ISWOTY - సొనాలీ విష్ణు: ‘ఒకప్పుడు వేసుకునేందుకు షూస్ లేవు... ఇప్పుడు భారత్‌కు ఆడుతున్నా’

సొనాలీ విష్ణు

సొనాలీ విష్ణు శింగేట్ ఇప్పుడు భారత మహిళల కబడ్డీ జట్టులో ఓ ప్రముఖ ప్లేయర్. కానీ, ఈ క్రీడలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు, ఆమెకు వేసుకునేందుకు షూస్ కూడా లేవు. వాటిని కొనిచ్చే స్థితిలో ఆమె కుటుంబం లేదు.

అదొక్కటే ఆమె ఎదుర్కొన్న సవాలు కాదు. 100 మీటర్లు పరిగెత్తేందుకు కూడా ఆమె శ్రమపడేవారు.

కాళ్లలో, ఉదర భాగంలో బలం పెంచుకునేందుకు, బరువులు కట్టుకుని ఆమె పరుగులు తీసేవారు. కఠిన వ్యాయామాలు చేసేవారు.

శిక్షణ, మ్యాచ్‌లు పూర్తయ్యాక పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అర్ధరాత్రి వరకూ పుస్తకాలతో కుస్తీ పట్టేవారు.

క్రీడల కోసం చదువును నిర్లక్ష్యం చేయకూడదని సొనాలీకి ఆమె కుటుంబం గట్టిగానే చెప్పింది. అయితే, క్రీడల్లో రాణించేందుకు ఆమెకు తమకు చేతనైనంత సహకారం కూడా అందించింది.

సొనాలీ తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. ఆమె తల్లి వికలాంగురాలు. ఆమె తినుబండారాలు అమ్మే కొట్టు నడిపించేవారు.

సొనాలీ కబడ్డీలో సత్తా చాటుకుని, భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడింది.

సొనాలీ విష్ణు

1995లో మే 27న ముంబయిలోని లోయర్ పారెల్‌లో సొనాలీ పుట్టారు. మహర్షి దయానంద్ కాలేజీలో చదివారు.

బాల్యంలో ఆమెకు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. అయితే, క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఆట వస్తువులు కొనిచ్చే పరిస్థితిలో ఆమె కుటుంబం లేదు.

ఆ తర్వాత ఆమె కాలేజీలో సరదాగా కబడ్డీ ఆడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెకు ఈ క్రీడపై ఆసక్తి పెరిగింది.

స్థానిక శివ శక్తి మహిళా సంఘ క్లబ్ కోచ్ రాజేశ్ పడవే దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. సొనాలీకి ఆయనే షూస్, కిట్ కొనిచ్చారు. ఆమెకు కఠోర శిక్షణ ఇచ్చారు.

కోచ్‌లు... గౌరీ వాడేకర్, సువర్ణ బర్టాకే లాంటి సీనియర్ క్రీడాకారిణుల తోడ్పాటుతోనే తాను ఈ క్రీడలో ఎదగగలిగానని సొనాలీ చెబుతుంటారు.

శిక్షణ మొదలుపెట్టిన కొన్నేళ్లకు సొనాలీ వెస్టర్న్ రైల్వేస్ జట్టులో చేరారు. అక్కడ గౌతమి అరోస్కర్ శిక్షణలో మరింత నైపుణ్యం సాధించారు.

సొనాలీ విష్ణు

2018లో జరిగిన ద ఫెడరేషన్ కప్ టోర్నమెంట్ సొనాలీ కెరీర్‌లో కీలక మలుపు. ఆ టోర్నీలో హిమాచల్ ప్రదేశ్‌ను ఓడించిన ఇండియన్ రైల్వేస్ జట్టులో ఆమె సభ్యురాలు.

ఈ టోర్నీలో ప్రదర్శనతో సొనాలీ జాతీయ కోచింగ్ శిబిరానికి ఎంపికయ్యారు. ఆ తర్వాత జకార్తాలో జరిగిన 18వ ఆసియన్ క్రీడల్లో భారత్ తరఫున ఆడే అవకాశం సంపాదించుకున్నారు.

ఆ టోర్నీలో భారత జట్టు వెండి పతకం గెలిచింది. ఆ తర్వాత 2019లో కాఠ్‌మాండూలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం సాధించింది. ఈ రెండు టోర్నీల్లో విజయాలు సొనాలీకి మరింత ప్రాచుర్యం తెచ్చిపెట్టాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి 2019లో రాష్ట్రంలో అత్యున్నత క్రీడాపురస్కారమైన శివ్ ఛత్రపతి అవార్డును అందజేసి సొనాలీని సత్కరించింది.

ఆ మరుసటి ఏడాది సొనాలీ 67వ జాతీయ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచారు.

మున్ముందు మరిన్ని అంతర్జాతీయ టోర్నీల్లో భారత్ తరఫున ఆడి రాణించాలని ఆమె ఆశిస్తున్నారు.

భారత్‌లో మహిళల కబడ్డీని మరింత ప్రోత్సహించడానికి... పురుషులకు ప్రొ కబడ్డీ లీగ్ ఉన్నట్లుగానే మహిళలకు కూడా ఓ ప్రొఫెషనల్ లీగ్ ఉండాలని సొనాలీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

(సొనాలీ విష్ణు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)