆలయాల్లోని జలాశయాలను నింపడానికి తీసుకువెళ్లే కాలువల్లోకి ప్రవహిస్తుంది.
ఇప్పుడు టికల్ వెళ్తే ఈ జలాశయాలు ఎక్కడున్నాయో వెతుక్కునేందుకు కొంచం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ శిథిలాల కింద మరుగునపడిపోయాయి.
రాజభవనంలో ఉన్న జలాశయంలో ఒకప్పుడు సుమారు మూడు కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసిఉంటారని అంచనా వేస్తున్నారు.
జియోలైట్ అవశేషాలు దొరికిన కొరియెంటల్, 5.8 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉండవచ్చని అంచనా.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
మయాప్రజలకు జియోలైట్ వాడకం ఎలా తెలిసింది?
2010లో జరిగిన ఫీల్డ్‌వర్క్‌లో జియోలైట్ ఉన్న కొరియెంటల్‌ను కనుగొన్నారు. అదే సమయంలో టికల్‌లోని నాలుగు జలాశయాల నుంచి పది రకాల నమూనాలను సేకరించారు.
ప్రమాదకర స్థాయిలో మెర్క్యురీ, విషపూరిత ఆల్గల్ బ్లూమ్స్‌లతో జలాశయాల్లోని నీరు కలుషితం కావడం వలన అంటువ్యాధులు ప్రబలడంతో, 9వ శతాబ్దంలో మయా రాజులు ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళిపోయారని ఈ నమూనాలపై జరిపిన పరిశోధనలో తేలింది.
రాజభవనం, ఆలయాల్లోని జలాశయాలు విషపూరితం అయినప్పటికీ కొరియెంటల్ జలాశయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం అద్భుతమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కొరియెంటల్ నమూనాలను నిశితంగా పరిశీలించినప్పుడు నాలుగు విభిన్న ఇసుక పొరలు కనిపించాయని, వాటిల్లో స్ఫటికాకారపు క్వార్ట్జ్, జియోలైట్ ముక్కలు ఉన్నాయని, ఇవి ఇతర జలాశయాల్లో కనిపించలేదని పరిశోధకులు వివరించారు.
అయితే, ఈ రకమైన ఇసుక అక్కడి నేలలో సహజంగా లభ్యమైనది కాదని ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించిన మీదట తేలిన విషయం.
కాబట్టి, ఈ పదార్థాలను ప్రత్యేకంగా జలాశయాల కోసం వేరెక్కడి నుంచో తీసుకువచ్చారని తెలుస్తోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టికల్‌కు ఈశాన్యంగా 30 కిలోమీటర్ల దూరంలో 'బాజో డి అజాకర్' అనే ఇసుక ఉన్నట్లు ఈ బృందంలో ఒక శాస్త్రవేత్తకు అనుకోకుండా తెలిసింది. అక్కడి నీరు స్వచ్ఛంగా, తియ్యగా ఉంటుందని స్థానికులు చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 4
బాజో డి అజాకర్ ఇసుక, రాళ్లల్లో జియోలైట్ ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి బాజో నుంచి టికల్‌కు ఈ రాళ్లను తరలించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
"వాస్తవంలో ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా కష్టం. మన దగ్గర టైం మిషన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. అయితే, బాజోలో అంత తియ్యటి నీరు లభిస్తుంటే, ఆ ఇసుక, రాళ్లను ఉపయోగించి నీటిని శుభ్రం చేసుకోవచ్చనే టికల్ ప్రజలకు ఆలోచన వచ్చి ఉండొచ్చని అంచనా వేయడం పెద్ద కష్టమేమీ కాదు" అని టేంకర్స్‌లీ అన్నారు.
జియోలైట్ ఉన్న ఇసుకను పెటెట్స్ అనే ఆకుల మధ్య కూరి ఫిల్టర్లుగా తయారు చేసి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ ఫిల్టర్లను జలాశయాల్లోకి నీరు ప్రవహించే కాలువ గోడల్లో అమర్చి ఉండవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇసుక, నీటిని కొంత శుభ్రం చేసినా, జియోలైట్ ఇతర సూక్ష్మ క్రిములను కూడా తొలగించి నీటిని శుద్ధి చేస్తుంది. ఇలా వడకట్టిన నీరు ప్రస్తుత కాలపు ప్రమాణాలతో పోల్చినా అత్యంత పరిశుభ్రమైనదే అవుతుందని పరిశోధకులు అంటున్నారు.
"జియోలైట్ లక్షణాలు,అదెలా పని చేస్తుందో మాయ ప్రజలకు అర్థం అయి ఉండకపోవచ్చు. కానీ, దీనివలన నీరు శుభ్రపడుతుందని అర్థం చేసుకున్నారు. ఆ జ్ఞానంతో నీటిని శుద్ధి చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు" అని ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన ఆంత్రపాలజిస్ట్ లీసా లుకేరో అన్నారు.
జియోలైట్‌తో కూడిన నాలుగు పొరల ఇసుక, వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు కొట్టుకుపోయి ఉంటుంది. అందుకే దాన్ని మళ్లీ మళ్లీ నిర్మించి ఉంటారు.
టికల్‌లో మాత్రమే కాకుండా మాయ నాగరికతలో వర్థిల్లిన ఇతర నగారాల్లో కూడా జియోలైట్ ఉన్న జలాశయాలు ఉండి ఉండొచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు.
ప్రస్తుత పరిశోధన మయా నాగరికతపై మరింత అవగాహన పెంపొందించేదుకు, మరిన్ని పరిశోధనలు జరిపేందుకు ప్రోత్సహిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫొటోల్లో లక్షల ఏళ్ల భారత చరిత్ర!
- ప్రజాస్వామ్యం నుంచే నిరంకుశత్వం పుడుతుందని ప్లేటో ఎందుకు అన్నారు?
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 5
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








