టీటీడీ తలనీలాల వివాదం: మియన్మార్ సరిహద్దుల్లో దొరికిన రూ.1.8 కోట్ల విలువైన జుట్టు ఎక్కడిది

తిరుపతిలో తలనీలాలు

ఫొటో సోర్స్, Frédéric Soltan/getty images

    • రచయిత, శంకర్.వి
    • హోదా, బీబీసీ కోసం

మిజోరాం, మియన్మార్ సరిహద్దుల్లో దొరికిన విలువైన తలవెంట్రుకలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ వెంట్రుకలను అక్రమంగా తరలిస్తున్నట్టు అనుమానాలు రావడం, అది మతపరమైన అంశాలతో ముడిపడిన విషయం కావడంతో భక్తుల్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇంతకీ రూ.1.8 కోట్ల రూపాయల విలువ చేసే వెంట్రుకలు ఎప్పుడు దొరికాయి? అధికారులు ఏమన్నారు?

ప్రస్తుతం తిరుమలలో ఈ విషయంపై ఒక టీవీ చానెల్‌తోపాటూ, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు ఎందుకు నమోదు చేశారు?

రెండు నెలల క్రితమే పట్టుబడిన తలనీలాలు

తాజాగా వార్తల్లోకెక్కిన తల వెంట్రుకల అక్రమ రవాణాను అసోం రైఫిల్స్‌కి చెందిన 23వ సెక్టార్ సెర్చిప్ బెటాలియన్ రెండు నెలల క్రితమే అడ్డుకుంది.

ఫిబ్రవరి 7న జరిపిన తనిఖీలలో ఇవి బయటపడ్డాయి.

ఇండో-మియన్మార్ సరిహద్దుల్లో మిజోరం రాష్ట్ర పరిధిలో ఈ అక్రమ రవాణాను గుర్తించారు.

ఈ ప్రాంతంలో జరిగే తనిఖీలలో తరచూ మాదకద్రవ్యాలు, బంగారం, వన్య ప్రాణుల అక్రమ రవాణాను పట్టుకునేవారు.

కానీ మొదటిసారి 120 బస్తాల తల వెంట్రుకలను సరిహద్దు భద్రతా బలగాలు గుర్తించడం సంచలనం సృష్టించింది.

అస్సాం రైఫిల్స్ పట్టుకున్న వెంట్రుకల బస్తాలు

ఫొటో సోర్స్, Twitter/AssamRifles

ఒక్కో బస్తాలో 50 కిలోల చొప్పున వెంట్రుకలు ఉన్నాయి.

ఒక ట్రక్కులో వాటిని తరలిస్తుండగా ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్టు మార్చి 20న అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

పట్టుబడిన ఈ తల వెంట్రుకలు తిరుపతి నుంచి తరలిస్తున్నట్లు డ్రైవర్లు చెప్పినట్లు కొందరు అధికారులు మీడియాకు తెలిపారు.

ఈ మేరకు ది హిందూ పత్రిక మార్చి 21న ఒక వార్తా కథనం ప్రచురించింది.

'దేశంలోని ఎన్నో ఆలయాల నుంచి తల వెంట్రుకలు రవాణా చేస్తుంటామని, అయితే పట్టుబడిన ట్రక్కులు మాత్రం తిరుపతివే' అని ఒక అధికారి చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

పట్టుబడిన డ్రైవర్ ముంగ్సీయన్‌ సింగ్‌ను విచారించారు.

"ఆ తలనీలాలను తన వాహనంలో మయన్మార్‌కు రవాణా చేసేందుకు ఐజ్వాల్‌లోని మరుయతి అనే మహిళతో కిరాయికి ఒప్పుకున్నాను" అని అతడు చెప్పినట్లు అధికారులు తెలిపారు.

తల వెంట్రుకలతో విగ్గుల తయారీ

ఫొటో సోర్స్, Ethan Miller/getty

ఫొటో క్యాప్షన్, తల వెంట్రుకలతో విగ్గులు తయారు చేస్తారు

తల వెంట్రుకల స్మగ్లింగ్ ఎందుకు?

సరిహద్దుకి 7 కిలోమీటర్లు ఇవతల ఈ తల వెంట్రుకల స్మగ్లింగ్ బయటపడింది.

పట్టుబడిన వెంట్రుకల ఖరీదు రూ.1.8 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధరించారు.

ఈ వెంట్రుకలను మియన్మార్ మీదుగా థాయిలాండ్ తరలిస్తారు. అక్కడ వాటిని ప్రాసెసింగ్ చేస్తారు.

అది పూర్తైన తర్వాత చైనాకు పంపించి వాటితో విగ్గులు తయారు చేస్తారు.

చైనా నుంచి ఈ విగ్గులను ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తారు.

ప్రస్తుతం ఈ విగ్గుల వ్యాపారంలో చైనా 70శాతం వాటా కలిగి ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

తలవెంట్రుకల వ్యాపారానికి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది.

ముఖ్యంగా భారత్‌లో మత ఆచారాల ప్రకారం ఆలయాల్లో మొక్కుల పేరుతో జుట్టు సమర్పించే సంప్రదాయం ఉంది.

దాంతో విగ్గుల వ్యాపారాలకు భారతీయుల జుట్టు ముఖ్యమైన వనరుగా మారింది.

తిరుమల తలనీలాలు

ఫొటో సోర్స్, Frédéric Soltan/getty

టీటీడీ అందులో టాప్..

దేశంలో అత్యధికంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.

ప్రస్తుతం రోజుకి సగటున 50 వేల మంది దర్శనాలకు వస్తున్నారు.

వీరిలో కనీసం మూడొంతుల మంది తలనీలాలు ఇస్తారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,937 కోట్ల బడ్జెట్ అంచనాల్లో టీటీడీ ట్రస్ట్ బోర్డు లెక్కల ప్రకారం కళ్యాణకట్ట ద్వారా రూ.131 కోట్లు అంచనా వేశారు.

టికెట్లతోపాటూ తలవెంట్రుకల ద్వారా కూడా టీటీడీకి అధిక ఆదాయం వస్తోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

తిరుమలలో తలనీలాల విక్రయం మొదట్లో ప్రతీ నెలా వేలం ద్వారా జరిగేది.

తిరుమల నుంచి ప్రతిరోజూ వెంట్రుకలను తిరుపతిలోని గోడౌన్లకు తరలిస్తారు.

ఎంఎస్‌టీసీ ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తారు.

ఆ తర్వాత వేలంలో వాటిని దక్కించుకున్న వారికి అప్పగిస్తారు.

తిరుపతిలో తలనీలాలు

ఫొటో సోర్స్, John van Hasselt - Corbis/getty

పొడవు, వాటి రంగును బట్టి తల వెంట్రుకలను 5 గ్రేడులుగా విభజిస్తారు.

జట్టు ఎంత ఎక్కువ పొడవుంటే అంత ఎక్కువ ధర వస్తుంది.

2019 సెప్టెంబర్‌లో తలనీలాల ద్వారా రూ. 74 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది.

2019 డిసెంబర్‌లో మొత్తం అన్ని గ్రేడుల వెంట్రుకలు కలిపి 54,500 కిలోలు వేలం వేయగా రూ. 37.26 కోట్లు వచ్చినట్టు చెప్పారు.

ప్రస్తుతం మూడు నెలలకు ఒకసారి వేలం వేస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే కాంట్రాక్ట్ వివరాలు, చివరిగా వేలానికి సంబంధించిన వివరాలను అందించడానికి మాత్రం టీటీడీ మార్కెటింట్ విభాగం నిరాకరించింది.

బీబీసీ పలుమార్లు సంప్రదించినా తమ దగ్గర సమాచారం లేదంటూ అధికారులు దాటవేశారు.

తిరుమల కల్యాణకట్ట

ఫొటో సోర్స్, The India Today Group/getty

ఎక్కడ అమ్ముతారో మాకు తెలియదు..

కొనుగోలు చేసిన జుట్టును మార్కెట్లో ఎక్కడ విక్రయిస్తారు అనేది తమ పరిధిలో లేని అంశమని టీటీడీ చెబుతోంది.

దీనిపై పీఆర్వో టి.రవి ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

"తిరుమలలో భక్తులు సమర్పించే తలనీలాలను కూడా టీటీడీ ప్రతి 3 నెలలకోసారి ఈ-టెండర్ల ద్వారా ఎక్కువ మొత్తం కోట్‌ చేసిన బిడ్డర్‌‌కు జీఎస్టీ కట్టించుకుని తలనీలాలు విక్రయిస్తుంది. కొనుగోలు చేసిన బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులున్నాయా? లేక దేశంలో ఏ ప్రాంతంలో విక్రయిస్తారు అనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదు. దేశంలోని చాలా ఆలయాల్లో తలనీలాల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే టీటీడీ కూడా ప్రతి మూడు నెలలకోసారి ఈ-టెండర్ ద్వారా తలనీలాలు విక్రయిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ" అని వెల్లడించారు.

బండారు సత్యనారాయణ మూర్తి

ఫొటో సోర్స్, FB/BANDARU SATYANARAYANA MURTHY

ఫొటో క్యాప్షన్, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి

అసలు వివాదం ఎందుకు

"తిరుపతి నుంచి వెంట్రుకలను తరలిస్తుండగా మియన్మార్ సరిహద్దుల్లో పట్టుబడిన ఘటనకు టీటీడీ అధికారులే బాధ్యత వహించాలి" అని ప్రతిపక్ష టీడీపీ అంటోంది.

దీనిపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలంటున్న ఆ పార్టీ నేత బండారు సత్యన్నారాయణ మూర్తి బీబీసీతో మాట్లాడారు.

"టీటీడీలో ఇంత గోప్యత ఎందుకు? వేలమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంలో తమకేమీ సంబంధం లేదని టీటీడీ అధికారులు చెప్పడం సిగ్గుచేటు. హిందువుల వైకుంఠమైన తిరుమలను ఈ ప్రభుత్వం వ్యాపారకేంద్రంగా మార్చేసింది. స్వామివారి తలనీలాలు ఎక్కడో చైనాకు తరలిస్తూ పట్టుబడితే, తలనీలాల కాంట్రాక్ట్ పొందిన సంస్థ, పూర్వాపరాలు టీటీడీ అధికారులకు తెలియవా? తలనీలాలు తీసుకెళ్లి సదరుసంస్థ ఎక్కడ విక్రయిస్తుందో, ఏంచేస్తుందో తెలుసుకోకుండానే పాలకవర్గం, టీటీడీ అధికారులు కాంట్రాక్ట్ కట్టబెట్టారా? టీటీడీ పాలకవర్గాన్ని తక్షణమే రద్దుచేయాలి. సంబంధిత అధికారులను విధుల నుంచి తొలగించాలి. ఈవో, జేఈవో దీనికి బాధ్యులు" ఆయన అన్నారు.

టీటీడీకి సంబంధించిన తలనీలాలు స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడ్డాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది.

గత రెండేళ్లుగా టీటీడీ పలు వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా సరిహద్దుల్లో తలవెంట్రుకల స్మగ్లింగ్ బయపడడం కలకలం రేపింది.

తిరుమల తలనీలాలు

ఫొటో సోర్స్, John van Hasselt - Corbis/getty

బ్లాక్‌లిస్ట్‌లో పెడతామంటున్న టీటీడీ

మొదట టెండర్లు దక్కించుకున్నవారు తల వెంట్రుకలు ఎక్కడ అమ్ముకుంటారో తమకు తెలీదని చెప్పిన టీటీడీ ఆ తర్వాత స్పందించింది.

అక్రమ రవాణాకి పాల్పడుతున్న సంస్థల పేర్లు అధికారికంగా వెల్లడిస్తే వాటిని బ్లాక్ లిస్టులో పెడతామని తెలిపింది.

అదే సమయంలో టీటీడీ ద్వారానే ఈ స్మగ్లింగ్ జరుగుతోందంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని విజిలెన్స్ విభాగం ఫిర్యాదు చేసింది.

టీటీడీ ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫేస్‌బుక్‌లో పోస్టులు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని తమకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తిరుపతి ఈస్ట్ సీఐ బి.శివప్రసాద్ రెడ్డి బీబీసీకి చెప్పారు.

"మాకు అందిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నెం. 121/2021గా కేసు నమోదు చేశాం. అందులో టీడీపీ, టీడీపీ పొలిటికల్ వింగ్, 'రామ రాజ్యం మళ్లీ మొదలైంది' అనే పేజీతో పాటూ గంగా ప్రకాష్, ప్రియాంకా రెడ్డి, స్వచ్ఛ అనే వారిపై కూడా కేసులు నమోదు చేశాం. ఆంధ్రజ్యోతిలో కూడా అలాంటి కథనాలు వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకు వారిని కూడా నిందితులుగా చేర్చాము. విచారణ తర్వాత ఇందులో ఇంకా ఎవరెవరున్నారు నిందితులుగా వారి పాత్ర ఏ మేరకు ఉంది అనేది తేలుస్తాం" అని ఆయన వివరించారు.

తిరుమల తలనీలాలు

ఫొటో సోర్స్, Frédéric Soltan/getty

ఆదాయం తగ్గడానికి, స్మగ్లింగ్‌కి మధ్య ఉన్న సంబంధం తేలాలి

తిరుమల దేవస్థానానికి 2006-08లోనే తలనీలాల ద్వారా రూ.250 కోట్లు ఆదాయం వస్తే, ఆ తర్వాత అది ఎందుకు తగ్గిందో తేల్చాలని టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేత, సీపీఎం నేత కందరాపు మురళి డిమాండ్ చేస్తున్నారు.

తాజా వివాదం గురించి ఆయన బీబీసీతో మాట్లాడారు.

"సరిహద్దుల్లో దొరికిన తలవెంట్రుకల వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరం. మాకు సంబంధం లేదంటూ టీటీడీ చేతులు దులుపుకోవడం కాదు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం తలనీలాల ద్వారా టీటీడీకి వెయ్యి కోట్ల రూపాయల వరకూ ఆదాయం రావాలి. కానీ 12ఏళ్లలో అది పెరగలేదు. దానికి కారణాలు కనుక్కోవాలి. ప్రస్తుతం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడడం అనుమానాలకు తావిస్తోంది. టీటీడీ ఆదాయం పడిపోవడానికి, అక్రమ రవాణాకు మధ్య ఏమి జరుగుతోందనేది తేల్చాలి. తలనీలాల సేకరణ, విక్రయం, గ్రేడింగ్ విషయాల్లో రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకుని దర్యాప్తు జరిపించి వాస్తవాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది" అని ఆయన డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)