ఆంధ్రప్రదేశ్: 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు విక్రయించే ఆలోచనలో ప్రభుత్వం

మిషన్ బిల్డ్ ఏపీ
ఫొటో క్యాప్షన్, మిషన్ బిల్డ్ ఏపీ
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూములను ‘మిషన్ బిల్డ్ ఏపీ’లో భాగంగా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టుకు అదే విషయం చెప్పింది.

గుంటూరు, విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల అమ్మకాలను సవాలు చేస్తూ హైకోర్టులో గుంటూరు నివాసి తోట సురేష్ బాబు మే 22న పిటిషన్‌ ధాఖలు చేశారు.

ఈ పిటిషన్ విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.‘మిషన్ బిల్డ్ ఏపీ’ డైరెక్టర్‌ ప్రవీణ్ కుమార్ జూన్ 30న కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆ అంశాన్ని ప్రస్తావించారు.

2019 జూన్ 28న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం, ల్యాండ్ పూలింగ్ కోసం 25,398 మంది 34,281 ఎకరాల భూమిని ఇచ్చారు.

రాజధాని అభవృద్ధి కోసం గత ప్రభుత్వం 2016లో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అందులో 1691.71 ఎకరాలను స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కోసం 2017లో సింగపూర్‌కు చెందిన అసెండాస్-సింగ్ బ్రిడ్జ్ అండ్ సెంబ్ కార్ప్ సంస్థల కన్సార్షియంకు కేటాయంచింది.

సింగపూర్ కన్సార్షియంకి 58 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 42 శాతం వాటా ఉండేలా గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే, 2019లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే, నవంబర్ 11న ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియం మధ్య పరస్పర అంగీకారంతో ఈ స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కోసం కేటాయించిన 1691.71 ఎకరాలను ‘మిషన్ బిల్డ్ ఏపీ’లో భాగంగా విక్రయించేందుకు పరిగణనలోకి తీసుకోవాలని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్ నిర్ణయించారు. 2020, మార్చి 2న ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రవీణ్ కుమార్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపారు.

ఈ అంశంపై స్పష్టత కోసం ‘మిషన్ బిల్డ్ ఏపీ’ డైరెక్టర్‌ ప్రవీణ్ కుమార్‌ని బీబీసీ తెలుగు సంప్రదించింది. అయితే, ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉంది కాబట్టి, అది పూర్తైన తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు.

అమరావతి

ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN

ఫొటో క్యాప్షన్, అమరావతి

దాతలు ఇచ్చిన భూముల విక్రయం-పిటిషనర్

నవరత్నాలు, నాడు-నేడు లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పనకు నిధుల కోసం 2019, నవంబరులో ఏపీ ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్‌బీసీసీ)తో ఒప్పందం చేసుకుంది.

ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని ఈ-వేలం ద్వారా విక్రయించి వచ్చే నిధులను సంక్షేమ పథకాల అమలకు వ్యయం చేస్తామని ప్రవీణ్ కుమార్ కోర్టుకు ఇచ్చిన తన నివేదికలో తెలిపారు.

దాదాపు 1400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న10 వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ‘మిషన్ బిల్డ్ ఏపీ’లో భాగంగా దశలవారిగా విక్రయించడాన్ని పరిశీలించాలని సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలోనే నిర్ణయించారని ఆయన చెప్పారు.

ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్

2020, ఫిబ్రవరిలో గుంటూరు, విశాఖపట్నం, విజయవాడలో భూములను గుర్తించేందుకు అధికారులు సమావేశమయ్యారు. గుంటూరు, విశాఖపట్నంలో గుర్తించిన 16.58 ఎకరాల భూములకు 137 కోట్ల రూపాయల వెల కట్టిన ప్రభుత్వం, ఈ-వేలం కోసం జూన్ 13న నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్‌బీసీసీ) సవరించిన జాబితాను విడుదల చేసింది.

మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారనే ఆరోపణలతోపాటూ, ప్రభుత్వ ప్రయోజనాలకోసం దాతలు ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని తోట సురేష్ బాబు హైకోర్టులో వేసిన తన పిటిషన్‌లో ఆరోపించారు. ఆ భూములు విక్రయించడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ హైకోర్ట్ లో వాదనలు వినిపించారు.

ఇటు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన ‘మిషన్ బిల్డ్ ఏపీ’ డైరెక్టర్‌ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర పాలనకు అవసరమైన విధానాలు రూపొందించడం గురించి ప్రభుత్వానికి సరైన అవగాహన ఉంటుందని, న్యాయస్థానాలు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో జోక్యం చేసుకోకుండా సంయమనం పాటించాయని పేర్కొన్నారు.

గత వారం జరిగిన విచారణలో "రాజ్యం వేరు, ప్రభుత్వం వేరు. రాజ్యం శాశ్వతం, ప్రభుత్వం శాశ్వతం కాదు" అని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ జులై 29కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)