Nuclear: నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన హోమీ జహంగీర్ భాభా మరణానికి కారణమేంటి

ఫొటో సోర్స్, TIFR
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రముఖ భారత శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ తన సహచరులను పొగడటం చాలా అరుదు. కానీ, హోమీ జహంగీర్ భాభాను మాత్రం ఆయన భారత దేశపు లియనార్డో డావిన్సీ అంటూ ఆకాశానికెత్తేసేవారు.
భాభా ఎక్కువగా డబుల్ బ్రెస్ట్ సూట్‌లో కనిపించేవారు. ఆయనకు సైన్స్‌తోపాటు సంగీతం, నృత్యం, పుస్తకాలపైనా ఆసక్తి ఎక్కువే. తన సహచరుల బొమ్మలు కూడా ఆయన గీసేవారు.
''భాభా తన స్కెచ్‌లు కూడా రెండు సార్లు గీశారని మృణాలినీ సారాబాయీ చెప్పారు. ఎమ్ఎఫ్ హుస్సేన్ స్కెచ్‌ను కూడా ఆయన గీశారని అన్నారు. ముంబయిలో హుస్సేన్ తొలి ప్రదర్శనను భాభానే ప్రారంభించారు. బాంబే ప్రొగ్రెసివ్ ఆర్టిస్ట్స్ ప్రదర్శన ఉన్నప్పుడు భాభా తప్పకుండా వచ్చేవారు. తమ సంస్థ కోసం పెయింటింగ్స్, విగ్రహాలు కొనుక్కొని వెళ్లేవారు'' అని ఆర్కైవల్ రీసోర్సెస్ ఫర్ కాంటెపరరీ హిస్టరీ వ్యవస్థాపకురాలు, హోమీభాభా జీవితంపై పుస్తకం రాసిన ఇందిరా చౌధరి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సంగీత ప్రియుడు
ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ యశ్‌పాల్... టాట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో తన కెరీర్ తొలి నాళ్లలో హోమీ భాభాతో కలిసి పనిచేశారు.
57 ఏళ్ల తన జీవితంలో భాభా సాధించిన విజయాలను గమనిస్తే, ఆయనకు సరిపోల్చే వ్యక్తులు ఎవరూ ఉండరని ఆయన అన్నారు.
''సంగీతం అంటే ఆయనకు చాలా ఇష్టం. భారతీయ సంగీతంతోపాటు పాశ్చాత్య సంగీతం కూడా వినేవారు. ఏ పెయింటింగ్‌ను ఎక్కడ పెట్టాలి? ఫర్నీచర్ ఎలా ఉండాలి? ఇలా ప్రతి విషయం గురించీ ఆయన లోతుగా ఆలోచించేవారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ప్రతి బుధవారం అకాడమిక్ కాన్ఫరెన్స్ జరిగేది. భాభా ఆ కార్యక్రమాన్ని ఎప్పుడూ మిస్ అయ్యేవారు కాదు. ఆ కార్యక్రమంలో అందరినీ కలిసేవారు. ఏం జరుగుతుంది? ఏ జరగాల్సి ఉంది? అన్నీ తెలుసుకునేవారు'' అని యశ్‌పాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, nuclearweaponarchive.org
నెహ్రూ 'భాయీ'
జవహర్‌లాల్ నెహ్రూకు హోమీ భాభా చాలా సన్నిహితుడు. నెహ్రూను ‘భాయీ’ (సోదరా) అని పిలిచేంత చనువు ఉన్న చాలా కొద్ది మందిలో భాభా కూడా ఒకరు.
''నెహ్రూను ఇద్దరే 'భాయీ' అని పిలిచేవారు. ఒకరు జయ్‌ప్రకాశ్ నారాయణ. ఇంకొకరు హోమీ భాభా. నెహ్రూ చాలా సార్లు అర్ధరాత్రి వరకూ భాభాతో ఫోన్ మాట్లాడుతుండేవారని, భాభా కోసం ఆయన ఎప్పుడూ సమయం ఇచ్చేందుకు వీలు చేసుకునేవారని ఇందిరా గాంధీ ఓసారి చెప్పారు. పాట్రిక్ బైంకెట్ అనే ఇంగ్లిష్ శాస్త్రవేత్త డీఆర్‌డీఓ సలహాదారుడిగా ఉండేవారు. నెహ్రూ మేధావుల సాంగత్యాన్ని ఇష్టపడేవారని, హోమీ భాభాతో అందుకే ఎక్కువగా మాట్లాడేవారని పాట్రిక్ చెప్పారు'' అని ఇందిరా చౌధరి అన్నారు.
భాభా ఏ విషయం గురించైనా చాలా లోతుగా ఆలోచించేవారు. భవిష్యతు అవసరాలు ఏంటన్నదానికి తగ్గట్లుగా ఆయన ప్రణాళికలు ఉండేవి.

ఫొటో సోర్స్, TIFR
దూరదృష్టి
''ఓసారి హోమీ భాభాతో కలిసి నేను దెహ్రాదూన్ వెళ్లా. అక్కడ సర్కిట్ హౌస్ భవనం నుంచి మేం కార్లో బయటకు వస్తూ ఉన్నాం. దారికి రెండు వైపులా కనిపిస్తున్నవి ఏ చెట్లో చెప్పగలవా అని ఆయన నన్ను ప్రశ్నించారు. అవి స్టర్ఫూలియా అమాటా చెట్లని నేను చెప్పా. ట్రాంబేలోని తమ సెంట్రల్ ఎవెన్యూలో ఇలాంటి చెట్లనే పెట్టాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కానీ, అవి పెరగడానికి కనీసం వందేళ్లు పడుతుందని నేను అన్నా. 'అయితేనేం. అప్పటికి నువ్వు, నేనూ ఉండం కావొచ్చు. కానీ, చెట్లు ఉంటాయిగా. మనం సర్కిట్ హౌస్‌లో ఈ చెట్లను చూస్తున్నట్లుగానే, భావితరాల వాళ్లు అక్కడ వాటిని చూస్తారు' అని ఆయన బదులిచ్చారు. అంతటి దూరదృష్టితో ఆయన ఆలోచించేవారు'' అని ప్రముఖ శాస్త్రవేత్త ఎమ్‌జీకే మేనన్ వివరించారు.

ఫొటో సోర్స్, TIFR
చెట్లను పెంచడం అంటే హోమీ భాభాకు చాలా ఇష్టం. టీఐఎఫ్ఆర్, బార్క్‌లో ఇప్పుడు కనిపిస్తున్న పచ్చదనం అంతా ఆయన చలవేనని చెబుతుంటారు.
''టీఐఎఫ్ఆర్‌లో అమీబా గార్డెన్ అనే తోట ఉంది. అది చూడటానికి అమీబాలేగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లను ఆయన ట్రాన్స్‌ప్లాంట్ చేసి (ఒక చోటు నుంచి మరో చోటుకు తెచ్చి) పెట్టారు. ఒక్క చెట్టును కూడా నరకలేదు. మొదట చెట్లు పెట్టి, ఆ తర్వాతే భవనం కట్టారు. బెంగళూరులో మెట్రో నిర్మించేందుకు వేల చెట్లను కొట్టేస్తుంటే, నాకు ఈ విషయం గుర్తుకువచ్చింది. చెట్లను కొట్టేయకుండా, ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చన్న ఆలోచనను ఆయన కొన్నేళ్ల క్రితమే చేశారు'' అని ఇందిరా చౌధరి అన్నారు.

ఫొటో సోర్స్, TIFR
భోజనం అంటే...
1948లో ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడినప్పటి నుంచి 1966 వరకు భాభా ఛైర్మన్‌గా ఉన్నారు.
ఆయన ఎప్పుడూ చాలా నిరాడంబరంగా ఉండేవారని, అందరితోనూ మర్యాదగా వ్యవహరించేవారని ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమెకు శాస్త్రీయ సలహాదారుడిగా పనిచేసిన ప్రొఫెసర్ అశోక్ పార్థసారథి చెప్పారు.
''భాభా ఎప్పుడూ తన సూట్‌కేసు తానే మోసేవారు. సహాయకుడితో మోయించేవారు కాదు. విక్రమ్ సారాభాయీ కూడా ఆ తర్వాత ఇదే పద్ధతి పాటించేవారు. భాభా ఓసారి సెమినార్‌లో ప్రసంగిస్తున్నప్పుడు ఒక జూనియర్ శాస్త్రవేత్త ఓ కఠినమైన సందేహం అడిగారు. దానికి, భాభా ఎలాంటి భేషజాలు లేకుండా ఆ సందేహానికి సమాధానం తన వద్ద లేదని... ఆలోచించి, కొన్ని రోజుల్లో జవాబు చెబుతానని చెప్పారు'' అని పార్థసారధి వివరించారు.
భాభా మంచి భోజన ప్రియుడు కూడా. కానీ, ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
''తిండి విషయంలో ఆయన ఎప్పుడూ మొహమాటపడేవారు కాదు. ఓసారి వాషింగ్టన్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయనకు అజీర్తి చేసింది. పెరుగు తప్పితే ఏదీ తినవద్దని వైద్యులు సలహా ఇచ్చారు. ఆయన మాత్రం గుడ్లు, టోస్ట్, పండ్లు, కాఫీ... ఇలా అన్నీ తీసుకున్నారు. ఆ తర్వాతే మందులు వేసుకున్నారు'' అని ఇందిరా చౌధరి చెప్పారు.

ఫొటో సోర్స్, TIFR
నోబెల్‌కు ఐదు సార్లు నామినేషన్
భాభా ఓ కుక్కను పెంచుకునేవారు. దానికి పొడవాటి చెవులు ఉండేవి. అందుకే దాన్ని 'క్యూపిడ్' అని పిలిచేవారు. రోజూ దాన్ని ఆయన రోడ్డు మీద తిప్పేవారు.
భాభా ఆఫీసు నుంచి ఇంటికి రాగానే, అది ఆయన దగ్గరకు వెళ్లి కాళ్లు నాకేది.
అనుకోకుండా ఆయన విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత ఓ నెల రోజుల పాటు అదేమీ తినలేదు.
వైద్యులు వచ్చి, రోజూ దానికి మందులు ఇచ్చేవారు. కానీ, అది ఏమీ తినేది కాదు. నీళ్లు మాత్రమే తాగేది. ఆ కుక్క తర్వాత ఎక్కువ రోజులు బతకలేదు.
మనుషులన్నాక, ఏవో ఒక లోపాలు ఉండటం సహజం. భాభా కూడా దీనికి అతీతం కాదు. సమయపాలన సరిగ్గా పాటించరన్న పేరు ఆయనకు ఉండేది.
''సమయాన్ని ఆయన సరిగ్గా పట్టించుకునేవారు కాదని చాలా మంది అంటుండేవారు. ఆయన్ను కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నవాళ్లు చాలా సేపు వేచి చూడాల్సి వచ్చేది. వియన్నాలో ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ సమావేశాలకు కూడా ఆయన ఆలస్యంగా వచ్చేవారు'' అని ఇందిరా చౌధరి చెప్పారు.
భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి భాభా ఐదు సార్లు నామినేట్ అయ్యారు.
''నా జీవితంలో ముగ్గురు మహానుభావులను కలిసే అవకాశం వచ్చింది. ఆ ముగ్గురు... గాంధీ, నెహ్రూ, హోమీ భాభా. హోమీ భాభా గణితజ్ఞుడు, శాస్త్రవేత్త మాత్రమే కాదు... గొప్ప ఇంజినీర్, బిల్డర్, గార్డెనర్. ఓ కళాకారుడు కూడా. ఆయన సంపూర్ణమైన వ్యక్తి'' అని ఒకప్పుడు హోమీ భాభాకు నివాళులు అర్పిస్తూ దిగ్గజ పారిశ్రామిక వేత్త జేఆర్‌డీ టాటా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








