మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై - BBC ISWOTY

ఫొటో సోర్స్, Hindustan Times
మెహులీ ఘోష్‌ది పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా. తాను ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా మారతానని చిన్నప్పుడు ఆమె అస్సలు అనుకోలేదు.
జాతర్లలో బెలూన్లను తుపాకితో పేల్చే స్టాళ్లలో ఆడుకుంటున్నప్పుడు ఆమెకు షూటింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. కానీ, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఈ క్రీడలో పతకాలు తెస్తానని ఆమెకు అప్పుడు తెలియదు.
2016లో జరిగిన నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్స్ టోర్నీలో తొమ్మిది పతకాలు సాధించి మెహులీ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించారు. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు. ఆ ప్రదర్శనతో భారత జూనియర్ జట్టుకు ఆమె ఎంపికయ్యారు.
మరుసటి ఏడాది జపాన్‌లో జరిగిన ఏసియన్ ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించారు. ఇదే ఆమెకు తొలి అంతర్జాతీయ పతకం.
భారత షూటర్ అభినవ్ బింద్రాను మెహులీ స్ఫూర్తిగా తీసుకున్నారు. 2008 బీజీంగ్ ఒలింపిక్స్‌లో బింద్రా బంగారు పతకం గెలవడాన్ని ఆమె టీవీలో చూశారు. అలాంటి ప్రదర్శనే ఎప్పటికైనా తానూ చేయాలని ఆమె సంకల్పించుకున్నారు.
మెహులీది మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి దినసరి కూలీ. తల్లి గృహిణి. తమకున్న పరిమిత వనరులతో షూటింగ్ లాంటి క్రీడ సాధన చేయడం ఆమెకు చాలా కష్టం.
తల్లిదండ్రులను ఒప్పించి, శిక్షణ మొదలుపెట్టేందుకు మెహులీకి ఏడాది పట్టింది. వాళ్లు ఒప్పుకున్న తర్వాత, ఇక వెనుదిరిగి చూడలేదు.
మెహులీకి ఆమె తల్లిదండ్రులు తమకు వీలైనంతగా సహకరించారు. అప్పట్లో ఆమె సాధన చేసేందుకు సరైన షూటింగ్ రేంజ్, ఎలక్ట్రానిక్ టార్గెట్ వంటి ఏర్పాట్లు ఉండేవి కావు. దీంతో రేంజ్‌ల్లో టార్గెట్‌లను మార్చేందుకు చేత్తో లాగే పుల్లీని ఆమె ఉపయోగించేవారు.
ఆ తర్వాత ఆమెకు మరో పెద్ద సవాలు ఎదురైంది.

2014లో మెహులీ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి వైపు పెల్లెట్ పేల్చారు. ఆ వ్యక్తి గాయపడటంతో ఆమె తాత్కాలిక నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో మెహులీ కుంగుబాటుకు గురయ్యారు.
ఈ సమయంలో ఆమెకు కుటుంబ సభ్యులు, ప్రముఖ షూటర్ జోయ్‌దీప్ కర్మాకర్ అండగా నిలిచారు. దీంతో ఆమె జీవితం మలుపు తిరిగింది.
అప్పటికి మెహులీకి సరైన కోచ్ లేరు. కర్మాకర్ అకాడమీలో శిక్షణ తీసుకోవడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నూరిపోసింది.
ఆ అకాడమీలో శిక్షణ తీసుకునేందుకు మెహులీ రోజూ నాలుగు గంటల ప్రయాణం చేయాల్సి వచ్చేది. అప్పుడప్పుడు శిక్షణ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటేది.
2017లో మెహులీ శ్రమకు ఫలితం దక్కింది. జపాన్‌లో జరిగిన ఏసియన్ ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో ఆమె తన తొలి అంతర్జాతీయ బంగారు పతకం గెలిచారు. ఆ తర్వాత వివిధ అంతర్జాతీయ పోటీల్లోనూ ఆమెకు పతకాలు దక్కాయి.
2018లో యూత్ ఒలింపిక్స్ గేమ్స్‌లో, కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె వెండి పతకాలు సాధించారు. అదే ఏడాది వరల్డ్ కప్‌లో కాంస్యం గెలిచారు. 2019లో సౌత్ ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణం అందుకున్నారు.
ప్రస్తుతం ఒలింపిక్స్, వరల్డ్ కప్ పోటీల్లో స్వర్ణాల సాధనే లక్ష్యంగా మెహులీ కృషి చేస్తున్నారు.
భారత్‌లో కొన్ని ప్రముఖ క్రీడల్లో సాధించిన విజయాలపై జనం సంబరాలు చేసుకుంటారని, మిగతా క్రీడల్లో విజయాలకు మాత్రం అంతగా గుర్తింపు రాదని ఆమె అన్నారు. పరిస్థితి మారి, మిగతా క్రీడల్లో రాణించేవారికి కూడా గుర్తింపు రావాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
(మెహులీ ఘోష్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)
ఇవి కూడా చదవండి:
- మదనపల్లె హత్యలు: కూతుళ్లను చంపిన కేసులో తల్లితండ్రులకు 14 రోజుల రిమాండ్...
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- స్టాండప్ కమెడియన్: వేయని జోకులకు జైలు శిక్ష అనుభవించిన మునావర్ ఫారూఖీ
- కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?
- డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు ఎంత తెలుసు? భారతదేశంలో ఇది ఎక్కడెక్కడ పండుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








