బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది

ఫొటో సోర్స్, BBC/dilip kumar sharma
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ హిందీ కోసం
''మంత్రగత్తెలని అనుమానిస్తూ అమాయకులపై జరిగే దాడులను అపేందుకు మొదలుపెట్టిన పోరాటంలో నాకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు కర్రలు, లాఠీలతో కొట్టారు. మా గ్రామంలో అడుగు పెట్టొద్దని ఆంక్షలు విధించారు. బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ నేను వెనకడుగు వేయలేదు. ఈ రోజు నా పేరు చెబితే మంత్రగత్తెల పేరుతో దాడుల చేసేవారు భయపడతారు''.
72 ఏళ్ల బీరుబాలా రాభా ఈ మాటలు చెప్పేటప్పుడు, ఆమె ముఖంలో, గొంతులో ఆత్మవిశ్వాసం, ధైర్యం తొణికిసలాడాయి.
అసోంకు చెందిన సామాజిక కార్యకర్త బీరుబాలాకు భారత ప్రభుత్వం ఈ ఏడాది పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే బీరుబాలా.. రాభా తెగకు చెందిన వారు. ఇప్పటివరకు మంత్రగత్తెలంటూ అనుమానిస్తూ జరిగే దాడుల నుంచి దాదాపు 40 మందిని ఆమె కాపాడారు. బాధితుల్లో చాలా మంది మహిళలే ఉన్నారు.
''పద్మ శ్రీ అందుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. మూఢనమ్మకాలతో అమాయకులపై జరిగే దాడులను అడ్డుకునే పోరాటంలో ఈ గుర్తింపు ఉపయోగపడుతుంది. ఇలాంటి గుర్తింపుతో ప్రజలతోపాటు ప్రభుత్వ అధికారులు కూడా మాకు అండగా నిలుస్తారు. 1998లో నేను ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడు నాకు ఎవరూ సాయం చేయలేదు. ఎవరూ నా మాట వినేవారు కాదు. కానీ 2005లో నా పేరు నోబెల్ ప్రైజ్‌కు పరిశీలించినప్పుడు చాలా మార్పులు వచ్చాయి. పోలీసుల నుంచి అధికారుల వరకూ చాలా మంది నాకు అండగా నిలవడం మొదలుపెట్టారు'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, BBC/dilip kumar sharma
చట్టం తీసుకువచ్చేలా కృషి..
చేతబడులు, మంత్రాలు చేస్తున్నారంటూ మూఢనమ్మకాలతో అమాయకులపై దాడులు చేయకుండా బీరుబాలా ఉద్యమించడంతో అసోం ప్రభుత్వం 2015లో ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. మంత్రగత్తెలనే నెపంతో చిత్రహింసలు పెట్టడాన్ని ఈ చట్టం నిషేధిస్తోంది.
మంత్రగత్తెలనే నెపంతో ఎవరినైనా మానసికంగా, శారీరకంగా హింసించడాన్ని ఈ చట్టం కాగ్నిజబుల్ నేరంగా పరిగణిస్తుంది. నిందుతులను నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేస్తారు. వారికి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.
''ఈ చట్టం వల్ల ప్రజల్లో అవగాహన చాలా వచ్చింది. ఈ చట్టానికి చాలా మంది భయపడుతున్నారు. మరోవైపు విద్య, ఆరోగ్య సేవలు మెరుగుపడటంతో.. తాంత్రికుల దగ్గరకు ప్రజలు వెళ్లడం కూడా తగ్గింది'' అని ఆమె చెప్పారు.
''కానీ గిరిజనుల్లో ఈ మూఢనమ్మకాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ముఖ్యంగా మహిళలకు వీటిపై అవగాహన కల్పించాలి. ఎందుకంటే వందల ఏళ్ల నుంచీ ఈ మూఢ నమ్మకాలు వారి సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమయ్యాయి. ఈ దిశలో చేయాల్సిన కృషి చాలా ఉంది'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, BBC/dilip kumar sharma
ఉద్యమం అలా మొదలైంది..
1996లో బీరుబాలా పెద్ద కొడుకు ధర్మేశ్వర్‌కు టైఫాయిడ్ వచ్చింది. దీంతో ఇంటిలో వారు సూచించడంతో అతణ్ని దగ్గర్లోని గ్రామ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు.
''మీ అబ్బాయి ఒక మంత్రగత్తెతో ప్రేమలో పడ్డాడు. ఆమె త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆ బిడ్డ పుట్టిన వెంటనే మీ అబ్బాయి మరణిస్తాడు'' అని ఆ గ్రామ వైద్యుడు.. బీరుబాలాకు చెప్పారు. అయితే, నెలలు గడిచిన తర్వాత కూడా ఆ గ్రామ వైద్యుడు చెప్పినవేమీ జరగలేదు.
''ఆ గ్రామ వైద్యుడు చెప్పినదాంట్లో నిజం లేదని తెలిసినప్పుడు.. నా బుర్రలో చాలా ఆలోచనలు మెదిలాయి. మంత్రవిద్యల పేరుతో గిరిజనులను తప్పుదోవ పట్టిస్తున్నారని అనిపించింది. అప్పుడే గిరిజనులను ఈ మంత్రవిద్యలు, మూఢ నమ్మకాల నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను'' అని ఆమె చెప్పారు.
''అప్పుడే నేను మా ఊరిలోని మహిళా సమితిలో చేరాను. మంత్రవిద్యలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఉద్యమం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే దీని కోసం పనిచేస్తున్న చాలా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కలిశాను'' అని ఆమె వివరించారు.
''వెనుకబడిన చాలా గిరిజన గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలు సరిగా ఉండవు. ఇక్కడ మూఢనమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తుంటారు. దీంతో పంట నష్టం, వ్యాధులు, విపత్తులు సంభవించినప్పుడు కొందరిపై అభాండాలు వేస్తూ.. అన్నింటికీ వారే కారణమని దాడులు చేస్తుంటారు''.
''ఒంటరిగా ఉండే మహిళలు, వితంతువులు, వృద్ధులను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటారు. అమాయకులను మంత్రగత్తెల పేరుతో చిత్రహింసలు పెట్టిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, BBC/dilip kumar sharma
మూడేళ్లు నిషేధం
ఇలాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని బీరుబాలా పిలుపునిస్తున్నారు.
''నేడు వైద్య రంగం ఎంతో పురోగతి సాధించింది. ఇప్పుడు మనకు అనారోగ్యంగా అనిపిస్తే.. వైద్యుల దగ్గరకు వెళ్తున్నాం. అంతేకానీ నకిలీ వైద్యుల దగ్గరకు వెళ్లం. మనసులో హింసను రెచ్చగొట్టే భావనలు, విద్వేషాలు గూడుకట్టుకుని ఉన్నవారే మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతుంటారు. ఈ విషయాలను నేను గ్రామస్థులకు అర్థమయ్యేలా చెబుతున్నాను. దీంతో వారు నమ్ముతున్నారు. అయితే, ఇప్పటికీ మంత్రగత్తెల పేరుతో దాడులు చేయాలని భావించేవారు.. నన్ను చూసి భయపడుతుంటారు. ఎందుకంటే నేను ఒక్క ఫోన్‌తో పోలీసులను తీసుకువస్తానని వారు భయపడతారు''అని ఆమె అన్నారు.
అసోం-మేఘాలయ సరిహద్దుల్లోని గ్వాల్‌పాడా జిల్లాలో ఓ చిన్న గ్రామంలో బీరుబాలా నివసిస్తున్నారు. మంత్రగత్తెలను అనుమానిస్తూ దాడులు చేసేవారికి వ్యతిరేకంగా 22ఏళ్ల క్రితం ఆమె ఈ ఉద్యమం మొదలుపెట్టారు. దీంతో ఆమెను గ్రామం మూడేళ్లపాటు బహిష్కరించింది.
అయితే, నేడు ఆమె ఎక్కడికి వెళ్లినా, ఆమెను కలిసేందుకు చాలా మంది వస్తుంటారు. ఆమెను సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు అడుగుతుంటారు. కొందరైతే ఆమె కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆమెను సన్మానించేందుకు నేడు అసోం వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC/dilip kumar sharma
2011లో 'మిషన్ బీరుబాలా' ప్రారంభం..
మంత్రవిద్యలకు వ్యతిరేకంగా అసోంలోని గ్రామాల ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు 2011లో ''మిషన్ బీరుబాలా''ను బీరుబాలా మొదలుపెట్టారు.
ఈ మిషన్ కోసం నేడు వందల మంది అసోంలోని భిన్న ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.
పద్మ శ్రీ కంటే ముందు బీరుబాలా చాలా అవార్డులు అందుకున్నారు. వీటిలో బెస్ట్ సోషల్ ఎంట్రప్రెన్యూయర్ అవార్డు ఒకటి. ఐదో తరగతి వరకు చదువుకున్న బీరుబాలాకు 2015లో గువాహటి వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
అసోం అసెంబ్లీలో నవంబరు 2019లో సమర్పించిన డేటా ప్రకారం.. 2011 నుంచి 107 మందిని మంత్రగత్తెలనే అనుమానంతో ప్రజలు కొట్టిచంపారు. అయితే, గత మూడు, నాలుగేళ్ల నుంచీ ఇలాంటి హత్యలు తగ్గుతూ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్: అకస్మాత్తుగా ముంచెత్తిన వరదలు, 150 మంది గల్లంతు.. పది మృతదేహాల వెలికితీత
- ఇండోనేషియా: రెండు ఆడ పులులు జూలో గార్డును చంపి పారిపోయాయి...
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









