ISWOTY - శైలీ సింగ్: అథ్లెటిక్స్‌లో భారత్‌ ఆశాకిరణం

శైలీ సింగ్
ఫొటో క్యాప్షన్, శైలీ సింగ్

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శైలీ సింగ్ పేరిట జూనియర్ స్థాయిలో లాంగ్ జంప్‌లో జాతీయ రికార్డు ఉంది. ఆమెను చాలా మంది విశ్లేషకులు భారత వెటరన్ జంపర్ అంజు బాబీ జార్జ్‌తో పోలుస్తుంటారు.

అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు తొలి పతకం సాధించిపెట్టింది అంజూ బాబీ జార్జే.

నిజానికి శైలీ సింగ్‌కు మార్గ నిర్దేశం చేస్తున్నది కూడా అంజూ బాబీ జార్జ్... ఆమె భర్త, కోచ్ రాబర్ట్ బాబీ జార్జ్.

శైలీ సింగ్‌కు ఇప్పుడు 17 ఏళ్లు. ఆమె 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అంటే 2018లో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 5.94 మీటర్ల దూరం లాంగ్ జంప్ చేసి రికార్డు నెలకొల్పారు.

ఒక ఏడాది తర్వాత అండర్-18 విభాగంలో 6.15 మీటర్లు దూకి తన రికార్డును తానే తిరగరాశారు.

అండర్-16, అండర్-18 విభాగాల్లో శైలీ బంగారు పతకాలు సాధించి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరెన్ రిజిజు నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.

ఐఏఏఎఫ్ అండర్-20 ఛాంపియన్‌షిప్‌-2020కి నిర్ణయించిన అర్హత ప్రమాణాల కన్నా మెరుగైన ప్రదర్శన ఆమె చేశారు.

శైలీ సింగ్

శైలీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో 2004 జనవరి 7న పుట్టారు. శైలీని ఆమె తల్లి వినీత సింగ్ ఒంటరిగా పెంచి పెద్ద చేశారు.

వినీత టైలరింగ్ చేస్తుంటారు. కుమార్తె అథ్లెటిక్స్‌లోకి వెళ్లాలనుకుంటున్నానని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయారు.

వాళ్లు ఉండే ప్రాంతంలో క్రీడలకు సంబంధించిన కనీస మౌలిక వసతులు కూడా లేవు.

కానీ శైలీ పట్టుదల, సామర్థ్యం చూసిన తర్వాత వినీత మనసు మారింది. కుమార్తెను ప్రోత్సహించాలని ఆమె నిర్ణయించుకున్నారు.

అదృష్టవశాత్తు శైలీ ప్రతిభను కోచ్ రాబర్ట్ బాబీ జార్జ్ త్వరగానే గుర్తించారు. ఆమెకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

దీంతో బెంగళూరులోని అంజూ బాబీ స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు వెళ్లి, శైలీ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పటికి ఆమె వయసు 14 ఏళ్లే.

శైలీ సింగ్

అండర్-18 విభాగంలో టాప్-20 లాంగ్ జంపర్స్‌ జాబితాలో శైలీ సింగ్ చోటు దక్కించుకున్నారు.

భారత అథ్లెటిక్స్‌లో ఆమెను ఓ ఆశాకిరణంలా విశ్లేషకులు చూస్తున్నారు.

2024 ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తేగల సత్తా ఉన్న క్రీడాకారిణి శైలీ సింగ్ అని రాబర్ట్ బాబీ జార్జ్ అంటున్నారు.

శైలీ సింగ్‌కు అభినవ్ బంద్రా స్పోర్ట్స్ సెంటర్ నుంచి కూడా ప్రోత్సాహం అందుతోంది.

అయితే శైలీ సింగ్ లాంటి క్రీడాకారిణులను ప్రోత్సహించడానికి మరింత చేయాల్సి ఉందని రాబర్ట్ అభిప్రాయపడుతున్నారు.

పోటీల్లో విజయం సాధించినప్పుడల్లా శైలీ తన తల్లికి ఫోన్ చేసి విషయం చెబుతుంటారు. ఏదో ఒకరోజు లఖ్‌నవూ లేదా ఝాన్సీలో తన తల్లి ముందు ఓ పెద్ద పోటీలో మంచి ప్రదర్శన చేయాలని ఆమె కలలు కంటున్నారు.

తన తల్లిని గర్వపడేలా చేసేందుకు కఠిన శ్రమను కొనసాగిస్తానని శైలీ చెబుతున్నారు.

(శైలీ సింగ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)