ఖైబర్ కనుమలు: అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు అందరి గర్వాన్నీ అణిచేసిన మృత్యులోయ

బాబ్-ఎ-ఖైబర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మహమూద్ జాన్ బాబర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చిన్నప్పుడు మనం చాలా రకాల కథలు విని ఉంటాం. వాటిలో మనకు కొన్ని ప్రాంతాల గురించి కూడా చెప్పేవాళ్లు. అక్కడ ఎవరైనా అడుగు ముందుకేస్తే చనిపోతారు, లేదా వెనక్కు తిరిగి చూస్తే శిల అయిపోతారని అనేవాళ్లు.

అవి కథలే అయినా, దాదాపు అంతటి ప్రమాదకరమైన ప్రాంతం ప్రపంచంలో ఒకటి ఉంది. అవే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులను తాకుతూ ఉండే ఖైబర్ కనుమలు.

అఫ్గానిస్తాన్‌కు రాకపోకలు సాగించేవారు, ఈ కనుమల్లో మార్గాన్ని ఉపయోగించుకోక తప్పదు. కానీ, ఎవరు ఆ మార్గాన్ని దాటాలన్నా, ఆ ప్రాంతంలో నివసించే అఫ్రిదీ తెగవారికి విలువైన బహుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రపంచ విజేతలమని గొప్పలు చెప్పుకున్న వారికి కూడా అది తప్పలేదు. ఎంతో మంది యోధులు ఖైబర్ కనుమల్లో స్థానిక అఫ్రిదీలకు తల వంచాల్సి వచ్చింది.

ఖైబర్ కనుమల్లో అఫ్రిదీ తెగవారి గురించి దాదాపు చరిత్రకారులందరూ తమ గ్రంథాల్లో రాశారు.

"వారికి యుద్ధం అంటే చాలా ఇష్టం, అఫ్రిదీలకు యుద్ధంపై ఉన్న ఆ ప్రేమ వారి శత్రువులకు చుక్కలు చూపించింది. అఫ్రిదీలతో తలపడి ఘోర పరాజయం మూటగట్టుకునేలా చేసింది" అని చెప్పారు.

ఖైబర్ కనుమల్లో జరిగినన్ని యుద్ధాలు బహుశా ప్రపంచంలో ఎక్కడా, ఏ మార్గంలోనూ జరిగుండవని విదేశీ, స్థానిక రచయితలు అందరూ ఏకీభవిస్తారు.

ప్రపంచ ప్రఖ్యాత ఖైబర్ కనుమలు పెషావర్‌కు 11 మైళ్ల దూరంలోని చారిత్రక ద్వారం బాబ్-ఏ-ఖైబర్ నుంచి మొదలవుతాయి.

దాదాపు 24 మైళ్ల దూరంలో ఉన్న తోర్ఖమ్ దగ్గర పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఈ కనుమలు అంతం అవుతాయి. అక్కడ డ్యురాండ్ రేఖను దాటి అఫ్గానిస్తాన్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.

చెడు ఉద్దేశాలతో బాబ్-ఎ-ఖైబర్, తోర్ఖమ్ మధ్య ఉన్న ఖైబర్ కనుమల్లోకి ప్రవేశించే ఎవరికైనా అది ఎలాంటి ప్రమాదకరమైన స్వాగతం పలికేదంటే, దానికి ఉదాహరణలు చరిత్రలో మరెక్కడా కనిపించవు. అందుకే, ప్రపంచాన్ని జయించానని చెప్పుకున్న యోధులు కూడా ఈ కనుమలను, అక్కడివారిని తమ నియంత్రణలోకి తీసుకోలేకపోయారు.

ఖైబర్ కనుమలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖైబర్ కనుమలు

ఖైబర్ కనుమల భౌగోళిక, యుద్ధ స్థితి

ఈ మార్గానికి రెండు వైపులా సుమారు 1500 అడుగుల ఎత్తున్న పర్వత శిఖరాలున్నాయి. వాటి మధ్యలో గుహలు పద్మవ్యూహంలా ఉంటాయి. పుట్టి పెరిగిన ప్రాంతం కావడంతో స్థానిక అఫ్రిదీలు కనుమల్లో వచ్చే శత్రువులపై సులభంగా దాడులు చేసేవారు. వారి ప్రత్యర్థులు ఎవరైనా ప్రపంచంలోని ఏ ఆయుధాలతోనూ వారిపై గెలవలేకపోయేవారు.

ఈ కనుమల్లో అత్యంత ప్రమాదకరమైన భాగం చారిత్రక అలీ మసీద్ ప్రాంతం. అక్కడ కనుమలు చాలా ఇరుకుగా ఉంటాయి. అక్కడి మార్గం కేవలం కొన్ని మీటర్ల వెడల్పే ఉంటుంది.

సరిగ్గా అదే ప్రాంతంలో ఎత్తయిన కొండలపై నక్కిన అఫ్రిదీ తెగవారు వందల అడుగుల కింద వెళ్తున్న శత్రు సైనికులపై దాడులు చేసేవారు. విధిలేక వారు వెనక్కి వెళ్లేలా చేసేవారు. చివరికి శత్రువులు కనుమల్లో ఉండిపోయిన తమ సైనికుల శవాలు తీసుకువెళ్లాలన్నా స్థానిక తెగలు చెప్పినట్టు వినాల్సి వచ్చేది.

ఖైబర్ కనుమలు

ఫొటో సోర్స్, GSINCLAIR ARCHIVE

మృత్యులోయకు ద్వారం

పెషావర్ నగరం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని జమ్రుద్ తాలూకాలో ఉన్న ఈ ద్వారాన్ని శత్రువులకు మృత్యులోయలోకి మార్గంగా చెప్పేవారు.

ఖైబర్ కనుమల ప్రాధాన్యం ఏంటో ఈ ద్వారమే చెబుతుంది. ఈ ద్వారాన్ని పాక్ మాజీ అధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ పాలనాకాలంలో నిర్మించారు. 1963 జూన్‌లో ఈ ద్వారం నిర్మాణం పూర్తైంది. కైబల్‌పూర్( ప్రస్తుతం అటక్)కు చెందిన ఇద్దరు మేస్త్రీలు దీన్ని నిర్మించారని చెబుతారు.

ఇది పూర్తి కావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ద్వారంపై ఉన్న శిలాశాసనాల్లో ఆ మార్గాన్ని ఉపయోగించుకుని ఎవరెవరు వచ్చారో ఆ పాలకులు, ఆక్రమణదారుల పేర్లు ఉన్నాయి.

ఆ ద్వారానికి దగ్గరగా సిక్కు సైన్యాధ్యక్షుడు హరి సింగ్ నల్వా ఒక నౌకలా కనిపించే కోటను నిర్మించారు. ఖైబర్ కనుమలపై నిఘా పెట్టడానికి, అక్కడ సైనికులను మోహరించడానికి వీలుగా ఆయన దానిని కట్టించారు.

ఖైబర్ కనుమల ప్రాంతంలో ఉన్న జనాభాలో అఫ్రిదీ వంశానికి చెందిన ఖోకీ ఖేల్‌కు తెగవారే ఎక్కువ మంది ఉన్నారు.

ఖైబర్ కనుమలు

ఫొటో సోర్స్, Alamy

జగజ్జేత అలెగ్జాండర్ వెనుదిరిగాడు

ప్రొఫెసర్ డాక్టర్ అస్లమ్ తాసీర్ అఫ్రీదీ ఖైబర్ పక్కనే ఉన్న ఓర్‌క్జాయ్ జిల్లాలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్. ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర నిపుణులు కూడా.

ఆయన ఆ ప్రాంతానికి అలెగ్జాండర్ వచ్చిన కాలానికి సంబంధించిన కొన్ని అంశాలు వివరించారు.

ఇరాన్‌పై విజయం సాధించిన తర్వాత పష్తూన్ల గాంధార ప్రాంతంపై విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన అలెగ్జాండర్ సైన్యానికి ఖైబర్ కనుమల్లో అతిపెద్ద అడ్డంకిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఖైబర్ కనుమలను దాటలేకపోయిన ఆయన, చివరికి తన తల్లి సలహాతో తన దారినే మార్చుకున్నారు.

అలెగ్జాండర్ అక్కడ నుంచి వెళ్లడాన్ని అఫ్రిదీ తెగవారు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో కారణం ఏంటో తెలుసుకునేందుకు అలెగ్జాండర్ తల్లి ఆ ప్రాంతంలోని కొందరిని విందుకు ఆహ్వానించారు.

అఫ్రిదీ తెగ నాయకులు అలెగ్జాండర్ తల్లితో చర్చలకు వచ్చారు. ఆమె అక్కడున్న నాయకులతో మీ అందరికీ నాయకుడు ఎవరు అని అడిగారు.

దాంతో అఫ్రిదీ తెగ పెద్దల్లో ప్రతి ఒక్కరూ నాయకుడు నేనంటే నేనే అని చెప్పుకున్నారు. చివరికి పరస్పరం గొడవకు కూడా దిగారు. దాంతో అలెగ్జాండర్ తల్లికి ఒక విషయం తెలిసింది. అఫ్రిదీ తెగవారు తమవారినే నాయకుడుగా గుర్తించనప్పుడు, అలెగ్జాండర్‌ తమపై ఆధిపత్యం చెలాయంచడానికి అసలు ఒప్పుకోరు అనేది అర్థమైంది.

తర్వాత భారత్ వెళ్లడానికి ఖైబర్ కనుమల్లోంచి వెళ్లాలనే ఆలోచన వదులుకోవడం మంచిదని ఆమె తన కొడుక్కి సలహా ఇచ్చారు.

దాంతో, అలెగ్జాండర్ తన దారి మార్చుకోవాల్సి వచ్చింది. ఆయన ఖైబర్ కనుమల్లోంచి వెళ్లకుండా బాజౌడ్ దారి గుండా తన గమ్యం వైపు ముందుకు కదిలారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న ఆ ప్రాంతంలో అలెగ్జాండర్ ప్రవేశించడం గురించి మాజీ బ్రిటిష్ గవర్నర్ సర్ ఓలాఫ్ కారో 'పఠాన్' అనే పుస్తకం రాశారు.

అందులో అలెగ్జాండర్ పెషావర్‌లో అడుగుపెట్టలేకపోయాడని ఆయన చెప్పారు. ఆయన దాటిన నదుల్లో కోసుస్‌ప్లా, గోరిస్ నదులు కూడా ఉన్నాయని తెలిపారు.

ఖైబర్ కనుమలు

ఫొటో సోర్స్, Getty Images

భారీ బౌద్ధ స్మారకాలు

ప్రముఖ జర్నలిస్ట్ అల్లా బక్ష్ యూసుఫీ తన తారీఖ్-ఎ-అఫ్రీదీ అనే పుస్తకంలో ఖైబర్ కనుమల గురించి కొన్ని కొన్ని వివరాలు రాశారు.

ఖైబర్ కనుమల్లో భారీగా బౌద్ధుల పురాతన ప్రాంతాలు లభించాయి. కానీ పష్తూన్లు విగ్రహారాధనకు వ్యతిరేకం. దాంతో, వారు వాటిని ధ్వంసం చేసేవారు.

అదే ప్రాంతంలో లాండీ ఖానా దగ్గర ఒక కొండపై ప్రాచీన కాలానికి చెందిన ఒక కోటలాంటి కట్టడం ఉంది. దానిని అక్కడి అఫ్రిదీలు 'కాఫిర్ కోట్' అంటుటారు.

"మహమ్మద్ ఘజనీ భారత్ మీద దాడులు చేయడానికి వచ్చే సమయంలో పష్తూన్లతో శత్రుత్వం కాకుండా వారికి తనపై నమ్మకం కలిగేలా చేసుకున్నారు. పష్తూన్ల పరిచయం తనకు దక్కిన అరుదైన గౌరవం అని చెప్పుకునేవారు" అని అల్లా బక్ష్ యూసుఫీ రాశారు.

మహమ్మద్ ఘజనీతోపాటూ యుద్ధాల్లో పాల్గొన్న స్థానిక తెగ నాయకుల్లో మాలిక్ ఖానో, మాలిక్ ఆమూ, మలిక్ దావర్, మలిక్ యాహ్యా, మలిక్ మహమూద్, మలిక్ ఆరిఫ్, మలిక్ గాజీ, మలిక్ షాహిద్, మలిక్ అహ్మద్ లాంటి వారు ఉన్నారు.

ఘజనీ సోమ్‌నాథ్ ఆలయంపై దాడి చేసిన సమయంలో ఆయనతో పష్తూన్లు కూడా ఉన్నారు. వారి పోరాటం చూసిన ఘజనీ.. వారికి ఖాన్ అనే పేరు ఇచ్చారు. అలా, పష్తూన్లు మాత్రమే ఖాన్ అని చెప్పుకోడానికి అర్హులయ్యారు.

జహీరుద్దీన్ బాబర్ తన బలంపై నమ్మకంతో భారత్ మీద విజయం సాధించగలననే ధీమాతో ఖైబర్ కనుమల వరకూ వచ్చినపుడు అఫ్రిదీ తెగ ఆయన దారిలో ఇనుప గోడలా నిలిచింది.

చివరకు బలప్రయోగంతో ఖైబర్ కనుమలు దాటడం కష్టమని బాబర్ గ్రహించారు. ఒకవేళ తిరిగి వెళ్లాలనుకున్నా అఫ్గానిస్తాన్ వైపు వెళ్లేటపుడు తమకు ఏదైనా జరగవచ్చి ఆయనకు అనిపించింది.

అందుకే, తన బలగాలను బలోపేతం చేసిన తర్వాత 1519లో బాబర్ మరోసారి ఖైబర్ కనుమలపై దాడి చేశారు.

బీకర యుద్ధం తర్వాత అలీ మసీదులో బాబర్ ఒకే ఒక రాత్రి మాత్రమే గడపగలిగారు. ఆయన జమ్రుద్ చేరుకున్నారు. కానీ తను పంజాబ్ వెళ్తే, తిరిగి వచ్చేటపుడు అఫ్రిదీ తెగ తన దారిని అడ్డగిస్తుందేమో అని భయపడ్డారు.

ఖైబర్ కనుమలు

ఫొటో సోర్స్, Getty Images

సిక్కుల పాలనాకాలం

సిక్కు పాలకుడు రంజీత్ సింగ్‌కు పష్తూన్లపై అధికారం చెలాయించాలంటే ఒక బలమైన నాయకుడు అవసరం అనిపించింది. దాంతో ఆయన సిక్కుల సైన్యాధ్యక్షుడు హరి సింగ్ నల్వాను ఒక పెద్ద సైన్యం ఇచ్చి పెషావర్ పాలనాధికారిగా నియమించారు.

హరి సింగ్ పష్తూన్లను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ అక్కడ తెగలవారికి పెద్దగా నష్టం కలిగించలేకపోయారు. అఫ్రిదీ తెగ వారి చర్యలు రంజిత్ సింగ్‌కు కూడా కలవరం కలిగించాయి.

ఆ భయంతోనే ఆయన అక్కడి తెగల దాడుల నుంచి కాపాడుకోడానికి హరి సింగ్ నాల్వా బాబ్-ఎ-ఖైబర్‌కు దగ్గరగా అంటే ఖైబర్ కనుమల్లో వాగుల దగ్గర ఒక కోట నిర్మించాలని అనుకున్నారు. 1836లో దాని పనులు ప్రారంభించారు.

అయితే, సిక్కులు స్థానిక తెగల నుంచి తమను కాపాడుకోడానికి ఈ కోట కట్టారు. కానీ, అఫ్గానిస్తాన్‌లోని అమీర్ దోస్త్ మొహమ్మద్ ఖాన్ దానిని తనకు వ్యతిరేకంగా కట్టారని అనుకున్నారు. ఆయన సిక్కు సేనలపై దాడి చేశారు. ఆ దాడుల్లో హరి సింగ్ చనిపోయారు.

ఖైబర్ కనుమలు

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 'మవాజిబ్‌'

సిక్కు సేనలను అఫ్గానిస్తాన్‌లో మొహరించినపుడు ఆంగ్లేయులకు ఖైబర్ కనుమల గుండా రాకపోకలు చాలా అవసరం అయ్యాయి. కానీ అఫ్రిదీ తెగవారికి చెల్లింపులు చేయకుండా అది సాధ్యం కాదు.

అఫ్రిదీలకు ఎంతోకొంత చెల్లించనిదే వాళ్లు శాంతించరనే విషయం ఆంగ్లేయులకు తెలుసు.

దాంతో, ఖైబర్ కనుమల్లో తమను అనుమతించడానికి ఆంగ్లేయులు అఫ్రిదీలకు ఏటా లక్షా 25 వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చేది.

అఫ్గానిస్తాన్‌లో రెండేళ్ల ఉన్న తర్వాత ఓటమి పాలైన ఆంగ్లేయులు తమ సిక్కు సైన్యంతో ఖైబర్ కనుమల్లో తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో అక్కడ అఫ్రిదీ తెగవారు వారిపై దాడి చేసి షాక్ ఇచ్చారు.

ఖైబర్ కనుమల్లో అలీ మసీదు దగ్గరకు చేరుకున్నప్పుడు ఆంగ్లేయులపైకి వచ్చిన అఫ్రిదీ తెగవారు వారి దగ్గరున్న ఫిరంగులు, తుపాకులు అన్నింటినీ లాక్కున్నారు.

అఫ్రీదీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆంగ్లేయులు ఆ మార్గంలో భద్రంగా వెళ్లడానికి, యుద్ధం జరగకుండా ఉండడానికి ఏటా ఆ మొత్తం చెల్లించేవారు. దానిని స్థానిక భాషలో 'మవాజిబ్' అనేవారు.

ఆంగ్లేయులు ఆ మొత్తాన్ని ఏడాదిలో రెండు సార్లు చెల్లించేవారు. అఫ్రిదీలు దానిని(మవాజిబ్)ను తీసుకోవడం ఒక గొప్పగా, గర్వంగా అఫ్రిదీలు భావించేవారు.

ఆ తెగ నాయకులు వృద్ధులు. వారంతా ఆ ప్రాంతానికి చాలా దూరంగా ఉండేవారు. ఆంగ్లేయులు చెల్లించే ఆ మొత్తం తీసుకోడానికనే వాళ్లు వేలు ఖర్చు పెట్టి అక్కడకు వచ్చేవారు. ఎట్టిపరిస్థితుల్లో ఆ మవాజిబ్‌ను వదులుకునేవారు కాదు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ సైన్యంపై విమర్శలు చేస్తే, ఇంత దారుణమా?

అఫ్రిదీలు ఎప్పట్నుంచి ఉన్నారు

ప్రొఫెసర్ డాక్టర్ అస్లమ్ తాసీర్ ఖైబర్ కనుమల ప్రాంతంలో ఉండే అఫ్రిదీల గురించి వివరించారు.

జమ్రుద్ నుంచి తిరాహ్, చోరాహ్ వరకూ ఆ ప్రాంతంలో అఫ్రిదీల ఉనికి ఉంది. వారు జలాలాబాద్ నుంచి పాకిస్తాన్‌లోని ప్రస్తుత మర్దాన్ నగరం వరకూ ఒక పష్తూన్ రాజ్యాన్ని కూడా స్థాపించారు. బాయజీద్ అన్సారీ అలియాస్ పీర్ రోఖాన్ దానిని ఏర్పాటుచేశారు. అందులో వజీరిస్తాన్ ప్రాంతం కూడా ఉండేది.

భారత్‌లో వ్యవసాయంతో సుభిక్షంగా ఉండడంతో దాన్ని అందరూ బంగారు పిచ్చుకలా భావించేవారు. అందుకే, ఎంతోమంది పాలకులు, ఆక్రమణదారులు దానిని ఆక్రమించుకోవాలని, తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించేవారు.

వారంతా గాంధారా అంటే పష్తూన్ల ప్రాంతంలోని మార్గంలోనే వచ్చేవారు. అక్కడ ఖైబర్ కనుమలు వారికి ఇనుప గోడల్లా నిలిచాయి.

బాబ్-ఎ-ఖైబర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 29 యుద్ధాలు జరిగాయి. అందులో సిక్కులు, ఆంగ్లేయుల యుద్ధాలతోపాటూ స్థానిక తెగల మధ్య జరిగిన యుద్ధాలు కూడా ఉన్నాయి.

అఫ్రిదీ తెగలో చాలా శాఖలు ఉన్నాయి. కానీ ఒక్కో శాఖ ఒక్కో ప్రాంతంలో ఉంటుంది. వీటిలో అతిపెద్ద శాఖ కోకీ ఖేల్. బాబ్-ఎ-ఖైబర్ నుంచి ఖైబర్ కనుమల వరకూ ఉన్న విశాల ప్రాంతం తిరాహ్‌లో వీరు ఉంటున్నారు.

జమ్రుద్‌ను నియంత్రణలోకి తెచ్చుకోడానికి తహకాల్‌కు చెందిన అర్బాబ్ సర్ఫరాజ్ ఖాన్ తన తెగకు చాలా సాయం చేశారని కోకీ ఖేల్ తెగకు చెందిన మలిక్ అబ్దుల్లా నూర్ కూడా చెప్పారు.

ప్రపంచంలో ఎక్కెడెక్కడినుంచో వచ్చే పాలకులు తమ ప్రాంతంపై విజయం సాధించాలని కోరుకునేవారని, మరోవైపు, తమ ప్రాంతంలో తెగల మధ్య కూడా అధికారం, భూముల కోసం పోరాటాలు జరిగేవని కూడా ఆయన చెప్పారు.

అయితే ఒకప్పుడు బీకర యుద్ధాలతో రక్తమోడిన ప్రాంతం ఇప్పుడు చాలా కాలంగా ప్రశాంతంగా ఉందని, ఆ ప్రాంతంలో ఉన్న అన్ని తెగలూ తమ తమ సరిహద్దుల్లో ప్రశాంత జీవనం గడుపుతున్నారని నూర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)