అమెజాన్ అడవుల్లో 'బంగారు' నదులు... గుట్టు బయట పెట్టిన నాసా ఫోటోలు

నాసా తీసిన ఫొటోలు

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, ఐఎస్ఎస్ నుంచి ఒక వ్యోమగామి తీసిన ఫొటోలు
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

పెరూలోని అమెజాన్ చిత్తడి అడవుల్లో బంగారం తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నాసా తీసిన కొన్ని అరుదైన ఫొటోలు బయటపెట్టాయి. వీటిలో ఎక్కువ తవ్వకాలుఅక్రమంగా జరుగుతున్నట్లు భావిస్తున్నారు.

ఈ ఫొటోల్లో బంగారం నదులుగా కనిపిస్తున్న ప్రాంతాలు నిజానికి లైసెన్స్ లేకుండా బంగారం తవ్వకాలు జరుగుతున్న గుంటలని నాసా చెప్పింది.

సాధారణంగా బంగారం తవ్వకాలు జరిగే ప్రాంతాలు ఆకాశం నుంచి కనిపించకుండా అక్రమంగా తవ్వేవారు వాటిని దాచేస్తారు. సూర్యుడి వెలుతురు ప్రతిబింబించేలా ఆ గుంటల్లో నీళ్లు నింపి శాటిలైట్ ఫొటోలకు చిక్కకుండా చేస్తారు.

అందుకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోని ఒక వ్యోమగామి డిసెంబర్‌లో తీసిన ఈ ఫొటోలను అత్యంత అరుదైనవిగా భావిస్తున్నారు.

ఆగ్నేయ పెరూలోని మాడ్రే డీ డియోస్ ప్రాంతంలో బంగారం తవ్వకాల వల్ల అడవుల్లో జరుగుతున్న విధ్వంసానికి ఈ ఫొటోలు నిదర్శనంగా నిలిచాయి.

పెరూ ప్రధానంగా బంగారం ఎగుమతులు చేసే దేశం. ఈ బంగారం తవ్వకాల పరిశ్రమకు మాడ్రే డి డియోస్ కేంద్రంగా ఉంది. జీవనోపాధి కోసం వేలాది గని కార్మికులు వీటిలో పనిచేస్తున్నారు.

దేశంలో ఈ ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రంగా నిలిచింది. బంగారం తవ్వకాలు తీవ్రంగా పెరగడం, ఇక్కడ అడవుల కొట్టివేతకు, ఎన్నో జీవుల ఆవాసాలు నాశనం కావడానికి కారణం అవుతోంది.

బంగారం తీయడానికి ఉపయోగిస్తున్న టన్నులకొద్దీ పాదరసం అంతా నదుల్లో, నేలలో కలవడంతో పర్యావరణం విషపూరితం అవుతోందని, స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నాసా తీసిన ఫొటోలు

ఫొటో సోర్స్, NASA

బంగారం కోసం తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో ఏర్పడిన గుంటలు నీళ్లతో నిండిపోయి, పైకి కొన్ని వందల పళ్లాల్లా కనిపిస్తున్నాయి. ఆ తవ్వకాలు జరిగే చుట్టుపక్కల చెట్లను కూడా భారీగా కొట్టేశారు.

అక్రమంగా తవ్వకాలు జరిపేవారు, ఖనిజాలతో సహా వివిధ అవక్షేపాలు నిక్షిప్తమైన పాత నదీ మార్గాలను అనుసరిస్తున్నట్లు నాసా వివరించింది.

తవ్వకాలు జరిగే ప్రాంతంలో కొన్ని భాగాల్లో కోతులు, జాగ్వార్లు, సీతాకోకచిలుకలు లాంటి జాతులు జీవిస్తున్నాయి.

బంగారం అక్రమ తవ్వకాల వల్ల అడవులు నాశనం అవుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2018లో జరిగిన బంగారం తవ్వకాల వల్ల పెరూలోని అమెజాన్ అడవుల్లో దాదాపు 23 వేల ఎకరాల అడవి నాశనమయ్యిందని 2019 జనవరిలో ఒక అధ్యయనం అంచనా వేసినట్లు ఆండ్రియన్ అమెజాన్ మానిటరింగ్ గ్రూప్ చెప్పింది.

బంగారం ధర అంతకంతకూ పెరుగుతుండడంతో తవ్వకాలే జీవనోపాధి అయిన స్థానికులు తరచూ వంచనకు గురవుతున్నారు.

అడవిలోని ఈ ప్రాంతంలో 30 వేల మంది చిన్న స్థాయి గని కార్మికులు పనిచేస్తున్నారని 2012లో అంచనా వేశారు.

దేశంలోని మరో భాగమైన లా పంపాలో దాదాపు 5 వేల మంది గని కార్మికులను ప్రభుత్వం 2019లో బహిష్కరించడంతో అక్కడ దదాపు పదేళ్లపాటు భారీగా జరిగిన బంగారం తవ్వకాలకు తెరపడింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)