బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?

బైరిపురం
    • రచయిత, ఎల్ శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఇప్పటివరకు జరిగిన ఏ పంచాయితీ ఎన్నికల్లోనూ ఆ గ్రామ పంచాయతీలో ఉన్న 1,100 మంది ఓటర్లకు ఓటు వేసే అవసరమే రాలేదు.

పంచాయితీ ఎన్నికలు ఒక్కసారి కూడా జరగని ఆ గ్రామ పంచాయితీ శ్రీకాకుళం జిల్లాలో ఉంది.

ఏకగ్రీవాలు ప్రస్తుత పంచాయితీ ఎన్నికల్లో హాట్ టాపిక్. అయితే, పంచాయితీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఏకగ్రీవమే తప్ప...ఎన్నికలే జరగని గ్రామ పంచాయతీ బైరిపురం.

ఇది ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉంది. బైరిపురానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఏకగ్రీవ పంచాయితీలో ఇప్పటివరకూ ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

వీడియో క్యాప్షన్, ‘‘ఆ ఊళ్లో ఒక్క పంచాయతీ ఎన్నికా జరగలేదు.. ఒక్క కేసూ నమోదవ్వలేదు’’

అయితే ఇక్కడి ప్రజల మధ్య వివాదాలు రాకుండా ఉండవు. తగవులు వచ్చినప్పుడు గ్రామ పెద్దలంతా సమావేశమై...పోలీసు స్టేషన్ల వరకూ వెళ్లకుండా సామరస్య పరిష్కారం చూపుతారు.

ఆ పరిష్కరానికి గ్రామ పెద్దలే హామీగా ఉంటారు. దీంతో ఏ సమస్యైనా సరిహద్దుదాటి పోలీస్ స్టేషన్‌కు చేరదు.

"బైరిపురం గ్రామస్థులంతా గ్రామ అభివృద్ధి కోసమే ఆలోచిస్తారు. ఈ గ్రామం మిగతా గ్రామాలతో పోలీస్తే చాలా అందంగా, అభివృద్ధి కళ్లకు కనపడే విధంగా ఉంటుంది. ఆ గ్రామం వెళ్లినప్పుడు నాకు ఆ విషయం స్పష్టమైంది. బైరిపురం గ్రామంలా అన్ని గ్రామాలు ఉంటే పెద్ద సమస్యలే ఉండవని మేం చర్చించుకుంటాం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అంతా ఒకే మాటపై ఉండి ఏళ్ల తరబడి ఏకగ్రీవంగానే సర్పంచులను,వార్డు మెంబర్లను ఎన్నుకోవడం జరుగుతోంది. ఇది చాలా మంచి విషయం. ఇప్పటివరకూ బైరిపురం పేరు మా పోలీస్ రికార్డుల్లో లేదు" అని కవిటి పోలీస్ స్టేషన్ ఎస్సై జి. అప్పారావు బీబీసీతో చెప్పారు.

బైరిపురం

మా ఓటు ఏకగ్రీవానికే

బైరిపురం గ్రామంలో 8 వార్డులలో 11 వందల ఓట్లు ఉన్నాయి. పదిహేను వందల జనాభా ఉన్న ఈ ఏకగ్రీవ పంచాయితీ ప్రజలు గ్రామ అభివృద్ధికే ఓటు వేస్తారు. ఏకగ్రీవాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదుతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు వస్తే మిగతా చోట్ల ఏలా ఉన్నా...ఈ గ్రామంలో మాత్రం అసలు ఎన్నికల వేడి, రాజకీయ వాతావరణ కనిపించదు.

"పంచాయితీ ఎన్నికల సమయంలో గ్రామస్థులంతా సమావేశమై దఫదఫాలుగా చర్చించుకుంటాం. అంతా ఒక నిర్ణయానికి వచ్చి సర్పంచు, వార్డు మెంబర్లుగా కొందరు పేర్లను ప్రకటిస్తాం. గ్రామ పంచాయితీ మొత్తం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. రాజకీయ వివాదాలు, ఎన్నికల హాడావిడితో గ్రామస్థుల మధ్య శత్రుత్వాలు పెరగకుండా ఈ విధంగా ఏకగ్రీవం చేసుకుంటాం. అలాగే ఎన్నికలు జరిగితే మద్యం, డబ్బుల పంపిణీ వంటివి జరిగి... అవి వివాదాలకు దారి తీస్తాయి. అలా జరగడం మాకు ఇష్టం లేదు. ఏకగ్రీవం వల్ల వచ్చే ప్రభుత్వ ప్రోత్సాహకంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఊరంతా ఒక్క మాటపై ఉంటాం. సర్పంచి పదవికి పోటీ పడి మా ఐక్యతను దెబ్బతీసుకోం. వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవమే" అని బైరిపురం మాజీ సర్పంచ్ పుల్లట ప్రభావతి చెప్పారు.

బైరిపురం

అసెంబ్లీకి ఓకే...

''పంచాయితీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవం చేసుకుంటాం. కానీ జనరల్ ఎలక్షన్స్ సమయంలో మాత్రం ఎవరి పార్టీ వారిదే. అయినా కూడా ఎన్నికల హడావిడి ఉండేది కొద్ది రోజులే. మళ్లీ అవి అయిపోగానే మేమంతా ఒక్కటే. మా గ్రామాభివృద్ధి కోసం అన్ని పార్టీల వద్దకు...అంతా కలిసి వెళ్లి పనులు చేయించుకుంటాం''అని గ్రామస్థుడు వెంకటరమణ బీబీసీతో చెప్పారు.

"అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రం గ్రామంలో ఎవరి పార్టీ వారిదే. ఎవరి రాజకీయం వారిదే. కానీ పంచాయితీ ఎన్నికల విషయంలో మాత్రం గ్రామమంతా ఒకే మాటకు కట్టుబడి ఉంటాం. ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలను అభివృద్ధి పనులకు ఉపయోగించుకుంటున్నాం. ఉద్దానం కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతంలో మా బైరిపురం ఉండటంతో... మినరల్ వాటర్ ప్లాంట్, అలాగే ఇంటింటికి కొళాయిల ద్వారా మంచినీటి సరఫరాలను ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ పంచాయితీలోని అన్నిచోట్లా సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే ఒక కళ్యాణ మండపాన్ని, ఆలయాన్ని నిర్మించుకున్నాం. ప్రమాదాలు జరగకుండా వాహనాలపై వచ్చే వారికి మలుపు వద్ద ఎవరు వస్తున్నారో తెలుసుకునేలా వైడ్ గ్లాస్‌లను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక పంచాయితీ ఆఫీసు,యువజన కేంద్రాలు అన్ని మా గ్రామాభివృద్ధి నిధులతోనే నిర్మించుకున్నాం. శ్మశానంలో సైతం విద్యుత్ ఏర్పాటు చేసుకున్నాం. ఇలా మా గ్రామఅభివృద్ధే మాకు ముఖ్యం అని అంతా ఒకటే మాటపై ఉండి అభివృద్ధిని సాధించాం"అని ఆయన చెప్పారు.

బైరిపురం

టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ హాయంలో కూడా...

''అధికారంలో ఏ పార్టీ ఉన్నా అన్ని పార్టీలు మా గ్రామాభివృద్ధికి సహకరించాయి. పార్టీ ఏదైనా మాకు మా పంచాయితీ అభివృద్ధే ముఖ్యం. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేం అంతా ఆయా నాయకులని కలిసి మా సమస్యలు చెప్పి... పనులు చేయించుకుంటాం''అని బైరిపురం గ్రామస్థుడు రమేష్ బీబీసీతో చెప్పారు.

"మా గ్రామం చాలా అభివృద్ది సాధించింది. గొడవలు, రాజకీయాలు చేయకుండా పంచాయితీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవంగా అభ్యర్థులను నిలబెట్టి...వారినే ఎన్నుకుని...ఎన్నికలు లేకుండా చేసుకుంటాం. పార్టీలతో సంబంధం లేకుండా మా గ్రామంలోని అన్ని పార్టీల నాయకులు అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లి మా సమస్యలను చెప్పుకుంటాం. ఆ విధంగానే టీడీపీ ప్రభుత్వ హాయంలో ఇంటింటికి కొళాయిలు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. కాంగ్రెస్ హాయంలో గ్రామంలో కళ్యాణ మండపం, సింమెంట్ రోడ్లు పూర్తి చేసుకున్నాం. ప్రస్తుత వైసీపీ పాలనలో మిగిలిపోయిన కుళాయి కలెక్షన్లు, అసంపూర్తిగా ఉన్న రోడ్లును వేయించుకోగలిగాం. ఇదంతా మా గ్రామ అభివృద్ధిపై మాకు ఉన్న బలమైన కోరిక వలనే జరిగింది" అని బైరిపురం నివాసి రమేష్ చెప్పారు.

బైరిపురం
ఫొటో క్యాప్షన్, నామినేషన్ వేస్తున్న రమాదేవి

ఆ కుటుంబంపైనే నమ్మకం

సర్పంచ్ ఎన్నికలే జరగని ఈ గ్రామంలో పుల్లట వాసుదేవ నాయుడు ఈ ఊరికి మొదటి సర్పంచ్. అప్పటి నుంచి ఆయన వారసులే ఈ ఊరికి సర్పంచులుగా ఎన్నికవుతున్నారు. వాసుదేవనాయుడు తరువాత అతని కుమారుడు దశరథరామయ్య, కోడలు ప్రభావతి వరుసగా సర్పంచులుగా చేశారు. ఈ సారి కూడా వాసుదేవనాయుడి మరో కోడలు పుల్లట రమాదేవిని గ్రామ సర్పంచుగా ఏక్రగ్రీవంగా ఎన్నుకుని...ఆమె చేతనే నామినేషన్ వేయించారు. దీంతో ఈ పంచాయితీ ఎన్నికల్లో కూడా బైరిపురం ఏకగ్రీవమైంది.

బైరిపురం

"పుల్లట కుటుంబం వారే మా గ్రామ పంచాయితీకి సర్పంచులుగా చేస్తున్నారు. మా గ్రామస్థులందరికీ ఎన్నో ఏళ్లుగా ఆ కుటుంబమంటే ఉన్న నమ్మకమే ఇది. వార్డు మెంబర్ల విషయానికి వస్తే.. గ్రామంలో ఉన్న ఇతర ఆరు కులాల వారు విడతల వారీగా ఉంటాం. ఏదైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి ఓ కమిటీ ఉంది. అలాగే 'మన బైరిపురం' పేరుతో వాట్సప్ గ్రూపు పెట్టుకుని అందులో మా గ్రామ సమస్యలు, వాటి పరిష్కరాలు చర్చించుకుంటాం. అలాగే ప్రపంచంలోని ఇతర అభివృద్ధి, కరెంట్ అఫైర్స్ విషయాలను కూడా ఎప్పటికప్పుడూ ఇందులో పోస్టులు ద్వారా తెలుసుకుంటాం. భిన్న ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులు, ఇతర విషయాలు తెలుసుకుని వాటని మా గ్రామాభివృద్దికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచిస్తాం" అని బైరిపురం వాసి శంకరరావు బీబీసీతో చెప్పారు.

ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు మెంబర్లను ఎన్నుకుంటున్న పంచాయితీలు మశాఖపురం, నువ్వలరేవు కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. అలాగే కడపలో శేషారెడ్డి పల్లి కూడా 40 ఏళ్లుగా ఏకగ్రీవ పంచాయతీయే.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)