ఆర్ వైశాలి: చెస్ ఆటలో మహిళా కెరటం - ISWOTY

ఆర్ వైశాలి

ఫొటో సోర్స్, Getty Images

ఆమె ముంబైలో నేషనల్ ఉమెన్ చాలెంజర్స్ టోర్నమెంటు గెలిచినపుడు ఆమె కేవలం 14 సంవత్సరాల టీనేజర్. అప్పటికే ఆమె ఎన్నో జూనియర్ టోర్నమెంట్లు గెలిచింది. నేషనల్ ఉమెన్ చాలెంజర్స్ టోర్నమెంట్ గెలిచిన తర్వాత ఇక వెనక్కి చూడలేదు ఆర్ వైశాలి.

ప్రపంచం ఆమెను గుర్తించటం మొదలైంది. 2017లో ఏసియన్ ఇండివిడ్యువల్ బ్లిడ్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచినపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు.

2018లో వైశాలి ఇండియన్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయినపుడు ప్రపంచ మాజీ చాంపియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆమెకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

చెస్ క్రీడ వైశాలి కుటుంబంలో ప్రవహిస్తోంది. ఆమె పదిహేనేళ్ల తమ్ముడు ఆర్ ప్రజ్ఞానంద ప్రపంచంలో అతి పిన్నవయస్కులైన గ్రాండ్ మాస్టర్లలో ఒకరు.

వైశాలి వయసు ఇప్పుడు 19 ఏళ్లు. ఆమె చెస్‌లో ఉమెన్ గ్రాండ్ మాస్టర్. తన సోదరుడి తరహాలో తాను కూడా త్వరలో గ్రాండ్ మాస్టర్ కావాలని ఆశిస్తున్నారు.

భారతదేశ చెస్ రాజధానిగా పరిగణించే చెన్నైకి చెందిన ఈ అక్కా తమ్ముళ్లు.. చాలా చిన్న వయసు నుంచే చెస్ ఆడటం ప్రారంభించారు.

వైశాలి తన కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలు సాధించారు. 2012లో అండర్-11, అండర్-13 నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లు గెలుచుకున్నారు. అదే ఏడాది కొలంబోలో ఏసియన్ అండర్-12 టైటిల్, స్లొవేనియాలో అండర్-12 వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లు కూడా గెలిచారు.

ఆర్ వైశాలి
ఫొటో క్యాప్షన్, ఆర్ వైశాలి

పునాది నిర్మాణం

చెన్నై నగరం ఆరోగ్యవంతమైన చెస్ సంస్కృతికి ఆలవాలం. అయితే చెస్ ఆడటానికి అవసరమైన శిక్షణ, ప్రయాణాల కోసం చాలా ఖర్చవుతుందని.. తొలినాళ్లలో ఈ విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని వైశాలి చెప్తారు.

ఆమె శిక్షణ పొందుతున్న తొలి రోజుల్లో ఆమెకు కంప్యూటర్ లేదు. తన చెస్ విజ్ఞానం పునాదులు నిర్మించుకోవటానికి, వ్యూహాలు అభివృద్ధి చేసుకోవటానికి పుస్తకాల మీదే ఆధారపడాల్సి వచ్చింది.

అధునాతన చెస్ సాఫ్ట్‌ వేర్, టూల్స్ ద్వారా నేర్చుకునే అవకాశం తొలినాళ్లలో ఆమెకు అందలేదు.

2012లో స్లొవేనియాలో వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాతే ఆమెకు స్పాన్సర్‌షిప్ ద్వారా ఒక ల్యాప్‌టాప్ లభించింది. దానివల్ల ఆమె చెస్ క్రీడాకారిణిగా మరింత బలోపేతమయ్యారు.

వైశాలి, ఆమె తమ్ముడు స్పాన్సర్ల దృష్టిని ఆకర్షించటం మొదలయ్యే వరకూ, ఆ తర్వాత ఇప్పుడు కూడా వారి తల్లిదండ్రులు వారికి మద్దతునిచ్చే పునాదిరాళ్లుగా నిలుచున్నారు.

చెస్ క్రీడకు అవసరమైన శిక్షణ, ఆర్థిక అవసరాలను తీర్చటం కోసం ఆమె తండ్రి కృషి చేస్తే.. ఆమె టోర్నమెంటుల్లో పాల్గొనటానికి వెళ్లినపుడు తల్లి తోడుగా ఉండేవారు.

ప్రపంచ యువ గ్రాండ్ మాస్టర్లలో ఒకరు తమ ఇంట్లో ఉండటం వల్ల కూడా తనకు పరిస్థితులు కొంత సులువయ్యాయని వైశాలి చెప్తారు.

వీళ్లద్దరూ కలిసి ప్రాక్టీస్ చేయటం తక్కువే అయినా.. వీరిద్దరూ కలిసి చాలా సేపు వ్యూహాలు చర్చిస్తూ గడుపుతారు. వైశాలి టోర్నమెంట్లకు సంసిద్ధం కావటానికి ప్రజ్ఞానంద తన అమూల్యమైన సూచనలతో తోడ్పాటునందిస్తుంటారు.

చెస్

ఫొటో సోర్స్, Getty Images

వ్యూహాలు.. లక్ష్యాలు...

2020 జూన్‌లో ఫిడే చెస్.కామ్ ఉమెన్స్ స్పీడ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రపంచ మాజీ చాంపియన్ ఆంటోనెట్ స్టెఫానోవేన్‌ను ఓడించిన వైశాలి ప్రపంచ చెస్ సమాజాన్ని ఆశ్చర్యచకితులను చేశారు.

చెస్ పోటీల్లో తరచుగా విజయాలు సాధించటం.. ఈ ఆట మీద తాను మరింతగా కష్టపడాలనే కాంక్షను రేకెత్తించాయని వైశాలి చెప్తారు.

ముందు ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) టైటిల్ కోసం పోటీపడాలని, ఆ తర్వాత గ్రాండ్ మాస్టర్ కావాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు.

వైశాలి స్వయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ.. చాలా మంది ఇతర మహిళా క్రీడాకారులు నైపుణ్యం, సత్తా ఉన్నా కూడా విజయాలు సాధించలేకపోతున్నారని.. తమ కెరీర్‌లో వివిధ దశల్లో వివక్షను ఎదుర్కోవటమే దానికి కారణమని ఆమె చెప్తున్నారు.

మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలను.. పురుషులు సాధించిన విజయాలతో సమాన స్థాయిలో పరిగణించరని.. పురుషులు, మహిళల క్రీడల ప్రైజ్ మనీలో (నగదు బహుమతులు) ఉన్న వ్యత్యాసాలే దీనికి తార్కాణమని ఆమె ఉటంకిస్తున్నారు.

(ఆర్ వైశాలికి బీబీసీ పంపిన ఈమెయిల్ ప్రశ్నావళికి ఆమె ఇచ్చిన సమాధానాలు ఈ కథనానికి ఆధారం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)