వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో ‘కనిపించిన’ ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాబ్లో ఎస్పర్జా
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాంగ్ పర్వతాల శిఖరాలు ఆకాశాన్ని పొడుస్తున్నట్లుగా ఉంటాయని, ఏడాదిలో చాలా కాలం వాటిపై మంచు పరుచుకుని ఉంటుందని అప్పట్లో యూరప్‌లో చెప్పుకునేవారు.
19వ శతాబ్దం నాటి పశ్చిమ ఆఫ్రికా మ్యాప్ చూస్తే, నదుల ప్రవాహ దిశలనే మర్చే భారీ పర్వతాల్లా ఇవి కనిపించేవి. వీటి గురించి అనేక కథలు ప్రచారంలో ఉండేవి.
ఈ పర్వతాల గురించి వర్ణనలు విన్నవాళ్లు, మ్యాప్‌లు చూసినవాళ్లు కాంగ్ పర్వతాలు హిమాలయాల తరహాలో భారీగా ఉంటాయని అనుకుంటారు.
కానీ, నిజానికి ఈ పర్వతాలు అసలు లేనేలేవు. కేవలం మ్యాప్‌ల్లోనే ఇవి కనిపిస్తాయి.
మ్యాపులు, సమాజాల దృక్పథాల మధ్య సంబంధం గురించి సిమోన్ గార్‌ఫీల్డ్ అనే జర్నలిస్ట్ ‘ఆన్ ద మ్యాప్’ అనే పుస్తకం రాశారు. కాంగ్ పర్వతాలు కేవలం మ్యాప్‌లు సృష్టించిన కల్పిత పర్వతాలని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్కాటిష్ యాత్రికుడు ముంగో పార్క్ మొదటగా కాంగ్ పర్వతాల గురించి వర్ణించారు. నైజర్ నది జన్మ స్థానం గురించి 1795 నుంచి 1797 మధ్యలో ఆయన అన్వేషించారు. ప్రస్తుతం సెనెగల్, మాలి ఉన్న ప్రాంతాల వరకూ వెళ్లారు.
ఆయన యాత్ర గురించి 1799లో ఓ పుస్తకం అచ్చైంది. దీనికి చివర్లో బ్రిటన్‌కు చెందిన మ్యాపుల చిత్రకారుడు జేమ్స్ రెనెల్ వేసిన ఓ మ్యాపు ఉంది.
భూ మధ్య రేఖకు ఉత్తరం వైపు 10 డిగ్రీల అక్షాంశం వెంబడి దాదాపు పశ్చిమ ఆఫ్రికా వ్యాప్తంగా కాంగ్ పర్వతాలు విస్తరించి ఉన్నట్లు ఇందులో గీశారు.
కాంగ్ సామ్రాజ్యం రాజధాని నగరం కాంగ్ పేరు మీద ఈ పర్వతాలకు ఆ పేరు పెట్టారు. వట్టారా అని కూడా ఈ సామ్రాజ్యానికి పేరు ఉంది.
‘పొరపాటా? కావాలనే చేశారా?’
ముంగో పార్క్ ఏవైనా పర్వతాలను చూశారా? లేక అవి ఉన్నట్లు కల్పించి చెప్పారా? అన్నది నిర్ధారించడం చాలా కష్టం.
‘‘పార్క్ వేటినో చూసి పొరబడి ఉంటారు. మేఘాలను చూసి పర్వతాలు అనుకున్నారేమో!’ అని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ ప్రొఫెసర్ థామస్ బాసెట్ అన్నారు.
పశ్చిమ ఆఫ్రికా భౌగోళిక పరిస్థితుల విషయంలో థామస్ నిపుణుడు.
‘‘యాత్రికులు, వ్యాపారులను ఆ వైపు పర్వత శ్రేణి ఉందా అని పార్క్ అడిగి ఉంటారు. వాళ్లు అవునని చెప్పి ఉండొచ్చు. అయోమయానికి మించిన కథేదో దీని వెనుక ఉండొచ్చు!’ అని థామస్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
నైజర్ నది ప్రవాహ మార్గం అప్పట్లో భూగోళ శాస్త్రవేత్తలకు చిక్కుముడిగా ఉండేది. ఈ అంశం కూడా కాంగ్ పర్వతాల గురించి కల్పనలో కీలకమై ఉండే అవకాశాలున్నాయి.
‘‘జేమ్స్ రెనెల్ తన సొంత సిద్ధాంతం ప్రకారం కాంగ్ పర్వతాలను వర్ణించారు. దీని గురించి పరస్పర విరుద్ధమైన చాలా సిద్ధాంతాలు ఉన్నాయి’’ అని థామస్ అన్నారు.
రెనెల్ తన కాలంలో బాగా పేరు మోసిన భూగోళ శాస్త్రవేత్త.
అట్లాంటిక్ సముద్రానికి తూర్పు వైపు నుంచి ఆఫ్రికాలోకి నైజర్ నది ప్రవహించి, ఆ తర్వాత అక్కడి డెల్టా లాంటి ప్రాంతంలోకి అది విస్తరించి కనుమరుగవుతుందని రెనెల్ ప్రతిపాదించారు.
ఆ నది దక్షిణాన ఉన్న బెనిన్ గల్ఫ్ వైపు ప్రవహించకుండా కాంగ్ పర్వతాలు ‘అడ్డంకి’గా మారాయని ఆయన చెప్పారు.
అయితే, నిజానికి నైజర్ నది ఆ వైపుగానే ప్రవహిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
రెనెల్ వర్ణనలు చాలా ప్రభావం చూపాయి. 19వ శతాబ్దం మొత్తం దాదాపు అన్ని ఆఫ్రికా మ్యాపుల్లో కాంగ్ పర్వతాలు ఉన్నట్లుగా చూపారు.
అయితే, వాటి ఆకారాన్ని మ్యాపులు గీసేవాళ్లు తమకు ఊహాశక్తికి తగ్గట్లుగా గీశారు.
కొన్ని మ్యాపుల్లో ఆఫ్రికా ఖండంలో పశ్చిమం నుంచి తూర్పు వైపుకు సహారా ఎడారి, మధ్య ఆఫ్రికా మధ్య పెద్ద గోడలా వీటిని గీశారు.
అవి చాలా ఎత్తైనవని, వాటి లోయల్లో బంగారం నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని కూడా వర్ణనలు చేశారు.
ప్రస్తుతం ఘనా ఉన్న ప్రాంతంలోని అష్టాని సామ్రాజ్యానికి అత్యంత విలువైన లోహం కాంగ్ పర్వతాల నుంచే వచ్చిందని కూడా కొందరు యురోపియన్లు వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, 1889లో ఫ్రాన్స్ అధికారి, యాత్రికుడు లూయిస్ గుస్తావే బింగర్ నైజర్ నది వెంబడి యాత్ర చేపట్టారు. అసలు కాంగ్ పర్వతాలు లేనే లేవన్న వార్తను పారిస్ జియోగ్రాఫికల్ సొసైటీకి తెలియజేసింది ఆయనే.
దీంతో ఇక మ్యాపుల్లో నుంచి కూడా వాటిని తీసేయడం మొదలైంది.
ప్రపంచం గురించి మనకున్న అపోహలు, అభిప్రాయాలు వాస్తవికమనైవని మనం అనుకునే మ్యాపులను సైతం ఎలా మార్చేస్తాయన్నదానికి కాంగో పర్వతాలు ఒక ఉదాహరణ అని ప్రొఫెసర్ థామస్ బాసెట్ అన్నారు.
‘‘మ్యాపులు కూడా తమ చారిత్రక నేపథ్యాలకు అనుగుణంగా తమ తమ జనాల కోసం కొందరు తయారుచేసుకున్న సామాజిక అభిప్రాయలే’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
18వ శతాబ్దానికి ముందు మ్యాపుల్లో చిత్రవిచిత్రమైన కల్పిత అంశాలు ఉండేవని థామస్ చెప్పారు.
16వ శతాబ్దంలో ఒర్టెలియస్ అనే మ్యాపులు గీసే కళాకారుడు నైలు నది దక్షిణ ఆఫ్రికాలోని రెండు పెద్ద సరస్సుల్లో పుట్టినట్లుగా చిత్రించారని అన్నారు.
‘‘19వ శతాబ్దానికి సైన్స్ ఎంతో కొంత పురోగతి సాధించింది. అలాంటి సమయంలోనూ మ్యాపుల్లో కాంగ్ పర్వతాలు కనిపించడం అసాధారణమైన విషయమే’’ అని థామస్ చెప్పారు.
రెనెల్‌కు ఉన్న పేరు, ప్రాముఖ్యతలు... యురోపియన్ ప్రచురణకర్తలకు ఉన్న వ్యాప్తి కారణంగా కాంగ్ పర్వతాల గురించిన అపోహను చాలా కాలం ఎవరూ ప్రశ్నించకుండా ఉండిపోయారు.
లూయిస్ గుస్తావే బింగర్ కాంగ్ పర్వతాలు లేవని అధికారికంగా చెప్పడం వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఆయన బయటపెట్టిన విషయం పశ్చిమ ఆఫ్రికాలో ఫ్రాన్స్ సామ్రాజ్యవాదాన్ని బలోపేతం చేసింది.
19వ శతాబ్దంలో యురోపియన్ ప్రభుత్వాలకు మ్యాపులంటే కేవలం భౌగోళిక సమాచారం చెప్పే అంశాలే కాదు. వలస సామ్రాజ్యాలను నెలకొల్పాలన్న ఆకాంక్షలకు ఉపయోగపడే సాధనాలు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘19వ వతాబ్దంలో రాజకీయ మ్యాపులను అసలు భౌగోళిక పరిస్థితులపై రుద్దారు. బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగీసు మ్యాపుల మధ్య తేడాలు ఉండటానికి అదే కారణం. వాళ్లు భూభాగాలను వర్ణించడం కాదు, వాటిపై తమ హక్కును ప్రకటించుకున్నారు’’ అని థామస్ బాసెట్ అన్నారు.
మ్యాపులను నిశితంగా పరిశీలించాలని, ఉన్నదున్నట్లుగా నమ్మకూడదన్న పాఠం కాంగ్ పర్వతాలు మనకు నేర్పించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘మ్యాపును ఏ పరిస్థితుల్లో రూపొందించారు? ఎందుకోసం రూపొందించారు? ఇలా ఈ ప్రశ్నలకు సమాధానాలను పరిగణనలోకి తీసుకోకుండా మనం మ్యాపులను సరిగ్గా అర్థం చేసుకోలేం’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








