కేజీఎఫ్ - కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్: టన్నుల కొద్దీ బంగారాన్ని ఇచ్చిన ఈ గనులు ఇప్పుడెందుకు మూతపడ్డాయి?

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

కె.జి.యఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. 2018లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ 'కె.జి.యఫ్ - చాప్టర్ 2' మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన ఈ సినిమా నిన్న మొన్నటి వరకు దేశంలో బంగారు గనులకు పెట్టింది పేరుగా ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ నేపథ్యంగా సాగుతుంది. ఈ బంగారు గనుల తవ్వకాల చుట్టూ అల్లిన ఈ కథ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.

కానీ, దాదాపు 130 ఏళ్ల పాటు ఎంతో బంగారాన్ని అందించిన ఈ గనులు రెండు దశాబ్దాల ఏళ్ల క్రితం మూతపడ్డాయి. 2001 నుంచి బంగారం తవ్వకాలు నిలిచిపోవడంతో కేజీఎఫ్ ప్రాంతం ప్రస్తుతం వెలవెలబోతోంది.

ఇటీవల కాలంలో కేజీఎఫ్‌లో బంగారం తవ్వకాలు మళ్లీ ప్రారంభిస్తారని సాగుతున్న ప్రచారం నేపథ్యంలో అసలు ఆ గనులు మూసివేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు బీబీసీ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లింది.

కేజీఎఫ్

సుదీర్ఘ చరిత్ర

కోలార్ ప్రాంతంలో బంగారం తవ్వకాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. సింధు నాగరికత కాలంలోనూ, ఆ తర్వాత గుప్తుల పాలనలోనూ ఇక్కడ బంగారం తవ్వకాలు జరిగినట్టు కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు.

చోళులు, విజయనగర రాజులు, టిప్పు సుల్తాన్ హయంలో కూడా బంగారం తవ్వకాలు కొనసాగాయి.

మైసూర్ రాజుల పాలనలో ఉన్న కోలార్ ప్రాంతంలో బంగారం కోసం గనుల తవ్వకాలకు కెప్టెన్ వారెన్ అనే బ్రిటిష్ వ్యక్తికి అనుమతి లభించింది. 1802లోనే ఆయన అనుమతి కోరినా తవ్వకాలు మాత్రం ముందుకు సాగలేదు.

తదనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున బ్రిటన్‌ నుంచి భారత్‌కు వచ్చిన పరిశోధకుడు ఎం.ఎఫ్. లావెల్లీ కూడా కావేరీ నదీ తీరం, కోలార్ ప్రాంతంలో బంగారం నిక్షేపాలపై విశేషంగా పరిశోధించారు. మైసూరు పాలకుల నుంచి ఆయనకు కూడా అనుమతి దక్కినా తవ్వకాలకు అయ్యే ఖర్చు భరించే స్తోమత లేకపోవడంతో ఆయన ముందుకు సాగలేకపోయారు.

అయితే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చిన ప్రోత్సాహంతో 1871లో బంగారం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. లావెల్లీ వంటి వారు తమకు దక్కిన అనుమతిని విక్రయించడంతో మరికొందరు ఈ ప్రయత్నాలు చేశారు.

1880లో జాన్ టేలర్ కంపెనీ రావడంతో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ రూపురేఖలు మారిపోయాయి.

టేలర్
ఫొటో క్యాప్షన్, టేలర్

కేజీఎఫ్ పేరు మారుమోగింది...

జాన్ టేలర్ కంపెనీ కోలార్ ప్రాంతంలో బంగారం తవ్వకాలకు ఆధునిక యంత్రాలు తరలించింది. బ్రిటన్‌ నుంచి వాటిని తీసుకొచ్చి మైనింగ్ మొదలుపెట్టింది. అదే సమయంలో అప్పటి వరకూ కిరోసిన్ దీపాల సహాయంతో మైనింగ్ కోసం వెళుతున్న వారికి విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేసింది.

కేజీఎఫ్ ప్రాంతంలోనే దేశంలోనే తొలి పవర్ ప్లాంట్ ఏర్పడినట్టు కేజీఎఫ్ ఇంజనీర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. కోలార్‌కు 150కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరి నదిపైన హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. దాదాపు 150 కిలోమీటర్ల మేర విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేశారు. అప్పటికి(1901-02) అదే అతిపెద్ద లైన్‌ కావడం విశేషం.

విద్యుత్ సదుపాయం రావడంతో 1900 తర్వాత బంగారం తవ్వకాలు జోరందుకున్నాయి. 1901- 1910 మధ్యకాలంలో ఈ గనులనుండి రికార్డు స్థాయిలో మైనింగ్ జరిగిందని రికార్డులు చెబుతున్నాయి. పదేళ్ల కాలంలోనే 1,70,000 టన్నుల ముడి ఖనిజాన్ని వెలికితీశారు. అప్పట్లో ఇది అరుదైన రికార్డు.

కేజీఎఫ్ సమీపంలో ఉన్న సుమారు 12 వేల ఎకరాల విస్తీర్ణంలో బంగారం తవ్వకాలు విస్తృతమయ్యాయి. ముఖ్యంగా ఛాంపియన్ రీవ్ అనే గనిలో మూడు కిలోమీటర్ల మేర తవ్వకాలు చేశారు. అప్పట్లో ఈ గని ప్రపంచంలోనే లోతైన బంగారం గనిగా రికార్డులకెక్కింది.

మినీ బ్రిటన్‌

బంగారం తవ్వకాలు జోరందుకోవడంతో నెల్లూరు నుంచి తంజావూరు వరకూ వివిధ జిల్లాల నుంచి కూలీ కోసం పెద్ద సంఖ్యలో కేజీఎఫ్ ప్రాంతానికి చేరుకున్నారు. వారందరికీ షెడ్లు వేసి ,కొన్ని సదుపాయాలను కంపెనీ సమకూర్చింది.

వారితో పాటుగా సాంకేతిక నిపుణులు, పర్యవేక్షణ కోసం అధికారులు కూడా బ్రిటన్ నుంచి తరలిరావడంతో కేజీఎఫ్ ప్రాంతాన్ని లిటిల్ బ్రిటన్‌గా పిలిచేవారు.

అధికారులకు అనుగుణంగా భవనాలు, కార్మికుల కోసం సాధారణ నిర్మాణాలు జరగడంతో కేజీఎఫ్ ఓ పట్టణ స్థాయికి చేరింది. బంగారం ముడి ఖనిజం తరలించేందుకు, దానిని మిల్లులలో శుద్ధి చేసి అక్కడి నుంచి తరలించేందుకు రోడ్డు రవాణాతో పాటుగా రైల్వే లైన్ కూడా నిర్మించారు.

కేజీఎఫ్‌లో తవ్వితీసిన బంగారం నేరుగా బ్రిటన్‌కు తరలించేవారు. దానికి అనుగుణంగా యంత్రాంగం కూడా ఏర్పాటు చేశారు.

కేజీఎఫ్

స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వం కూడా...

స్వాతంత్ర్యం అనంతరం భారత ప్రభుత్వం కేజీఎఫ్‌లో బంగారం తవ్వకాలను కొనసాగించింది. 1955లో ఈ గనులను జాతీయం చేశారు.

నాటి ప్రధాని నెహ్రూ, అంతకుముందు మహాత్మా గాంధీ సహా అనేక మంది జాతీయ స్థాయి ప్రముఖులు కేజీఎఫ్‌ని పరిశీలించారు. బంగారం తవ్వకాల గురించి వివరాలను సేకరించారు. ఇక్కడ తవ్వితీస్తున్న బంగారం బ్రిటన్‌కి తరలించడం పట్ల అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు.

చివరకు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో కేజీఎఫ్‌లో సేకరించిన బంగారం నేరుగా రిజర్వ్ బ్యాంకుకి తరలించేలా ఏర్పాటు చేశారు.

అప్పట్లో గనుల నుంచి ముడి ఖనిజం తరలించడానికి కన్వేయర్ బెల్ట్ మీదుగా ఏర్పాట్లు ఉండేవి. దూరంగా ఉన్న గనుల నుంచి లారీలలో మెటీరియల్ తెచ్చేవారు. దానిని 40, 30, 10 ఎంఎం సైజులో విభజించి మిల్లులోకి పంపించేవారు. దానిని శుద్ధి చేసి బంగారం, వెండి వేరు చేసి మట్టిని బయటకు పంపించేది. దానికి సైనేడ్ ద్రావణం వాడి శుభ్రం చేసేవారు.

"పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత ఆ బంగారం మార్కెట్ కోసం తరలించేవారు. నాతో సహా వేల మంది కార్మికులు పనిచేసేవారు. గనుల్లోకి వెళ్లి తవ్వేవాళ్లు, ట్రాన్స్ పోర్టు, పవర్ ప్లాంట్, మిల్లు వద్ద టెక్నికల్, నాన్ టెక్నికల సిబ్బంది చాలామంది ఉండేవారు. ఒక్కసారిగా తవ్వకం నిలిపివేయంతో అందరికీ ఉపాధి పోయింది" అంటూ కేజీఎఫ్ లో పనిచేసిన జి మణి అనే కార్మికుడు బీబీసీతో తన అనుభవాన్ని పంచుకున్నారు.

బంగారం తవ్వకం ఎందుకు నిలిచిపోయింది..

కేజీఎఫ్‌లో బంగారం తవ్వకాలను నిలిపివేస్తూ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని కార్మికులు వ్యతిరేకించారు. తమ ఉపాధి పోతుందని ఆందోళన చేశారు.

కానీ, ప్రభుత్వం మాత్రం కోలార్ ప్రాంతంలో బంగారం తవ్వకానికి పెడుతున్న ఖర్చుతో పోలిస్తే, రాబడి తక్కువగా ఉండడంతో కంపెనీ నష్టాల పాలయ్యిందని చెబుతూ 2001 మార్చి 21న దాన్ని పూర్తిగా మూసేసింది.

అంతకుముందే పీవీ నరసింహరావు హయంలో ఈ గోల్డ్ మైన్స్‌ను సిక్ ఇండస్ట్రీగా ప్రకటించారు.

''అప్పట్లో బంగారం తులం అంటే 10 గ్రాములు రూ. 4,000 ఉండేది. ఖర్చు రూ. 9,000 అయ్యేది. పది గ్రాముల బంగారం తీయడానికి అదనంగా రూ 5వేలు ఖర్చు కావడంతో నిర్వహణ సాధ్యం కాదని నిర్ణయించారు. దానికి మరో కారణం ఏమంటే కేజీఎఫ్ బంగారాన్ని నేరుగా ఓపెన్ మార్కెట్లో అమ్మడానికి అనుమతి లేదు. ఆర్బీఐకి తరలించాల్సిందే. లండన్ మెటల్ ఎక్చేంజ్ రేట్ ప్రకారం అమ్మకాలు చేయాల్సి రావడంతో ఎల్ఎంఈ రేటు పడిపోవడంతో కేజీఎఫ్‌కి ఆదాయం తగ్గింది. ఎల్ఎంఈకి, భారత మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసంగా ఉన్న ధరను కేంద్రం చెల్లిస్తుందని తొలుత చెప్పారు. కానీ పీవీ నరసింహరావు హయంలో సబ్సిడీలు ఆపేశారు. దీంతో కంపెనీ నడపడానికి సాధ్యం కాని స్థితికి చేరింది. వందేళ్ల అనుభవం ఉన్న కంపెనీ అలా మూతపడింది'' అంటూ కేజీఎఫ్‌లో ఇంజనీర్‌గా పనిచేసిన త్యాగరాజన్ బీబీసీతో చెప్పారు.

కేజీఎఫ్

‘పరిస్థితి తలకిందులైంది’

కేజీఎఫ్ కార్యకలాపాలు సాగినంతకాలం సంతృప్తిగా కనిపించిన కార్మికులు ఉపాధి కోల్పోయి వలసలు పోవాల్సి వస్తోందని చెబుతున్నారు. కేజీఎఫ్ నిర్వహణలో ఉండగా లభించిన అనేక సదుపాయాలు కూడా కోల్పోయారు.

కేజీఎఫ్ నష్టాలకు అసలు కారణం నిర్వహణా లోపాలేనని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మిక నాయకుడు విజయ్ చంద్రన్ ఇదే విషయం గురించి బీబీసీతో మాట్లాడారు.

''మొదట జాన్ టేలర్ కంపెనీ ప్రారంభించినప్పుడు బంగారం గనుల్లో పనికి స్థానికులు రాలేదు. దాంతో నార్త్ ఆర్కాడ్ జిల్లాల నుంచి కూలీలను తరలించారు. అనేక అవస్థలను ఎదుర్కొన్నారు. వెయ్యి , రెండు వేల అడుగులు లోతుల్లోకి వెళ్లి తవ్వకాలు చేసేవారు. క్యాంపులు వేసుకుని మైన్స్‌కి దగ్గరలో ఉండేవారు. 1930లలో కార్మిక సంఘాలు వచ్చిన తర్వాత కాలనీల నిర్మాణం, ఇతర సదుపాయాలు, వేతనాలకు భరోసా వచ్చాయి. 32వేల మంది కార్మికులు పనిచేసేవారు. కేజీఎఫ్‌కి నగర హోదా కూడా కార్మికులు పెద్ద సంఖ్యలో రావడం వల్లనే జరిగింది. కేజీఎఫ్ నష్టాలకు ప్రధాన కారణం నిర్వహణా వైఫల్యమే. అవినీతి ఎక్కువగా జరిగేది. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడానికి అదో కారణం. నాణ్యమైన బంగారం ఉంది. అయినా తవ్వకాలు సక్రమంగా సాగలేదు. పైగా బంగారం ఓపెన్ మార్కెట్లో అమ్మకానికి లేకుండా పోయింది. ఇలాంటి కారణాల వల్ల పరిస్థితి పూర్తిగా తారుమారయ్యింది. ఉచిత రేషన్ లేదు. ఉచిత కరెంట్ లేదు. ఆస్పత్రి మూసేశారు. ఇలాంటివి అనేకం కోల్పోవడంతో కేజీఎఫ్ కళ తప్పింది'' అంటూ ఆయన వివరించారు.

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో బంగారం తవ్వకాలు చేసిన కార్మికులంతా ఇప్పుడు చెల్లాచెదురయిపోయారని కార్మిక కుటుంబానికి చెందిన ఎస్ బాబు వివరించారు.

''మా నాన్న కేజీఎఫ్‌లో పనిచేశారు. కంపెనీ మూసేసిన తర్వాత పనిలేదు. బెనిఫిట్స్ కూడా రాలేదు. ఇప్పుడు అంతా బెంగళూరు రోజువారీ పనికి పోతున్నారు. సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. నిత్యం వేల మంది కేజీఎఫ్ నుంచి రైళ్లలో బెంగళూరికి పోయి వస్తుంటారు'' అని వివరించారు.

మళ్లీ బంగారం తవ్వకాలపై ఆశలు...

కోలార్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బంగారం లభ్యత తగ్గిపోవడం కూడా అప్పట్లో గనులు మూసివేయడానికి ఓ కారణంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే నేటికీ పలువురు రాజకీయ నేతలు మళ్లీ గనులు ప్రారంభిస్తామనే ప్రకటనలు చేస్తూ ఉంటారు.

కర్ణాటకకు చెందిన మంత్రులు ఈ విషయంలో ఇస్తున్న సానుకూల ప్రకటనలు ఇంతవరకూ ఆచరణ రూపం దాల్చలేదని నిపుణులు చెబుతున్నారు.

మళ్లీ బంగారు గనులు తెరుచుకోవాలంటే ప్రభుత్వం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు.

''మళ్లీ మైనింగ్ ప్రారంభించాలంటే రూ.2,000 కోట్లు పెట్టుబడి అవసరం అవుతుంది. మైనింగ్‌కి కొత్త టెక్నాలజీ అవసరం. గతంలో సాంకేతికంగా చాలా వెనుకబడి ఉండటం వల్ల బంగారం తవ్వకాలు లాభదాయకం కాని పరిస్థితి వచ్చింది. దానిని మార్చి, ప్రభుత్వం ముందుకు వచ్చి పెట్టుబడులు పెడితే మైన్స్ మళ్లీ మొదలుపెట్టవచ్చు. ముందుగా కేజీఎఫ్ నగరాన్ని ఆనుకుని ఉన్న సైనేడ్ గుట్టలను శోధించాలి. అప్పట్లో బంగారం శుద్ధి చేసిన సమయంలో రసాయనాలు కలిపిన తర్వాత పూర్తిగా తీయకుండా కొంత బంగారం వదిలేశారనే వాదన ఉంది. దాని మీద కూడా పరిశోధన చేసి సైనేడ్ గుట్టలు తవ్వితే కొంత ఉపయోగం ఉండవచ్చు'' అని కేజీఎఫ్‌లో ఇంజనీర్ గా పనిచేసిన త్యాగరాజన్ అభిప్రాయపడ్డారు.

బంగారం

ఫొటో సోర్స్, AUSSIEGOLDHUNTERS/DISCOVERYCHANNEL

దృష్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద...

అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని రామగిరి మండలంలో 130 హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు గనులు ఉన్నట్లు గుర్తించారు. భారత్ గోల్డ్ మైన్స్ ఆధ్వర్యంలో కొంతకాలం పాటు తవ్వకాలు కూడా జరిగాయి. వాటిని కూడా 2001లోనే మూసేశారు.

ఇక కేజీఎఫ్‌కు సమీపంలో ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం మండలం చిగురుగుంటలో బంగారు గనుల తవ్వకాలకు ఇటీవల ఎన్ఎండీసీకి అనుమతి వచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధరలు అమాంతంగా పెరిగిన తరుణంలో బంగారం తవ్వకాలు తొలుత చిగురుగుంట ప్రాంతంలో జరగాలని గోల్డ్ మైనింగ్ నిపుణులు చెబుతున్నారు.

ఏపీ మైనింగ్ శాఖ చిగురుగుంటతో పాటుగా మల్లప్పకొండ, బిసానట్టం ప్రాంతాల్లో బంగారం నిక్షేపాలను గుర్తించింది. అవన్నీ బీజీఎంఎల్ ఆధ్వర్యంలో ఉన్నాయని చెబుతోంది.

''కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని మైనింగ్‌కు అనుమతినిస్తే కొంత ఫలితం రావచ్చు. గతంలో చేసిన ప్రయోగాలు ఆశాజనకంగా లేకపోవడంతో ముందుకు సాగలేదు. ఇటీవల ఎన్ఎండీసీ అధికారులు కూడా కొంత సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. బంగారం తవ్వకాలకు అనుమతి లభించే అవకాశం ఉంది'' అని ఏపీ మైనింగ్ శాఖ పలమనేరు డీడీ జగన్నాథరావు బీబీసీతో అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)