ఉత్తరాంధ్ర తప్పెటగుళ్లు: ఈ కళాకారుల ఆట పాటల్లో రామాయణ, భాగవతాలు జానపదాలై అలరిస్తాయి...

తప్పెటగుళ్లు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

రొమ్ముకు కట్టిన తప్పెట్ల మీద తాళాలు వేస్తూ, కాలి గజ్జెలతో సవ్వళ్లు చేస్తూ వారు పాడుతుంటే... రామాయణ, భారత, భాగవతాలు కూడా జానపద గీతాలై వినిపిస్తాయి.

ఇదే తప్పెటగుళ్ల కళ. ఉత్తరాంధ్ర గుండె చప్పుడు.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ కళారూపం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఎక్కువగా యాదవులు ఈ కళను ప్రదర్శిస్తుంటారు.

రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి పురాణేతిహాసాలు, కావ్యాలతో పాటు గ్రామదేవతల కథలను కూడా గ్రామీణ యాసలో గానం చేస్తూ చెప్తారు.

తప్పెట్ల శబ్దానికి అనుగుణంగా నర్తిస్తూ జనాన్ని కన్నార్పకుండా చేస్తారు. ఉత్తరాంధ్రకు సొంతమైన ఈ తప్పెటగుళ్ల కళ తెలుగు జానపద కళా వైభవానికి ఓ ప్రతీక.

తప్పెటగుళ్లు

‘తప్పెట శబ్ధం... స్వర్గం చేరుతుంది’

తప్పెటగుళ్ల కళాకారుల ఆహార్యం నుంచి ఆట వరకూ అంతా కనులవిందుగా ఉంటుంది.

కళాకారులు రంగురంగుల వస్త్రాలు ధరిస్తారు. ఇనుపరేకులతో తయారుచేసిన తప్పెటగుళ్లను రొమ్ముకు కట్టుకుంటారు. దానిని లయబద్దంగా వాయించడం మొదలుపెట్టి... క్రమంగా వేగం పెంచుతూ బలంగా గుండెలు బాదుకుంటున్నట్టుగా కొడుతూ కళాకారులు ఊగిపోతుంటారు.

"మా ఆటా,పాటకి శబ్దమే అందం. మేం బలంగా ఆడటానికి, మా ఆటని అందరూ చూడటానికి కారణం గుండెలపై తప్పెట్లతో మేం చేసే శబ్దమే. వరుసలుగా, వలయాలుగా పాటలకి అనుగుణంగా మాలో మేమే సర్దుకుంటూ గెంతుతాం. తప్పెటగుళ్ల నృత్యం చేయాలంటే ఒక్కొ ప్రదర్శనకి 15 నుంచి 30 మంది దాకా ఉండాలి. రంగుల చొక్కాలు, నిక్కర్లు వేసుకుంటాం. కాళ్లకు చిన్న గజ్జెలతో పాటు నడుంకి కూడా మూడు, నాలుగు వరుసల పెద్ద గజ్జెలు కట్టుకుంటాం. కాశీకోక (నడుముకి కట్టుకునే రంగురంగుల వస్త్రం) ధరిస్తాం. ఇవన్నీ ఉంటేనే మాకు ఉత్సాహం వస్తుంది'' అని గరివిడి తప్పెటగుళ్ల బృందానికి చెందిన కళాకారుడు నూకరాజు బీబీసీతో అన్నారు.

''ఈ రంగులు, తప్పెటగుళ్ల శబ్దాలే అలుపు లేకుండా మా ఆటని ముందుకు తీసుకెళ్తాయి. ముందు మా నాయకుడు పాట మొదలుపెడతాడు. దానిని క్రమంగా మేం అందుకుని హుషారుగా గెంతుతూ... పోటీపడి మరీ దిక్కులు ఆదిరిపోయేలా తప్పెటను మోగిస్తాం. ఆ శబ్దం నేరుగా ఆ స్వర్గానికి చేరి... అక్కడున్న దేవుళ్లు మమ్మల్ని దీవిస్తారు" అని ఆయన చెప్పారు.

ఈ కళకి ఆద్యులు యాదవులు. అయితే, ఇప్పుడు యాదవులతో పాటు ఇతరులు కూడా తప్పెటగుళ్లని ప్రదర్శిస్తున్నారు.

తప్పెటగుళ్లు

కథలను చెప్పే తప్పెటగుళ్ల కథ

పురాణాలు, ఇతిహాసాలు, స్థానిక గ్రామదేవతలతో పాటు అనేక కథలను చెప్పే తప్పెటగుళ్ల కళ పుట్టుక గురించి కూడా రకరకాల కథలున్నాయి. అయితే వాటిలో చాలా మంది నమ్మే, ఎక్కువగా వినిపించే ఓ కథ ఉంది.

శ్రీకాకుళం షేర్ మహ్మద్ పురానికి (ఎస్ఎం పురం) చెందిన కళాకారులు రాము, జయబాబు తమ ప్రదర్శన విశ్రాంతి సమయంలో ఆ కథను ఇలా వివరించారు.

"పంటకోతలైపోయాక ఆ పొలాల్లోకి మేకలు, గొర్రెల మందలను తోలుకుపోయేవారు యాదవులు. పంట లేకపోయినా ఆ పొలాల్లో గడ్డి మొలుస్తుంది. దాన్ని తింటూ మేకలు, గొర్రెలు అక్కడే విసర్జిస్తుండేవి. ఆ విసర్జకాలే పొలానికి ఎరువు. ఊరిలోనే కాకుండా వేర్వేరు ఊళ్లలో ఉన్న పొలాల్లో కూడా మందలను మేపుతుండేవాళ్లు. అంతా బాగానే ఉన్నా రాత్రుళ్లే చిక్కులొచ్చిపడేవి. ఎటు నుంచైనా ఏ నక్కో,తోడేలో వస్తుందోమోనన్న భయం ఉండేది. దొంగల బెడద కూడా ఉండేది. అందుకే నిద్రరాకుండా ఉండేందుకు కాపలాకు వచ్చిన యాదవులంతా రెండు జట్లుగా విడిపోయేవారు. ఒక్కో జట్టు కొంత సమయం చొప్పున కాపలా ఉండేవారు. ఇక్కడికి ఒక సమస్య తీరినా... ఓ కొత్త సమస్య వచ్చింది" అని చెప్పి బృందంలో ఆడేందుకు వెళ్లారు వారు.

తప్పెటగుళ్లు

తొలుత టేకు ఆకు... తర్వాత ఇనుపరేకు

రాము, జయబాబుల స్థానంలో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన తప్పెటగుళ్ల బృంద నాయకుడు రాజు మిగతా కథని వివరించారు.

"మందలకు కాపలా కాసేందుకు జట్టులుగా విడిపోయేవారు. కానీ, మెలకువగా ఉన్నవారిని తీవ్రమైన చలి చంపేసేది. చలిని వదిలించుకునేందుకు చిందులేసేవారు. చిందు ఆగకుండా హుషారుగా సాగడం కోసం పాటలు పాడేవారు. ఆ పాటకి క్రమంగా దరువు చేరింది. యాదవుల చేతుల్లో ఉండే గడకర్రలనే లయబద్దంగా గుండెలపై కొడుతూ శబ్దం చేసేవారు. కాలక్రమంలో ఎండబెట్టిన టేకు ఆకులను గుండెలపై పెట్టుకుని దరువు వేసేవాళ్లు. తర్వాత మేక, గొర్రె చర్మాలతో తప్పెట్లను తయారు చేసేవారు. అయితే గుండెలపై బలంగా, వేగంగా కొట్టడంతో అవి చిరిగిపోయేవి. దాంతో ఇనుపరేకుని గుండ్రంగా కత్తిరించి... దానిని దరువు వేసేందుకు వీలైన ఆకారంలో మలిచి ఛాతీకి కట్టుకుని వాయించడం మొదలుపెట్టారు. అది సరిగ్గా సరిపోవడంతో తప్పెటగుళ్లు క్రమంగా గ్రామాల్లోని అన్ని శుభకార్యాల్లో ప్రదర్శించే కళగా మారింది" అని తప్పెటగుళ్ల వెనుక ప్రచారంలో ఉన్న ఆ కథని పూర్తి చేశారు రాజు.

అలాగే ఇంకొందరు స్థానికులు చెప్పినదాని ప్రకారం... తమ కులదైవమైన శ్రీకృష్ణుడు మరణించినప్పుడు యాదవులందరూ గుండెలపై కొట్టుకుని శోకించారట. అలా గుండెలపై బాదుకుంటూ కృష్ణలీలలను తలచుకున్నారట. అదే ఇప్పుడు తప్పెటగుళ్లు అయ్యిందని వారు అంటున్నారు.

12వ శతాబ్దంలో యాదవరాజైన కాటమరాజుకు నెల్లూరు సిద్ధిరాజుకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆలమందలను కాపాడుకోవడానికి యాదవులు డప్పులు, తాళాలతో గుండెలపై కొట్టుకున్నారని... ఆ శబ్దాలను విని అవి పారిపోయాయని మరో కథ ప్రచారంలో ఉంది.

తప్పెటగుళ్లు

గురుశిష్యుల ఆట

తప్పెటగుళ్లను గురు,శిష్యుల బృందం ఆడుతుంది. గురువే జట్టు నాయకుడిగా ఉంటూ ఆటను నడిపిస్తాడు.

నాయకుడికి పాటకి,ఆటకి అనుగుణంగా తాళం, లయ తప్పకుండా శిష్యులు నృత్యం చేయాలి. ఈ కళని గురువుల వద్ద నేర్చుకుని, వారి వద్దే శిష్యరికం చేస్తూ ప్రదర్శనలు ఇస్తుంటారు.

చెంచులక్ష్మి, సారంగధర, తూర్పు భాగవతం, తేలుపాట, గాజులోడిపాట, మందులోడిపాట, చుట్టపాట వంటి స్థానిక ఇతివృత్తాల ఆధారంగా పాటలు పాడతారు.

"ఎస్ఎం పురానికి చెందిన తప్పెటగుళ్ల గురువు పాపయ్య వద్ద 18 ఏళ్లుగా శిష్యరికం చేస్తున్నాను. గురువులు చెప్పింది చెప్పినట్లుగా ప్రదర్శించడమే మా పని. గురువు ముందుండి ప్రదర్శనను నడిపిస్తాడు. ఆయనని మేం అనుసరిస్తాం. ప్రదర్శనలో ఒక్కో గురువుకి 20 మంది వరకు శిష్య బృందం కలుస్తుంది. అయితే ఇంతమందే ఉండాలనే నియమం ఏమీ లేదు. కాకపోతే ఎందరున్నా... ఆటలో క్రమం తప్పకుండా ఉండేవాళ్లు కావాలి. ఏ మాత్రం క్షమశిక్షణ తప్పినా... ఆటంతా అభాసుపాలవుతుంది. దాన్ని మా కళకే అవమానంగా భావిస్తాం. అందుకే తప్పు జరగకుండా గురువుని అనుసరిస్తాం'' అని కళాకారుడు రాంబాబు చెప్పారు.

''ఒకరికంటే ఒకరు బాగా చేయాలని అనుకుంటాం. ప్రదర్శన చివరకు చేరేసరికి ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేయడానికి ఒకరిపై నుంచి మరొకరం గెంతుతూ ప్రదర్శనను ముగిస్తాం. మేమంతా కలిసి క్రమం తప్పకుండా గుండ్రంగా తిరుగుతూ... బలంగా ఒకే ఊపుతో గెంతులాడుతూ చేస్తున్నామంటే... అది మా గురువుల నుంచి నేర్చుకున్న విద్య మహిమే. ఈ ఆటకి చాలా బలం అవసరం. శరీరం అలసిపోతుంది. అయినా తప్పెటగుళ్ల శబ్ధమే మాకు శక్తిగా మారి... మమ్మల్ని అలసిపోనివ్వదు" అని ఆయన వివరించారు.

తప్పెటగుళ్లు

'దేవుళ్లు మాండలికంలో మాట్లాడుతారు'

తప్పెటగుళ్ల ప్రదర్శనలు ఎక్కువగా గ్రామాల్లోని జాతర్లలోనే జరుగుతాయి. ప్రదర్శనలో గానానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, అభినయానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది.

పాటకు తగిన తాళం, తాళానికి తగిన లయ, లయకు తగిన నృత్యం... వాటన్నింటిని సమన్వయం చేసుకుంటూ ఉద్రేకంతో శరీరం కదిలే తీరు ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. గేయ, వచనాల్లో కథ చెబుతూ నృత్యానికి అభినయాన్నీ జోడిస్తారు.

"రామాయణ, భాగవత, మహాభారత, దశావతారాలు, సారంగధర చరిత్ర, చెంచీత, అమ్మవారి చరిత్ర లాంటి కథాగేయాలను కూడా పాడుతూ సన్నివేశాలకు అనుగుణంగా అభినయాన్ని ప్రదర్శిస్తాం. దానికి తగ్గట్టుగా నృత్య విన్యాసాలు చేస్తాం. అయితే వీటన్నింటిని మా భాషలోనే, మా యాసలోనే చెబుతాం. మా ఊరి మాండలీకంలో చెబుతుండటంతో ప్రేక్షకులు లీనమై తన్మయత్వం పొందుతారు. కళాకారులుగా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటిస్తాం'' అని విజయనగరానికి చెందిన తప్పెటగుళ్ల బృంద నాయకుడు పీత గంగయ్య చెప్పారు.

''మా ప్రదర్శనకి వేగం ఆయువుపట్టు. మా పాటకి ప్రాణం పల్లెపదం. మాండలికాలతో పలికే తీరు, స్థానిక మాటలు, పదాలతో పాడే పాటలు వింటుంటే మనుషులే దేవుళ్లై వచ్చారా అన్నట్లు ఉంటుందని ప్రదర్శన చూసిన చాలా మంది చెబుతుంటారు. మా బిడ్దలకు చిన్న తనం నుంచే ఈ విద్యలో శిక్షణ ఇస్తాం. అలాగే మా కళ ద్వారా పల్స్ పోలియో, మలేరియా, ఎయిడ్స్ నివారణ కోసం ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు కూడా ప్రచారం చేస్తాం" అని ఆయన వివరించారు.

తప్పెటగుళ్లు

విదేశాల్లో కూడా మోగిన తప్పెటగుళ్లు

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువగా ప్రదర్శితమయ్యే ఈ తప్పెటగుళ్ల కళ... ఉత్తరాంధ్రని దాటి విదేశాల్లోనూ మార్మోగింది.

"గత మూడు దశాబ్దాలుగా తప్పెటగుళ్లు ఆడుతూనే ఉన్నాను. ఎందరో శిష్యులను తయారు చేశాను. ఇప్పటికీ ప్రదర్శనలు ఇస్తున్నాను. మా బృందాలతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నోసార్లు ప్రదర్శనలిచ్చాం. నేనే కాదు నాతోటి కళాకారులు సైతం అమెరికా, థాయ్ లాండ్, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు ఈ కళకి ఆదరణ తగ్గినా... మా బాధ్యతగా ప్రదర్శిస్తూనే ఉన్నాం. మరో తరానికి వారసత్వంగా ఇలాంటి కళలను అందించాల్సిన బాధ్యత తీసుకున్నాం" అని విజయనగరం జిల్లా బాడంగి మండలానికి చెందిన తప్పెటగుళ్ల గురువు నీలబోతు సత్యం చెప్పారు.

తప్పెటగుళ్లు

'ప్రభుత్వం ప్రొత్సహించాలి... ప్రజలు ఆదరించాలి'

గుండెపై తప్పెట కట్టుకుని దానిపై దరువేస్తూ... బలంగా ఎగురుతూ, దూకుతూ కళాకారులు చేసే నృత్యానికి చూసేవాళ్ల శరీరాలు అదురుతాయి. ఒకప్పడు మహారాజులను సైతం మెప్పించిన ఈ జానపద కళ క్రమంగా ప్రాభవం కోల్పోతోంది.

తప్పెటగుళ్లు అనే ఒక కళ కూడా ఉందని చాలా మందికి తెలియదని గిడుగు రామమూర్తి తెలుగుభాష, జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు బద్రి కుర్మారావు అన్నారు. ఈయన శ్రీకాకుళం జిల్లా బీసీ గురుకుల కళాశాలలో ఎకనామిక్స్ అధ్యాపకునిగా పని చేస్తున్నారు.

"తప్పెటగుళ్లకు ఆదరణ తగ్గడంతో కళాకారులు అనేక మంది జీవన పోరాటంలో భాగంగా వలస బాట పట్టారు. కొందరు కళాకారులు మాత్రం యువతకు శిక్షణనిస్తూ...ఈ అపురూప జానపదాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను కొన్ని జానపద కళారూపాల మూలాలను సేకరించాను. వాటికి మన రాష్ట్ర ప్రభుత్వం జానపదకళలు పేరుతో 5, 7 తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాల్లో స్థానం కల్పించింది. ఇందులో తప్పెటగుళ్లు, తోలుబొమ్మలాటలు, కురవంజి, కోలాటం, చెక్కభజనలు, గిరిజనుల నృత్యం థింసా, బుర్రకథ, హరికథ, వీధిబాగోతం వంటి అంశాలున్నాయి. ఇవన్నీ ప్రజా కళలు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై, ప్రభుత్వాలపై ఉంది. ఈ కళల ప్రదర్శనకు ప్రభుత్వం సరైన వేదికలు కల్పించాలి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొన్ని కళలకైనా ప్రదర్శన అవకాశాలు కల్పించాలి. ప్రజలు కూడా వీటిని ఆదరించాలి. అప్పుడే ఈ విశిష్టమైన కళలు బతుకుతాయి" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)