మధ్యయుగంలో రాజులు మెచ్చిన ఈ పండు అకస్మాత్తుగా ఎలా కనుమరుగైంది...

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, జరియా గోర్వెట్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
అది 2011 సంవత్సరం.
టాస్గేటియం అనే గ్రామంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది.
రైన్ నదిపై నిర్మితమైన ఈ గ్రామాన్ని పూర్వకాలంలో సెల్టిక్ అనే రాజు పాలించేవాడు.
జూలియస్ సీజర్ ఈ ప్రాంతాన్ని స్వయంగా సెల్టిక్ రాజుకు బహుకరించారు.
ఇదిప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉంది.
ఆ గ్రామంలోని ఒక రోమన్ టాయిలెట్‌లో పురావస్తు శాఖ అధికారులకు అంతుచిక్కని అసాధారణ విత్తనాలు దొరికాయి.
ప్లమ్స్, చెర్రీలు, పీచెస్, వాల్‌నట్ వంటి వాటి మధ్యలో పురావస్తు శాస్త్రవేత్తలకు 19 పెద్ద విత్తనాలు దొరికాయి.
వీటిని కనీసం 2000 సంవత్సరాల క్రితం భద్రపరచి ఉంటారని భావిస్తున్నారు.
ఈ విత్తనాలు ఎప్పుడో కుళ్లిపోయి ఉండాల్సింది.
కానీ అవి నిన్ననే పెట్టినంత తాజాగా ఉన్నాయి.
గాలి చొరబడే అవకాశం కూడా లేకపోవడం వల్ల అవి అలా తాజాగా ఉండి ఉండొచ్చని అనుకుంటున్నారు.
కానీ అక్కడ దొరికిన పండ్లు మాత్రం వృక్షశాస్త్ర నిపుణులకు కూడా అంతుచిక్కలేదు.

ఫొటో సోర్స్, Alamy
మెడ్లర్.. ఘనమైన చరిత్ర
ఆ ఫలం పేరు మెడ్లర్.
ఒకప్పుడు యూరప్‌లో ఈ పండుకి విపరీతమైన డిమాండ్ ఉండేది.
క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన గ్రీకు కవిత్వంలో ఈ ఫ్రూట్ ప్రస్తావన కనిపిస్తుంది.
నెమ్మదిగా ఈ ఫలం రోమన్ల చేతిలోకి వెళ్లిపోయింది.
వీరు దీన్ని దక్షిణ ఫ్రాన్స్, బ్రిటన్‌కి తీసుకెళ్లారు.
క్రీస్తుశకం 800లో రాజుల తోటల్లో ఈ చెట్టు కచ్చితంగా ఉండేది.
200 సంవత్సరాల తర్వాత ఎల్ఫ్రిక్ ఆఫ్ ఏషం అనే ఇంగ్లిష్ రచయిత దీనికొక ముద్దు పేరు పెట్టారు.
అప్పటి నుంచి ఈ పండు ప్రాముఖ్యం పెరగడం మొదలైంది.

ఫొటో సోర్స్, Alamy
షేక్స్‌స్పియర్ రోమియో అండ్ జూలియట్‌లో ఈ పండు ప్రస్తావన
మధ్యయుగంలో బౌద్ధారామాలు, రాజ భవనాలలో ఇదొక ముఖ్య ఆహారంగా మారిపోయింది.
పల్లెటూళ్లలో కూడా ఈ చెట్టు విరివిగా కనిపించేది.
ఈ పండు ప్రస్తావన కాంటర్బరీ టేల్స్, షేక్స్‌స్పియర్ రోమియో అండ్ జూలియట్‌లలో కనిపిస్తుంది.
8వ హెన్రీ కూడా హ్యాంప్టన్ కోర్టులో ఈ విత్తనాలను నాటించారు.
ఆయన తన ఫ్రెంచ్ సమకాలీకులకు కూడా వాటిని బహుమానంగా ఇచ్చారు.
1600 నాటికి ఇంగ్లాండ్‌లో ఆపిల్, మల్బరీల మాదిరిగానే ఈ పండును విరివిగా పండించేవారు.
కానీ మధ్యయుగంలో ఓ వెలుగు వెలిగిన ఈ ఫ్రూట్ క్రమంగా పతనం కావడం మొదలయింది.
20వ శతాబ్దంలో కూడా ఈ ఫలం గురించి కొంత తెలిసినప్పటికీ దీని గురించి గొప్పగా చెప్పుకునే వారు కాదు.
దాంతో ఈ పండు ప్రజల జ్ఞాపకాలలోంచి మాయమైంది.
"ఒకప్పుడు ఇంటింటా వినిపించిన ఈ పండు కేవలం గతం మిగిల్చిన ఒక అవశేషంగా మిగిలిపోయింది. ఇదిప్పుడు ఆసక్తి కలిగిన వృక్ష ప్రేమికుల దగ్గర, రాజ భవనాలు, మ్యూజియంలలోనూ ఒక చారిత్రక ఉత్సుకతగా మిగిలిపోయింది" అని ఒక రోమన్ వ్యాఖ్యాత అన్నారు.
ఇప్పుడు ఈ ఫ్రూట్ బ్రిటన్ సూపర్ మార్కెట్లలో ఎక్కడా కనిపించదు.
ఒకవేళ ఇవి ఎక్కడైనా కనిపించినా ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోరు.

ఫొటో సోర్స్, Alamy
ఈ ఫలం ప్రత్యేకత ఏమిటి?
మెడ్లర్ ఎక్కడ పుట్టిందో తెలియదు. కానీ, దీనిని 3000 సంవత్సరాల క్రితం పశ్చిమాసియాలో కాస్పియన్ సముద్ర తీరంలో పెంచారని కొందరు చెబుతారు. ఇప్పటికీ వీటి రకాలు ఆ ప్రాంతంలో కనిపిస్తాయి.
ఈ చెట్టును ఆపిల్, గులాబీ, సీతాఫలానికి దగ్గరగా ఉండే జాతిగా చెబుతారు.
కింద భాగంలో వంగిన కొమ్మలు, పైభాగంలో అందంగా అల్లిన దట్టమైన ఆకులు ఉండి ఈ చెట్టు అందంగా కనిపిస్తుంది.
వసంత కాలంలో నక్షత్ర ఆకారంలో ఉండే పువ్వులు పూస్తాయి.
శరత్కాలం వచ్చే సరికి పచ్చగా, ఎరుపు, గోధుమ రంగుల సమ్మేళనంతో కనువిందు చేస్తుంది.
ఈ చెట్లు చాలా అసాధారణమైనవి.
ఇవి డిసెంబరులో కాపుకు వస్తాయి.

ఫొటో సోర్స్, Alamy
కుళ్లిన తర్వాతే తినాలి
ఈ పండ్లు కుళ్లిన తర్వాత మాత్రమే తినడానికి పనికొస్తాయి.
ఇవి చెట్టు నుంచి తీసేటప్పుడు పచ్చగా, గోధుమ రంగులో ఉంటాయి.
ఇవి అస్తవ్యస్తంగా ఉన్న ఉల్లిపాయ ఆకారంలో ఉంటాయి.
వీటిని నేరుగా తింటే తీవ్ర అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని 18వ శతాబ్దపు వైద్యులు పేర్కొన్నారు.
కానీ వీటిని కొన్ని వారాల పాటు మగ్గబెట్టి కుళ్లిన తర్వాత తింటే మంచిదని చెప్పారు.
వీటి రుచి కాల్చిన ఆపిల్‌లా ఉంటుంది.
ఈ పండులో అంతు చిక్కని రసాయన చర్య జరుగుతుంది.
ఈ పండులో ఉండే ఎంజైములు క్లిష్టమైన కార్బోహైడ్రేట్‌లను తేలికపాటి చక్కెరలాగా ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌గా మారుస్తుంది. అందుకే ఇందులో మాలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. దీని వల్లే వీటికి పుల్లటి రుచి వస్తుంది.
ఈ ప్రక్రియనే బ్లేట్టింగ్ అని అంటారు. ఈ పదాన్ని 1939లో ఒక బోటనిస్ట్ కనిపెట్టారు.
ఈ ప్రక్రియ వల్ల దీనికి బాగా పండిన కర్జూరాన్ని నిమ్మకాయలతో కలిపితే వచ్చే రుచి వస్తుంది.
"ఇవి బాగా మగ్గినప్పుడు తినడానికి బాగుంటాయి" అని 2015లో నార్ఫోక్ పండ్ల తోటలో 120 మెడ్లర్ చెట్లను నాటిన జేన్ స్టెవార్డ్ చెప్పారు.
బ్రిటన్‌లో భారీ స్థాయిలో జరిగిన ఈ చెట్ల సేకరణ ఇదే అని చెప్పవచ్చు.
ఈ ఫలం అందరికీ నచ్చాలనే నియమం ఏమి లేదు.
"మెడ్లర్ ఒక కుళ్లిన ఆపిల్ కంటే కేవలం ఒక డిగ్రీ రుచిగా ఉంటుంది" అని మధ్యయుగం నాటి ఒక ప్రచురణలో రాశారు.

ఫొటో సోర్స్, Alamy
ఈ పండును ఎలా తినేవాళ్లు?
ఈ పండును ఎలా తినాలనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.
దీనిని సాధారణ ప్రజలు నేరుగా నోట్లో పెట్టుకుని గుజ్జును తినేవారు.
విలాసవంతమైన ప్రదేశాల్లో ఈ పండులో గుజ్జును చీజ్‌తో కలిపి వడ్డిస్తే, స్పూన్‌తో తినేవారు.
దీనిని కాల్చి, వేపి జెల్లీ కూడా తయారు చేసేవారు. దీనిని బ్రాందీగా కూడా మార్చేవారు.
ఈ ఫలం డిమాండ్ తగ్గిపోవడానికి బ్లేట్టింగ్ ప్రక్రియ కూడా ఒక కారణమని భావిస్తారు.
19వ శతాబ్దపు చివరి భాగం, 20వ శతాబ్దం మొదటి వరకు ఈ పండు ప్రాచుర్యంలోనే ఉండేది.
రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా దీనిని పశుగ్రాసంగా వాడేవారు.
ఎందుకు కనుమరుగైంది?
కానీ, ఇది నెమ్మదిగా షాపుల నుంచి మాయమయింది.
సంవత్సరం అంతా పండే అరటిపళ్లు, పైనాపిల్ లాంటి ఫలాలు చౌకగా దొరకటం కూడా మెడ్లర్ డిమాండ్ తగ్గడానికి మరో కారణం కావొచ్చు.
యూరప్‌లో గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ఈ చెట్లు అక్కడక్కడా కనిపిస్తాయి. కానీ, వీటిని వెతకాల్సి ఉంటుంది.
1820లో నార్ఫోక్‌లో నాటిన రకం నేటికీ పండ్లు ఇస్తోంది.
కానీ, మెడ్లర్ నేటికీ దాని జన్మస్థానం కాస్పియన్ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగానే కనిపిస్తుంది.
ఇరాన్, అజర్‌బైజాన్, కిర్గిస్తాన్, జార్జియా, టర్కీలలో ఈ చెట్లను పెంచి మార్కెట్లలో అమ్ముతున్నారు.
కిర్గిస్తాన్ నుంచి ఇంగ్లండ్ వెళ్లిన ఒక కుటుంబం ఈ చెట్లను అక్కడ పెంచడానికి చాలా ఉత్సాహం చూపించారని
120 మెడ్లర్ చెట్లను నాటిన జేన్ స్టెవార్డ్ చెప్పారు.
ఔషధంగా మెడ్లర్
ఈ ప్రాంతంలో సంప్రదాయ వైద్య విధానాల్లో ఈ పండును ఔషధంగా కూడా వాడతారు.
ఉత్తర ఇరాన్‌లోని గిలాన్ గ్రామీణ ప్రాంతంలో మెడ్లర్ చెట్టు ఆకులు, బెరడు, పండ్లు, చెక్కను విరేచనాలు, కడుపు ఉబ్బరం, రుతుస్రావం సమస్యలకు ఔషధంగా వాడతారు.
మధ్య యుగం నాటి యూరప్‌లో దీనిని అనేక విధాలుగా వాడేవారు.
అధిక రుతుస్రావం అయ్యేటప్పుడు ఈ ఫలం ఔషధంలా పని చేస్తుందని 17వ శతాబ్దపు బోటనిస్ట్ డాక్టర్ నికోలస్ కల్ పెపెర్ రాశారు.
ఎండిన గుజ్జుతో లవంగాలు, జాజికాయ, ఎర్ర పగడం, గులాబీ రెక్కల రసం కలిపి లేపనం చేస్తే పొట్ట తేలికవుతుందని చెప్పారు.
స్టెవార్డ్ లాంటి వ్యక్తుల ప్రయత్నాల వల్ల 2021లో ఈ పండు నెమ్మదిగా తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది.
ఆమె ఈ పండ్ల నుంచి తయారు చేసిన అనేక ఉత్పత్తులను మార్కెట్‌లో అమ్ముతూ ఉంటారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









