Women's health: ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ అంటే ఏమిటి.. ఇది ఎలాంటి సమస్యలకు కారణమవుతుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ శైలజ చందు
- హోదా, బీబీసీ కోసం
అది అడవి చెట్ల మధ్య కట్టిన రాజప్రాసాదం వంటి భవనం. పూర్వీకులిచ్చి పోయిన సంపదని వృద్ధి చేస్తున్న ఆ ఇంటి యజమానికి ఇద్దరు ఆడపిల్లలు.
దేవయాని, శర్వాణి. ఇద్దరికీ వయసులో ఒక సంవత్సరమే తేడా. ఎవరు పెద్దవారో, ఎవరు చిన్నవారో చూసేవారికి తికమకగా ఉండేది.
గంధపు బొమ్మలకు ముత్యాల పొడితో నగిషీ పెట్టినట్లు మెరిసిపోయేవారు.
ఆ వంశపు ఆడవారు బయటికి వెళ్లే అవకాశం లేదు. చదువుసంధ్యలు నేర్పడానికి ఉపాధ్యాయులే వారి భవనానికి వచ్చేవారు.
కాలక్షేపానికి కొదవ లేకుండా, ఆడపిల్లలిద్దరికీ సంగీత నృత్యాలు, ఆటపాటలు నేర్పించే ఏర్పాటు చేశారు.
సాయంకాలం వేళ ఇంగ్లీషు నేర్పించడానికొక దొరసాని వచ్చేది.
పదిహేను సంవత్సరాలు నిండాయి. పిల్లలిద్దరూ వసంత కాలపు పూల పొదలవలె ఎదిగారు. చదువు, వినయ విధేయతలతో పాటు ఐశ్వర్యం సమకూర్చిన అందంతో ఇద్దరూ వెలిగిపోతుండేవారు.
సంవత్సరానికొకమారు, కొండమీద దేవుడి ఉత్సవాలలో ప్రథమ పూజ కోసం మాత్రమే వారు బయటికి వచ్చేవారు.
ఆనాడు ఆ ఇద్దరమ్మాయిలనూ చూసేందుకు ఊరి జనమంతా విరగబడేవారు.

ఫొటో సోర్స్, Getty Images
అమ్మాయిలకు నృత్యం నేర్పించడానికి వచ్చే నాట్యాచార్యుడొక గుర్రపు బగ్గీలో వచ్చేవారు.
ఆనాడు తోటలో ఉన్న వేదికపై నృత్యప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ భవనానికి వెళ్లే దారికి రెండువైపులా ఏటవాలు కొండలపై అంతా పచ్చదనమే. గుర్రపు బండీ వచ్చే సమయానికి ఆ పచ్చికపై ళ్లు చిలకరిస్తున్నట్టు వర్షం పడుతోంది.
నాట్యాచార్యుడికి నమస్కారం చేశారిద్దరూ. ఒకమ్మాయి పసుపు దుస్తులు, రెండో అమ్మాయి కుంకుమ వర్ణపు ఆహార్యంలోనూ మెరిసిపోతున్నారు.
ఇద్దరూ కలిసి ఒక నృత్య రూపకాన్ని అభినయించారు. అతిథులెవరో కాదు. దగ్గర బంధువులు, అక్కడ పని చేసే పనివారూను.
వారి నృత్యాన్నీ, సోయగాలను చూస్తూ అందరూ మైమరచి పోయారు.
నాట్యం నేర్పే గురువుకి మాత్రం ఎక్కడో అసంతృప్తి. వారి అడుగులలో సౌకుమార్యం లోపిస్తున్న భావన. పిల్లలిద్దరూ వినయంగా ఉంటారు. కానీ నృత్యంలో మృదువుగా పడవలసిన చోట, అడుగులు పరుషంగా పడుతున్నట్లు గమనించారు.
నృత్యం అయిపోయింది. ఇద్దరూ ఆయనకు నమస్కరించి, స్వేదం తుడుచుకుంటూ "ద్రౌపదీ, గురువుగారికి ఫలహారం సిద్ధం చేయమ"ని చెప్పి లోపలికెళ్లారు.
ఫలహారం పట్టుకొచ్చింది ద్రౌపది. ఆమె నడివయసు విధవరాలు. ఆడపిల్లలిద్దరి బాగోగులు చూసుకునేందుకు నియమించారు.
తల్లిదండ్రులిద్దరూ ఇంటి పట్టున ఉండేది తక్కువ. తండ్రి ఎస్టేటు వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతాడు. తల్లి ఆయన్ని అనుసరించక తప్పదు.
తల్లితో కన్నా పిల్లలిద్దరికీ ద్రౌపదితోనే చేరిక.
ఎంత ప్రయత్నించినా వారి నృత్యంలో రౌద్రం తగ్గడం లేదేమని గురువుగారు, వారి గురించే ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనల్లో , అకస్మాత్తుగా ఓ విషయం స్ఫురించింది. పిల్లలు ఈడేరాక సహజంగా తీసుకోవలసిన నెలసరి సెలవు వీరు తీసుకుంటున్నట్లు లేదే అన్న విషయం.
కొన్ని దైవికమైన నృత్యాలను నేర్పే విషయంలో ఆయన ఆచారం పాటిస్తారు. తన మనసులో మాట ఎవరితో చెప్పాలా అని ఆలోచించి ద్రౌపదిని పిలిచారు.
చెప్పేందుకు నాట్యాచార్యుడు సందేహిస్తుంటే, గురువుగారికి డబ్బు సహాయమేమైనా కావాలేమోననుకుంది.
"అయ్యగారు రేపు దేవిడీలో కూర్చున్నపుడు కలవండ"ని చెప్పింది.
"అది కాదమ్మా. పిల్లలు ప్రతిరోజూ సాధన చేస్తున్నారు."
కొద్దిగా ఆగి, "కానీ ఆ రోజుల్లో విశ్రాంతి తీసుకుంటే మంచిదేమోనని" అంటూ నసిగారు.
"ఏ రోజుల్లో?" అని ద్రౌపది అడిగింది. వెంటనే ఆమెకూ స్ఫురించింది. ఆయన దేని గురించి ప్రస్తావించారో.
నిజమే, ఆ విషయమే ఎరుకకు రాకపోవడమేమిటని ఆశ్చర్య పోయింది. పిల్లలిద్దరికీ పదహారు సంవత్సరాలు నిండబోతున్నాయి. రూపు రేఖల్లో చక్కగా ఎదిగారు. రజస్వల ఈడొచ్చింది. అయినా ఆ ముచ్చట జరగకపోవడమేమిటి?
పిల్లలింకా రజస్వల కాకపోవడం గురించి యజమానురాలి చెవిన వేసింది ద్రౌపది.

ఫొటో సోర్స్, Getty Images
రజస్వల కోసం
ఆస్పత్రుల చుట్టూ తిప్పడానికో, డాక్టర్లను పిలిపించడానికో వారికి మనసొప్పలేదు. కుటుంబ ప్రతిష్ట తగ్గుతుందనీ, నలుగురూ రకరకాలుగా మాట్లాడుకుంటారనీ భావించి, తమ వంశానికి గురువు వంటి వ్యక్తికి కబురు చేశారు.
కొండపైన ఆలయంలో వుండే పూజారి. ఆయన దేవీ ఉపాసకుడు. విషయం విన్న పూజారి వారిద్దర్నీ ముగ్గులో కూర్చోబెట్టాలని, కొండ గుహలో ఓ రాత్రి గడపాలని చెప్పాడు.
ఓ పౌర్ణమి నాటి రాత్రి అమ్మాయిలిద్దరినీ గుహ వద్ద ముగ్గు పూజకు దిగబెట్టారు.
పూజారి పిల్లలిద్దరికీ ఒక ద్రవం తాగించి పూజలు జరిపించారు.
మర్నాడు సూర్యోదయం కాగానే గుహ వద్దకు వెళ్లారు జమీందారు దంపతులు. వారిద్దరి దుస్తులకు రక్తం అంటి వుంది. సంతోషంతో గురువుకు సాగిలపడ్డారు.

ఫొటో సోర్స్, iStock
కూతుళ్లిద్దరూ సంపూర్ణమైన ఆరోగ్యవంతులనీ, మరిక ఆలోచించవలసిందేమీ లేదనీ, యజమానురాలు నిశ్చింతగా వుంది. కానీ ప్రతి నెలా రుతుక్రమమేమీ రావడం లేదని ద్రౌపది సంకోచిస్తూ యజమానురాలికి చెప్పింది.
"హెచ్చు తగ్గులుంటాయిలేవే. పిల్లలింకా లేతవాళ్లే కదా." అంది జమీందారిణి.
ఆ తర్వాత భర్తతో ఏం మాట్లాడిందో, వారిద్దరూ ఏం నిర్ణయించుకున్నారో, ఆపై యేడాది పిల్లలిద్దరికీ వివాహాలు నిశ్చయించారు.
వరులిద్దరూ అన్నదమ్ములే. లండన్‌లో చదువుకుంటున్నారు.
ఊరంతా సంబరంలా జరిగాయి జంట వివాహాలు.
పెద్ద అబ్బాయికి చదువైపోయింది. ఇక్కడకు వచ్చేసి భార్యని కాపురానికి తీసుకెళ్లాడు.
చిన్నతని చదువు మరొక సంవత్సరం మిగిలే వుండడంతో భార్యని తనతో బాటు లండన్ తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
కాపురానికి వచ్చిన నెల తరువాత తెలిసింది
పెద్ద అమ్మాయి కాపురానికెళ్లిన ఒక నెలకు పెద్ద అల్లుడికి విషయం తెలిసింది. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరకపోయే సరికి అనుమానమొచ్చి అడిగారు.
తనకెపుడూ రుతుక్రమం రాలేదనీ, వివాహమపుడు తలిదండ్రులకెదురు చెప్పే వీలులేకపోయిందని చెప్పింది దేవయాని.
సిటీకి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తే గర్భకోశమే లేదని తెలిసింది.
దేవయానిని అత్తింటి వారు గౌరవంగా పుట్టింట్లో దిగవిడిచారు.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లయి నెలయినా భార్యాభర్తల కలయిక సాధ్యపడకపోతే అనుమానం వచ్చింది
శర్వాణిని చేసుకున్న తమ్ముడు, ఆమెను లండన్ తీసుకుని వెళ్లాడు. కొత్త దంపతులు అద్దె ఇంట్లో కాపురం పెట్టారు.
అన్నకు ఎదురైన సమస్యే అతనికీ వచ్చింది. భార్యాభర్తల కలయిక సాధ్యపడడం లేదు.
తామున్న ఇంటి యజమాని దంపతులిద్దరూ డాక్టర్లే కావడంతో సమస్య వారి వద్దకు చేరింది.
అమ్మాయిని హాస్పిటల్లో పరీక్షకు తీసుకెళ్లారు. ఆమె క్రోమోజోముల పరీక్ష చేయగా తేలిందేమిటంటే ఆమె జెండర్ క్రోమోజోములు XY గా తేలాయి.
సాధారణంగా స్త్రీల లైంగిక క్రోమోజోములు XX అయితే మగవారికి XY వుంటాయి.
క్రోమోజోముల లెక్క ప్రకారం - శర్వాణి పురుషుడు. బాహ్య రూపాన్ని చూసినట్లైతే- స్త్రీ.
ఎలా ఇపుడు? ఏం చెయ్యాలి?
ఆ పరిస్థితిని వారికి వివరించడానికి , భవిష్యత్తు నిర్ణయాల గురించిన అవగాహన కోసం వైద్య నిపుణుల బృందం వారితో ఒక సమావేశం నిర్వహించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇదేమి పరిస్థితి? అసలెందుకిలా జరిగింది?
ఇది Androgen insensitivity syndrome అనే స్థితి.
మొదట్లో ఏ గర్భస్థ శిశువు కైనా జననాంగాల ఆకారం ఆడవారిలానే ఉంటుంది.
6 వారాల వరకూ ఆడ మగ శిశువుల మధ్య ఎటువంటి భేదమూ కనిపించదు. ఆ తర్వాత సెక్స్ హార్మోన్స్ విడుదల అవుతాయి.
మగ శిశువులో యాండ్రోజెన్స్ ప్రభావం వల్ల క్రమంగా పురుషాంగాలు పరిణితి చెందుతాయి. వృషణాలు మెల్లగా పొట్టలోపలి నుంచి ప్రయాణించి వృషణ కోశాల్లో స్థిరపడతాయి.
ఇక్కడ జరిగిన విషయమేమిటంటే, యాండ్రోజెన్స్ ఉత్పత్తి జరిగింది కానీ, ఆ హార్మోన్లకు స్పందించే గుణం శరీరానికి లేకపోవడం వల్ల జననాంగాలు స్త్రీ వలెనె ఉండిపోయాయి.
మరి వృషణాలెక్కడ వున్నాయి. సాధారణంగా అవి కడుపులో నుండి ప్రయాణించి బిడ్డ డెలివరీ అయే సమయానికి వృషణ కోశాల్లోకి చేరుకుంటాయి.
ఆ ప్రయాణానికి కూడా పురుష హార్మోన్లు అవసరమే. కానీ హార్మోన్ల ప్రభావం శరీరంపై లేకపోవడం వల్ల అవి ఉదరపు గోడల్లో ఉండిపోతాయి.
ఇక బాహ్య జననాంగాల ఆకారం వలన వీరిని ఆడపిల్లల వలే పెంచుతారు. కానీ యుక్త వయసుకు ఆడపిల్లలో కనిపించే ముఖ్యమైన లైంగిక లక్షణాలు కనిపించవు.
సెకండరీ సెక్సువల్ క్యారక్టర్స్ అంటే ఏమిటి?
యౌవనం ప్రారంభమయే ముందు ఆడవారిలో వక్షోజాల పెరుగుదల, చేతుల కింది భాగంలోనూ , జననాంగాల పైన రోమాలు పెరుగుతాయి. వాటిని secondary sexual characters అంటారు.
మరి రొమ్ముల పెరుగుదల ఆడవారిలానే ఉంది కదా. టెస్టోస్టెరోన్ హార్మోన్లలో కొంత శాతం ఈస్ట్రోజెన్స్ (ఆడవారి హార్మోన్స్) వలె మారడం వల్ల వక్షోజాలు పెరుగుతాయి కానీ రోమాలు కనిపించవు.
ఇప్పుడేం చెయ్యాలి?
ఒక చిన్న ఆపరేషన్ ద్వారా ఆమె కడుపులో ఉన్న వృషణాలను తొలగించాలి. తొలగించకపోతే? అసాధారణ ప్రదేశంలో ఉండడం వల్ల వాటిలో కాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
వీరికి భవిష్యత్తేమిటి?
స్త్రీగా జీవించడానికి ఏ ఇబ్బందీ లేదు. జన్మాంతం ఆడవారి హార్మోన్స్ తీసుకోవలసిన అవసరం ఉంది.
'మీరు భార్యాభర్తలుగా కొనసాగాలంటే తప్పక సహాయం చేస్తాం. కృత్రిమ వెజైనా సర్జరీ ద్వారా ఏర్పాటు చేయాలి. బిడ్డలు కావాలంటే మాత్రం దత్తత తీసుకోవడం వలన గానీ , లేదా సర్రోగసీ వల్లనే సాధ్యం'.

ఫొటో సోర్స్, Getty Images
రజస్వల కావడం ఆలస్యమైన ఆడపిల్లలలో పరీక్ష ఎప్పుడు చేయించాలి?
ముందుగా యుక్త వయసులో కనిపించే లక్షణాలు ఏర్పడ్డాయా లేదా అని గమనించాలి. ఆ లక్షణాలలో ప్రధానమైనవి, రొమ్ముల పెరుగుదల, చేతుల కింద, జననాంగాల పైన వచ్చే రోమాలు. ఈ ఆ లక్షణాలు ఏర్పడని పక్షంలో 16 సంవత్సరాల వరకు ఆగవచ్చు.
అప్పటికీ రజస్వల కాని పక్షంలో వైద్య పరీక్షలవసరం.

ఫొటో సోర్స్, Getty Images
ఆ రకంగా ఎందరో బిడ్డలకు తల్లులయ్యారు
జెనెటిక్స్‌కు , క్రోమోజోములకు సంబంధం లేకుండా పెరిగిన శర్వాణి స్త్రీ హృదయం తల్లడిల్లింది. దుఃఖం సముద్రమైంది.
తను మగవాడా? భర్త భుజమ్మీద తల పెట్టుకోవాలని చూసింది. భర్త అనే వ్యక్తి తనని ఒప్పుకుంటాడా?
అతను భార్యా భర్తలుగా కొనసాగుదామన్నాడు. తనకు పిల్లలు ముఖ్యం కాదనీ , కావాలంటే బిడ్డని పెంచుకుందామన్నాడు.
తననుండి విడిపోయి హృదయం ముక్కలు చేయొద్దని బతిమాలాడు.
భార్యగా కొనసాగాలంటే శరీరానికి అవసరమైన కృత్రిమ రంథ్రం ఏర్పాటుకు శర్వాణి ఇష్టపడలేదు.
అతన్ని వేరే పెళ్లి చేసుకొమ్మని ఒప్పించి ఇంటికి చేరుకుంది. జమీందారు దంపతులిద్దరూ కాలం చేశారు. దేవయాని, శర్వాణీ, ఒక అనాథ శరణాలయాన్ని నిర్మించి ఎందరో బిడ్డలకు తల్లులయ్యారు.
(వైద్యపరమైన కేసును సులభంగా వివరించడానికి నేపథ్యం, పాత్రలు కల్పించబడినవి. నిజమైన వ్యక్తులతో, జీవించిఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం)
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








