15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..

గారిసన్ హిల్ యుద్ధ క్షేత్రంలో బ్రిటిష్ ఇండియా, జపాన్ సైనికులు
ఫొటో క్యాప్షన్, గారిసన్ హిల్ యుద్ధ క్షేత్రంలో బ్రిటిష్ ఇండియా, జపాన్ సైనికులు
    • రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

అది 1944 మే నెల. రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈశాన్య భారతదేశంలోని కోహిమా పట్టణం. బ్రిటిష్ ఇండియా సైనికుల బృందం మీద జపాన్ దళాలు దాడి చేస్తున్నాయి.

జపాన్ సైన్యం దాదాపు 15,000 మందితో విరుచుకుపడుతోంది. వారిని ప్రతిఘటిస్తున్న బ్రిటిష్ ఇండియా సైనికుల సంఖ్య అందులో పదో వంతు కూడా లేదు. వారికి మద్దతుగా కెప్టెన్ రాబిన్ రోలాండ్ తన సైనిక రెజిమెంట్‌ను కోహిమాలో మోహరించారు. అప్పుడు ఆయన వయసు 22 సంవత్సరాలు.

కెప్టెన్ రోలాండ్ వయసు ఇప్పుడు 99 సంవత్సరాలు. నాడు విధ్వంసమైన పట్టణాన్ని దాటి యుద్ధ రంగాన్ని చేరుకోవటం ఆయనకు ఇప్పటికీ చాలా స్పష్టంగా గుర్తుంది.

నాటి ఈ యువ కెప్టెన్ బ్రిటిష్ ఇండియా సైన్యంలోని పంజాబ్ రెజిమెంట్ సభ్యుడు. అప్పటికి కొన్ని వారాలుగా.. తమ కంటే పది రెట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న జపాన్ సైనికులతో పోరాడుతున్న 1,500 మంది తన సహచర సైనికులకు సాయం చేయం చేయటానికి తన సైనిక బృందంతో బయలుదేరారు.

"దారిపొడవునా సైనికులు వదిలివెళ్లిన కందకాలు, ధ్వంసమైన గ్రామాలు కనిపించేవి. మేం ముందుకు సాగుతున్నపుడు అంతటా చావు వాసనే వేసేది" అని చెప్పారాయన.

కోహిమాలో యుద్ధ స్మారకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోహిమాలో యుద్ధ స్మారకం

మిత్రరాజ్యాల దళాల మార్గాలన్నీ జపాన్ సైన్యం మూసివేసింది. దీంతో కేవలం వాయు మార్గంలో జరిగే సరఫరాలపై ఆధారపడి పోరాటం కొనసాగిస్తున్నాయి. ఆ దాడిని ఇంకా కొనసాగించగలమని నమ్మేవారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. జపాన్ సైనికులు అప్పటి బర్మా (నేటి మియన్మార్) గుండా కోహిమాలోకి చొచ్చుకొచ్చారు. భారతదేన్ని ఆక్రమించటం వారి లక్ష్యం.

జపనీయులు అప్పటికే బర్మాలో బ్రిటిష్ వారిని మట్టికరిపించారు. అయితే వారు.. ఈశాన్య భారతదేశంలోని కొండలు, కోనలు, అడవులను, అందులో వేగంగా ప్రవహించే నదీనదాలు దాటుతారని.. తీవ్రస్థాయిలో దోమల దండును ఎదుర్కొని సాగుతారని.. నాగాలాండ్ రాజధాని కొహిమాకు, మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు విజయవంతంగా చేరుకుంటారని ఎవరూ ఊహించలేదు.

కానీ వారు అక్కడికి చొచ్చుకొచ్చారు. దాదాపు 15,000 మందికి పైగా జపాన్ సైనికులు ఈ రెండు పట్టణాలను చుట్టుముట్టారు. వారి నుంచి ఆ పట్టణాలను కాపాడే పని కేవలం 1,500 మంది బ్రిటిష్ ఇండియా సైనికులపై పడింది.

జపాన్ సైనికులు ఆ ప్రాంతాలను దాటి.. వ్యూహాత్మక నగరమైన దిమాపూర్‌ను ఆక్రమించకుండా నిరోధించడానికి బ్రిటిష్ ఇండియా సైనికులు వారాల పాటు పోరాడారు. ఆ నగరాన్ని కనుక జపాన్ సైనికులు స్వాధీనం చేసుకుంటే ఇక అస్సాంలోని మైదాన ప్రాంతాలకు వారికి దారులు తెరుచుకుంటాయి. వారిని నిలువరించే కర్తవ్యంలో పిడికెడు మంది బ్రిటిష్ ఇండియా సైనికులు గెలుస్తారని నమ్మిన వారు లేరు.

జపాన్ సైనికులు "రాత్రి తరువాత రాత్రి అలలు అలలుగా" వచ్చారని కెప్టెన్ రోలాండ్ గుర్తుచేసుకున్నారు.

జపాన్‌ను ఓడించిన తర్వాత పంజాబ్ రెజిమెంట్‌లోని సహచరులతో రాబిన్ రోలాండ్

ఫొటో సోర్స్, Robin Rowland

ఫొటో క్యాప్షన్, జపాన్‌ను ఓడించిన తర్వాత పంజాబ్ రెజిమెంట్‌లోని సహచరులతో రాబిన్ రోలాండ్

ఆ పోరాటం చాలా క్రూరంగా సాగింది. బ్రిటిష్-ఇండియా దళాలు కోహిమా పైభాగంలోని గారిసన్ హిల్‌‌లో చిక్కుకుపోయాయి. ఒక సమయంలో ఈ యుద్ధం ముఖాముఖి స్థాయికి మారింది. ఇరు పక్షాల మధ్య ఆ కొండ మీద తవ్విన ఒక టెన్నిస్ కోర్టు మాత్రమే అడ్డుగా ఉంది.

అయినప్పటికీ.. బ్రిటిష్ ఇండియా సైనికులు అదనపు బలగాలు వచ్చే వరకూ జపాన్ సైనికులను నిలువరించారు. మూడు నెలల తరువాత.. జూన్ 1944 నాటికి జపాన్ బలగాల్లో 7,000 మందికి పైగా సైనికులు చనిపోయారు. మిగతా సైనిక బలగాలకు ఆహార సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. అక్కడే ఉండి యుద్ధం కొనసాగించాలని పై నుంచి ఆదేశాలు వచ్చినా.. జపాన్ సైనికులు మడమతిప్పి బర్మాకు వెనుదిరిగారు.

"కేవలం 1,500 మంది బ్రిటిష్ ఇండియా సైనికులు చేసిన భీకర ప్రతిఘటన అది" అని కెప్టెన్ రోలాండ్ అభివర్ణించారు. "జపాన్ సైనికులు గనుక గారిసన్ హిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లయితే.. వారు దిమాపూర్‌ను ముట్టడించేవారు" అని చెప్పారు.

వెనక్కి వెళ్లిపోతున్న జపాన్ సైనికులను వెంటాడాలని బ్రిటిష్ ఇండియా దళాలకు ఆదేశాలు వచ్చాయి. అలా వారిని వెంటాడిన సైన్యంలో రాబిన్ రోలాండ్ కూడా ఉన్నారు. కొంతమంది జపాన్ సైనికులు కలరా, టైఫాయిడ్, మలేరియా వంటి జబ్బుల బారిన పడి చనిపోయారు. కానీ అంతకన్నా ఎక్కువ మంది.. ఆహార సరఫరా లేకపోవడంతో మరింత ఎక్కువ మంది జపాన్ సైనికులు ఆకలితో అలమటిస్తూ మరణించారు.

బ్రిటిష్ ఇండియా, బర్మా

‘‘కోహిమా, ఇంఫాల్ యుద్ధం ఆసియాలో రెండో ప్రపంచ యుద్ధం గమనాన్ని మార్చివేసింది’’ అని సైనిక చరిత్రకారుడు రాబర్ట్ లైమాన్ విశ్లేషించారు.

"జపనీయులు మొట్టమొదటిసారిగా ఒక యుద్ధంలో ఓడిపోయారు. దాని నుంచి వారిక కోలుకోలేదు" అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఈశాన్య భారతదేశంలో జరిగిన ఈ యుద్ధం కీలక మలుపు అయినప్పటికీ.. యూరప్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో జరిగిన డి-డే, వాటర్లూ తదితర యుద్ధాల తరహాలో ఇది ప్రజాస్రవంతిలో ప్రాచుర్యం పొందలేదు.

అందుకే దీనిని తరచుగా "విస్మృత యుద్ధం" గా వర్ణిస్తుంటారు.

బ్రిటన్ ప్రజలు ఈ యుద్ధం ప్రాధాన్యతను గుర్తించలేనంత సుదూరంగా ఉన్నారని యార్క్ నగరంలోని కోహిమా మ్యూజియం అధిపతి బాబ్ కుక్ చెప్పారు.

"అప్పుడు జర్మనీ వాళ్లు బ్రిటన్ నుండి కేవలం 22 మైళ్ళ దూరంలో సముద్రానికి ఆవల ఉన్నారు. రేపో మాపో జర్మనీ తమపై దండయాత్ర చేస్తుందన్న తక్షణ ముప్పు గురించే బ్రిటన్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు" అని ఆయన తెలిపారు.

అయితే.. కోహిమా, ఇంఫాల్ యుద్ధం గురించి ప్రజలకు బోధించటానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. 2013లో లండన్‌లోని ఇంపీరియల్ వార్ మ్యూజియంలో జరిగిన చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో.. బ్రిటన్ చేసిన అతి గొప్ప యుద్ధంగా ఈ యుద్ధాన్ని ఎన్నుకున్నారు. డి-డే, వాటర్లూ తదితర యుద్ధాల కన్నా కోహిమా, ఇంఫాల్ యుద్ధమే గొప్ప యుద్ధంగా నిలిచింది.

గారిసన్ హిల్‌పైన ఉన్న టెన్నిస్ కోర్టు

ఫొటో సోర్స్, Anbarasan Ethirajan/BBC

ఫొటో క్యాప్షన్, గారిసన్ హిల్‌పైన ఉన్న టెన్నిస్ కోర్టు

ఆ చర్చలో కోహిమా యుద్ధం గురించి రాబర్ట్ లైమాన్ వివరించారు. కానీ ఈ యుద్ధం ప్రాముఖ్యతను చాటటానికి భారత ఉపఖండంలో ఎటువంటి ప్రయత్నం జరగలేదు. ఆ యుద్ధంలో ఆధునిక భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైనికులు సహా - వేలాది మంది బ్రిటిష్ ఇండియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఇందుకు ఒక కారణం.. ఆ యుద్ధం తర్వాత కొంత కాలానికే బ్రిటిష్ వారు భారతదేశాన్ని విభజించటమని నాగాలాండ్‌లోని కోహిమాలో ఉన్న చరిత్రకారుడు చార్లెస్ చాసీ చెప్తారు.

‘‘తొలినాళ్లలో అధికార బదిలీ, దేశ విభజన ప్రభావాలను ఎదుర్కోవడంలో భారత నాయకులు తలమునకలై ఉండటం ఒక కారణమని నేను భావిస్తున్నా. ఉప ఖండంలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారి చేతులు దాటిపోకముందే ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని బ్రిటిష్ వారు నిర్ణయించుకున్నారు’’ అని ఆయన వివరించారు.

కోహిమా యుద్ధాన్ని ఒక వలసరాజ్య యుద్ధంగానే చూశారు. యుద్ధానంతర చర్చ ప్రధానంగా.. భారత నాయకుడు మహాత్మా గాంధీ నేతృత్వంలోని భారత స్వాతంత్య్ర పోరాటం మీదే ఎక్కువ దృష్టి పెట్టింది.

ఆనాటి యుద్ధంలో బ్రిటిష్ ఇండియా సైన్యంతో పాటు.. స్థానిక నాగా జాతి ప్రజలు వేలాది మంది బ్రిటిష్ వారితో కలిసి పోరాడారు. ఆ యుద్ధంలో అమూల్యమైన నిఘా సామాచారాన్ని అందించారు. పర్వత భూభాగాల గురించి వారికి గల లోతైన అవగాహన బ్రిటిష్ ఇండియా సైన్యానికి ఎంతో సహాయపడింది.

నాటి కోహిమా యుద్ధంలో పాల్గొన్న నాగా యోధుల్లో కేవలం ఒక డజను మంది మాత్రమే నేడు జీవించి ఉన్నారు. వారిలో సోసాంగ్‌టెంబా అయో ఒకరు. ఆయన వయసు ఇప్పుడు 98 సంవత్సరాలు.

సోసాంగ్‌టెంబా అయో
ఫొటో క్యాప్షన్, సోసాంగ్‌టెంబా అయో

"జపాన్ బాంబర్లు ప్రతి రోజూ ఆకాశంలో ఎగురుతూ బాంబులు వేసేవి. ఆ శబ్దాలకు చెవులు చిల్లులుపడేవి. దాడి జరిగిన ప్రతిసారీ దట్టంగా పొగ అలముకునేది. అదంతా చాలా నిస్పృహకు గురిచేసేది" అని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఆయన రెండు నెలల పాటు బ్రిటిష్ ఇండియా సైన్యంతో కలిసి పనిచేశారు. అప్పుడు ఆయనకు రోజుకు ఒక రూపాయి చెల్లించేవారు. జపాన్ సైనికుల పోరాట సామర్థ్యం తనకు ఇప్పటికీ అబ్బురంగానే అనిపిస్తుందని ఆయన చెప్తారు.

"జపాన్ సైన్యం చాలా స్ఫూర్తివంతంగా కనిపించేది. ఆ సైనికులకు చావంటే భయం లేదు. తమ చక్రవర్తి కోసం పోరాడటమనేది వారికి దైవకార్యం. వారిని లొంగిపోవాలని అడిగితే వారు ఆత్మాహుతి దాడి చేసేవారు" అని అయో వివరించారు.

ఈ యుద్ధం మీద రూపొందించిన ‘మెమొరీస్ ఆఫ్ ఎ ఫర్గాటెన్ వార్’ అనే డాక్యుమెంటరీని.. జపనీయులు లొంగిపోయిన 75 వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. నిర్మాత సుబిమల్ భట్టాచార్జీ, ఆయన సిబ్బంది కొన్నేళ్ల కిందట ఒక సంస్మరణలో పల్గొనటానికి జపాన్ వెళ్లారు.

‘‘నాటి కోహిమా యుద్ధంలో పాల్గొన్న జపాన్, బ్రిటిష్ సైనికులు ఆ సంస్మరణలో కలిసినప్పుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కన్నీరుపెట్టుకున్నారు. ఒకప్పుడు పరస్పరం కాల్పులు జరుపుకున్న సైనికులు వీరు.. అయినా తమ మధ్య గల ప్రత్యేక బంధాన్ని వారు చాటారు. అదంతా అనుకోకుండా జరిగిపోయింది. మేం ఊహించలేదు’’ అని వివరించారు.

1945 నవంబర్‌లో కోహిమా యుద్ధంలో చనిపోయిన సైనికులకు నివాళులర్పిస్తున్న రాయల్ వెస్ట్ కెంట్ రెజిమెంట్ సభ్యులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1945 నవంబర్‌లో కోహిమా యుద్ధంలో చనిపోయిన సైనికులకు నివాళులర్పిస్తున్న రాయల్ వెస్ట్ కెంట్ రెజిమెంట్ సభ్యులు

జపనీయులకు అది అవమానకరమైన ఓటమి. నాటి యుద్ధంలో పాల్గొన్న జపాన్ సైనికులు కోహిమాలో తమ అనుభవం గురించి మాట్లాడటం అరుదు.

"జపనీయులకు తిండి లేకుండా పోయింది. అది ఓడిపోతున్న యుద్ధం. ఇక మేం వెనుదిరిగాం" అని వాజిమా కొయిచిరో అనే వెటరన్ సైనికుడు డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో చెప్పారు.

బ్రిటిష్ వారికి సహాయం చేసి, భారీ ప్రాణనష్టం చవిచూసిన నాగ జాతి వారికి కూడా బాధలు కొనసాగాయి. అధికారాన్ని అప్పగించేటప్పుడు బ్రిటిష్ వారు తమను భారతదేశంలో భాగంగా కాకుండా.. ప్రత్యేక నాగా దేశంగా గుర్తిస్తారని వారు ఆశించారు.

"కానీ వారు తీవ్ర నిరాశకు గురయ్యారు" అని చరిత్రకారుడు చార్లెస్ చాసీ పేర్కొన్నారు. తదనంతరం భారత ప్రభుత్వంతో, సైన్యంతో ఘర్షణల్లో వేలాది మంది నాగాల మరణానికి కారణం బ్రిటిష్ వారేనని చాలా మంది నిందించారు.

కోహిమా, ఇంఫాల్ వద్ద చనిపోయిన సైనికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా బ్రిటన్, జపాన్ దేశాల వారు తమ పూర్వీకులకు నివాళులు అర్పించడం కోసం.. ఆ రెండు పట్టణాల వద్ద గల యుద్ధకాలపు శ్మశానవాటికలకు ఎన్నో ఏళ్లుగా వెళ్తూ ఉంటారు.

కీలకమైన ఇంఫాల్-కోహిమా రోడ్డుపై 1944లో ఒక బ్రిటిష్ సైనికుడు

ఫొటో సోర్స్, IWM

ఫొటో క్యాప్షన్, కీలకమైన ఇంఫాల్-కోహిమా రోడ్డుపై 1944లో ఒక బ్రిటిష్ సైనికుడు

కెప్టెన్ రోలాండ్ 2002 లో భారత పంజాబ్ రెజిమెంట్ ఆహ్వానం మేరకు తన కొడుకుతో కలిసి కోహిమా వెళ్ళారు. అంతకు 58 ఏళ్ల కిందట తాను, తన సహ సైనికులు జపాన్ సైనికులను ఎదుర్కొని నిలువరించిన చోటు - గారిసన్ హిల్ ముందు నిలబడ్డారు.

కేవలం 1,500 మంది సైనికుల బృందం.. అలలుగా విరుచుకుపడుతున్న 15,000 మంది జపాన్ సైన్యపు 31వ డివిజన్ మొత్తాన్నీ ఎదుర్కొని ఎలా నిలబడిన "ఎన్నో జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి" అని కెప్టెన్ రోలాండ్ తెలిపారు. ‘‘అదో గొప్ప సైనిక విజయం’’ అని అభివర్ణించారు.

కోహిమా నుంచి వెనుదిరిగే ముందు, కెప్టెన్ రోలాండ్, ఆయన కుమారుడు.. గారిసన్ హిల్ మీద రాతితో చేసిన యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. నాడు తనతో పాటు యుద్ధం చేస్తూ నేలకొరిగిన ఎనిమిది మంది తోటి సైనికులను గుర్తు చేసుకున్నారాయన.

చాలా ప్రసిద్ధిగాంచిన యుద్ధాల లాగా.. కోహిమా యుద్ధానికి ప్రజల ఆలోచనల్లో తగిన స్థానం లభించిలేదని ఆయనకు తెలుసు. కానీ అక్కడ ఉన్నవారు మాత్రం ఎప్పటికీ మరచిపోరు.

"మానవ ప్రతిఘటనా స్వభావానికి అదొక గొప్ప నివాళి" అని ఆయన అభివర్ణించారు.

2014లో రాబిన్ రోలాండ్

ఫొటో సోర్స్, Rebecca Rowland

ఫొటో క్యాప్షన్, 2014లో రాబిన్ రోలాండ్
BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)