భారత్-పాకిస్తాన్ 1971 యుద్ధం: భారత్‌ను భయపెట్టేందుకు అమెరికా నేవీని పంపించింది. తర్వాత ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Langevin Jacques
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1971 డిసెంబర్ 12. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశానికి పిలుపునిచ్చింది.
పాకిస్తాన్ ప్రతినిధి మండలికి నేతృత్వం వహించిన జుల్ఫికల్ అలీ భుట్టోను, ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి జార్జి బుష్ సీనియర్‌ను కలవడానికి భారత ప్రధాని ఇందిరాగాంధీ విదేశాంగ మంత్రి స్వర్ణ సింగ్‌ను పంపించారు.
స్వర్ణ సింగ్ పాకిస్తాన్ మీద జోకులేస్తూ "ఏంటి, శ్రీ భుట్టోగారు ఇప్పటికీ భారత్ మీద గెలవాలని, దిల్లీ చేరుకోవాలని కలలు కంటున్నారా?" అన్నారు. గారీ బేస్ తన 'ద బ్లడ్ టెలిగ్రామ్' అనే పుస్తకంలో అదంతా రాశారు.

ఫొటో సోర్స్, C. Hurst & Co Publishers
నిక్సన్, కిసింజర్ ఆదేశాల మేరకు బుష్ "ఈ యుద్ధంలో భారత్ ఉద్దేశం ఏంటని" స్వర్ణ సింగ్‌ను అడిగినప్పుడు, ఆయన, "వియత్నాం గురించి అమెరికా ఏమనుకుంటోందని" బుష్‌ను ఎదురు ప్రశ్నించారు.
మూడోసారి భద్రతామండలి యుద్ధ విరమణ ప్రస్తావనను వీటో చేసిన సోవియట్ యూనియన్ అప్పుడు భారత్‌ను కాపాడింది. దాంతో కిసింజర్‌కు చాలా కోపం వచ్చింది, ఆయన నిక్సన్‌ను అడగకుండానే కొన్ని రోజుల్లో సోవియట్ యూనియన్‌తో జరగబోయే శిఖరాగ్ర చర్చలు రద్దు చేస్తామని బెదిరించారు. (హెన్రీ కిసింజర్, వైట్ హౌస్ ఇయర్స్, పేజీ 790)

ఫొటో సోర్స్, Consolidated News Pictures
బెంగాల్ తీరానికి యుఎస్ఎస్ ఎంటర్‌ప్రైజ్
మరోవైపు భారత్, పాకిస్తాన్ అమెరికా దౌత్యవేత్తలు పరస్పరం విమర్శించుకోవడంలో మునిగిపోయారు.
తూర్పు పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులను సురక్షితంగా తప్పించడానికి తమ విమాన వాహక నౌక యుఎస్ఎస్ ఎంటర్‌ప్రైజ్‌ను వెంటనే బెంగాల్ తీరానికి పంపించాలని నిక్సన్, కిసింజర్ నిర్ణయించారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దానికి ఒక రోజు ముందే అమెరికన్లు అందరినీ ఢాకా నుంచి ఖాళీ చేయించారు. "అమెరికా యుద్ధ నౌకల దళం మలక్కా తీరం నుంచి త్వరలో బెంగాల్ తీరానికి చేరుకుంటుంది" అని నిక్సన్ భుట్టోకు చెప్పినట్లు అమెరికా విదేశాంగ శాఖ డీక్లాసిఫై చేసిన టేపుల్లో ఉంది. భారత సైన్యం వెనక్కు తగ్గడానికి ఒప్పుకునేవరకూ, భారత్ వైపు వెళ్లడం కొనసాగిస్తామని కూడా నిక్సన్ గట్టిగా చెప్పారని కూడా వాటిలో ఉంది. (FRUS VOL E 7).

ఫొటో సోర్స్, South China Morning Post
అణు శక్తితో నడిచే అమెరికా ఏడో విమానవాహక నౌక ఎంటర్‌ప్రైజ్‌లో ఏడు డెస్ట్రాయర్లు, ఒక హెలికాప్టర్ క్యారియర్ ట్రిపోలీ, ఒక ఇంధన క్యారియర్ ఉన్నాయి.
దాని కమాండ్ అడ్మిరల్ జాన్ మెకెన్ జూనియర్ చేతుల్లో ఉంది. ఆయన కొడుకు మూడో జాన్ మెకెన్ తర్వాత ఆరిజోనా సెనేటర్‌గా ఉన్నారు. 2008లో అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు.
బ్లడ్ టెలిగ్రామ్ రచయిత గారీ జె.బాస్ అప్పటి పరిస్థితి గురించి రాశారు.
భారత నౌకాదళంతో పోలిస్తే, అమెరికా నౌకాదళం చాలా పెద్దది. మిసైల్ సంక్షోభ సమయంలో ఎంటర్‌ప్రైజ్ క్యూబాను ముట్టడించింది. ఎంటర్‌ప్రైజ్ నౌకాదళంలోని ట్రిపోలీ నౌక, భారత విక్రాంత్ కంటే పెద్దది. అణుశక్తితో నడిచే ఎంటర్‌ప్రైజ్ మళ్లీ ఇంధనం నింపుకోకుండా మొత్తం ప్రపంచాన్ని చుట్టేయగలదు. మరోవైపు విక్రాంత్‌లో బాయిలర్ కూడా సరిగా పనిచేయని పరిస్థితి ఉంది.

ఫొటో సోర్స్, HarperCollins India
మిషన్ గురించి స్పష్టత లేదు
అమెరికా చర్యలు గమనిస్తున్న సోవియట్ యూనియన్ కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు.
అడ్మిరల్ ఎస్ఎం నందా తన ఆత్మకథ 'ద మెన్ హు బాంబ్డ్ కరాచీ'లో దాని గురించి రాశారు.
"డిసెంబర్ మొదటి వారంలోనే సోవియట్ యూనియన్ నేవీకిచెందిన ఒక డెస్ట్రాయర్, మైన్ స్వీపర్ మలక్కా తీరం నుంచి ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. 1972 జనవరి మొదటి వారంలో అమెరికా నౌకాదళం అక్కడనుంచి వెళ్లిపోయేవరకూ సోవియట్ నౌకాదళం వాటిని వెంటాడింది" అని చెప్పారు.
"తర్వాత, ఎంటర్‌ప్రైజ్ కెప్టెన్ అడ్మిరల్ జుమ్‌వాల్ట్ 1989 నవంబర్‌లో యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన మిషన్ ఏంటో తనకు స్పష్టంగా తెలీదని, బహుశా కష్టాల్లో ఉన్న తమ స్నేహితులను ఎలా ఆదుకుంటామో అమెరికా ప్రపంచానికి చూపించాలనుకుందని చెప్పారు. ఆ సమయంలో, తాము ఏవైనా భారత నౌకలను ఎదుర్కోవాల్సి వస్తే వాటిని ఏం చేయమంటారు అని అడ్మిరల్ జుమ్‌వాల్ట్ అప్పుడు కిసింజర్‌ను అడిగారు కూడా. ఆయన 'అది మీరే నిర్ణయించుకోవాలి' అన్నారట" అని నందా రాశారు.

ఫొటో సోర్స్, Bettmann
అడ్మిరల్ నందాకు ఇందిరాగాంధీ పిలుపు
అడ్మిరల్ జుమ్‌వాల్ట్ ప్రసంగం తర్వాత అడ్మిరల్ నందా ఆయన్ను తన ఇంటికి డ్రింక్స్ కోసం ఆహ్వానించారు. అక్కడ జుమ్‌వాల్ట్ ఆయన్ను "మేం బెంగాల్ తీరానికి వస్తున్నట్లు మీకు సమాచారం అందగానే, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు" అని అడిగారు. అడ్మిరల్ నందా తన ఆత్మకథలో తను ఇచ్చిన సమాధానం గురించి చెప్పారు.
"ఆ వార్త వ్యాపించగానే మా ప్రధాని ఇందిర నన్ను పిలిపించారు. నావికాదళం దీనిపై ఏం చేయబోతోందని అడిగారు. 'నేను మీరేమనుకుంటున్నారు, భారత్ మీద అమెరికా యుద్ధం ప్రకటిస్తుందని అనుకుంటున్నారా' అన్నాను. 'ఇందిర అలా ఎందుకంటున్నారు' అన్నారు. నేను 'వాళ్లు మన నౌకలపై దాడి చేస్తే, అది యుద్ధ చర్యే అవుతుంది' అన్నాను. 'దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు' అని ఆమె అడిగారు".

ఫొటో సోర్స్, Nanda Family
"నేను, మేడమ్, వాళ్లు మనపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నారు. మనం దృఢంగా ఉండాలి. మీకు ఏదైనా అమెరికా నౌక ఎదురైతే, పరస్పరం పరిచయం చేసుకోవాలని, వారిని మన డ్రింక్ కోసం మన నౌకలోకి ఆహ్వానించాలని నేను మా కెప్టెన్లతో చెప్పాను" అన్నాను. అది విని ఆమె నవ్వారు. నేను నా డిప్యూటీ అడ్మిరల్ కృష్ణన్‌తో 'నా సందేశం కెప్టెన్లు అందరికీ పంపించాలని' చెప్పాను. ఈలోపు సోవియట్ యూనియన్ తన శాటిలైట్ల ద్వారా అమెరికా నౌకల కదలికలపై నిఘా పెట్టింది. మాకు మొత్తం సమాచారం అందిస్తూ వచ్చింది అన్నారు".

ఫొటో సోర్స్, Nanda Family
భారత నౌకాదళాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశం అమెరికాకు లేదు
ఈ ఉద్రిక్తతల మధ్య ఇందిరాగాంధీ దిల్లీ రాంలీలా మైదాన్‌లో ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆమె స్పీచ్ ఇస్తున్నప్పుడు, పాకిస్తాన్ విమానాలు ఆ సభను లక్ష్యంగా చేసుకుంటాయేమో అని, భారత వైమానిక దళం విమానాలు సభ జరిగే చోట ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ సభలో అమెరికా, చైనా పేర్లు ప్రస్తావించని ఇందిరాగాంధీ, "కొన్ని బయటి శక్తులు మనల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. వాటికి గట్టి జవాబు చెబుతాం" అన్నారు. ఆ ప్రసంగం ఎంత రెచ్చగొట్టేలా ఉందంటే, తర్వాత ఆమె ప్రెస్ ఆఫీస్ ఇందిర లిఖిత ఎడిషన్ల నుంచి కొన్ని అంశాలను తొలగించింది.
ఈలోపు, అమెరికా ఏడో నౌకాదళం బెంగాల్ తీరం వైపు వెళ్తోందని యాహ్యా ఖాన్‌కు తెలిసింది. దాంతో, ఆయన దానిని కరాచీ రక్షణ కోసం పంపించాలని నిక్సన్‌ను వేడుకున్నారు.
పాట్రిక్ మొయినిహన్ తన 'ఎస్ట్రేంజ్డ్ డెమాక్రసీస్ ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్'లో ఆనాటి పరిస్థితి రాశారు.
అమెరికా భారత్‌తో ఏ క్షణంలో అయినా యుద్ధానికి దిగవచ్చు అని అనిపిస్తున్నా, రెండు నౌకాదళాల మధ్య యుద్ధం జరగాలనే ఉద్దేశం నిక్సన్‌కు లేదు. సోవియట్ యూనియన్ యుద్ధ విరమణ చేయాలని భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చేలా ఆయన ఎంటర్‌ప్రైజ్‌ను ఒక సాకుగా ఉపయోగించారు. ఈ యుద్ధంలో సైనికపరంగా జోక్యం చేసుకోవాలని వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ఉద్దేశం లేదని కిసింజర్ కూడా చెప్పేవారు.

ఫొటో సోర్స్, Bettmann
వియత్నాం యుద్ధం వల్ల అమెరికా జోక్యం చేసుకునే అవకాశాలు దాదాపు లేవు
మరోవైపు, అమెరికా ఏడో నౌకాదళం భారత్ మీద దాడి చేయవచ్చని, కానీ, వియత్నాం యుద్ధం కొనసాగుతుండడంతో ఆ అవకాశాలు చాలా తక్కువే అని నావెల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, అడ్మిరల్ మిహిర్ రాయ్ ఇందిరాగాంధీకి ఇచ్చిన బ్రీఫింగ్‌లో చెప్పారు.
అయితే, భారత నౌకాదళం పాకిస్తాన్ దిగ్బంధాన్ని అది విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించవచ్చని అన్నారు.
భారత నావికాదళం తూర్పు కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎన్.కృష్ణన్ తన 'నో వే బట్ సరెండర్' అనే పుస్తకంలో ఆ సమయంలో ఏం జరిగిందో రాశారు.
"అమెరికా దళాలు చట్‌గావ్ వరకూ వస్తాయేమోనని నేను భయపడ్డా. ఆ నౌక వేగం కాస్త తగ్గించడానికి, మేం మా జలంతర్గామితో ఎంటర్‌ప్రైజ్ మీద టార్పెడో ప్రయోగించాలని కూడా అనుకున్నాం. తర్వాత, చట్‌గావ్, కాక్స్ బజార్ మీద నావికాదళంతో తీవ్రంగా దాడులు చేయడం ఒక్కటే దానికి పరిష్కారం అని మాకు అర్థమైంది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, South Asia Books
వియత్నాంలో చిక్కుకుపోయిన అమెరికా, భారత్ మీద యుద్ధానికి తన సైన్యాన్ని పంపించడం దాదాపు అసాధ్యం అనే విషయం భారత నాయకత్వానికి అర్థమైంది.
తర్వాత ఇటాలియన్ జర్నలిస్ట్ ఒరియానా ఫలాచీకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇందిరాగాంధీ ఆ విషయం చెప్పారు.
"అమెరికా ఒక్క తూటా పేల్చినా, లేదా బెంగాల్ తీరంలో కూర్చోవడం కాకుండా అది వేరే ఏదైనా చేసినా, మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యుండేది. కానీ, మీకు నిజం చెప్పనా.. నా మనసులో ఒక్కసారి కూడా భయం అనిపించలేదు" అన్నారు.
అయినా, తమపై దాడి చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అమెరికాకు చెప్పాలని భారత్ సోవియట్ యూనియన్‌ను కోరింది. దానికోసం పీఎన్ హక్సర్‌ను ప్రత్యేకంగా మాస్కో పంపించింది. బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ మీద భారత్‌కు ఎలాంటి కోరికా లేదని భారత రాయబారి డీపీ ధర్‌తో సోవియట్ ప్రధాని ఎలెక్సీ కొసీజిన్‌కు చెప్పించింది.
సోవియట్ యూనియన్ అమెరికాను ఈ యుద్ధంలో జోక్యం చేసుకోనివ్వదని భారత్‌లోని సోవియట్ రాయబారి హామీ ఇచ్చారని నెహ్రూ మెమోరియల్ లైబ్రరీలోని హక్సర్ పత్రాల్లో రాసి ఉంది.

ఫొటో సోర్స్, Bettmann
తూర్పు పాకిస్తాన్‌లో దిగిన వార్త అమెరికా లీక్ చేయించింది
దీనికి పూర్తి విరుద్ధంగా తూర్పు పాకిస్తాన్ తీరంలో చొరబాటుకు అమెరికా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని, అందులోని మూడు మెరైన్ బెటాలియన్లను సిద్ధంగా ఉండాలని చెప్పామని అమెరికా వార్తలు లీక్ చేయించింది.
అవసరమైతే ఇండియన్ ఆర్మీ కమ్యూనికేషన్ కేంద్రాలపై ఎంటర్‌ప్రైజ్ బాంబర్లతో బాంబులు వేయడానికి కూడా నిక్సన్ అనుమతి ఇచ్చేశారు.
అమెరికా సైనికులు తూర్పు పాకిస్తాన్‌లో చొరబడే అవకాశాల గురించి భారత రాయబారి లక్ష్మీకాంత్ ఝా అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారిని ఒకర్ని అడిగారు. ఆయన దానిని ఖండించలేదు.
దాంతో, భారత రాయబారి ఆ ఘటనతో చాలా కంగారు పడిపోయారు. అమెరికా టెలివిజన్‌లో నిక్సన్ పాలన గురించి, ఆయన ఉద్దేశాల గురించి నానా మాటలూ అనేశారు.
తర్వాత డీక్లాసిఫై చేసిన వైట్ హౌస్ టేప్స్ ద్వారా నిక్సన్, కిసింజర్ ఇద్దరూ భారత్‌ను అలా ఇబ్బంది పడుతుంటే, చాలా సంతోషించేవారనే విషయం బయటపడింది.
ఆ టేపుల్లో కిసింజర్ "మనం బెంగాల్ తీరంలో లాండ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నామనడానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని భారత రాయబారి అంటున్నారు. నాకు ఇది చాలా బాగుంది" అన్నారు. తర్వాత నిక్సన్.. "ఆ.. దీనితో వాళ్లు భయపడిపోయారు. నావికా దళం పంపించాలనే నిర్ణయం మంచి చర్యే" అన్నారు.
ఇంత జరుగుతున్నా అమెరికా నౌకాదళం చట్‌గావ్‌కు దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయింది. ఆ ప్రాంతంలో నాలుగు లేదా ఐదు సోవియట్ నౌకలు ఉన్నాయని, కానీ వాటికి గానీ, భారత, పాకిస్తాన్ నౌకాదళానికిగానీ ఎంటర్‌ప్రైజ్ ఎదురవలేదని పెంటగాన్ చెప్పింది.
అప్పుడు అక్కడున్న రష్యా నౌకాదళంలో ఒక డెస్ట్రాయర్, ఒక క్రూజర్, రెండు అటాకింగ్ జలాంతర్గాములు ఉన్నాయి. దానికి అడ్మిరల్ వ్లాదిమిర్ క్రగలియాకోవ్ కమాండ్‌గా ఉన్నారు. తర్వాత సెబాస్టియన్ రాబలిన్ తన 'వార్ ఈజ్ బోరింగ్' పుస్తకంలో దాని గురించి రాశారు.
"అమెరికా దళాలు ముందుకు వస్తే, వారిని చుట్టుముట్టాలనేదే మా లక్ష్యం. నేను నా జలాంతర్గాముల మిసైల్ ట్యూబులు తెరిపించి, ఎంటర్‌ప్రైజ్‌కు ఎదురుగా నిలబెట్టేవాడిని. కానీ, ఆ పరిస్థితి రాలేదు. తర్వాత మరో రెండు రష్యా యుద్ధ నౌకలు ఆ దళంలో చేరాయి" అని రష్యా టెలివిజన్ కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్రగలియాకోవ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Bettmann
పాక్ లొంగిపోవడంతో ఎంటర్‌ప్రైజ్ రూటు మారింది
భారత మాజీ దౌత్యవేత్త అరుణనిధి ఘోష్ తర్వాత ఏం జరిగిందో చెప్పారు.
"ఆ రోజుల్లో కలకత్తాలో అమెరికా బాంబులు వేస్తుందని ఒక వదంతి వ్యాపించింది. మేం దానికి సరదాగా వాళ్లు బాంబులు వేయనీ.. ఆ సాకుతో అయినా, మనం కలకత్తాను మళ్లీ కొత్తగా, ఇంకా అందంగా కట్టుకునే అవకాశం వస్తుంది అనేవాళ్లం" అన్నారు.
ఎంటర్‌ప్రైజ్ ఆగకుండా ప్రయాణించి ఉంటే డిసెంబర్ 16న ఉదయం అది తూర్పు పాకిస్తాన్ తీరానికి చేరుకునేది. కానీ, దానికి ఒక రోజు ముందే పాకిస్తాన్ జనరల్ నియాజీ, తాము యుద్ధ విరమణ కోరుకుంటున్నట్లు జనరల్ మానెక్‌షాకు సందేశం పంపించారు. దానితో పాకిస్తాన్ లొంగిపోడానికి సిద్ధంగా ఉందని భారత్ అర్థం చేసుకుంది. పాకిస్తాన్ లొంగిపోగానే, యుఎస్ఎస్ ఎంటర్‌ప్రైజ్ తూర్పు పాకిస్తాన్ నుంచి శ్రీలంక వైపు మళ్లింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








