వీకే విస్మయ: ఇంజినీర్ కావాలనుకున్న ఈమె, ఇప్పుడు టోక్యో ఒలింపిక్ పతకంపై గురిపెట్టారు

ఫొటో సోర్స్, Getty Images
అనుకోకుండా అథ్లెట్ అయ్యానని చెబుతారు 23 ఏళ్ల వీకే విస్మయ. కేరళలోని కన్నూరు జిల్లాలో పుట్టిన ఆమె మొదట తన చదువు కొనసాగించాలని, ఇంజినీర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అదే సమయంలో తాను క్రీడల్లో కూడా బాగానే రాణించగలనని విస్మయ అనుకునేవారు.
కానీ, తను ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకమే గెలవబోతున్నానని అప్పుడు ఆమె ఊహించలేదు.
విస్మయ సోదరి ఆ సమయంలో ఒక వర్ధమాన క్రీడాకారిణి. అథ్లెటిక్స్ మీద మరింత ఆసక్తి పెట్టమని ఆమె తన సోదరిని ప్రోత్సహించారు.
తర్వాత విస్మయ తన స్కూల్లో స్పోర్ట్స్ టీచర్ల నుంచి, చంగానాస్సేరిలో టాప్ అథ్లెట్స్‌ను తయారు చేస్తుందనే పేరున్న అజంప్షన్ కాలేజీ కోచ్‌ల సాయంతో క్రీడా ప్రయాణం ప్రారంభించారు.
మొదట 2014లో కేరళ తరఫున క్రీడల్లో పాల్గొన్న విస్మయ ఆ పోటీల్లో రెండు రజత పతకాలు సాధించారు.
ప్రస్తుతం 2021 ఒలింపిక్ క్రీడల్లో పోటీపడేందుకు శిక్షణ తీసుకుంటున్నారు.
టోక్యో ఒలింపిక్ క్రీడలకు ఇప్పటికే క్వాలిపై అయిన విస్మయ, అథ్లెటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని తను నిర్ణయం తీసుకోవడం అంత సులభంగా జరగలేదన్నారు.

ఫొటో సోర్స్, VK.VISMAYA
చాలా కష్టమైన చాయిస్
వీకే విస్మయ తండ్రి ఒక ఎలక్ట్రీషియన్. తల్లి గృహిణి. కుటుంబం ఆదాయం అంతంతమాత్రమే ఉండేది.
అందుకే ఇంజనీరింగ్ వదులుకుని క్రీడల్లోకి వచ్చేముందు ఆమె ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సి వచ్చింది.
ఇద్దరు కూతుళ్లూ క్రీడలవైపు వెళ్లడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం అనేది అంత సులభం కాదని ఆమె చెప్పారు.
కానీ, వారు తమ శక్తి మేరకు తమను ప్రోత్సహించారని తెలిపారు.
విస్మయకు మొదట్లో సింథటిక్ ట్రాక్స్, అత్యాధునిక జిమ్ సౌకర్యాలు లాంటివి అందుబాటులో ఉండేవి కావు.
బదులుగా ఆమె మట్టి ట్రాక్స్ మీదే ప్రాక్టీస్ చేసేవారు. వర్షాకాలంలో అలా ప్రాక్టీస్ చేయడం చాలా కష్టంగా ఉండేది.
"ఒక క్రీడాకారుడు రాణించాలంటే, ప్రారంభంలో వారికి తగిన మౌలిక సదుపాయాలు, పరికరాలు, శిక్షణ సహకారం ఎంతో అవసరం, కానీ మన దేశంలో వాటి కొరత తీవ్రంగా ఉంది" అంటారు విస్మయ.
తగిన సదుపాయాలు లేకపోవడం వల్ల క్రీడాకారులు గాయపడే అవకాశం ఉంటుందన్న విస్మయ... తన అనుభవమే దానికి ఒక ఉదాహరణ అంటారు.
విస్మయ మొదట హర్డిల్ స్ప్రింటర్‌గా కెరీర్ ప్రారంభించారు.
కానీ, ఒక గాయంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో తన దారి మార్చుకోవాల్సి వచ్చింది. చివరకు మిడిల్ డిస్టన్స్ రన్నర్‌గా శిక్షణ పొందాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
స్వర్ణం గెలవడంతో...
2017లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలవడంతో తన కెరీర్‌ను మలుపు తిరిగిందని విస్మయ చెప్పారు.
200 మీటర్ల పరుగు పందెంలో ఆ పతకం సాధించిన ఆమె 25 ఏళ్ల నాటి రికార్డు కూడా బద్దలు కొట్టారు.
విస్మయ అదే చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల రేస్‌లో కూడా రజత పతకం గెలుచుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆమెకు గుర్తింపు వచ్చింది.
ఆ ఘనతే ఆమెను నేషనల్ కాంప్‌కు సెలక్ట్ అయ్యేలా చేసింది. అక్కడ విస్మయకు అవసరమైన ఆధునిక శిక్షణ సౌకర్యాలతోపాటూ కోచ్‌ల మద్దతు కూడా లభించింది.
అలా, నేషనల్ 4X400 రిలేలో విస్మయ చాలా కీలకంగా అయిపోయారు. 2018లో జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఆమె టీమ్ స్వర్ణ పతకం కూడా గెలిచింది. తన కెరీర్‌లోని మరచిపోలేని విజయాల్లో అది కూడా ఒకటి అంటారు విస్మయ.
ఏడాది తర్వాత 2019లో విస్మయ 400 మీటర్ల పరుగు పందెంలో వ్యక్తిగత స్వర్ణం కూడా సాధించారు. చెక్ రిపబ్లిక్, బర్నోలో జరిగిన ఆ అథ్లెటిక్ మీట్‌లో 52.12 సెకన్లలోనే ఆమె తన గమ్యాన్ని చేరుకున్నారు.
తర్వాత 2019లో దోహాలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆమె మిక్స్‌డ్ రిలేలో కూడా పోటీపడ్డారు. అందులో విస్మయ టీమ్ ఫైనల్‌కు చేరుకుని టోక్యో ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించింది.
ఎదురుదెబ్బలు తగిలినప్పుడు నిరుత్సాహపడిపోకుండా.. పాజిటివ్‌గా ఉంటే, మనం పడిన కష్టాలే, మన బలంగా మారుతుందని విస్మయ గట్టిగా నమ్ముతున్నారు.
(బీబీసీ ఈమెయిల్ ద్వారా పంపిన ప్రశ్నావళికి వీకే విస్మయ ఇచ్చిన సమాధానాలు ఈ కథనానికి ఆధారం)
ఇవి కూడా చదవండి:
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- ఇండోనేసియా విమాన ప్రమాదం: ‘పిడుగు పడినట్లుగా భారీ శబ్దంతో సముద్రంలో కూలిపోయింది’
- సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్ష
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








