సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ను కాదని జవహర్‌లాల్ నెహ్రూను మహాత్మా గాంధీ ప్రధానిని చేశారు, ఎందుకు?

పటేల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దయాశంకర్‌ శుక్లాసాగర్‌
    • హోదా, బీబీసీ కోసం

కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో మహాత్మాగాంధీ జోక్యం చేసుకోకపోయి ఉంటే సర్దార్ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్వాతంత్ర్యం రాక ముందే భారత ప్రభుత్వానికి తాత్కాలిక ప్రధాని అయ్యేవారు.

స్వాతంత్ర్యం వచ్చే సమయానికి పటేల్‌కు 71 ఏళ్లు. కానీ నెహ్రూకు 56 ఏళ్లే. దేశం ఆ సమయంలో చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది.

పాకిస్తాన్ కోసం జిన్నా మొండిపట్టు పట్టారు. బ్రిటన్‌ పాలకులు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ను ఆహ్వానించారు.

దేశ నాయకత్వాన్ని పటేల్‌కు అప్పగించాలని కాంగ్రెస్‌ అనుకుంది. ఎందుకంటే ఆయన జిన్నా కంటే మెరుగ్గా చర్చలు జరపగలరు. కానీ గాంధీ మాత్రం నెహ్రూను ఎంచుకున్నారు.

గ్లామరస్ నెహ్రూ కోసం గాంధీజీ తన నమ్మకస్తుడైన సహచరుడిని వదులుకున్నారని రాజేంద్రప్రసాద్‌ లాంటి కాంగ్రెస్‌ నేతలు బాహాటంగానే విమర్శించారు. కానీ చాలామంది కాంగ్రెస్‌ నేతలు మౌనంగా ఉండిపోయారు.

గాంధీ, పటేల్

ఫొటో సోర్స్, UNIVERSAL HISTORY ARCHIVE

దేశపగ్గాలను గాంధీజీ నెహ్రూకు ఎందుకు ఇచ్చారు?

స్వతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రశ్న భారత రాజకీయాల్లో చర్చనీయంగా నిలిచింది.

దీనికి కారణం కనుక్కోవాలంటే మనం బ్రిటిష్‌ రాజ్‌ చివరి ఏళ్లలో రాజకీయాలు, గాంధీతో నెహ్రూ, పటేల్‌కు ఉన్న బంధం గురించి వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.

సైద్ధాంతిక విరోధం నుంచి గాంధీ భక్తుడిగా పటేల్‌

నెహ్రూ కంటే ముందే గాంధీని వల్లభ్‌భాయి పటేల్‌ కలిశారు. ఆయన తండ్రి ఝోవర్‌ భాయి 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన మూడేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్నారు.

1857 తిరుగుబాటు జరిగిన 12 ఏళ్ల తర్వాత గాంధీజీ పుట్టారు. 18 ఏళ్ల తర్వాత అంటే 1875 అక్టోబర్ 31న పటేల్‌ పుట్టారు. గాంధీ కంటే పటేల్‌ ఆరేళ్లు చిన్నవారు కాగా, పటేల్‌ కన్నా నెహ్రూ 12 సంవత్సరాలు చిన్నవారు.

వయసులో ఆరేళ్ల తేడా పెద్ద ఎక్కువ కాదు అందుకే గాంధీ, పటేల్‌ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండేవి. లండన్‌లో గాంధీ, జిన్నా, విఠల్‌ భాయి పటేల్‌, నెహ్రూలు ఎక్కడ బారిస్టర్ డిగ్రీలు అందుకున్నారో అదే మిడిల్‌ టెంపుల్‌ లా కాలేజీలో వల్లభ్ భాయి పటేల్‌ కూడా బారిస్టర్ డిగ్రీ అందుకున్నారు.

ఆ రోజుల్లో వల్లభ్‌భాయి పటేల్‌ గుజరాత్‌లో అత్యంత ఖరీదైన వకీళ్లలో ఒకరు. పటేల్‌ మొదటిసారి గాంధీని గుజరాత్‌ క్లబ్‌లో 1916లో కలిశారు.

గాంధీ దక్షిణాప్రికా నుంచి మొదటిసారి గుజరాత్ వచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆయనకు అభినందన సభలు జరుగుతున్నాయి. ఆయన్ను కొందరు మహాత్మా అనడం మొదలుపెట్టారు.

కానీ గాంధీలోని మహాత్ముడు పటేల్‌ను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఆయన ఆలోచనలను కూడా పటేల్‌ను ఉత్సాహపరచ లేకపోయాయి.

“మనదేశంలో మహాత్ములకు లోటు లేదు. మనకు ఎవరైనా పనిచేసేవారు కావాలి. గాంధీ పాపం ఈ జనాలకు బ్రహ్మచర్యం గురించి ఎందుకు చెబుతున్నారో అర్ధం కాదు. అదెలా ఉంటుందంటే, బర్రె ముందు భాగవతం చెప్పినట్టు ఉంటుంది’’ అని పటేల్‌ అనేవారు. (విజయీ పటేల్‌, బైజ్‌నాథ్, పేజ్ 05)

1916లో ఎండాకాలంలో గాంధీ గుజరాత్ క్లబ్‌కు వచ్చారు. ఆ సమయంలో పటేల్‌ తన తోటి వకీల్ గణేశ్‌ వాసుదేవ్ మావ్‌లంకర్‌తో పేకాట ఆడుతున్నారు.

మావ్‌లంకర్ గాంధీ విధానాలకు చాలా ప్రభావితం అయ్యారు. గాంధీ రాగానే ఆయన్ను కలవడానికి లేచారు. పటేల్‌ నవ్వుతూ “ ఆయన నిన్నేమని అడుగుతారో నేనిప్పుడే చెప్పేస్తున్నా. గోధుమల నుంచి రాళ్లు తీయడం మీకు తెలుసా, తెలీదా అంటారు. తర్వాత ఈ దేశానికి ఎన్ని పద్ధతుల్లో స్వాతంత్ర్యం సంపాదించవచ్చో చెబుతారు’’ అన్నారు.

కానీ గాంధీ పట్ల తన అభిప్రాయన్ని పటేల్‌ చాలా త్వరగానే మార్చుకున్నారు.

చంపారన్‌లో గాంధీ అనుసరించిన విధానాలు పటేల్‌పై చాలా ప్రభావం చూపాయి. ఆయన గాంధీ వెంటే ఉండి పోయారు. ఖేడా ఉద్యమం జరిగినపుడు పటేల్‌, గాంధీ మరింత దగ్గరయ్యారు.

సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైనప్పుడు బాగా నడుస్తున్న తన ప్రాక్టీసును వదిలి పటేల్‌ గాంధీ భక్తుడిగా మారిపోయారు. ఆ తర్వాత బార్దోలీ సత్యాగ్రహంతో పటేల్‌ పేరు మొదటిసారి దేశమంతా తెలిసింది.

రైతులపై ప్రాంతీయ ప్రభుత్వాల పన్ను పెంచడానికి నిరసనగా 1928లో జరిగిన ఒక రైతు ఉద్యమానికి పటేల్‌ నాయకత్వం వహించారు. చివరకు బ్రిటిష్ ప్రభుత్వం పటేల్‌ ముందు తలవంచాల్సి వచ్చింది.

ఈ ఉద్యమం తర్వాత గుజరాత్ మహిళలు ఆయనకు సర్దార్ అనే బిరుదు ఇచ్చారు. 1931లో కాంగ్రెస్ కరాచీ సెషన్‌లో పటేల్‌ మొదటి, చివరసారి పార్టీ అధ్యక్షుడయ్యారు. మొదటిసారి ఆయన గుజరాత్ సర్దార్ నుంచి దేశానికే సర్దార్ అయ్యారు.

గాంధీ, నెహ్రూలతో పటేల్

ఫొటో సోర్స్, Bettmann

నెహ్రూఎన్నిక

దేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం రావాల్సి ఉంది. కానీ దానికి ఏడాది ముందే భారతీయుల చేతులకు బ్రిటన్‌ అధికారం అప్పగించింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడినే ప్రధానమంత్రి చేయాలని నిర్ణయించారు.

ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. అప్పటికి ఆరేళ్లుగా ఆయనే ఆ పదవిలో ఉన్నారు. ఆయన దిగిపోవాల్సిన సమయం వచ్చింది. నెహ్రూ చేతులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అప్పటికే గాంధీ నిర్ణయించారు.

1946 ఏప్రిల్ 20న మౌలానాకు గాంధీ ఒక లేఖ రాశారు. “”నేను ఇక అధ్యక్షుడిగా ఉండదలుచుకోలేదు’’ అని ఒక ఏకవాక్య తీర్మానం జారీ చేయాలని సూచించారు.

“ఈసారి నా అభిప్రాయం అడిగితే నెహ్రూను అధ్యక్షుడిని చేయాలని అంటాను. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిని చెప్పాలని అనుకోవడం లేదు.’’ అని గాంధీ అన్నారు. (కలెక్ట్ వర్క్స్ 90, పేజీ 315)

ఆ లేఖతో నెహ్రూను ప్రధానమంత్రిని చేయాలని గాంధీ అనుకుంటున్నట్టు కాంగ్రెస్‌ వారందరికీ అర్థమైపోయింది.

1946 ఏప్రిల్ 29న కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశంలో “కొన్నినెలల్లో ఏర్పడనున్న తాత్కాలిక ప్రభుత్వం కోసం భారత ప్రధాని కావడానికి పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి’’ అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మహాత్మా గాంధీతోపాటు నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, ఆచార్య కృపలాని, రాజేంద్రప్రసాద్‌, ఖాన్ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ సహా కాంగ్రెస్‌ అగ్ర నేతలందరూ ఉన్నారు.

నెహ్రూను పార్టీ అధ్యక్షుడిగా చూడాలని గాంధీ భావిస్తున్నట్లు ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.

సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రాంతీయ కాంగ్రెస్‌ కమిటీ నిర్వహిస్తుంది. 15లో 12 ప్రాంతీయ కమిటీలు సర్దార్‌పటేల్‌ పేరును ప్రతిపాదించాయి. మిగిలిన మూడు కమిటీలు ఆచార్య కృపలానీ, పట్టాభి సీతారామయ్య పేరు ప్రతిపాదించాయి.

ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీలో ఏ ఒక్కటి కూడా నెహ్రూ పేరును అధ్యక్షుడిగా ప్రతిపాదించలేదు. నెహ్రూను నాలుగోసారి అధ్యక్షుడిగా చేయాలని గాంధీ కోరుకుంటున్నట్లు ప్రాంతీయ కమిటీలన్నింటికీ తెలిసినా ఎవరూ ఆయన పేరు ప్రతిపాదించలేదు.

పార్టీ ప్రధాన కార్యదర్శి కృపలానీ పీసీసీ ఎన్నికల చీటీని గాంధీ వైపు జరిపారు. గాంధీ కృపలానీవైపు చూశారు. గాంధీ ఏమనుకుంటున్నారో ఆయనకు అర్థమైంది. ఆయన కొత్త ప్రతిపాదన సిద్ధం చేసి నెహ్రూ పేరు ప్రతిపాదించారు. దానిపై అందరూ సంతకాలు చేశారు. పటేల్‌ కూడా సంతకం చేశారు.

ఇప్పుడు అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థులే ఉన్నారు. ఒకరు నెహ్రూ, మరొకరు పటేల్‌.

పటేల్‌ తన పేరు వాపసు తీసుకుంటేనే నెహ్రూ ఏకగ్రీవంగా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది. కృపలానీ ఒక కాగితంపై ‘పార్టీ అధ్యక్ష పదవి పోటీ నుంచి నేను నా పేరును పేరును వెనక్కు తీసుకుంటున్నాను’’ అని అర్జీ రాసి సంతకం పెట్టాలంటూ దాన్ని పటేల్‌ వైపు జరిపారు.

అంటే గాంధీ.. నెహ్రూ అధ్యక్షుడు కావాలని, అందుకే మీరు మీ పేరు వాపసు తీసుకుంటున్నట్లు కాగితంపై సంతకం పెట్టాలని స్పష్టంగా చెప్పినట్లయింది. కానీ పటేల్‌ సంతకం చేయలేదు. ఆయన దాన్ని గాంధీవైపు జరిపారు.

నెహ్రూ వైపుప చూస్తూ గాంధీ... “జవహర్‌...వర్కింగ్ కమిటీ తప్ప వేరే ఏ ప్రాంతీయ కాంగ్రెస్‌ కమిటీ మీ పేరు సూచించలేదు. దీనిపై మీరేమంటారు’’ అన్నారు.

నెహ్రూ మౌనంగా ఉండిపోయారు. అక్కడ కూర్చున్నవారంతా నిశ్శబ్దంగా ఉన్నారు. “సరే, మీరు పటేల్‌కు అవకాశం ఇవ్వండి’’ అని నెహ్రూ అంటారేమో అని గాంధీ అనుకున్నారు. కానీ నెహ్రూ అలా చేయలేదు. చివరికి గాంధీయే తుది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

గాంధీ ఆ కాగితాన్ని తిరిగి పటేల్‌కు ఇచ్చారు. ఈసారీ పటేల్‌ దానిపై సంతకం చేశారు. దాంతో “నెహ్రూను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నాం’’ అని కృపలానీ ప్రకటించారు.

తన పుస్తకం “గాంధీ హిజ్ లైఫ్ అండ్ థాట్స్’’లో కృపలానీ ఈ ఘటన గురించి వివరంగా రాశారు.

“నేను అలా జోక్యం చేసుకోవడం పటేల్‌కు నచ్చలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను గాంధీ అనుకున్నదానిని యాంత్రికంగా చేశాను. ఆ సమయంలో అది పెద్ద విషయం అనిపించలేదు. ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అంతే కదా అనుకున్నాను’’ అని ఆయన రాసుకున్నారు.

నెహ్రూ, గాంధీ, పటేల్

ఫొటో సోర్స్, UNIVERSAL HISTORY ARCHIVE

ఫొటో క్యాప్షన్, నెహ్రూ, గాంధీ, పటేల్

గాంధీ అలా ఎందుకు చేశారు?

అది మహాత్మాగాంధీ మాత్రమే చేయగలరు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరవుతారు అనే నిర్ణయం అంతకు పన్నెండేళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఒక వ్యక్తి తీసుకున్నారు.

కానీ కాంగ్రెస్ నేతలకు అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే 1929, 1936, 1939 తర్వాత గాంధీజీ చెప్పడం వల్ల పటేల్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి తన పేరును నాలుగోసారి వెనక్కు తీసుకున్నారు. అందరూ షాక్ అయ్యారు.

అప్పటి ప్రముఖ జర్నలిస్ట్ దుర్గాదాస్ తన 'ఇండియా ఫ్రమ్ కర్జన్ టు నెహ్రూ' పుస్తకంలో " గ్లామరస్ నెహ్రూ కోసం గాంధీజీ తనకు నమ్మకస్తుడైన సహచరుడిని త్యాగం చేశారు. నెహ్రూ ఇక ఆంగ్లేయుల దారిలో ముందుకెళ్తారేమోనని నాకు భయంగా ఉంది అని రాజేంద్రప్రసాద్‌ నాతో అన్నారు" అని రాశారు.

"రాజేంద్రప్రసాద్‌ స్పందనను నేను గాంధీజీకి చెప్పాను. అప్పుడు ఆయన నవ్వారు. తర్వాత రాజేంద్రను ప్రశంసిస్తూనే రాబోయే ఎన్నో సమస్యలన్నింటినీ ఎదుర్కోడానికి నెహ్రూ తనను తాను సిద్ధం చేసుకున్నారు’’ అని దుర్గాదాస్ రాశారు .

ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ గాంధీ పటేల్‌ స్థానాన్ని నెహ్రూకు ఎందుకు అప్పగించారన్న సందేహం వినిపిస్తూనే ఉంటుంది. దానికి తన దగ్గర చాలా కారణాలు ఉన్నాయని గాంధీజీ అన్నారు. కానీ ఆ కారణాలు ఏంటని ఆయన్ను ఎవరూ అడగలేదు. ఆయన ఎవరికీ చెప్పలేదు.

సర్దార్‌ పటేల్‌ లాంటి నేతను పక్కనపెట్టి నెహ్రూను ఎందుకు ఎంచుకున్నారని బాపూజీని అడిగే ధైర్యం కాంగ్రెస్‌లో ఎవరికీ లేకుండా పోయింది.

విలేఖరి దుర్గా దాస్ ఆ ప్రశ్న అడిగినప్పుడు “ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పటేల్‌ ఒక మంచి నెగోషియేటర్, ఆర్గనైజర్ కాగలరు. కానీ, ప్రభుత్వానికి నెహ్రూ నాయకత్వం వహించాలని నాకు అనిపించింది” అని చెప్పారు.

మీరు ఆ గుణాలను పటేల్‌లో ఎందుకు చూడలేకపోతున్నారు అని దుర్గాదాస్ గాంధీని అడిగారు. "జవహర్ మా క్యాంపులో ఏకైక ఆంగ్లేయుడు" అని గాంధీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

తన సమాధానంతో దుర్గాదాస్‌ సంతృప్తి చెందలేదని గాంధీకి అనిపించింది. “జవహర్ రెండోస్థానంలో ఉండడానికి ఎప్పటికీ రెడీగా ఉండరు. పటేల్‌తో పోలిస్తే అంతర్జాతీయ అంశాల్లో నెహ్రూకు మంచి అవగాహన ఉంది. వీరిద్దరూ ప్రభుత్వం అనే బండిని లాగే రెండు ఎద్దుల్లాంటి వారు. అంతర్జాతీయ అంశాల కోసం నెహ్రూ, దేశీయ వ్యవహారాల కోసం పటేల్‌ పని చేస్తారు’’ అని ఆయనకు వివరించి చెప్పారు.

గాంధీ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో రెండు విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి నెహ్రూ నంబర్-2గా ఉండడానికి ఇష్టపడరు. రెండోది పటేల్‌ నంబర్-2గా ఉండటానికి ఇబ్బందిపడరు. ఇది గాంధీ నమ్మకం. నిజంగా అలాగే జరిగింది.

అధ్యక్ష పదవి విషయంలో జరిగిన దానికి ఆగ్రహించకుండా వారంలోనే మామూలైపోవడమేకాదు అందరితో నవ్వుతూ, సరదాగా ఉండగలిగారు పటేల్‌ .

పటేల్ చెప్పే సరదా మాటలకు నవ్వే వారిలో గాంధీ కూడా ఉండేవారు. అయితే తన ఇంగ్లీష్ పాండిత్యంవల్ల అధికార బదిలీని పటేల్‌కంటే నెహ్రూ మెరుగ్గా నిర్వహించగలరని గాంధీకి అనిపించేది.

గాంధీ ఇదే విషయాన్ని ఓ సందర్భంలో చెప్పారు. “ఆంగ్లేయుల నుంచి అధికారం తీసుకుంటున్నప్పుడు, నెహ్రూ స్థానంలో మరో వ్యక్తిని ఊహించలేం. ఆయన హారో విద్యార్థి, కేంబ్రిడ్జిలో గ్రాడ్యుయేషన్, లండన్‌లో బారిస్టర్ చేయడం వల్ల ఆంగ్లేయులతో చాలా బాగా డీల్ చేయగలడు’’ అన్నారు గాంధీ (మహాత్మా,తెందుల్కర్, సెక్షన్ 8, పేజి 3)

ఈ విషయంలో గాంధీనే కరెక్ట్. స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి గాంధీ తర్వాత ప్రముఖంగా వినిపించిన రెండో పేరు నెహ్రూదే. యూరోపియన్‌లే కాదు, అమెరికాలో కూడా నెహ్రూను గాంధీకి వారసుడుగా భావించేవారు. పటేల్‌ గురించి అలా ఎవరికీ తెలీదు.

పటేల్‌ను ఎవరైనా విదేశీయులు బహుశా గాంధీ వారసుడుగా భావించినా, లండన్‌లోని కాఫీ హౌసుల్లో మేధావుల మధ్య మాత్రం నెహ్రూ గురించే చర్చ జరిగేది. వైస్రాయ్‌లు, క్రిప్స్‌ సహా చాలామంది ఆంగ్లేయ అధికారులు నెహ్రూ స్నేహితులుగా ఉండేవారు. వారిని నెహ్రూ వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతుండేవారు.

పటేల్

ఫొటో సోర్స్, SARDAR PATEL NATIONAL MEMORIAL, AHMEDABAD.

నెహ్రూ- పటేల్‌ భిన్న ధ్రువాలు

వీరిద్దరి వ్యక్తిత్వాల్లో తేడాలు రాజకీయాలలో చాలా కీలక పాత్ర పోషించాయి. నెహ్రూ హిందీ, ఇంగ్లీషులలో అనర్గళంగా మాట్లాడగలరు, అలాగే రాయగలరు.

ఉదారవాదిగా నెహ్రూకు పేరుంది. ఆయన ఆ విషయాన్ని ఎక్కడా దాచుకోరు కూడా.

అందరినీ ఆకట్టుకునేలా ప్రవర్తించేవారు నెహ్రూ. అందుకు భిన్నంగా పటేల్‌ వ్యవహారం మొండిగా ఉండేది. అయితే మనిషి మొరటుగా కనిపించినా, పటేల్‌ హృదయం మాత్రం మెత్తనే.

ఇక నెహ్రూ ఎప్పుడూ మిగతావారికి భిన్నంగా ఉండేందుకు ప్రయత్నించేవారు. జైలులో ఉన్నప్పుడు మిగిలిన కాంగ్రెస్‌ నేతలతో కబుర్లు చెప్పకుండా, ఒంటరిగా కూర్చుని “డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’’లాంటి పుస్తకాలు రాశారు. నెహ్రూ తనదైన సొంత లోకంలో ఉండేవారు.

నెహ్రూ గొప్ప వక్త కాగా, పటేల్‌ అందుకు భిన్నంగా ఉండేవారు. అయితే ఆయన మనసులోని మాటను స్పష్టంగా చెప్పేవారు.

ముస్లింలకు వ్యతిరేకిగా, ఆరెస్సెస్‌కు అనుకూల వాదిగా ఆయనకు పేరుంది. అందుకే ముస్లింలు ఆయనను వ్యతిరేకించేవారు. సోషలిస్టు సిద్ధాంతాలకు నెహ్రూ ఆకర్షితుడైతే , పటేల్‌ మాత్రం పార్టీకి విరాళాలు సేకరించేందుకు పెట్టుబడిదారులతో సంబంధాలు నెరపేవారు.

నెహ్రూ లౌకిక భారతదేశం గురించి కలలుగంటుండగా, పటేల్‌ జాతీయ ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి పెట్టేవారు. ఆయనలో హిందూ భావజాలం ఎక్కువగా కనిపిస్తుంది.

నెహ్రూ

ఫొటో సోర్స్, Hulton

నెహ్రూ పొరపాట్లు

నెహ్రూ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరిగిన రెండు ఘటనలు వారి వ్యక్తిత్వాలకు రుజువుగా నిలుస్తాయి.

కేబినెట్ మిషన్‌ ప్లాన్‌ను కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ రెండూ అంగీకరించాయి. మరుసటి నెలలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడనుంది. ఇందులో ఇద్దరి ప్రతినిధులు పాల్గొనబోతున్నారు.

అయితే కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ రెండూ మిషన్‌ ప్లాన్‌ను చెరొక విధంగా అర్ధం చేసుకున్నాయి. అదే సమయంలో జులై 7, 1946లో నెహ్రూ కాంగ్రెస్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ ప్రణాళిక ఏంటో వివరించారు.

తాము ఎవరితో కలవాలో నిర్ణయిచుకునే హక్కు ప్రావిన్సులకు ఉందని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్న నార్త్‌-వెస్ట్‌ ఫ్రాంటియర్‌, అస్సాంలు పాకిస్తాన్‌లోకాక హిందుస్థాన్‌లో చేరాలని కోరుకుంటున్నట్లు స్పష్టమైంది.

అయితే కాంగ్రెస్‌ వివరణతో జిన్నా సంతృప్తి చెందలేదు. ఆయనకు అర్ధమైన మిషన్‌ ప్లాన్‌ ప్రకారం ముస్లిం మెజారిటీ ఉన్న రెండు, పశ్చిమంలో రెండు రాష్ట్రాలను ముస్లిం రాష్ట్రాల గ్రూపులో చేర్చాలి. ఇక్కడే నెహ్రూకు, జిన్నాకు మధ్య తేడా వచ్చింది.

కానీ మూడు రోజుల తరువాత జూలై 10, 1946న నెహ్రూ ముంబైలో విలేఖరుల సమావేశం నిర్వహించి, రాజ్యాంగ సభలో చేరాలని కాంగ్రెస్ నిర్ణయించిందని, అవసరమని భావిస్తే క్యాబినెట్ మిషన్ ప్లాన్‌ను కూడా మార్చగలదని అన్నారు.

కేబినెట్‌ మిషన్ ప్లాన్‌ మొత్తాన్ని నెహ్రూ తన ఒక్క నిమిషం మీడియా ప్రకటనతో తారుమారు చేశారు. ఈ ప్రకటనతో అఖండ భారతదేశం చివరి ఆశ కూడా లేకుండా పోయింది.

అప్పటికే ఆగ్రహంలో ఉన్న జిన్నాకు ఈ నిర్ణయంతో మంచి అవకాశం వచ్చింది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కాంగ్రెస్‌ ఉద్దేశాలు సరిగాలేవని, బ్రిటీష్‌ పాలనా కాలంలోనే పాకిస్తాన్ ఇవ్వకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని జిన్నా స్పష్టం చేశారు.

ఆగస్టు 16 నుంచి ముస్లింలీగ్‌ ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. ఇది భారీ హింసకు దారి తీస్తుందని ఎవరూ ఊహించలేదు. నెహ్రూ వల్ల పొరపాటు జరిగిపోయిందని పటేల్‌ అర్ధం చేసుకున్నారు.

సర్దార్‌ తన సన్నిహితుడు, వ్యక్తిగత కార్యదర్శి అయిన డీపీ మిశ్రాకు లేఖ రాశారు. "నెహ్రూ ఇప్పటి వరకు నాలుగుసార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ ఇంకా ఆయన చర్యలు చిన్నపిల్లల చేష్టల్లాగే ఉన్నాయి. విలేఖరుల సమావేశంలో మొత్తం భావోద్వేగంతో, తన పిచ్చి ప్రకటనలతో నింపేశారు'' అని పేర్కొన్నారు.

నెహ్రూ చేసిన అతి పెద్ద పొరపాటు ఫలితం తర్వాత దేశానికి తెలిసింది. జిన్నా ప్రత్యక్ష కార్యాచరణ దేశంలో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలకు కారణమైంది. కలకత్తా నగరంలో వేలమంది హత్యకు గురయ్యారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. నౌఖాలీలో భారీ ఎత్తున మారణ హోమం జరిగింది. క్రమంగా అల్లర్లు దేశమంతటికీ పాకాయి.

కలకత్తా, నౌఖాలీ, బిహార్లలో జరిగిన మారణహోమాన్ని సరిచేసే ప్రయత్నాలను గాంధీ అలుపెరుగకుండా చేశారు. స్వాతంత్ర్య దినం వరకు ఆ పని సాగింది.

పటేల్

ఫొటో సోర్స్, HULTON ARCHIVES

కత్తికి కత్తి

1946 నవంబర్‌ 23న మీరట్‌లో జరిగిన సమావేశంలో పటేల్‌లోని హిందుత్వవాది సహనం కోల్పోయాడు. “పాకిస్తాన్‌ను మోసపూరితంగా లాక్కోవడం గురించి మాట్లాడకండి. కత్తికి కత్తితోనే సమాధానం చెప్పవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. " ( మీరట్ కాంగ్రెస్‌ 54వ సెషన్‌, కెపి జైన్ర్) పటేల్‌ ప్రకటన సంచలనమైంది.

ఈ విషయం గాంధీకి చేరింది. "మీ గురించి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. మీ ప్రసంగాలు ప్రజలను ఆహ్లాదపరుస్తాయి. కానీ మీరు హింసకు, అహింసకు మధ్య తేడాను గమనించడం లేదు. మీరు కత్తికి కత్తితో సమాధానం చెప్పమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు’’ అని గాంధీజీ పటేల్‌కు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు.

నెహ్రూ, పటేల్‌ వ్యక్తిత్వాలను అర్ధం చేసుకోడానికి ఈ రెండు ఘటనలు సరిపోతాయి. నెహ్రూను గాంధీ తన వారసుడిగా ప్రకటించారు. అప్పటికే గాంధీ, పటేల్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

అయితే దీని అర్ధం గాంధీ పటేల్‌ను ద్వేషించారనో, ఇష్టపడలేదనో అనుకోకూడదు. కాకపోతే ఈ రోజు గాంధీ లేరు, నెహ్రూ లేరు పటేల్‌ లేరు. కాలచక్రం మారిపోయింది. ఈ రోజు నెహ్రూ విధానాలు మూలన పడ్డాయి. గుజరాత్‌లో అతి పెద్ద ఇనుప విగ్రహం రూపంలో పటేల్‌ ప్రస్తుత రాజకీయాలను చూస్తున్నారు. ఒకప్పుడు తనను నిషేధించిన పటేల్‌ను ఇప్పుడు ఆరెస్సెస్‌ తన మనిషిగా మార్చుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)