నేపాల్‌లో క్యాబ్‌లు, ఆహార పదార్థాలు, సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయెందుకు

ఫొటో సోర్స్, Frédéric Soltan /Corbis via Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ నుంచి చిత్వన్ జిల్లా దాదాపు 170 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
అక్కడకు వెళ్లేందుకు నేను క్యాబ్ తీసుకున్నాను. క్యాబ్ డ్రైవర్ పేరు లక్ష్మణ్ లౌడారీ. ఆయన స్కార్పియోలో నన్ను చిత్వన్ తీసుకువెళ్లారు. లక్ష్మణ్.. భారత్‌తోపాటు సౌదీ అరేబియాలోనూ దాదాపు పదేళ్లు గడిపారు. చిత్వన్‌కు తీసుకెళ్లేందుకు ఆయన నా దగ్గర 10,000 రూపాయలు (భారత కరెన్సీ) తీసుకున్నారు.
దిల్లీలో అయితే, ఈ దూరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తే సరిపోతుంది. మరి ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ తీసుకుంటున్నారు?
ఇదే విషయాన్ని నేను లక్ష్మణ్‌ను అడిగాను.

ఫొటో సోర్స్, Frank Bienewald/getty images
ప్రభుత్వం మమ్మల్ని లూటీ చేస్తోంది
లక్ష్మణ్ నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు. ‘‘మమ్మల్ని ప్రభుత్వం లూటీ చేస్తోంది. మేం ప్రజలను లూటీ చేస్తున్నాం. నేను ఈ స్కార్పియోను ఎంతకు కొన్నానో తెలుసా? 22 లక్షల రూపాయలు (భారత కరెన్సీ) పెట్టి సెకండ్ హ్యాండ్‌లో నేను దీన్ని తీసుకున్నాను. ఇంకొక మూడు లక్షలు పెడితే భారత్‌లో నేను రెండు కొత్త స్కార్పియోలను కొనుక్కోవచ్చు’’అని లక్ష్మణ్ చెప్పారు.
‘‘ప్రభుత్వం మా దగ్గర దోచుకుంటోంది. మాకు తిరిగి ఏమీ చేయట్లేదు’’అని ఆయన అన్నారు.
భారత్ నుంచి కొనుగోలు చేసే కార్లపై నేపాల్ 250 శాతానికిపైనే ట్యాక్స్‌లు విధిస్తుంది. ఎక్సైజ్, కస్టమ్, స్పేర్ పార్ట్స్, వ్యాట్ పేరుతో ఈ పన్నులు వసూలు చేస్తుంది. మోటార్ వెహికల్స్ ట్యాక్స్ దీనికి అదనం. అందుకే భారత్‌తో పోలిస్తే.. ఇక్కడ కార్లను దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు.
ఇక్కడ బైక్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుంటాయి. ఇవన్నీ విలాసవంతమైన వస్తువులని (లగ్జరీ కేటగిరీ), అందుకే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, ఇక్కడి ప్రభుత్వ రవాణా సదుపాయాలు సరిగ్గా ఉండవు. దీంతో ప్రజలు ఎక్కువగా ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
‘‘రాచరికం వల్లే’’
‘‘నేపాల్‌లో రాచరిక వ్యవస్థ ఉండేటప్పుడు ప్రజలను స్వేచ్ఛగా బతికనిచ్చేవారు కాదు. సామాన్య ప్రజలకు కనీస సౌకర్యాలు సరిగా అందేలా చూసేవారు కాదు. అవే పరిస్థితులు ఇప్పటికీ పునరావృతం అవుతున్నాయి’’అని కాఠ్‌మాండూ యూనివర్సిటీలోని ఎకానమిక్స్ ప్రొఫెసర్ విశ్వ పౌడెల్ చెప్పారు.
‘‘మోటార్ వాహనాలపై 250 నుంచి 300 శాతం వరకు ట్యాక్స్‌లు విధించడంలో అర్థంలేదు. దీని బదులు టోల్ ట్యాక్స్‌ను వసూలు చేసి.. రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టిపెడితే మేలు. కాఠ్‌మాండూ నుంచి వీరగంజ్‌కు మధ్య దూరం 150 కి.మీ. కంటే తక్కువే. అయితే, అక్కడి నుంచి ఇక్కడకు ట్రక్కులు రావాలంటే దాదాపు రెండు రోజులు పడుతుంది. ఇక్కడి రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి’’.
‘‘ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వానికి వేరే మార్గాలేవీ కనపడటం లేదు. దీంతో అర్థంపర్థంలేని రీతిలో సుంకాలు విధిస్తున్నారు’’అని విశ్వ అన్నారు.
‘‘విదేశాల్లో పనిచేసే నేపాలీలు వెనక్కి పంపే డబ్బులపైనే నేపాల్ విదేశీ మారకం నడుస్తోంది. ఇక్కడ పెట్టుబడుల ఊసే ఉండదు. ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే, రోడ్లు, విద్యుత్, నైపుణ్యంగల కార్మికులు లాంటివి చూస్తారు. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితులే లేవు. పైగా ఏదైనా విదేశీ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి వస్తే... తమ సంపద దోచుకుపోతున్నట్లు చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు ఎలా వస్తాయి?’’అని ఆయన ప్రశ్నించారు.
‘‘సరకులు, వస్తువులను ప్రజలకు చౌక ధరలకు అందించాలని ప్రభుత్వం భావించదు. కార్లు, బైకులే కాదు.. ఇక్కడ ఆహారం, పానీయాలు కూడా ప్రియమైనవే. ఒక కప్పు టీ కోసం రూ.14 (భారత కరెన్సీ)ని మనం చెల్లించాల్సి ఉంటుంది’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, SOPA Images/getty
అన్నీ అంతే..
నేపాల్‌లో ఏదైనా రెస్టారెంట్‌కు తినడానికి వెళ్తే.. వెయ్యి రూపాలయకుపైనే ఖర్చు అవుతుంది. ఇక్కడ మేక మాంసం కేజీ రూ.900. ప్రస్తుతం బంగాళా దుంపల సీజన్ నడుస్తోంది. అయితే, నేపాల్‌లో బంగాళా దుంపలు కేజీ రూ.45కుపైనే ఉంటాయి. ఉల్లిపాయలు అయితే కేజీ రూ.90కిపైనే ఉంటాయి.
ఆర్బీఐ తరహాలో నేపాల్‌లోనూ ఒక రిజర్వు బ్యాంకు ఉంది. దీన్నే నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్‌గా పిలుస్తారు. దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన నర్‌బహాదుర్ థాపా బీబీసీతో మాట్లాడారు. భారత్‌లో ధరలను ఇక్కడి ధరలతో పోల్చి చూడటం సరికాదని ఆయన అన్నారు.
‘‘నేపాల్‌కు సముద్ర మార్గం లేదు. నేపాల్ అంతర్జాతీయ వాణిజ్యంలో 65 శాతం వరకు భారత్‌తోనే ముడిపడి ఉంది. పైగా ఇదంతా ఏకపక్షమే. అంతా భారత్‌కు అనుకూలంగానే ఉంటుంది. మేం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంటాం. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌కు విక్రయిస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూను పెంచుకోవడానికి పన్నులు పెంచడమే ఏకైక మార్గం’’అని థాపా అన్నారు.

ఫొటో సోర్స్, NurPhoto/getty Images
బంగ్లాదేశ్‌లా ఎందుకు ముందుకు వెళ్లలేదు?
‘‘నేపాల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 35 బిలియన్ డాలర్లు. వ్యవసాయ, సేవా రంగాల నుంచే దేశానికి ఎక్కువ రెవెన్యూ వస్తోంది. వస్తూత్పత్తి రంగం నుంచి వచ్చేది చాలా తక్కువ. నిజానికి నేపాల్‌ను బంగ్లాదేశ్‌తో కూడా పోల్చి చూడలేం. ఎందుకంటే బంగ్లదేశ్‌కు సముద్రం ఉంది’’అని థాపా అన్నారు.
రెడీమేడ్ వస్త్రాల తయారీలో మొదటి స్థానం, జెనెరిక్ ఔషధాల తయారీలో రెండో స్థానాన్ని బంగ్లాదేశ్ సంపాదిస్తున్నప్పుడు నేపాల్ ఎందుకు ఆ దిశగా ముందుకు వెళ్లలేదు? అని విశ్వను బీబీసీ ప్రశ్నించింది.
‘‘అక్కడ రాజకీయ వాతావరణం చాలా బావుంటుంది. ఇక్కడ విద్యావంతులైన నేపాలీలకు కూడా ఉద్యోగాలు ఉండవు. ఎవరైనా బిహారీ.. గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ పనిచేసిన డబ్బులతో హాయిగా ఇల్లు కొనుక్కోవచ్చు. కానీ నేపాల్‌లో అలా కాదు. ఎందుకంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే కనీసం కోటి రూపాయలు ఉండాలి’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Pacific Press/LightRocket via Getty Images
కొత్త రోడ్లే లేవు..
‘‘గత 40ఏళ్లలో నేపాల్‌లో కొత్త రోడ్లు అనేవే వేయలేదు. పన్నులు పెంచకపోతే రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇది చాలా వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే నాలుగు దశాబ్దాల్లో కొత్త రోడ్లు లేవు. రైళ్లు లేవు.. మరోవైపు ప్రైవేటు వాహనాలపైనా విపరీతంగా పన్నులు విధిస్తున్నారు’’అని నేపాల్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ దులాల్ అన్నారు.
‘‘నేపాల్‌లో చాలా వాహనాలు ఉన్నాయని రాజకీయ నాయకులు చెబుతుంటారు. కానీ నిజం ఏమిటంటే ఇక్కడ రోడ్లు తక్కువగా ఉన్నాయి. వాహనాలపై 300 శాతం పన్ను విధించే కంటే.. రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడితే మేలు. కానీ ప్రస్తుతం మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టులు చాలావరకు మధ్యలోనే ఆగిపోయాయి’’అని ఆయన చెప్పారు.
‘‘ఇక్కడ ట్యాక్సీ రేట్లు కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే విడి భాగాలపైనా 40 శాతం వరకు ట్యాక్స్ విధిస్తున్నారు. అసలే అధ్వానమైన రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లు.. వీటికితోడు వేగంగా వెళ్లాలని అనుకుంటే తీవ్రమైన పరిణామాలను చవిచూడాల్సి ఉంటుంది’’అని ఆయన అన్నారు.

చమురు వినియోగం కూడా ఎక్కువే...
నేపాల్‌లో చమురు వినియోగం కూడా ఎక్కువే. దీనిపై పన్నులు తగ్గిస్తామనే రీతిలో ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇవ్వడంలేదని కృష్ణ ప్రసాద్ అన్నారు.
నేపాల్‌లో విద్యుత్ ఖర్చులు కూడా చాలా ఎక్కువ. ఒక యూనిట్‌కు ఇక్కడ రూ.12 వరకు చెల్లించాల్సి ఉంటుంది. రోడ్డు పక్కనుండే సెలూన్ షాప్‌లు భారత్‌లో జుట్టు కత్తిరించడానికి రూ.20 నుంచి రూ.50 మధ్య వసూలు చేస్తుంటాయి. నేపాల్‌లో అయితే రూ.220 చెల్లించాల్సిందే. మరోవైపు పుస్తకాలు, పెన్నులు, మందులు.. ఇలా అన్ని ఇక్కడ ధర ఎక్కువే.
కాఠ్‌మాండూలోని ధోబీఘాట్ ప్రాంతంలో మధేశీ సెలూన్ షాప్‌కు నేను జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్లాను. అక్కడ కటింగ్ అనంతరం నా దగ్గర రూ.220 తీసుకున్నారు. మీరు ఎక్కువగా తీసుకుంటున్నారని అక్కడ పనిచేసే శివ్ శంకర్ ఠాకుర్‌తో అన్నాను.
ఆయన నవ్వుతూ.. ‘‘ఈ దుకాణం కోసం మేం ఎంత అద్దె చెల్లిస్తున్నామని అనుకుంటున్నారు?’’అని ప్రశ్నించారు. రూ.2,000 ఉంటుందా? అని నేను అడిగాను. అయితే, ఆయన నవ్వుతూ దీని అద్దె రూ.10,000 అని చెప్పారు.
నేపాల్ పర్యటన చవకగా అయిపోతుందని అనుకుని మీరు ఇక్కడకు వస్తే కాస్త అసంతృప్తికి గురికావాల్సిందే. ఇక్కడి పోఖ్రా, సొలుఖుంబు ప్రాంతాల్లో ఖర్చులు సింగపూర్‌ను తలపిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న డిమాండే హత్యకు కారణమా?
- మదనపల్లె హత్యలు: ‘కాళికనని చెబుతూ.. నాలుక కోసి..
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








