మమతా బెనర్జీ: 18 ఏళ్ల క్రితం తనను పోలీసులు మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లినపుడు 'దీదీ' ఏమని శపథం చేశారు

ఫొటో సోర్స్, ARKO DATTA
- రచయిత, ప్రభాకర్ మణి తివారీ
- హోదా, బీబీసీ కోసం
తేదీ మే 12, 2011.
ప్రదేశం: కోల్‌కతాలోని కాళీఘాట్‌లో రెండు గదులున్న ఒక ఇల్లు.
2011 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
ఆ ఇంటి దగ్గరికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో చేరుకుంటున్నారు.
మమత బెనర్జీ ముఖం ఇంకా ప్రశాంతంగానే కనిపిస్తోంది.
కాంగ్రెస్‌తో విడిపోయి కొత్త పార్టీ పెట్టిన 13 సంవత్సరాలకు పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలను గద్దె దించాలన్న ఆమె కల అప్పుడే సాకారమవుతోంది.
ఆమె చేసిన ఒక శపథం కూడా నెరవేరబోతోంది.
టీఎంసీకి భారీ మెజార్టీ రావడం ఖాయమైపోయింది.
కానీ, మమత సంబరాలు చేసుకోవడానికి బదులు, తదుపరి వ్యూహాలను రూపొందించడంలో మునిగిపోయారు.
అప్పటికి కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న మమత ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ఫలితాలు వెల్లడైన తర్వాత, ఆ రోజు రాత్రంతా తన సన్నిహితులతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి రూపునివ్వడంలో ఆమె మునిగిసోయారు.
మమతా బెనర్జీకి ఒకప్పుడు సన్నిహితురాలైన సోనాలీ గుహా ఆ సందర్భం గురించి చెప్పారు.
ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీ టికెట్ ఇవ్వలేదన్న కోపంతో సోనాలీ బీజేపీలో చేరారు.
ఎన్నికల ఫలితాలు వచ్చాక మమత స్పందించిన తీరు కూడా చాలా సాదాసీదాగా ఉంది.
''ఇది మాత, మట్టి, మనుషులు సాధించిన విజయం. బెంగాల్ ప్రజలు సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం. అదే సమయంలో ఈ రోజు కోసం గత మూడు దశాబ్దాలుగా బలిదానాలు చేసిన వారిని కూడా మనం స్మరించుకోవాలి'' అని మమత అన్నారు.

ఫొటో సోర్స్, STR
18 ఏళ్ల శపథం నెరవేరిన వేళ
మమత 18 ఏళ్లనాటి శపథం ఆ రోజు నెరవేరబోతుంది.
1993 జులైలో మమతా బెనర్జీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు.
ఆమె నేతృత్వంలో అప్పుడు రాష్ట్ర సచివాలయంగా ఉన్న రైటర్స్ బిల్డింగ్‌ను ముట్టడించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది నిరసనకారులు చనిపోయారు.
ఆ నిరసనల్లో మమత కూడా గాయపడ్డారు.
అంతకుముందు, అదే ఏడాది జనవరి 7న నదియా జిల్లాకు చెందిన బధిరురాలైన ఒక అత్యాచార బాధితురాలిని వెంటతీసుకుని మమత రైటర్స్ బిల్డింగ్‌కు వెళ్లారు.
అప్పుడు రాష్ట్ర సీఎంగా ఉన్న జ్యోతిబసును కలిసే అవకాశం ఇవ్వాలంటూ ఆయన చాంబర్ ద్వారం ముందు కూర్చొని ధర్నా చేశారు.
రాజకీయ ఒత్తిడి కారణంగానే ఆ మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మమత ఆరోపించారు.
మమత అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినా, జ్యోతిబసు ఆమెకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.
జ్యోతిబసు వచ్చే సమయం కావడంతో ఆమెను, ఆ మహిళను సీఎం భద్రతా సిబ్బంది అక్కడి నుంచి కదిలించే ప్రయత్నం చేశారు.
వాళ్లు ఎంత గట్టిగా చెప్పినా, మమత అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఒప్పుకోలేదు.
మహిళా పోలీసులు మమతను, ఆమెతో పాటు ఉన్న మహిళను మెట్ల మీదుగా ఈడ్చుకుంటూ లాల్‌బజార్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. అలా తీసుకొస్తున్నప్పుడు వారి దుస్తులు కూడా చిరిగిపోయాయి.
ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరిగి ఆ కార్యాలయంలో తాను అడుగుపెడతానని మమత అప్పుడు శపథం చేశారు.
దాదాపు 18 ఏళ్ల తర్వాత, 2011 మే 20న ఆమె ముఖ్యమంత్రిగా తిరిగి ఆ భవనంలో అడుగుపెట్టారు.
మమత రాజకీయాలంటే జ్యోతిబసు బాగా చికాకుపడేవారు.
ఆయన బహిరంగంగా మమత పేరును పలికేందుకు కూడా ఇష్టపడేవారు కాదు.
మమత గురించి ప్రస్తావించాల్సివస్తే, 'ఆ మహిళ' అని అనేవారు.

ఫొటో సోర్స్, DESHAKALYAN CHOWDHURY
పోరాటతత్వం
మమత బెనర్జీ తన రాజకీయ జీవితంలో చాలా కఠినమైన ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నారు.
1990లో సీపీఎం కార్యకర్త లాలూ ఆలం చేసిన దాడి, సింగూరులో టాటా ప్రాజెక్టు కోసం జరిగిన భూసేకరణకు వ్యతిరేకంగా 26 రోజుల ఆందోళన...అన్నీ అలాంటివే.
వీటిలో ప్రతి ఘటనా ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పేవే అయ్యాయి.
1990 ఆగస్టు 16న కాంగ్రెస్ బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది.
ఆ సమయంలో లాలూ ఆలం అనే వ్యక్తి మమత తలపై లాఠీతో కొట్టాడు.
ఆమె తల పగిలింది. కానీ, తలకు పట్టీ కట్టుకుని మమత మళ్లీ రోడ్డు మీదకు వచ్చారు.
''అప్పుడు, మమత పని అయిపోయిందని మేం అనుకున్నాం. కానీ బెంగాల్ ప్రజలకు ఏదో చేయాలన్న తపన, ఆ పట్టుదల ఆమెను బతికించాయి'' అని మమతా బెనర్జీ సన్నిహితుడు సౌగత్ రాయ్ అన్నారు.
''మన దేశంలోనే చాలా గట్టి పట్టుదల ఉన్న మహిళా నేతల్లో మమత ఒకరు'' అని 'దీదీ: ద అన్‌టోల్డ్ మమతా బెనర్జీ' పేరుతో మమత జీవిత కథను రాసిన సుత్పా పాల్ అన్నారు.
''ప్రత్యేకమైన వ్యక్తిత్వం, దూకుడు రాజకీయాలతో, తన రాజకీయ జీవితంలో అసాధ్యమైన ఎన్నో పనులను మమత సుసాధ్యం చేసి చూపించారు. వాటిలో వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించడం ఒకటి'' అని సుత్పా పాల్ తన పుస్తకంలో రాశారు.
'జనాలు మమత విషయంలో చూపినంత ఆసక్తి, దేశంలో మరే మహిళా నేత జీవితం మీద చూపించరేమో!. ఆమె చరిష్మా పూర్తిగా భిన్నం'' అని 'డీకోడింగ్ దీదీ' అన్న పేరుతో రాసిన పుస్తకంలో దోలా మిత్ర్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, DESHAKALYAN CHOWDHURY
రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి 2011లో ముఖ్యమంత్రి అయ్యేవరకూ మమత ప్రయాణం గురించి ఈ రెండు పుస్తకాల్లో సవివరంగా ఉంది.
''మమత జీవితంలో ఎప్పుడూ సింపుల్‌గా ఉండటానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఎంపీగా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా తెల్లటి నూలు చీరనే కట్టేవారు. 'ముఖ్యమంత్రి అయ్యాక ఆమె జీవనశైలిలో, వస్త్రధారణలో పెద్దగా మార్పు రాలేదు. ఇంటా, బయటా ఆమె వ్యవహరించే పద్ధతి ఏమీ మారలేదు'' అని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ సమీరన్ పాల్ అన్నారు.
''మూలాలు ఎప్పుడూ మరిచిపోకుండా ఉండటమే ఆమె బలం. సింగూర్ రైతులకు మద్దతుగా చేపట్టిన దీక్ష గానీ, నందిగ్రామ్‌లో పోలీసుల కాల్పుల్లో బాధితుల కోసం చేసిన పోరాటం గానీ... ఎందులోనైనా మమత ఎప్పుడూ పోరాట పటిమ చూపారు'' అని ఫ్రొఫెసర్ అన్నారు.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP
తృణమూల్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి సీనియర్ జర్నలిస్ట్ తపస్ ముఖర్జీ మమత బెనర్జీ రాజకీయాలను కవర్ చేస్తున్నారు.
''పడిలేస్తూ మమత బెనర్జీ రాజకీయాల్లో ఎదిగిన తీరు, ప్రస్తుత తరం నాయకుల్లో మనకు ఎక్కడా కనిపించదు. ఆమె ఓటమికి భయపడరు. రెట్టించిన బలంతో విజయం కోసం కృషి చేస్తారు'' అంటారు తపస్.
2006 అసెంబ్లీ ఎన్నికలను ఆయన దీనికి ఉదాహరణగా ప్రస్తావించారు.
అప్పుడు మమత పార్టీ అధికారంలోకి రావడం ఖాయమేనని మీడియా, రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరిగింది.
అప్పుడు, టీఎంసీ సభల్లో జనం పెద్ద ఎత్తున కనిపించినా, ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఆ పార్టీకి పరాజయం ఎదురైంది.
వామపక్షాలు 'సైంటిఫిక్ రిగ్గింగ్' చేశాయని అప్పుడు మమత ఆరోపించారు.
అప్పటి నుంచే 2011 ఎన్నికల కోసం సిద్ధమవ్వడంలో మునిగిపోయారు.
ఆ తర్వాత నందిగ్రామ్, సింగూర్ అంశాలు ఆమెకు రాజకీయంగా బాగా ఉపయోగపడ్డాయి.
''2004 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ నుంచి మమత ఒక్కరే ఎంపీగా గెలిచారు. కానీ, 2019లో ఆ పార్టీ ఎంపీల బలం 19కి పెరిగింది'' అని చెప్పారు తపస్.

ఫొటో సోర్స్, DESHAKALYAN CHOWDHURY
కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు, సైద్ధాంతిక విభేదాలతో, ఆ పార్టీని వదిలి, కొత్త పార్టీ ఏర్పాటు చేసి, రాష్ట్రంలో బలంగా వేళ్లూనుకున్న లెఫ్ట్ ప్రభుత్వానికి 13 ఏళ్లలోనే గట్టి పోటీ ఇవ్వడం, రోడ్డు మీద నుంచి సచివాలయం వరకూ చేరుకోవడం లాంటి ఆమె విజయాలను చూసి మమతా బెనర్జీ బద్ధ శత్రువులే ముక్కున వేలేసుకుంటారు.
ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మమతను ఓడించిన సోమెన్ మిత్రా కూడా తర్వాత మమతను ఎదుర్కోలేమని భావించారు.
తర్వాత ఆయన కాంగ్రెస్ వదిలి టీఎంసీలోకి వచ్చేశారు. ఎంపీ కూడా అయ్యారు.
మొండిపట్టు, పోరాట పటిమ మమత రక్తంలోనే ఉన్నాయని చాలాకాలంగా, టీఎంసీని కవర్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ పులకేశ్ ఘోష్ భావిస్తారు.
"ఆ పోరాట పటిమ ఆమెకు తన గురువు, స్వాతంత్ర్య సమర యోధుడు అయిన తండ్రి ప్రమీలేశ్వర్ బెనర్జీ నుంచి వారసత్వంగా వచ్చింది. ఆ లక్షణాల వల్లే ఆమె 1998లో కాంగ్రెస్‌తో బంధం తెంచుకుని తృణమూల్ కాంగ్రెస్ స్థాపించారు. కేవలం 13 ఏళ్లలోనే రాష్ట్రంలో దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్‌ను గద్దె దించి, తమ పార్టీని అధికారంలో కూర్చోపెట్టారు" అన్నారు.
2016లో అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు, సీట్లు పెరిగాయంటే, దానికి మమత చరిష్మానే కారణం.
సింగూర్, నందిగ్రామ్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆమె తీవ్ర స్థాయిలో చేసిన ఉద్యమాలు ఒక పోరాడే నేతగా మమత ఇమేజ్‌ను మరింత పెంచాయి.
టీఎంసీ రైటర్స్ బిల్డింగ్ వరకూ చేరుకోడానికి అవి బాటలు వేశాయి.

ఫొటో సోర్స్, RAVEENDRAN
రాజకీయ ప్రయాణం
మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణం 21 ఏళ్ల వయసులో 1976లో మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ప్రారంభమైంది.
1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన మమతా బెనర్జీ సీపీఎం ప్రముఖ నేత సోమ్‌నాథ్ చటర్జీని ఓడించి ఎంపీగా మొదటి అడుగుతోనే సంచలనం సృష్టించారు.
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మమతను యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు.
కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీయడంతో 1989లో ఆమె ఎన్నికల్లో ఓడిపోయారు.
కానీ, ఏమాత్రం తొనకకుండా ఆమె తన మొత్తం దృష్టిని బెంగాల్ రాజకీయాల మీద కేంద్రీకరించారు.
1991 ఎన్నికల్లో మమత లోక్‌సభకు మరోసారి ఎన్నికయ్యారు.
ఆ తర్వాత ఆమె ఇక ఎప్పుడూ వెనక్కు చూసుకోలేదు.
ఆ ఏడాది ఎన్నికల్లో గెలిచిన తర్వాత పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆమెకు యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ బాధ్యతలు అప్పగించారు.
కేంద్రంలో రెండేళ్లు మంత్రి పదవిలో ఉన్న తర్వాత, మమతా కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు.
తమ రాష్ట్రంలో సీపీఎం అరాచకాలకు గురైన కాంగ్రెస్ నేతలకు అండగా ఉండాలని తాను అనుకుంటున్నట్లు ఆ సభలో ఆమె చెప్పారు.
రాజకీయ కెరియర్ ప్రారంభం నుంచీ మమత లక్ష్యం ఒక్కటే.
బెంగాల్‌లో వామపక్షాలను అధికారం నుంచి దించడం. దానికోసం ఆమె చాలాసార్లు తమ సహచరులను మార్చారు.
దానికోసం ఆమె ఒక్కోసారి ఎన్డీయే వైపు నిలిస్తే, ఇంకోసారి కాంగ్రెస్ చేయి అందుకున్నారు.
2012లో టైమ్ పత్రిక ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో మమత ఒకరని పేర్కొంది.
అయితే, మమత రాజకీయ ప్రయాణంలో ఎన్నో వివాదాస్పద ఘటనలు కూడా జరిగాయి. అవి ఆమె ఇమేజ్‌ను మార్చాయి.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP
నియంతృత్వంగా వ్యవహరిస్తారని, తనపై వచ్చే విమర్శలను సహించలేరని మమతపై ఆరోపణలు ఉన్నాయి.
దానీతోపాటూ పార్టీలో తన మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీని వెనకేసుకొస్తారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
అవినీతి నేతలకు రక్షణ కల్పించడంతోపాటూ మమతపై ఎన్నో అంశాల్లో ప్రశ్నలు వెల్లువెత్తాయి.
ఆమెపై ఉన్న అత్యంత తీవ్రమైన ఆరోపణ.. మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడం.
మమత ఒక రాజకీయ నేతే కాదు. ఆమె కవి, రచయిత, చిత్రకారిణి కూడా.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తన పెయింటింగ్స్ విక్రయించి ఎన్నికల ప్రచారం కోసం లక్షల రూపాయలు సేకరించారు.
అయితే, ఆమె వేసిన ఆ పెయింటింగ్స్ కొనుగోలు చేసిన వారి గురించి కూడా ఆ తర్వాత ప్రశ్నలు వచ్చాయి.
విపక్షాలు మమతను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశాయి.
వీటిని కొనుగోలు చేసినవారిలో రాష్ట్రంలోని చాలా చిట్‌ఫండ్ కంపెనీల యజమానులు ఉన్నారు.
ముఖ్యమంత్రి అయ్యాక, ఆమె కవితలు, కథలతో పదుల సంఖ్యలో పుస్తకాలు వచ్చాయి.
మమత తన ప్రసంగాల్లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్ చంద్ర గురించి కూడా ప్రస్తావించేవారు.
పశ్చిమ బెంగాల్‌లో గత దశాబ్దంలో అత్యంత ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సవాళ్లు చుట్టుముట్టిన దశలో, మమతా ఈసారీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోగలరా అనే ప్రశ్న కూడా వస్తోంది.
ముకుల్ రాయ్, శుభేందు అధికారి సహా చాలా మంది బలమైన సహచరులు ఈసారీ ఆమె వెంట లేరు.
"మమత బలం, స్వయంగా మమతే. ఇప్పటివరకూ కొనసాగిన ఆమె రాజకీయ ప్రయాణాన్ని మనం గమనిస్తే, మమతను తక్కువ అంచనా వేయడం పొరపాటే అవుతుంది" అని తపస్ ముఖర్జీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









